BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...

రచన : మాకినీడి సూర్య భాస్కర్

కథాస్వామ్యం, గోదావరి స్టేషన్, సామెత కథల వంటి సొంత కథలను సంపుటాలుగా వేసిన ప్రసిద్ధ అనువాద కథకులు ఎల్. ఆర్. స్వామి - మలయాళంలో పుట్టి, తెలుగులో ఉద్యోగించిన జీవితాన్ని తన ప్రవృత్తికి అన్వయిస్తూ మలయాళం నుండి తెలుగులోకి, తెలుగు నుండి మలయాళం లోనికి అనేక రచనల్ని అనువదించారు. తమిళం నుండి తెలుగులోకి కూడా కొన్ని అనువాదాలు చేశారు. అనువాద రచయితగా వీరి ప్రాచుర్యం ఎంతటిదంటే, కేంద్ర సాహిత్య అకాడమీ స్వయంగా పూనుకుని వీరి చేత కొన్ని గ్రంథాల్ని అనువదింప జేసింది. అనువాద కథకునిగా ఎంత పేరు పడ్డారో సొంత ముద్ర కలిగిన స్వీయ కథలకూ అంతే పేరు పొందారు, స్వామి.

తెలుగులో స్వామి రచనా నేపథ్యానికి ఆరంభం మాత్రం గొప్ప విస్మయాన్ని కలిగించే సంఘటన. తెలుగు మాతృభాష కాకపోయినా, ఉద్యోగరీత్యా 1980ల్లో విశాఖ వచ్చి స్థిరపడ్డ కారణంగా తెలుగు నేర్చుకుని తెలుగు సాహిత్యాన్ని చదివారు స్వామి. ఓ ప్రముఖ వార పత్రిక పోటీలో బహుమతి పొందిన ఓ కథ గురించి చర్చించు కుంటున్న సహోద్యోగులతో, విభేదించిన కారణంగా మాటా మాటా పెరిగి, సత్తా ఉంటే కథ రాసి చూపమనే సవాలుగా పరిణమించడం వల్ల తప్పనిసరిగా రాయాల్సిన అవసరంలోంచి 20 ఫిబ్రవరి 1988 న పుట్టుకొచ్చింది , ఆయన మొదటి తెలుగు కథ 'జవాబు లేని ఒక ప్రశ్న'గా స్వామి కలం నుంచి. అంతే కాక, ఆంద్ర జ్యోతి వార పత్రిక ఉగాది కథల పోటీలో బహుమతి కూడా పొందింది. అయితే, స్వామి అప్పటికే మలయాళంలో గుర్తింపు పొందిన రచయిత అని పాపం వారి సహోద్యోగులకు తెలిసి ఉండదు. ఏమైనా వారిని అబినందించాలి, తెలియక చేసినా మంచి పని చేసినందుకు; మంచి అనువాదకున్ని తెలుగు సాహిత్యానికి అందించినందుకు.

ఒకటి రెండు సంఘటనలతో లోకరీతిని అద్భుతంగా చిత్రీకరించగల నేర్పుతో కథను సాధ్యమైనంత సంక్షిప్తంగా రాయగల శిల్పాన్ని సంతరించుకున్న స్వామి ప్రయోగవాది కూడా. జీవిత సారాన్ని ఏరి, కూరిన సామెతల ఆధారంగా మంచి కథ లల్లారు స్వామి. అయితే ఆ కథలు ఏదో ఒక సామెతను ఎంచుకుని దానికి రాసినట్లుగా ఉండవు. కథనం మొత్తంగానే ఆ సామెతకు దారి తీసినంత సగాజంగా ఉంటాయి. ఈ రకంగా లోగడ సామెత కథలను డా.(శ్రీమతి) తెన్నేటి సుధాదేవి రాశారు. ఈ ప్రయోగాన్నే ఇంకొంచెం మార్చి 'లోగుట్టు పెరుమాళ్ళ కెరుక' అనే ఒక్క సామెతనే తీసుకుని పదిన్నొక్క కథ లల్లారు
స్వామి. కథలన్నిటికీ ఈ సామెతే శీర్షిక కనుక ప్రత్యేకించి శీర్షికేదీ లేకుండానే కేవలం సంఖ్యతో సూచించారు. ఈ కథల విషయికంగా విలాసం మాస పత్రిక సంపాదకులు చింతా ప్రభాకర రావును అభినందించాలి. ఎందుకంటే ఆయన కోరి మరీ రాయించి ప్రచురించారు. భవిష్యత్తులో ఎప్పటికో రావాల్సి ఉన్న ఈ కథల్ని రాయడాన్ని వేగిర పరిచా రాయన.

'లోగుట్టు పెరుమాళ్ళ కెరుక' అంటే మనిషి ఆన్తర్యంలోని ఎవరికీ తెలియని ఆలోచనలు పెరుమాళ్ళుకు తెలుస్తాయని. అయితే ' ఎవరీ పెరుమాళ్ళు?' అని ప్రశ్నించుకుంటే 'ఎల్.ఆర్.స్వామి' అనే సమాధానం వస్తుంది, ఈ కథల్ని చదివినప్పుడు. ఆ విధంగా 'ఎల్.ఆర్. పెరుమాళ్ళు' అనే మరో పేరును సంపాదించుకున్నారు స్వామి. కొస మలుపు ఒక మెరుపుగా కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ, లోగుట్టు సామెతకు అతికేలా అప్పటి వరకు జరిగిన కథనీ, కతాంశాల్నీ మలుపు తిప్పేదిగా ఉండడం ఈ కథల్లో చూస్తాం. సాదాసీదా మొదలు ఒక వర్ణన లోకి దారి తీస్తుంది. ఆ వర్ణన తరువా త్తరువాత కథలోని పాత్రల సహజ స్వభావానికి సరిపోతుంది. ఈ కథల్లోని మౌలిక శిల్పమిది. పోలికలతో కథనాన్ని నడపడం కూడా గమనిస్తాం. పోలికలు అమోఘంగా ఉంటాయి. వీటిలో పలుకుబడీ, నుడికారంతో సంపద్వంతమైన తెలుగు భాషను వాడతారు. ఉదాహరణకు కొన్ని-

" ఆప్యాయంగా మసలితే జలగలా అతుక్కుపోతుందేమో!"
" ఏడ్చి ఏడ్చి ఉబ్బుకుపోయిన ఆమె కళ్ళు ఎర్ర మందారాల్లా కనబడ్డాయి."
" వర్ధనమ్మ అన్నయ్య ఆమెతో పాదరసంలా అంటీ అంటనట్లు ఉంటాడు."

వీటిని కేవలం పోలికలుగానే భావిస్తే సరి కాదు. ఈ పోలికల వెనుక లోకరీతిని అద్భుతంగా పట్టి ఉంచుతారు స్వామి.

" చూడు, చుట్టాలు సముద్రం వంటి వాళ్ళు. దూరం నుంచి కాని ఒడ్డున నిలబడి కాని చూస్తె బాగుంటుంది."
" అంత వరకు పిల్లల కేరింతలతో, పడుచువాళ్ళ కబుర్లతో కళకళలాడిన పార్కు ఆత్మీయులు విడిచి పెట్టిన ముసలి వాడి ఇల్లులా ఉంది." అలాగే రిటైరైన ఉద్యోగి జీవితం -
" టెంక లోపల తొలుచుకు తినే పురుగున్నా బయట నిగనిగలాడే కలెక్టర్ మామిడిపండు లాంటిది."
"పదవీ విరమణ చేసినవాడి జీవితంలా రెస్టారెంటు ఖాళీ అయింది."

తెలుగు మాతృ భాషగా గలవారికంటే జీవద్వంతమైన భాషను రాయగలగడం గొప్ప విషయం. ఆంటీ, కార్లు, సిటీ వంటి సర్వ సాధారణమైన పదాలు తప్పిస్తే ఆంగ్ల పదాల్ని అంతగా ఉపయోగించరు స్వామి.

చాలా కథల్లో తప్పనిసరిగా కనబడే పాత్ర కర్చీఫ్. కళ్ళు ఒత్తుకునే సాధనంగా దర్శన మిస్తుంది. ఒక్కో కథలో పేరు మార్చుకుని ' చీర కొంగు' గా అవతారమేత్తుతుంది. ఎక్కువగా కళ్ళు ఒత్తుకునే సాధనంగానే దర్శనమిచ్చినా, ఒకటి రెండు కథల్లో చెమట పట్టిన మొహాన్నీ, మెడనీ ఒత్తుతూ కనబడుతుంది. జేబు రుమాలు పాత్ర ద్వారా సమాజంలో భద్ర జీవితాలకన్నా అభద్ర జీవితాలే ఎక్కువన్న విషయాన్ని స్వామి చెప్పకుండానే తెలియజేసినట్లైంది.

మొదటి రెండు కథల్లోనూ మౌలిక సారాంశం ఒక్కటే - ఓ వ్యక్తి చనిపోయాకా సంబంధీకులు ( అదీ తల్లీ కూతుళ్ళు) ఏడ్చే ఏడ్పు చనిపోయినందుకు కాదనీ, మరేదో దానికి కారణమనీనూ. మొదటి కథలో ఆ పాత్రను కూతురు పోషిస్తే, రెండో కథలో తల్లి పోషిస్తుంది. కారణం ఆర్దికాంశం కావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఈ పదకొండు కథల్లోని ' లోగుట్టు' ముఖ్యంగా ఆర్ధిక సంబంధం కావడం గమనిస్తాం. మొదటి కథలో పెద్దమ్మ చనిపోతూ తన నగలూ డబ్బూ అయిన వారెవ్వరికీ ఇవ్వకుండా, చివరికంటా తనకు సేవ చేసిన పనిమనిషి బంగారమ్మకు ఇచ్చిందని తెలుసుకున్న బంధువులు, కూతురుతో సహా శవాన్ని వదిలేసి చక్కా పోతారు. అలాగే రెండో కథలో రామాయమ్మ ఏడుపు చనిపోయిన ఎనిమిదేళ్ళ కూతురు గురించి కాదనీ, ఆ అమ్మాయిని పణంగా పెట్టి తీసుకున్న రెండు వేల రూపాయల అప్పు గురించని తెలిసినప్పుడు విస్మయమౌతుంది. ఈ విధంగా ' లోగుట్టు'కు అసలు కారణం ఆర్దికాంశం కావడం ఎన్నో కథల్లో చూస్తాం.

కొంత ఖర్చుతో ఘనంగా విందిచ్చి, తన కివ్వాల్సిన పదిహేను వేల రూపాయల గొలుసును సొంతం చేసుకున్న తమ్ముడు, పదవీ విరమణానంతరం తండ్రికి వచ్చిన డబ్బును అతని దగ్గరున్న అక్క కైవసం చేసుకోక ముందే తన సొంతం చేసుకోవాలని భావించిన చెల్లీ, డబ్బున్న వారి పిల్లలకు తీసిపోకుండా కనబడాలనే తాపత్రయంతో తోటి విద్యార్థుల పుస్తకాలు దొంగిలించి, అమ్ముకుని,ఆ డబ్బుతో జల్సాలు చేసే విద్యార్థినీ, డబ్బు హోదా దర్పం ప్రదర్శించుకునే వేదికగా స్నేహితురాలి అమ్మాయి పెళ్లిని భావించి, భర్త వద్దన్నా వెళ్ళిన స్త్రీ ఒక మోసగాడి వలలో పడి తన నగలన్నీ
పోగొట్టుకోవడం - ఇలా ఆర్దికాంశమే అధికంగా 'లోగుట్టు' అవుతుంది. అయితే, ఆర్దికేతరమైన అంశాలు కూడా 'లోగుట్టు' కావడం కొన్ని కథల్లో ఉంది.

చిన్నప్పట్నుంచీ పని పిల్లగా ఉన్న కొండమ్మని వయసొచ్చేసరికి పనిలోంచి తీసేసిన అమ్మ గారి లోగుట్టు - ఆ అమ్మాయి పట్ల ఆవిడ భర్త చూపిన మొహం అయితే, ఎక్కడో పల్లెటూరిలో ఉన్న నిరుపేద మేనత్తని కారు పంపి రప్పించుకుని పట్టు చీర పెట్టి మరీ పంపించడంలో 'లోగుట్టు' కీర్తి కండూతి. జాలి గల వాడిగా మంచి పేరును కొట్టేయాలన్న పబ్లిసిటీ. అలాగే కాలదోషం పట్టిన వీసాను రక్షించుకుని, అమెరికా పౌరసత్వం సంపాదించడం 'లోగుట్టు'గా అందం చందం లేని అనకాపల్లి 'నల్ల బెల్లం దిమ్మ'ని పెళ్లి చేసుకుంటాడో అమెరికా సేటిల్డ్ ప్రబుద్ధుడు.

ఈ విధంగా సమాజంలో మనకి కనబడే రకరకాల మనుష్యుల ' లోగుట్టు'ల్ని ఈ కథల్లో బట్టబయలు చేసి పడేశారు స్వామి - మనసుల ఆంతర్యాలని పసిగట్టిన పెరుమాళ్ళు.

Posted by జ్యోతి Oct 12, 2010

Subscribe here