BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...


MALA P KUMAR SAYS...

బారిస్టర్ పార్వతీశం

మొక్కపాటి నరసిం హ శాస్త్రి

బాపు, ముళ్ళపూడి వెంకట రమణల బుడుగు, చిలకమర్తి నరసింహ శాస్త్రి గణపతి, మొక్కపాటి వారి బారిస్టర్ పార్వతీశం ,రవీంద్ర నాథ్ ఠాగూర్ నౌకా ప్రమాదం ల కోసం చాలా సంవత్సరాలుగా వెతుకుతుండగా ఆరు సంవత్సరాల క్రితం బుడుగు,ఈ మధ్య గణపతి, బారిస్టర్ పార్వతీశం దొరికాయి. చిన్నప్పుడు చదివిన ఈ నవలలు, మళ్ళీ చదవాలనే కోరికనే ఇంతలా వెతికించింది.బారిస్టర్ పార్వతీశం పుస్తకం, కొద్దిగా చినిగి పాతపడిన ప్రతిని, పాపం విశాలాంధ్ర లోని మేడం నా కోసం వెతికి ఇచ్చారు. అదే మహా ప్రసాదం అని తీసుకున్నాను.

ఈ నవలని శాస్త్రి గారు 1924 న రచించారు. ఈ రచనకు దారి తీసిన విధానాలు ,ఎలా రాశారు? ఈ నవల ముందు అంతరంగం లో ఆయన ప్రియ శిష్యుడు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు వివరించారు. బారిస్టర్ పార్వతీశాన్ని శ్లాఘించే శ్రీ శ్రీ గారి పద్యము తో అంతరంగాన్ని ముగించారు. ఆ పద్యం...

క్షితి లో బారిస్టర్ పార్వతీశము ను
చెప్పి, పిదప పలుకవలె కదా
కితకితల కితరులను భాసిత
సిత సుశ్లోకు డతడు సిరిసిరి మువ్వా!

శ్రీకాంత శర్మ గారి, ముళ్ళపుడి వెంకట రమణ గారి అంతరంగం, శ్రీ శ్రీ గారి పద్యము వందన్నర బొమ్మలు, జోకులు ఈ నవల కు స్పెషల్ అట్రాక్షన్.

లండన్ వెళ్ళి బారిస్టర్ చదివి దేశానికి సేవ చేయాలని ఆరాటము, ఉబలాటము, ఉత్సాహం కల ఆంధ్ర సనాతన బ్రాహ్మణ కుటుంబాని కి చెందిన యువకుడే పార్వతీశం. నవలంతా పార్వతీశం స్వీయ చరిత్ర రూపంలో వుంటుంది.
మాది మొగల్తూర్ లెండి .మొగల్తూర్ అంటే ఏమనుకున్నారో చరిత్రలో ప్రసిద్ది కెక్కిన మహానగరం (ఓ అప్పటి నుండే ప్రస్సిద్దా!) అని పార్వతీశం కథ చెప్పటం మొదలు పెడతాడు. ఆ ఊరి వారందరికీ పార్వతీశం అంటే తెగ ముద్దు. అక్కడ చదువయ్యాక నర్సాపురం లో టైలరు స్కూల్ లో ఫస్ట్ ఫార్మ్ లో చేరుతాడు. ఇక అక్కడ ఏర్పడిన వివిధ పరిచయాలు, అనుభవాల రీత్యా లండన్ వెళ్ళి బారిస్టర్ చదవాలని నిశ్చయం చేసుకుంటాడు.

మొగల్తూర్ లో బయిలుదేరిన పార్వతీశం ఇంగ్లాండ్ లో అడుగు మోపటము, అతను స్కాట్లండ్ లో ని ఎడింబరో విశ్వవిద్యాలయము లో ఏం.ఏ కోర్స్ చదువుతూ, ప్రక్కగా బారిష్టర్ పరీక్ష కి చదివి ఈ కాలం లో ఇంగ్లాండ్ లో రకరకాల అనుభవాలు గడించి,ఒక దొరసాని పిల్ల ప్రేమకు పాత్రుడై ,మొదటి ప్రపంచ యుద్దపు(1917) చివరి సంవత్సరం బారిస్టరు పార్వతీశం గా అవతరించి,ఇండియా కి ఓడలో రావటము, స్వగ్రామం చేరి సరస్వతి అనే అమ్మాయి ని పెళ్ళాడి, టంగుటూరి ప్రకాశం పంతులుగారి దగ్గర మద్రాసు లో అప్రెంటిస్ గిరి పూర్తి చేసుకొని, ఆ మీదట భారత స్వాతంత్రోద్యమం పట్ల ఆకర్షితుడై అటువైపుగా కొంత కాలం నడిచి, మామగారి సౌజన్యాన్ని ఆసరా చేసుకొని,తన జీవితం గురించి,కర్తవ్యం గురించి విజ్ఞత తో ఆలోచించి, చివరకు తన ప్లీడరీ వృత్తిని విడిచి, భార్య సరస్వతి తో మొగల్తూర్ వెళ్ళి, ఉన్న ఆస్తి పాస్తు లను చూసుకోవటముతో నవల ముగుస్తుంది.

ఆంగ్లేయ విద్య తో పాటు అబ్బవలసిన అనేక సుగుణాలు ఆనాటికి ఇతని లో కొరత పడినాయి నేటి నాగరికత అంతా కొత్త. ఎన్నడూ రైలెక్కి కూడా ఎరుగడు. రైల్ ఎక్కినది మొదలూ అడుగడుగునా విపరీత పరిస్థితులే తారసిల్లి ఎక్కడికక్కడే అతనిని మూర్ఖుడుగా చేసి, ప్రపంచమే తలకిందులుగా అయినట్టు, రైల్ లో అతడు నడచిన నడత, మద్రాస్ లో అతను పడిన యిబ్బందులు, స్టీమర్ లో అతను పడిన అవస్థలు, కొత్త ప్రదేశాలలో అతడు పడిన చిక్కులు అన్నీ చదివి తీరవలసిందే. కడుపు చెక్కలయ్యెంతగా నవ్వించి, ఒక ఘట్టాని మించి ఒక ఘట్టం హాస్య ప్రధానం గా వుంటాయి.
పాత్ర స్వభావతగా మూర్ఖుడు కాడు. పరిస్థితులతనిని మూర్ఖుని గా చేసి వెక్కిరిస్తూవుంటాయి. ఈ పార్వతీశాన్ని మించి నవ్వుల పాలైన అవస్థలు మనం కూడా జీవితం లో ఎప్పుడో ఒకప్పుడు అనుభవించినవే! అందుకే ఈ పాత్రంటే మనకు మమత ,అభిమానం,సానుభూతి కలుగుతాయి.

మొత్తం నవల అంతా ఏకబిగిన చదివిస్తుంది.పాత కాలం రచన కదా భాష ఎలా వుంటుందో అని భయపడక్కర లేదు.సరళమైన వ్యవహావారిక భాష లోనే వుంది. ఇంకో మాట,టి.వి ప్రేక్షకులు కూడా ఈ పుస్తకాన్ని నిఝంగా కొనేసి చదువుతే ,టి.వి లో కన్నా గొప్ప చిత్రాలు కనిపిస్తాయని,కరెంట్ కరుసు వుండదని ముళ్ళపూడి వారు గారెంటీ ఇచ్చారు.ఇంకెందుకు ఆలస్యం కొని చదివేస్తేబాగుంటుంది కదా! ధర కుడా ఎక్కువేమీ కాదు 333 రూపాయలు మాత్రమే.

*** *** ***

(యావండోయ్! మాత్రమే అనేది మాలా కుమార్ గారికే. నాకు కాదు. మీకేమన్నా అభ్యంతరం ఉంటే, నా బాధ్యత కాదు. హీఈఈఈఈఈఈఈఈఈఈఈఈఈఈఈ)

మాలా కుమార్ గారు ఇంతకు ముందు BOOKS AND GALFRIENDS లో బుడుగు గురించి రాశారు. కేవలం పుస్తకాలగురించే కాదు, వాటితో అనుబంధాల గురించి కూడా మీరు అనుభుతులని పంచుకోమనవి.
పుస్తకాల గురించీ, వాటితో అనుబంధాల గురించీ, సినిమాలూ, షికార్లూ, ఆటలూ, పాటలూ, adventures, ఒకటేమిటి! బోలెడన్ని సంగతులను ఇక్కడ చదవవచ్చు. మీరూ మాతో చేతులు కలపండి. ఇదే మా ఆహ్వానం.

Chaitanya Kalyani, and గీతాచార్య

Motor-cycle Diaries (Che Guevera ది కాదు) త్వరలో. Get ready for the excitement.

Posted by గీతాచార్య Jun 23, 2009

Subscribe here