BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...


1950 వ సంవత్స్రరంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రేడియోలో ' వక్తృత్వము - శ్రోతల మనస్తత్వము ' అనే విషయం మీద చేసిన ప్రసంగంలో శ్రోతల్లో రకాల గురించి, వారి మనస్తత్వాల గురించి, వారి మధ్యన ప్రసంగం చేసే వక్తల ఇబ్బందుల గురించి హాస్య, వ్యంగ్య ధోరణిలో వివరించారు. ఆ ప్రసంగపాఠం నుండి కొన్ని భాగాలు.......

ఏ రాజో, చక్రవర్తో రాజ్యాల్ని పాలించేటప్పుడు ప్రజల హక్కులనీ, కష్టసుఖాలనీ, మరేదో అనీ ఆందోళనలు చేయడానికి కాని, ఆవేశాలు కలిగించడానికి కాని అవసరమూ ఉండేది కాదు, అవకాశమూ ఉండేది కాదు.
మన భారత దేశంలో దాదాపు నూరేళ్ళనుంచి మహావక్తలు పుట్టుకొచ్చారు. ఇలా రావడానికి కారణం ఇక్కడ రెండు మూడు మహోద్యమాలు పుట్టి విజృభించాయి. సంఘ సంస్కరణోద్యమం, మత సంస్కరణోద్యమం, భారత స్వాతంత్ర్యోద్యమం - మూడు ఉద్యమాలూ ప్రజలకు సంబంధించినవే.

అయితే దాదాపు ముఫ్ఫయి ఏళ్ళక్రితం దాకా మధ్య తరగతి అక్షరాస్యులే ప్రజ అన్నమాట. అంటే నా అభిప్రాయం సభల్లో, సమావేశాల్లో వాళ్ళే లెండి ఉండేవారు. వాళ్ళే శ్రోతలు, కనుక వక్తల ప్రసంగాలలో కూడా ఒక హుందా, ఒక పెద్దమనిషి తరహా ఉండేవి.

గాంధీ యుగం వచ్చాక ప్రజాబాహుళ్యం సభలు వచ్చాయి. గాంధీ ఉద్యమంలో మంచి వక్తలూ వచ్చారు.

సభలకు హాజరయ్యే వాళ్ళలో ఎన్ని రకాల వాళ్ళున్నారండీ ! ఎన్నెన్ని మానవ ప్రకృతులున్నాయో అన్ని రకాల శ్రోతలూ ఉంటారు కదూ !

అయిదు గంటలకు ప్రారంభమయ్యే సభకు నాలుగు గంటలకే వచ్చే భక్తుడున్నాడు. ఇతగాడు పెద్దమనిషి. ప్రతీ సభకూ కూడా ఎవరు మాట్లాడినా సరే, ఏ విషయాన్ని గురించిన ప్రసంగమయినా సరే ఈయన వేంచేసి తీరుతాడు. అంతే కాదు అది ఎలాంటి ఆముదపు ప్రసంగమయి ఊరుకున్నప్పటికీ ఈ మంచివానికి బాగుండి తీరుతుంది.

ఇతగాడు మళ్ళీ మూడు నాలుగు రకాలు :

రాగానే ముందు పంక్తిలో కూర్చుండి, సూటిగా అప్పణ్ణుంచే వేదిక వైపు వక్త నిలబడవలసిన చోటుకేసి చూపులను గుచ్చి చూస్తూ, నవ్వూ త్రుళ్ళూ లేకుండా సభాంతందాకా కూర్చుండే రకం ఒకటీ: ఈయన నిజానికి ఉపన్యాసం వినడు. మంఛివాడు. మనస్సు ఖాళీగా కూడా ఉంటుంది, మొదటా చివరానూ ! సభకు రావడం పురుషలక్షణం కనుక వస్తాడు.

ఉపన్యాసం ప్రారంభం మొదలుకొని అంతం దాకా, పెదవులు రెండు చెవులదాకా, విశాలమైన నవ్వుతో, చప్పుడు చెయ్యని నవ్వుతో - చిరునవ్వే అది - అలాంటి నవ్వుతో సాగదీసి తానూ, వక్తా, విషయమూ, లోకమూ అంతా మంచివి కనుక తాను ఎంచక్కా ఒప్పుకున్నట్టు కనబడే రకం మరొకటి. ఈ రబ్బరు రకం మొదటి రకానికి తమ్ముడు.

ఉపన్యాసం ప్రారంభించీ ప్రారంభించడంతోనే కుర్చీ ఉంటే దాని అంచునీ, క్రింద అవుతే ఒక కాలు అడ్డంగానూ, ఒక కాలు నిటాగ్గానూ మడిచి మడతగా ముందుకి ఒరిగిన్నీ, మరీ మంచి సంగతి వచ్చినప్పుడు ఉత్సాహంతో అవసరమైతే ముందుకు దూకడానికిలాగా కూర్చుని, అప్పుడూ ఇప్పుడూ పేలవమయిన చోట ' వినండి వినండి ' అంటూ, హాస్యం లేని చోట ఫెడీలుమని నవ్వుతూ, తానే దగ్గరుండి వక్త చేత ఉపన్యాసం ఇప్పిస్తున్నట్లూ, తానూ వక్తతో ఏకీభవిస్తున్నట్లూ తొండలాగ తల పంకిస్తూ సందడి చేసే నరాల పట్టులేని వొడుదుడుకు రకం ఒకటి ఉంది.

ఇంకో జాతి శ్రోత ఉన్నాడు. అరుదుగానీ ఉన్నాడు. అక్కడక్కడా కనిపిస్తుంటాడు. ఇతగాడు చిన్న నోటు బుక్కుతో, పెన్సిల్ తో వస్తాడు. ప్రసంగం వింటూ వింటూ రివ్వున నోటు బుక్కూ, పెన్సిల్ తీసి దానిలో ప్రసంగంలోని మహద్విషయమో, వాక్యమో వ్రాసేసుకుంటాడు, మహా జ్ఞానతృష్ణ ఉన్న విద్యార్థిలాగ. ఆ పుస్తకం నెమ్మదిగా లాగి చూస్తే ఎందరివో, ఎన్ని ఉపన్యాసాల తాలూకువో వ్రాసి వుంటాయి. అయిన తారీకు, వక్త పేరు, ఉపన్యాస విషయమూ కూడా ఉటంకింపబడి ఉంటాయి. అయితే దానిలో వ్రాసి ఉన్నవేవీ వ్రాసిన వాడికీ, ఇతరులకీ కూడా తెలియవు.

వీళ్ళతో ఇంకొకడున్నాడు. వక్తకు స్నేహితుడు. అనుయాయి. మెచ్చుకునేవాడు. ఉపన్యాసం సాగుతుంటే కళ్ళు ఉల్లాసంతో మెరిపిస్తూ, ఇటూ అటూ ఇతర సదస్యులవైపు " నేను చెప్పాను గదూ ముందే " అన్నట్లూ " ఎవరికోసం ఒప్పుకుంటారండీ చచ్చినట్లు " అన్నట్లూ, " అయిందా మీ పని " అన్నట్లూ చూస్తూ ఉపన్యాసం చివరని వక్త పక్కకి దూకి ఇట్టే అంగరక్షకుడు లాగ నిలబడుతూ, ఆటోగ్రాఫ్ హంటర్స్ ని సర్ది జాగ్రత్తగా ఆర్డరులో పంపుతూండేవాడు.

ఈ శ్రోతలందరూ వక్త స్నేహితులు - పురాణ కాలక్షేపం రకం, రబ్బర్ నవ్వు రకం, తొండ రకం, నోటుబుక్ రకం, అంగరక్షకుడి రకం.

మరికొన్ని జాతుల శ్రోతలున్నారు. వీళ్లతోనే పేచీ.

ఒక్కొక్క శ్రోత వస్తుంటాడు. ఇతగాడు ఉపన్యాసకునివైపు చూడడు. పక్కకి తల తిప్పి ఏదో చూస్తున్నట్లు చూస్తూ కూర్చుంటాడు. " ఏదో మాట్లాడుదూ ! నేను వింటూనే ఉన్నాను. ఇలాంటివి చాలా విన్నాను కూడా ! " అని అనుకున్నట్లు వక్తకు అనిపిస్తాడు. ఇది గడ్డు జాతి. గడసరి జాతి. ఉపన్యాసం కాగానే తత్ క్షణం ఏమీ అనకుండా వెళ్ళిపోతాడు.

మరొక రకం శ్రోత ఉంటాడు. ఈ భయంకరుడే సూటిగా వక్త కళ్ళల్లోకి చూస్తూ, నవ్వూ త్రుళ్ళూ, తలపంకింపు ఏమీ లేకుండా కూర్చుని " నువ్వు చచ్చినా ఎంత వాగినా నేను మెచ్చుకోను తెలిసిందా " అన్నట్లు ఉంటాడు. ఇతని వైపు ఏమాత్రం తరుచుగా చూసినా ఉపన్యాసం నట్టుతుంది. ఇతగాడు లోకోత్తరుడు. అసాధ్యమైన తెలివితేటలు గలవాడు. మెచ్చుకుని తెలివి తేటలకు లోపం తెచ్చుకోడు.

ఇంకొక రకం గమ్మత్తు శ్రోత ఉన్నాడు. ఉపన్యాసకుడు వైపు చూస్తూ, పక్కన ఉన్న వాడితో ఏదో చెప్తూండడం, నవ్వుతూండడం చేస్తూ ఉంటాడు. ఉపన్యాసంలో ఆకర్షణ లేకపోతే, జిడ్డుగా ఉంటే, మరో విషయం తోచక పక్కవాడితో మాట్లాడుతున్నట్లు కనబడతాడు. ఒక్కొక్కప్పుడు మరొకరకం కంగారు కలిగిస్తాడు ఇతనే. వక్త కట్టులోనో, చొక్కాలోనో ఏదో నవ్వు పుట్టించేది ఉన్నట్లో, వక్త హమేషా తెలియకుండా ఒకటే మాటనో, ఒకటే చేయి ఊపునో, ఒకటే పెదవి చప్పరింపునో వాడుతున్నట్లో, అలా చెయ్యడం వలన వాళ్ళల్లో వాళ్ళు నవ్వుకుంటున్నట్లో తోపిస్తాడు ఈ మహానుభావుడు. ఇతడిది చాలా అపాయకరమైన ధోరణి.

ఇక యుద్ధకాండపు శ్రోతలున్నారు. వీరిలో ధర్మ యుద్ధపు వాళ్ళూ, అధర్మపు దొంగతనపు చాటుమాటు నంగి నంగి యుద్ధం వాళ్ళూ ఉన్నారు.

అసలు యుద్ధాలలో లాగే ధర్మయుద్ధం వాళ్ళతో పోట్లాడి గెలవడమే తేలిక. వీళ్ళు అడ్డుసవాళ్ళు వేస్తారు. గర్జిస్తారు. హాస్యపు మాటలు విసురుతారు. ఇవేవీ రానివాళ్ళు ఊరికే చప్పట్లు కొడతారు. వీళ్ళు నిజమైన వక్తకు ఉత్సాహమూ, వేడి కలిగిస్తారు - ముఖ్యంగా అడ్డు సవాళ్లు వేసేవాళ్ళు !

ఇక అధర్మయుద్దపు శ్రోతగారు. ఇతనికి ఎన్ని జంతువుల భాషలో వచ్చు. ఎన్ని రకాల వాద్య విశేషాలో నేర్చుకున్నాడు. కప్ప, కాకి, మేక, పిల్లి, శునక, గార్దభాదులు అన్నిటి అరుపులూ అచ్చంగా అలాగే వచ్సునితనికి. తరువాత సన్నాయి, ఈలపాట, బ్యాండు వాద్యమూ అన్నిటిలో దిట్ట ఈయన.

ఒకసారి వీటి సహాయం ఏమీ ఆపేక్షించకుండానే ఉపన్యాసం హుషారుగా సాగుతున్నప్పుడు నిశ్శబ్ద సదస్యలోకం లోనుంచి ఒక్క మూలుగు - రోకలి బండలాగ, పాములాగా మన నరాల ద్వారా మెదడులోకి పాకి, తిరిగి నరాల ద్వారా ఒళ్లంతా నిండిపోయేది - ఒక్క మూలుగు మూలుగుతాడు. ఆది వక్తకు మృత్యువు లాంటిది.

అయితే ఇతనికన్నా శత్రువు ఇంకొకడే ఉన్నాడు. ఇతను కూడా చల్లగా చప్పుడు చేయకుండా వింటూన్న సభ్యకూటంలోనుంచి హఠాత్తుగా గట్టిగా ఆవులిస్తాడు. వక్త అంటే గిట్టకకాదు. పరధ్యానంగా, అంటే ఏ ఇంటి గొడవో ఏదో ఆలోచించుకుంటాడో ఏమో. ఇతన్ని ఎలా ఎదుర్కోవడం చెప్పండి వక్త ?

ఎంత గడిదేరిన వక్త అయినా గద్దేమీదకి ఎక్కేముందూ, ఎక్కిన రెండు నిముషాలదాకానూ లోపల గుండె పీచుపీచుమంటూ ఉంటుందనుకుంటాను. వేయిమందితో కర్రతో చెడీ యుద్ధం చేయవలసినవాడు వక్త. మెదడుతో ఉప్పట్టీ, చేడుగుడూ, కుండ బంతీ, కోతి కొమ్మచ్చీ అంచీలమీద ఆడగలిగే నేర్పరి వక్త.

................ ఇంకా ఇన్ని రకాల శ్రోతలను ఆకట్టుకుని ఉపన్యాసాన్ని ఎలా రక్తి కట్టించాలో కొన్ని సూచనలు కూడా చేస్తారు ఈ ప్రసంగంలో దేవులపల్లి వారు.


ఈ వ్యాసాన్ని అందించినవారు శిరాకదంబం బ్లాగర్ రామచంద్రరావుగారు. ధన్యవాదాలు రావు గారు.

Posted by జ్యోతి May 24, 2010

Subscribe here