BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...

ఉప శీర్షిక 'చింతనాత్మక సాహిత్యం' అన్నందుకు మిసిమి లోని ప్రతి వ్యాసమూ పాఠకుల్లో వివేచానత్మకమైన విమర్శనాత్మకమైన ఆలోచనను కలుగచేస్తుంది. పూజ్యులు ఆలపాటి రవీంద్రనాథ్ గారి సంపాదకత్వంలో వెలువడిన ప్రథమ సంచిక నుంచి, అన్నపరెడ్డివారి సంపాదకత్వం వరకు 'మిసిమి' మాస పత్రికకు ఇది వర్తించినా, విషయ విస్తృతి రీత్యా ప్రస్తుత జూన్, 2010 సంచిక నుంచి మిసిమి మరింత పసిమి ఛాయతో ప్రకాశిస్తోంది. వల్లభనేని అశ్వినీ కుమార్ గారి ఆవాస సంపాదకత్వంలో వెలువడిన ఈ సంచిక పరిమాణంలోనే కాక ప్రమాణాలలో సైతం ఉత్తమ అభిరుచులను పెంపొందించే విధంగా తీర్చి దిద్దబడింది.

చిత్ర కళకు ఎప్పుడూ ఉచిత స్థానం ఇస్తూ గొప్ప చిత్రకారుల మంచి చిత్రాలను అట్టలమీద ముద్రిస్తూ, ఆయా చిత్రకారుల పరిచయంతో ఒక వ్యాసం ఇవ్వడం పరిపాటిగా వస్తున్నదే. ఈ సారి ప్రముఖ జానపద చిత్రకారుడు,జూన్ తొమ్మిదిన రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖచే జీవితకాల ప్రతిభాసాఫల్య పురస్కారాన్ని అందుకోనున్న కాపు రాజయ్యగారి చిత్రాలు ముఖపత్రాన్ని( బతుకమ్మ పండుగ ), రెండు నాలుగు అట్టల్నీ (తాన తందానా, మాతృత్వం ) అలంకరించాయి. వీటితో పాటు, లోపలి పేజీలలో కూడా తెలుపు-నలుపు చిత్రాలను ముద్రించడం ఈ సంచిక నుంచి ఆరంభమైన మరో విషయం. చక్కని రేఖతో ఈ చిత్రాలను గీసిన చిత్రకారుడు ఎవరో, (పేరు ఎక్కడా లేదు ) అభినందనీయుడు. అలాగే మూడవ అట్టమీద డి. గోవిందరాజుల చిత్రం ' పల్లె పడుచు' అలరిస్తుంది. చిత్రకళావనిలో తిరుగురాయుడై ధారి ప్రక్కన దర్శనమిచ్చిన ఎనిమిది దశాబ్దాల చిత్రకళారత్నాన్నినిత్యమూ బ్రతుకు చీకటిలోమునకలై మసలే మనకు ఏరి చూపిన ఆశ్వినికుమార్ మిసిమి సంపాదకత్వాన్ని స్వీకరించడం ముదావహం.

కాపు రాజయ్యగారి పరిచయ వ్యాసాన్ని కాండ్రేగుల నాగేశ్వర రావు రాశారు. 'జనపదాల కాపు'గా ఆయనను చిత్రిస్తూ, " తెలంగాణా జీవన స్రవంతిని, శ్రామైక జీవన సౌందర్యాన్ని తన రేఖలతో, రంగులతో సజీవం చేసిన మెతుకు సీమ చిత్రకారుడు'' అనడం సముచితం. ' తెలుగు బొమ్మల బ్రహ్మ'గా ప్రముఖ కళావిమర్శకులు ఏ.ఎస్. రామన్ గారిచే కీర్తింపబడిన రాజయ్యగారి చిత్రాలకు నకాషీ చిత్రకారుల సాంప్రదాయిక శైలి అక్షరాభ్యాసం చేయించిందనీ, ఆయన చిత్రిత వస్తువులన్నీ గ్రామీణ జీవితంనుంచీ, పండగలూ,కర్మకాండలూ, గ్రామ దేవతలూ, వివిధ వృత్తుల, కులాల వారి నిత్య జీవితం మొదలైన అంశాలనుంచి స్వీకరింపబడినవంటారు.

కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీతల పరిచయ వ్యాసాలను ఎప్పటినుంచో ధారావాహికగా ఇస్తోంది, మిసిమి. ఈ నెల మనోజ్ దాస్ గారి పరిచయాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ సలహాదారులు డా.జె. లక్ష్మిరెడ్డి చేశారు. ఇదివరలో మానవీయ అంశాలకే అధిక ప్రాధాన్యముండే పత్రికలో వివిధ విభిన్న అంశాలతో కొత్త శీర్షికలను ప్రవేశ పెట్టిన అశ్విని కుమార్ గారిని అభినందించి తీరాలి. కళారంగం, పుస్తక పరిచయం ( ఊర్లు పేర్లు పేజీల విషయాలు చెప్పే కేవల సమీక్షలా కాదు), ఆత్మకథ, సంస్కృతి, కవి, గత కాలమ్, నాగరకత, కథాసాహిత్యం, మేధావులు అనేవి కొత్త శీర్షికలు.

'కళారంగం' లో అబ్బూరి గోపాల కృష్ణగారు 'తెలుగు నాటక రంగ చరిత్ర' వ్యాసంలో ' నాటక రచన, ప్రదర్శన లలో తెలుగు వారు సాధించినది బహుస్వల్పమని సోదాహరణంగా వివరిస్తూ, అభిరుచి రాహిత్యం తెలుగు నాటక ప్రగతికి పెద్ద ఆటంకంగా పరిణమించింది అంటారు. ధార్వాడ నాటకాల ప్రభావం వల్ల ' ఆధునిక తెలుగు నాటక రంగం' ఆవిర్భవించలేదంటూ, అంతకు ముందున్న యక్షగానం కొంతవరకు దోహద పడిందంటారు. అప్పట్లో కావ్య భాషలో సంభాషణలు పలకడంలో ఇబ్బందిని అధిగమించడానికి నాటి నటులు కృతక శైలిని అనుసరించారానీ అంటారు. ఇతర భాషాసంపర్కం కేవలం పై మెరుగుగానే తెలుగు భాష పొందగలిగిన కారణంగా ఆధునిక తెలుగు సారస్వతం ఎదగవలసిన స్థాయికి ఎదగలేదనడం మంచి పరిశీలనే అయినా పాక్షిక సత్యం. ఆధునిక తెలుగు నాటకం ఎదగకపోయినా, ఇతర ప్రక్రియలు తెలుగులో బాగానే ఎదిగాయి, నాటక రంగం విషయానికొస్తే, ప్రయోగాశీలకమైన అనవసర ఆర్భాటాలతో తెలుగు నాటకం కునారిల్లుతోందన్న విషయాన్ని విస్మరించారు.

నటరాజ రామకృష్ణ ' నా కళా జీవితం - నాగపూరు' అనే వ్యాసంలో, తన జీవితంలో ఒక శకలాన్ని అత్యంత ఆర్ద్రతతో చిత్రీకరించారు. అదే ఆయీ వృత్తాంతం. నిండు జీవితాన్ని నాట్య కళకే అంకితం చేసి అజ్ఞాతంగా పండుటాకులా రాలిపోయిన ఒక వృద్ధ కళాకారిణి వేదనాభరిత యదార్ధ జీవన గాథ తప్పకుండ చదవాల్సిన వ్యాసం. ఆ రోజుల్లో ప్రజా కళలకు, శాస్త్రీయ కళలకు ఉన్న తేడా గురించి పడిన ఆలోచనే తన భావి జీవితానికి, పరిశోధనకు ఉపకరించయంటారు, నండూరి. ' భారతీయ సంస్కృతి-సత్యాసత్యాలు' ఎరుక పరుస్తూ, బి.ఎస్.ఎల్. హనుమంతరావు, ప్రాక్పశ్చిమాది భేద రహితంగా మానవులందరూ ఒకటే కనుక, జాతి జాతికీ ప్రత్యేక సంస్కృతి ఉండనవసరం లేదంటారు - చాలా... ... పరిణామ క్రమాన్ని కోరుకునే అంశమిది. భౌతిక పరిసరాల సవాలుకు మానవ మేధాశక్తి సృజన సామర్ధ్యం చెప్పగల సమాధానాల ఫలితమే సంస్కృతి అంటూ, సంస్కృతికి మంచి నిర్వచనం ఇచ్చారు. ఆధ్యాత్మికత భారతీయ సంస్కృతికి పునాది అనీ, కేవలం ప్రాపంచికమైన పునాదులు గల పాశ్చాత్య నాగరకత కంటే భిన్నమైనదనీ ఆంగ్లేయులే సూత్రీకరించారంటూ, ఏమైనా భారతీయతలో నశించి పోతున్న ఆధ్యాత్మికతను పునరుద్ధరించి పాశ్చ్యాత్యులే మనలో జాతీయ భావాన్ని పురికొల్పారంటారు. ప్రాక్పశ్చిమ సంస్కృతీ భేదం మధ్య యుగాలలో లేనిదనీ, ఇటీవలనే పుట్టిన భావమనీ చెబుతూ, ప్రాక్పశ్చిమ సంస్కృతులే కాదు, క్రైస్తవ ముస్లిం సంస్కృతులు గాని, ఆంగ్లో అమెరికన్ సంస్కృతులు , ఆ మాటకొస్తే అన్ని సంస్కృతులు సాంకర్య జనితాలేనంటూ, ఏ సంస్కృతుల్లోనూ లేని సహనశీల శాంతి ప్రియత్వాలూ, సనాతన అప్రియత్వాల సమ్మేలనమే మానవ జాతి ఉమ్మడి సంస్కృతికి దోహదపడుతున్దంటారు. చాలా సునిశితమైన వివేచనా- ధారంగా ఈ వ్యాసం లోని విషయం రూపొందిన్దన్నది నిర్వివాదం. నేటికీ హిందువులు చెట్లను,పుట్లను, జంతువులను, వినాయకుని వంటినరమృగాలను పూజించడం అసమంజసమంటారు. అయితే, ఇలా అనుకోవడమే జీవజాలాల మనుగడకు అవరోధమై, పర్యావరణ సమ స్థితికి కారణ మవుతోందని గుర్తించాలి.

మరో గొప్ప కథావ్యాసం ' నాగరకత' శీర్షికన ఇచ్చిన ' మేల్కొలుపు'. చిత్రకారుడు కూడా కావడం వల్ల రచయిత వ్యాసాన్ని కవితాత్మకంగా మలచారు. మనిషి ప్రకృతికి అనుగుణంగా నడచుకోవడంలోని, మానవ సహజ లేకితనాలు, దంబాలకు దూరంగా ఉండడంలోని, కలల్లో విహరించే కుటిలత్వాల, అనవసర వాచాలత్వాలకు దూరంగా ఉండడంలోని, సర్వ సుఖాలను గుమ్మరించుకునే అధికారానికి దూరంగా ఉండడంలోని, ఒక్క మాటలో చెప్పాలంటే, నాగరకతకు దూరంగా ఉండడంలోని పరమార్ధాన్ని నొక్కి చెప్పిన సత్యం - మనిషి తనను తాను తెలుసుకుని మేల్కోవటం! నాగరీక వక్ర వేషాలూ,అవినీతి మయమైన జీవన విధానం వదలి ధర్మ మార్గంలో బ్రతుకుని పండించుకుంటూ మానసికానందాన్ని పొందగలగడం - ' ఆత్మ సాక్షాత్కారం'! కథన శైలిలో నడచిన ఆలోచానాత్మక విశ్లేషణను పటనయోగ్యంగా అందించిన రచయిత సంపాదకులు వల్లభనేని ఆశ్వినికుమార్ గారే!

' గత కాలమ్ ' శీర్షికలో 'సైగల్ గానం చరిత్రలో రికార్డైన అద్భుత అధ్యాయం'గా వ్యవస్థాపక సంపాదకులు ఆలపాటి రవీంద్రనాథ్ గారి పాత వ్యాసాన్ని ఇచ్చారు. ఈ వ్యాసం ఎప్పుడు, ఏ సందర్భంలో వచ్చిందో వివరమిస్తే బావుండేది. అటువంటి వివరమిచ్చిన 1-2-70న విశాఖలో శ్రీశ్రీకి జరిగిన సన్మానం సందర్భంగా ప్రచురించిన సావనీర్లోని రాచకొండ విశ్వనాథ శాస్త్రి వ్యాసం ' మహాకవి', శ్రీశ్రీ తన శక్తినంతా ధర్మపక్షం నెగ్గ డానికే మహాకవిగా, మహామనీషిగా వినియోగించారంటారు. 'మేధావులు' శీర్షికలో మానవెంద్రనాథ్ రాయ్ ఆలోచనలు నేటికీ అక్కరకు వస్తాయని సరిశెట్టి ఇన్నయ్య, కీ.శే. బూదరాజు రాధాకృష్ణ గార్ల వ్యాసం నిరూపించింది. ' పుస్తక సమీక్ష'లో డా.ద్వానా సంపాదకత్వంలో వెలువడిన అపూర్వ గ్రంథం ' మా నాన్న గారు'ను తల్లావజ్ఝాల పతంజలి శాస్త్రి సమీక్షించారు.

కొత్త వ్యాసాలతో అలరించే మిసిమి పాత కవితలను ఇవ్వడం బావుండలేదు. ఎమ్.వి.ఆర్. ఆంగ్ల కవితకు అనువాదాన్ని ఆరుద్ర స్వదస్తూరిలో చూడడం ఓ పులకరింత. 'శ్రీపాద పురస్కారం' అందుకున్న తనికెళ్ళ భరణి చదివి వినిపించిన శ్రీపాద వారి వీలునామా లాంటి ఉత్తరం హృదయాన్ని కదిలిస్తుంది.

సంపాదక హృదయాన్ని ఆవిష్కరిస్తూ, సంపాదకులు అంటారిలా - '' ఏ జాతికైనా సంస్కృతే ప్రాణ నాడి. ఆ నాడీ స్పందనే జన జీవితంలో జవసత్త్వాలను నింపుతుంది. ఆ సంస్కృతీ విశిష్టతే జాతికొక ఔన్నత్యాన్ని, ప్రత్యేక గుర్తింపును సమకూరుస్తుంది.'' ఈ లక్ష్యసిద్ధి కోసం బాధ్యతాయుతమైన ఒక పత్రిక ఎలా ఉండాలో అలా, చక్కని వ్యాసాలను, శీర్షికలను జాగ్రత్తగా ఎంపిక చేసి అందిస్తున్న సంపాదకులు అస్వినీకుమార్ గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

-- మాకినీడి సూర్య భాస్కర్

Posted by జ్యోతి Aug 3, 2010

Subscribe here

భువన సుందరి సీరియల్ చదవండి

భువన సుందరి సీరియల్ చదవండి
Keira Knightley: Beautiful Lady reading a Book

You said it!