BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...


"నేను మేస్టర్ని. ఎం. బీ. ఎస్ ప్రసాద్ కి కేవలం ఫస్ట్ క్లాస్ కాక డిస్టింక్షన్ ఇస్తున్నాను" అని కవన శర్మ గారు చెప్పిన ముందుమాటే చాలు ఈ పుస్తకం విలువ చెప్పడానికి. ఆంగ్ల సాహిత్య అభిమానుల్లో పీ. జీ. ఉడ్ హౌస్ నీ, అతని రచనలలో వెల్లి విరిసే సున్నితమైన, విభిన్నమైన హాస్యాన్నీ ఎరుగని వారు ఉండరు. ఇద్దరు ఉడ్ హౌస్ అభిమానుల (శర్మగారూ, ఈ పుస్తక రచయత ఎం. బి. ఎస్ ప్రసాద్ గారూ) సాహిత్య చర్చలు ఒక ముఖ్య కారణంగా ప్రసాద్ గారి కలం నుంచి వెలువడి, ఎంతో ప్రాచుర్యం పొందిన రచనలు ఇవి. ' అచలపతి కధలు ఎంత బావుంటాయో, రాంపండు లీలలు కూడా అంతే బావుంటాయి. జీవ్స్, వూస్టర్ పాత్రల స్పూర్థితో 'అచలపతి కధలూ ఎందుకు రాసారో రచయత ఈ పుస్తకం ముందు మాటలో చెప్పారు, అవి ఉడ్ హౌస్ అభిమానులకి కూడా నచ్చడం పట్ల సంతోషం వెలిబుచ్చారు కూడా. ఆ సునిశితమైన హాస్యం అందరికీ అందాలనే ఉద్దేశ్యంతో మరొక రెండు, మూడు పాత్రలని కలగలిపి తయారు చేసిన పాత్రే మన హీరో రాంపండు. ఈ పుస్తకం లో ఉన్న పదిహేడు కధలూ, చిత్ర విచిత్రం గా సాగే అతని ప్రేమ లీలలు.



సూర్యుడు ఒక దేశంలో అస్తమించినా మరొక దేశంలో ఉదయిస్తూనే ఉంటాడు. అచ్చం మన రాంపండు ప్రేమ లాగే. అతని ప్రేమ కి ఆది, అంతం లేదు. అది అనంతంగా సాగుతూనే ఉంటుంది. అనంత్ అనబడే అనంత శయనానికి ప్రాణం మీదకి తెస్తూనే ఉంటాయి. రాంపండు కి ప్రేమించడం తప్ప వేరే పనేమీ లేదు. ఎందుకంటే నెల నెలా పాకెట్ మనీ ఇచ్చే బాబాయి ఉన్నాడు కనక అందరిలా ఉద్యోగం లాంటి మామూలు వ్యవహారాలు పెట్టుకోడు. అతనో ఏకలవ్యుడు అంటే ఒకసారి ఒక్కరినే ప్రేమిస్తాడు, ఎవరిని ప్రేమించినా అది పాపం అతని బాల్యమిత్రుడైన పాపానికి అనంతంగా శయనించే (అంటే పనీ పాటా లేదని అర్ధం) అనంత శయనం మెడకే చుట్టుకుంటుంది. అది ప్రేమకధని విజయవంతం చెయ్యడానికే మొదలయినా, చివరికి అభాసుపాలుగానే ముగుస్తుంది. ఈ ప్రయాణంలో రరకాల సంఘటనలూ, సన్నివేశాలూ.. నవ్వుల వానలో తడిపేస్తాయి.



'తా వలచింది రంభ' అన్నది పాత నిజమే.. అది రాంపండు విషయంలో మరింత నిజం.. అందుకే అందరికళ్ళకీ షాండోలా కనబడే షాలిని కూడా అతనికి లతాంగిలాగానూ, పరమపాతకాలపు పేరైన సుబ్బి కూడా ముగ్గులో గొబ్బిలాగానూ కనిపిస్తూ, వినిపిస్తూ ఉంటాయి. ప్రతీ కధలోనూ రాంపండు విధిగా ఎవరో ఒక అమ్మాయితో తలమునకలు అయ్యేటట్లు ప్రేమలో పడటమూ, దానిని సఫలం చేసే బాధ్యత అనంతు మీద అతని ప్రమేయం లేకుండా పెట్టడమూ ( నీకంత బుర్ర ఎక్కడ ఏడ్చిందిలే? నువ్వంటే అచలపతి అని అంటూ మరీ), అచలపతి సలహాల వల్ల అనంతు వాటిల్లోంచి బయట పడటమూ హుషారుగా జరిగి పోతూ ఉంటాయి. ఈ ప్రక్రియలో అనంతు ఒకసారి ప్రేమకధలు రాసే కల్పనారాణీ అవతారం ఎత్తవలసి వస్తే (రాంపండూ- పెసరట్ల సుబ్బీ), మరొకసారి రాంపండు ని హీరోలా చూపించడానికి తనే అతని ప్రేమికురాలి తమ్ముడుని నీళ్ళల్లో తోసేయ్యడం (రాంపండూ-షాండో షాలినీ), అతను ప్రేమించిన అమ్మాయిని, తన ఇంటికే భోజనానికీ, టీ కీ పిలవవలసి రావడమూ, ఆ 'వాలెంతింటా' అది తింటా, ఇది తింటా అంటూ అతని బుర్రతో సహా తినడమూ (కామ్రేడ్ రాంపండు). అంతే కాక కవిత్వపు పందాలూ, ఆటల పోటీలూ, వాటిల్లో ఎదురయ్యే పందాలూ, పరాభవాలూ ఒక ఎత్తు అయితే.. రాంపండు కి తెలిసిన వాళ్ళతో తను తిట్లూ, మైదా పిండి తలకి పోయించుకోవడమూ ( రాంపండూ- హెడ్మాస్టారూ), ఐస్ దిండు తో తడిసిన పక్కమీద పడిన అవస్థలూ,(రాంపండూ- ఐస్ దిండూ), శునకదానాల పేరిట కుక్కలని కాపలా కాయడమూ, కావలసినప్పుడు మార్చడమూ (రాంపండూ- శునకదానమూ) లాంటివన్నీ మరొక ఎత్తు. ఈ మధ్యలో సింపుల్ గా ఒకరు తలుపుకొట్టి వచ్చిన వారి ధ్యాస మళ్ళిస్తే మరొకరు లోపలకి వెళ్ళగలిగే అవకాశం ఉన్నచోట, అక్కరలేని పూలకుండీల ఉపాయాలూ (రాంపండూ- రెసిడెన్షీల్ స్కూలూ), ఇలా రకరకాల సరదా కధలమధ్యన సమయం తొందరగా కరిగిపోతుంది.



ఇలా సుబ్బీ, షాండో షాలినీ, సులోచనా, వాలెంతింటా, సుమనోహరీ, వీణాపాణీ, కోకిలలని వరసగా ప్రేమించిన రాంపండు చివరికి అనుకోని పరిస్థుతుల్లో ఊహని పెళ్ళి చేసుకోవలసి వస్తుంది. ఇన్నాళ్ళూ "ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చింది అన్నట్టుగా వీడు ప్రేమిచడమూ అది నా పీకకి చుట్టుకోవడమూ" అని చిరాకు పడే అనంతు ఊహతో అతని పెళ్ళి జరిగిందని తెలియగానే ఎగిరి గంతేస్తాడు. తన బాబాయి ఈ పెళ్ళిని ఆశీర్వదించేట్టు చెయ్యమని ప్రాధేయపడితే జాలి పడి అతనిని కలుస్తాడు. ఊహే అసలు కల్పనారాణి అని షాకింగ్ నిజం తెలియడమే కాక, ఆవిడ రాంపండు బాబాయి మీదా, తన మీద పరువు నష్టం దావా కూడా వేసే పరిస్థితి రావడం తో మరో దారి లేక అచలపతి దయవల్ల మతిస్థిమితం లేనివాడిగా ముద్ర వేయించుకోవలసి వస్తుంది పాపం అనంతుకి. అనంతుతో కలిసి కల్పనారాణి డ్రామా ఆడినందుకు రాంపండు పాకెట్ మనీ అలవెన్స్ కట్ అయిందని వేరే చెప్పక్కర్లేదు.. ఇలా పాపం రాంపండు ప్రేమే కాక పెళ్ళి కూడా అనంతు ముప్పుకే రావడంతో ఆఖరు కధ ముగుస్తుంది.



కధల్లో ఉన్న చమత్కారాలూ, ఉడ్ హౌస్ తరహా సంభాషణలూ, చమత్కార బాణాలూ కధల్ని వదలకుండా చదివిస్తాయి. ఈ తరహా హాస్యం తెలుగు పాఠకులకి అంత పరిచయం లేకపోయినా, కొత్తగా, సుతిమెత్తగా హాయిగా ఉండి అలరిస్తాయి. ఈ మూడు ముఖ్య పాత్రలూ, రాంపండు ప్రియురాళ్ళ పాత్రలే ,కాక మధ్యలో వచ్చిపోయే అత్తయ్యలూ, వారి స్నేహితులూ, వారి పిల్లలూ ఇలా అనేక పాత్రలు మనల్ని పలకరించి వారివంతు హాస్యాన్ని చిలికించి వెళతాయి.



'మొగుడు పారిపోయినా పర్వాలేదు కానీ పనిమనిషి పారిపోతే మాత్రం మళ్ళీ దొరకదు" అని వంట మనిషి భీమారావు ని పణంగా పెట్టడం గురించి చెప్పే ఉషారత్తయ్యా ఎప్పుడైనా అవలీలగా స్టమక్ లైనింగ్ గురించి మాట్లాడేసే కామేశం బాబయ్యా, చిన్నదెబ్బసాయంతో క్షతగాత్రుడినంటూనే అన్ని కులాసాలూ జరిపించుకునే ఫల్గుణుడూ.. వీటిల్లో కొన్ని.


చదవగానే పకపకా నవ్వించేది హాస్యంలో ఒకరకంగా అలరిస్తే.. సున్నితంగా చక్కలిగిలులు పెట్టే ఈ సునిశితమైన హాస్యం మరొకరకంగా మనల్ని మురిపిస్తుంది. ప్రసాద్ గారి శైలి గురించి కానీ, ఆయన కలానికున్న పదును గురించి కానీ, అది చేసిన, చేస్తున్న ప్రయోగాలని గురించి కానీ నేను కొత్తగా, ప్రత్యేకంగా చెప్పేది ఏమీ లేదు.. అందుకే శ్రీ కవనశర్మ గారు చెప్పిన రెండు మాటలు చెప్పి ముగిస్తాను. "ఈ రచనలు మనల్ని ఆసాంతం చదివిస్తాయి, అలరిస్తాయి. కొని చదివినందుకు సంతోషిస్తాం. కనక మీరు కొనవచ్చు అని సిఫార్సు చేస్తున్నాను" అన్నారు.

"కధలకీ, కధనానికీ అతికినట్టుగా ఉన్న ప్రముఖ చిత్రకారులు శ్రీ బాలి వేసిన బొమ్మలు కూడా ఈ పుస్తకానికి హైలైట్ గా నిలుస్తాయి. శ్రీ బాపూ రమణలకి అంకితమిచ్చిన ఈ పుస్తకం విశాలాంధ్ర వారిచే ప్రచురించబడింది.

ఈ పుస్తక సమీక్షను రాసినవారు ప్రసీద పేరుతో మనసు పలికే అని బ్లాగుతూ , కౌముదిలో అగ్రహారం కధలతో అందరి మనసు దోచుకున్న డా.సుభద్ర వేదుల

Posted by జ్యోతి May 21, 2010

Subscribe here

భువన సుందరి సీరియల్ చదవండి

భువన సుందరి సీరియల్ చదవండి
Keira Knightley: Beautiful Lady reading a Book

You said it!