BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...























మునిమాణిక్యం కథలంటే తెలీని వారు ఉండరేమో. దాంపత్యంలోని చిన్ని చిన్ని చిలిపి తగాదాలు, సర్దుబాట్లు,జరుగుబాట్లు ఇలా ప్రతి దంపతులకు తప్పనిసరిగా అవసరానికొచ్చే విషయాలు ఎన్నో ఈ కథలలో ఉంటాయి. మునిమాణిక్యంగారి కాంతం గురించి మనకు సవివరంగా అందిస్తున్నారు శ్రీలలిత బ్లాగర్..


శ్రీ మునిమాణిక్యం వారి ”కాంతం” కథలను తలుచుకుంటే మనకి తెలియకుండానే మన పెదవులు చిరునవ్వుతో విచ్చుకుంటాయి. దాంపత్య జీవితం లో ప్రతిరోజూ మామూలుగా జరిగే దినచర్యలో కూడా హాస్యం పండించడం ఆ మహానుభావునికే చెల్లింది. కాంతం అచ్చమైన తెలుగింటి ఇల్లాలు. భర్త అంటే బోలెడు ఇష్టం. అదే సమయం లో పాపం ఆయన కేమీ తెలీదని, ఆయన అమాయకత్వంపై బోలెడు సానుభూతి.


మునిమాణిక్యం నరసింహారావు గారి కాంతం కథలను, దాంపత్యోపనిషత్తును పంతొమ్మిదివందల యాభైనాలుగు లో యం.శేషాచలం అండ్ కంపెనీ వారు ముద్రించారు.మళ్ళీ పంతొమ్మిదివందల తొంభై అయిదులో శ్రీమానస పబ్లికేషన్స్ వారు ముద్రించారు.అన్ని పుస్తకాల షాపుల్లోనూ దొరుకుతాయి.


దాంపత్యోపనిషత్తు అయినా, కాంతం కథలయినా మునిమాణిక్యం గారి వి ఏవయినా సరే ఈ తరం వారికి తెలియక పోవచ్చునేమొ కాని క్రితం తరం వారికి తప్పక తెలిసే ఉంటాయి. ఆ అనుభూతి వారు పొందే ఉంటారు. ఇప్పటివారికి కూడా వారి గురించి చెప్పడమంటే సూర్యునికి దివిటీ చూపించినట్టే అని నేను భావిస్తున్నాను.


కాంతాన్ని ప్రధానపాత్ర గా చేసుకుని మునిమాణిక్యంగారు చాలా కథలు వ్రాసారు.

ఇల్లు ఇల్లాలు, ఇంటావిడతో పోట్లాట, ప్రణయ కలహం, కాంతం కథలు, కాంతం కైఫీయతు, నేనూ మా కాంతం, దాంపత్యోపనిషత్తు ఇలాంటివి చాలా పుస్తకాలు వ్రాసారు. భార్యాభర్త లిద్దరూ పోట్లాడుకుంటుంటే ఒక విధమైన సంగీతం పుడుతుందని ఆయన చెప్పిన గొప్ప మాట. అలాగని ఒకరంటె ఒకరు ఇష్టపడరని కాదు. ఇష్టమె. కాని ఆ ఇష్టం లోనే ఒకరకమైన గడుసుదనం గల ఇల్లాలు కాంతం.


భర్త ఎక్కడికైనా ప్రయాణమై వెడితే ఏదో ఒకటి పోగొట్టుకుని వస్తారని నిక్కచ్చిగా నమ్మే గృహిణి కాంతం. అందుకే వెళ్ళేటప్పుడు ఎన్ని జాగ్రత్తలో చెపుతుంది. అయినా ఆయన బెడ్డింగు, శాలువా పారేసుకునే వస్తారు. ”నేను పారేసుకోలేదు...వెనకాల వస్తున్నాయీ..” అని ఎంత చెప్పినా ఆవిడ అభిప్రాయం మారదు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణలు, లౌక్యంగా కాంతం భర్త దగ్గరినుంచి విషయం రాబట్టడానికి చేసే ప్రయత్నాలు అన్నీ మనల్ని అలరిస్తాయి. మామూలుగా మన ఇళ్ళలో జరిగే సంభాషణలనే ఎంతో చతురంగా వర్ణిస్తారు. సాయంత్రం ఆయన స్నేహితులతో కలిసి షికారు వెడుతుంటే, ”పండక్కి ఫలహారాలు చెయ్యాలి, పిల్లల్ని పట్టుకుందురుగాని తొందరగా రండి” అని చిలక్కి చెప్పినట్టు చెపుతుంది. అయినా ఆయన రావడం ఆలస్యమవుతుంది. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యన జరిగిన సంభాషణ స్వయంగా చదవాలి తప్పితే, వేరే వాళ్ళు చెపితే ఆయనకు అన్యాయం చేసినట్టే అవుతుంది. పిల్లకి పేరు పెట్టే విషయం లోనూ బలే జాణలా మాట్లాడుతుంది కాంతం. ”మీ పిల్ల కదా.. మీకు నచ్చిన పేరు పెట్టండి” అంటూనే ఆయన చెప్పిన ప్రతి పేరునీ ఏదో కారణం చెప్పి తిప్పి కొడుతుంది. అలాగని తను ఫలానా పేరు పెట్టమని చెప్పదు. ”మీ ఇష్టం” అంటూనే ఉంటుంది. తీరా అందరి అభిప్రాయాలూ కలిపి పేరు పెట్టాక ఆ పేరు తో పిలవకుండా తను మళ్ళీ వేరే పేరు పెట్టి పిలుస్తుంది.


ఒక కథలో కాంతానికి ప్రబంధనాయికల లాగ విరహం అంటే ఏమిటో తెలియచెయ్యాలని పాపం ఆ భర్తగారు చేసే ప్రయత్నం మనకి ఎంతో నవ్వు తెప్పిస్తుంది.


మరో కథలో కాంతం భర్త ఆవిడ అక్కగారి దగ్గర తను ఎంత మంచి భర్తో నిరూపించుకోవడానికి చాలా పెద్ద హామీ ఇచ్చి వాళ్ళిద్దరినీ కార్తీక మాసంలో తెల్లవారుఝామునే నదీ స్నానానికి పంపిస్తాడు. ఆ హామీ ఏమిటంటే వాళ్ళు స్నానం చేసి వచ్చేదాకా పిల్లలని తను చూసుకుంటానని. తెల్లవారితేకాని పిల్లలు ఎలాగూ లేవరు, ఈలోపల వాళ్ళ స్నానం పూర్తయి వాళ్ళు రానే వస్తారు, మహా అయితే వాళ్ళొచ్చే ఓ గడియ ముందు పిల్లలు లేస్తారు. ఆ కాస్సేపూ పిల్లల్ని చూసుకుని వదినగారి దగ్గర మంచివాడనే సర్టిఫికెట్టు కొట్టెయ్యవచ్చని ఆయన ఉద్దేశ్యం.ఇంక చూడాలి పాపం ఆయన పడ్డ పాట్లు. ఇంకా చాలా రాత్రుండగానే నిద్దట్లో ఎడపిల్ల కదులుతుంది. ఆ కదలికకి చంటిపిల్ల లేచి పాలకోసం ఏడుపు మొదలు పెడుతుంది. ఆయన పాలు కలుపుకుని వచ్చేలోపు ఆ ఏడుపుకి ఎడపిల్ల లేచి అమ్మ కోసం వెతుక్కుని కనపడక ”అమ్మా” అంటూ రాగం మొదలుపెడుతుంది. ఆ ఏడుపుకి చంటిపిల్ల పాలు తాగడం మానేసి రాగం కలుపుతుంది. ఈ చంటిపిల్ల ని ఊరుకోపెట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటే ఎడపిల్ల నెమ్మదిగా వెళ్ళి పెద్దవాణ్ణి లేపి అమ్మ కనిపించటం లేదని చెపుతుంది. వాడు వీధి తలుపు తీసుకుని అమ్మకోసం బైటకి వెళ్ళి వెదుకుదామని వెళ్ళబోతాడు. ఈ గోలకి ఇంకో పిల్ల లేచి అన్నతో వీధిలో కి వెళ్ళాలో, నాన్న పిలుస్తుంటే అక్కడే నిలబడాలో తెలిక వీధి గుమ్మం దాటి, ఆ పక్క కాలవలో పడబోతుంది. పాపం ఆ తండ్రి ఏడుస్తున్న చంటి పిల్లను చంకలో ఎత్తుకుని, పెద్దపిల్ల కాలవలో పడిపోకుండా ఆపడానికి గబుక్కున ఆ కాలవలోకి దిగుతాడు. సరిగ్గా ఆ సమయానికి కాంతం, ఆవిడ అక్కగారు ఇంటి ముందు జట్కా దిగుతారు. వాళ్ళు దిగేటప్పటికి సీను ఎలా ఉంటుందంటె, చంటిపిల్లని ఎత్తుకుని ఆయన కాలవ మధ్యలో నిలబడి, రెండో చేత్తో ఎడపిల్లని ఆపుతూ, పెద్దపిల్లలని ఊరుకోబెడుతూ అష్టావధానం చేస్తూ కనిపిస్తారు. కాంతం జట్కా దిగగానే ఆయన పరిస్థితి చూస్తుంది. కాస్తయినా తనని జాలితో చూస్తుందేమో ఆవిడ అని ఈయన ఆశిస్తారు. కాని ఆవిడ దబుక్కున ఈయన చేతుల్లోంచి చంటిపిల్లని లాక్కొని ఒళ్ళో కూర్చోబెట్టెసుకుని, ఎడపిల్లని దగ్గరికి తీసుకుని, అక్కడే మెట్ల మీద కూర్చోగానే పెద్ద పిల్లలిద్దరూ ఆవిడకి చెరో వైపూ చేరిపోతారు. ఇంక ఆవిడ మొదలు పెడుతుంది.. ”నే చచ్చిపొయానే.. నా చిట్టిని వదిలి వెళ్ళానే.. ఎంత ఏడిచెవె నా తల్లీ, నా బుధ్ధి పాడుగాను.. నే చచ్చిపొయానే..” అంటూ పిల్లని ముద్దు పెట్టుకోనూ, పిల్లాణ్ణి దగ్గరికి తీసుకోనూ, తన్ని తిట్టుకోనూ.. తప్పితే అలా కాలవలో చేష్టలు దక్కి నిలబడ్డ ఆయనగారి వేపు చూడనైనా చూడదు. అప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో తల్చుకుంటుంటే ఎంతో నవ్వొస్తుంది.


అన్నీ ఇలాంటి చక్కిలిగింతలు పెట్టించే కథలే .

”మీకూ, మీ భార్యకూ అభిప్రాయభేదాలు రావా? వస్తే పొట్లాటలు లేకుండా ఏవిధంగా జరుపుకొని వస్తున్నారు?” అని నా స్నేహితులైన ఇంద్రగంటివారిని అడిగాను.

ఇలాంటి ప్రశ్నను ఎవరు అడుగుతారో వేరే చెప్పాలా..

హాస్య రచయితలలో అగ్రగణ్యుడుగా ప్రసిధ్ధి చెందిన శ్రీ మునిమాణిక్యం నరసింహారావుగారు.
మునిమాణిక్యంగారి దాంపత్యోపనిషత్తు పుస్తకం లోని మొట్టమొదటి వాక్యం అది.

ఆ పుస్తకం లో ముందుమాటగా ఆయన ఒకమాట చెపుతారు.

హరిణీ ప్రేక్షణా యత్ర గృహిణీ న విలోక్యతే
సేవితం సర్వసంపద్భి రపి తద్భవనం వనమ్.

ఏ భవనములో కురంగీనయన అయిన గృహిణి కనబడదో, ఆ భవనము సకల సంపత్తులతో కూడుకొన్నప్పటికీ వనమే అవుతున్నది కాని భవనము కావడము లేదు. గృహానికి గృహలక్ష్మి ఉండాలె అన్నాడు పండితరాజు.

దాంపత్య జీవితాన్ని రమ్యంగా చిత్రించాలని ఆయన అభిలాష.

మునిమాణిక్యంగారు ”దాంపత్యోపనిషత్తు” వ్రాయాలనుకున్నప్పుడు చాలామంది పెద్దవారిని భార్యాభర్తల మధ్య అభిప్రాయభేదాల గురించి అడిగారు. అదిగో అప్పుడు అడిగిందే పైన చెప్పిన ప్రశ్న.

”మీకూ, మీ భార్యకూ అభిప్రాయభేదాలు రావా? వస్తే పోట్లాటలు లేకుండా ఏ విధంగా జరుపుకొని వస్తున్నారు!” అని నా స్నేహితులైన ఇంద్రగంటివారిని అడిగాను. ఆయన మంచి పండితుడు, సాహితీపరుడు, మనస్తత్వ శాస్త్రము బాగా తెలిసినవాడు. ఆయన చెప్పింది యిది:

”నాకూ, నా భార్యకూ అభిప్రాయభేదాలు రాకుండా ఉండవు. వస్తూనే ఉంటవి. ఆవిడ అభిప్రాయానికి భిన్నమైన అభిప్రాయం కలిగి వున్నప్పుడే మేము భిన్నాభిప్రాయులము అవుతాము. భిన్న తత్వాలు గల అభిమతాలకు సంఘర్షణ ఏర్పడి తగవుగా పరిణమిస్తుంది. కాబట్టి అభిప్రాయభేదం వచ్చినపుడు నా అభిప్రాయం నేను ఆవిడతో చస్తే చెప్పను. ఇంక ఆవిడ ఏం జేస్తుంది? నోరు మూసుకుని ఊరుకొంటుంది. ఇదే నేను అవలంబిస్తూ ఉన్న మార్గం పోట్లాటలు లేకుండా ఉండడానికి.” అన్నారు.”అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు నేనే నోరుమూసుకొని ఊరుకుంటాను” అని చాలా చమత్కారంగా చెప్పినారు గదా అని సంతోషించాను.ఆ తరువాత కాటూరివారిని అడిగాను.. ఇలా మునిమాణిక్యంగారు ఈ ప్రశ్న చాలా పెద్ద పెద్దవారిని అడిగి సమాధానాలు రాబట్టుకొని మరీ ఈ పుస్తకం వ్రాసారు.


” జీవిత రమణీయకము మహారాజుల ఉన్నత సౌధాలలోనూ, ఉద్యానవనాలలోనూ మాత్రమే కాక రసవిహీన మనుకొన్న సామాన్య గృహస్థజీవితంలో కూడా ఉన్నదని చూపడానికి నేను నా జీవితం అంతా ప్రయత్నించాను.
ఈ పుస్తకం కూడా అట్టి ప్రయత్నానికి ఫలితమే! సంసారపు పాలకడలిని చిలకడములో చిందిన తుంపురులను పోగుచేయగా ఈ గ్రంథము తయారు అయింది.”

అని ఆయన ఈ ”దాంపత్యోపనిషత్తు” పుస్తకానికి ముందు మాటలో చెప్పారు.

ఈ పుస్తకాన్ని ఎల్లాగ చదవాలె అన్న విషయాన్ని గురించి రెండు మాటలు (ఆయనవే)
‘’ ఇది హాస్యగ్రంథము. ఆ విషయము గుర్తించి చదవండి. అంటే కాసేపు నవ్వుకొనడానికి సిధ్ధపడి మరీ పుస్తకం తెరవండి. విసుగుగా ఉన్నపుడు ఈ పుస్తకం చదవకండి. ‘’ అని..

సంసార సాగరంలొ దొరికే సున్నితమైన హాస్యం కావాలంటే మాత్రం మనం మునిమాణిక్యం గారి కాంతాన్ని కలుసుకోవాల్సిందే...


**************************************************************************************

Posted by జ్యోతి Nov 9, 2009

Subscribe here

భువన సుందరి సీరియల్ చదవండి

భువన సుందరి సీరియల్ చదవండి
Keira Knightley: Beautiful Lady reading a Book

You said it!