BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...

సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా అలనాటి ఆణిముత్యాలకు ఆదరణ, అభిమానం ఎప్పటికి చెరగదు, తరగదు. అద్భుతమైన కథాచిత్రాలకు పెట్టింది పేరైన విజయా వారి ఆణిముత్యాలలో ఒక అపురూపమైన మరపురాని చిత్రం "గుండమ్మ కథ". 1962 లో నిర్మించబడిన ఈ చిత్రం కోసం హేమాహేమీలైన నటీనటులు, సాంకేతిక నిపుణులు పని చేసారు. వారి కష్టం ఇప్పటికీ తెలుగువారి అభిమానంలో దాగి ఉంది. ఈ చిత్రం నిర్మించి దాదాపు యాభై ఏళ్లు కావొస్తున్నా ఇప్పటికీ, ఎప్పటికీ నిత్యనూతనమే. కథ, మాటలు, పాటలు, సంగీతం, చాయాగ్రహణం ఇలా అన్నీ అద్భుతాలే. ఎన్ని సార్లు చూసిన విసుగు పుట్టని చిత్రం ఈ గుండమ్మ కథ.

అక్కినేని, ఎన్.టి.ఆర్. ఎస్.వి.ఆర్, సావిత్రి, జమున వంటి ఎందరో ప్రముఖ నటులు ఉన్నా కూడా గయ్యాళిగా నటించిన సూర్యకాంతం పాత్ర గుండమ్మ పేరునే సినిమా టైటిల్ గా పెట్టడంలో విజయా వారు ఒక కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు అని చెప్పుకోవచ్చు. నలుపు తెలుపు చిత్రమైనా కూడా చూస్తుంటే ఇప్పటికీ అద్భుతం అనిపిస్తుంది . ఈ సినిమా చూసిన తర్వాత మనకు కథ గుర్తుకు రాదు . అందులోని పాత్రలు, అంజి, గుండమ్మ, గంటయ్య .... వారి డైలాగులు మన మనసులో, మాటల్లో మిగిలిపోతాయి. అది మాటల రచయిత ప్రభావమా?, నటీనటుల ప్రతిభా? అనేది నిర్ణయించుకోలేము.

భర్త పోయిన గుండమ్మ కూతురు సరోజ, సవతి కూతురు లక్ష్మి. గుండమ్మ పరమ గయ్యాళి. సరోజను గారాబంతో పెంకిదానిలా తయారు చేసి , లక్ష్మిని మాత్రం ఇంటిపనిమనిషిలా చూస్తుంది. గుండమ్మ భర్తకు స్నేహితుడైన వెంకట్రామయ్య తన ఇద్దరు కొడుకులకు గుండమ్మ కూతుళ్లను చేసుకోవాలనుకుంటాడు. కాని గుండమ్మ స్వభావం, పిల్లల ప్రవర్తన చూసిన తర్వాత ఆమెను మార్చి ఆమె కూతుళ్లని పెళ్లి చేసుకొమ్మని తన కొడుకులు అంజి, రాజాలకు చెప్తాడు. గుండమ్మ దగ్గర గుమాస్తాగా ఉన్న గంటయ్య సరోజను తన కొడుకుకు చేసుకొని ఆస్థి కాజేయాలనుకుంటాడు. అందుకే ఆమెకు వచ్చిన పెళ్లి సంబంధాలు చెడగొడుతుంటాడు. అంజి ఒక మామూలు పనివాడిగా గుండమ్మ ఇంట్లో చేరి తన మాటల చాతుర్యంతో ఆమెను మెప్పిస్తాడు. గంటయ్యకు కూడా చురకలు వేస్తూనే ఉంటాడు. రాజా కూడా సరోజతో పరిచయాన్ని పెంచుకుని తనని ప్రేమించేలా చేసుకుంటాడు. లక్ష్మిని పెళ్లి చేసుకుంటానని అంజి చెప్పినప్పుడు గుండమ్మ అతడు కూడా ఒక పనివాడిలా ఇంట్లో ఉండిపోతాడు అని ఒప్పుకుంటుంది. రాజా వెంకట్రామయ్య కొడుకని తెలుసుకుని ఆయనకు ఇష్టం లేకున్నా సరోజనిచ్చి పెళ్లి చేస్తుంది. ఎప్పటికైనా తండ్రీ కొడుకులు ఒకటి కాకుండా పోతారా అనే నమ్మకంతో. కాని కొద్ది రోజులకే అంజి గుండమ్మతో గొడవ పడి లక్ష్మిని తీసుకుని ఇంట్లోంచి వెళ్లిపోతాడు. రాజా తాగుబోతులా నటించి తాను కూడా వెళ్లిపోతానని తనమీద ప్రేమ ఉంటే సరోజను తనతో రమ్మని అంటాడు. తల్లి వారించినా వినకుండా సరోజ భర్తే తన దైవమని వెళ్లిపోతుంది.

అత్తగారింటికి చేరిన లక్ష్మికి అసలు విషయం తెలుస్తుంది. అలాగే సరోజను చేసుకుంది అంజి తమ్ముడే అని, ఆమెను మార్చడానికి ప్రయత్నిస్తున్నాడని తెలుసుకుని సంతోషిస్తుంది. సరోజ పెంకితనం, అహంభవాన్ని తగ్గించి పేదరికం, కష్టపడడంలోని ఆత్మసంతృప్తి స్వయంగా తెలుసుకునేలా చేస్తాడు రాజా. ఒంటరిగా ఉన్న గుండమ్మ ఇంట్లో గంటయ్య, అతడి రౌడీ కొడుకు, కోడలి చుట్టమైన దుర్గమ్మ తిష్ట వేసి ఆమెను బాధపెడుతుంటారు. చివరికి లక్ష్మి, అంజి వచ్చి గుండమ్మను కాపాడి అసలు విషయం తెలియచేస్తారు. తన తప్పు తెలుసుకున్న గుండమ్మ కూతుళ్లిద్దరూ మంచి ఇంటికి కోడల్లైనందుకు ఎంతో సంతోషిస్తుంది.

ఈ కథాకథనంలో హాస్యం అంతర్లీనంగా ఉండి ప్రతి సన్నివేశం హాయిగా నవ్వుకునేలా చెస్తుంది. ప్రతి పాత్రకు మాటలు అతికినట్టుగా ఉంటాయి. ముఖ్యంగా అంజి పాత్రకు వాడిన భాష మనని గిలిగింతలు పెడుతుంది. అంజి గంటన్నతో పెట్టుకునే సంవాదము, కోలు కోలోయన్న పాటకు వేసే చిందులు మరచిపోలేనివి. ఆ సినిమా చూసి ఎన్నో ఏళ్లైనా , కొన్ని డైలాగులు అస్సలు మరిచిపోలేము. ఈ చిత్రంలో అద్భుతమైన మాటలు రాసింది డి.వి.నరసరాజు. ఇక పాటల విషయానికొస్తే మరపురాని , మధురమైన పాటలు మనకందించారు పింగళి. ఒక్కో పాట ఒక్కో జాతి రత్నం అని చెప్పవచ్చు. దాదాపు యాభై ఏళ్లు గడిచినా ఆ పాటల్లోని మాధుర్యం మనని మత్తులో ముంచేస్తుంది. దానికి ఘంటసాల మాష్టారు సంగీతం జత కూడితే చెప్పాల్సిందేం ఉంది. ఈ చిత్రానికి మరిన్ని సొబగులు అద్దిన మార్కస్ బార్ట్ లీ ని ప్రత్యేకంగా ప్రశంసించాలి. అలిగినవేళనె చూడాలి అన్న పాటలో ఎన్.టి.ఆర్ ఎంత ముద్దుగా, గోముగా ఉంటాడు. గుర్తుందా? ఈ చిత్రం ఎన్.టి.ఆర్. కి నూరవ చిత్రం కాగా, తమిళ వెర్షన్ "మనిదన్ మారవిల్లె" ఏ.ఎన్.ఆర్ కి నూరవ చిత్రం. చక్రపాణి, నాగిరెడ్డి ఈ చిత్రాన్ని తమిళంలో కూడా నిర్మించారు కాని అది సక్సెస్ కాలేదు. విజయావారి సంస్థనుండి వచ్చిన ఆఖరి విజయవంతమైన చిత్రం ఇదేనేమో..


మరిన్ని వివరాలు..

గుండమ్మ కథ (1962 )

నిర్మాత : బి.నాగిరెడ్డి, చక్రపాణి
దర్శకత్వం : కమలాకర కామేశ్వర రావు
మాటలు : డి.వి.నరసరాజు
పాటలు : పింగళి నాగేంద్రరావు
సంగీతం : ఘంటసాల
చాయాగ్రహణం : మార్కస్ బార్ట్ లీ
నిర్మాణ సంస్థ : విజయా ప్రొడక్షన్స్
నటీనటులు : ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్. ఎస్.వి.ఆర్. సావిత్రి, జమున, సూర్యకాంతం, హరనాధ్, ఎల్.విజయలక్ష్మి, రమణారెడ్డి, చాయాదేవి, రాజనాల, హేమలత, మిక్కిలినేని .. మొదలైన వారు.
పాటలు మాత్రం మరిచిపోగలమా??


లేచింది నిద్ర లేచింది మహిళా లోకం.. (ఆనాడే ఆడాళ్ళ గురించి ఎంత గొప్పగా చెప్పారో కదా )
చల్లగా వీచే పిల్ల గాలిలో ( ఈ పాత వింటుంటే నిజంగానే మనసు హాయిగా ఉంటుంది. ఏమంటారు?)
మౌనంగానే మనసు పాడిన ( నిజమే కదా. మౌనంగా ఉన్నా కూడా మనసు ఎన్ని మాటలాడుతుంది, పాటలు పాడుతుంది. )
కోలు కోలోయన్న ( ఎన్.టి.ఆర్ విన్యాసాలు , అల్లరి చూడవలసిందే )
మనిషి మారలేదు ( ఎన్ని మారినా మనిషి మాత్రం మారలేదు )
అలిగిన వేళనే చూడాలి (మగాళ్ళు అలిగితే నిజంగా ఎన్.టి.ఆర్ అంత అందంగా ఉంటారా)
ప్రేమయాత్రలకు బృందావనం (కొత్తగా పెళ్ళైన వారు తెలుసుకోవలసిన సత్యాలు )
జ్యోతి వలబోజు....

Posted by జ్యోతి Feb 27, 2010

Subscribe here