అతివలకు, అందాలు , అలంకరణలకు అవినాభావ సంబంధముంది. ఇది అబద్దమని ఎవరూ అనలేరు కదా. నాటి రాతియుగం నుండి నేటి నాగరిక యుగంవరకు స్త్రీ వస్త్రధారణ గురించి మీ అభిప్రాయం చెప్పండి అంటే తన మాటలను అందమైన పద్యాలలో ఇమిడ్చి మనకందించారు పద్యమంజూష బ్లాగర్ శ్రీ టేకుమళ్ల వెంకటప్పయ్య గారు. ధన్యవాదాలు వెంకట్ గారు..
తే.గీ..ఆకులలములు దేహాన నావరించ
రాతి యుగమున జీవించు రమణులెల్ల
వాన ఎండల కాగిరి వారలెల్ల
వాడసాగిరి పత్రాలు వాటికొరకె.
తే.గీ..లోహయుగమునవారలే లోకమెరిగి
శీత వాతాతపంబులు రోత దోయ
మేని నిండుగ గప్పుట మేలు యనుచు
చుట్టె దామర యాకులు సుఖముదెలిసి.
తే.గీ...మధ్యయుగమున యువతులు మారె జాల
కుట్టు యంత్రాలు రాకనె పట్టుదలగ
మేను దాచుటె గాకుండా మేలురకము
వేల రకముల దుస్తులు వేసిరకట
తే.గీ...రాచనగరున యుండేటి రాణులంత
కోరి జనులను నియమించి కోర్కెదీర
కోటిరకముల దుస్తులు కుట్టెరనఘ
వారే దర్జీలు మనకాయె వరసులుగా.
ఆ.వె..ఘల్లు ఘల్లు మనగ గజ్జెల పాదాలు
పట్టుపావడె కనికట్టు జేయ
బుట్ట చేతుల రవిక పొంగెడి వయసున
కుర్రకారుకెటుల కునుకు వచ్చు?
తే.గీ..మెల్ల మెల్లని నడకలు మేని హొయలు
కాళ్ళ జీరాడు ఓణీలు కాకవయసు
కావ్య నాయిక రీతిగా నవ్యశోభ
పసిడి పాదాల గోరింట పండి మెరయ.
తే.గీ. శారి యనగానె అమ్మకు సారి జెప్పు,
చీరెలిచ్చును సాక్ష్యము సారె లందె,
డ్రస్సు సులభము ఇంతికి బస్సులందు.
ఉరుకు పరుగుల బతుకున ఉచితమౌర!
తే.గీ..కాల మహిమన దుస్తులు చాల మారె
వళ్ళు దాచుట మరచిరి వగలు నేర్చి
కురచ చేతుల రవికలు గుండెలదర
దేశ దేశాల పోకడ దేహమంత.
తే.గీ..హద్దులోపల యుండిన ముద్దు తల్లి
హద్దు మీరిన ఫ్యాషన్లు వద్దు చెల్లి
రెచ్చగొట్టెడి దుస్తులు మెచ్చగలమ
మానభంగాలు హత్యలు మారుమోగు.
తే.గీ..సకలలోకము మెచ్చేటి చక్కనయిన
దుస్తులొసగును మీకెల్ల మస్తు పేరు
శీలమన్నది ముఖ్యము చాల చాల
పుట్టినింటి పేరు నిలబెట్టి జూపు.