తెలుగు బ్లాగర్ల నేస్తం జాజిపూలంటూ మనకెన్నో కబుర్లని చెప్తారు కదా. ఇక్కడ మా(మన) బుక్స్ అండ్ గాళ్ఫ్రెండ్స్ లో మంచి కబుర్లు చెప్పమని అడిగితే మా(మన) కోసం ఒక చక్కని పాత సినిమా గురించి చెప్తున్నారు. ఆ సినిమా పేరు గృహ లక్ష్మి.
నేస్తం మాటల్లోనే...
నాకు సినిమా సమీక్షలు చదవడం ఇష్టం .ఆ మాటకొస్తే రాయడం ఇంకా ఇష్టం .మరి ఎందుకు రాయలేదంటే కారణాలు రెండు ..ఒకటి:- సమీక్షలు రాయడం చేత కాక.రెండు ఒకవేళ నాకు వచ్చినట్లుగా రాసి ముచ్చట తీర్చుకుందామన్నా ,నేను రాద్దామనుకున్న సినిమాలపై ఇప్పటికి పది కి తక్కువకాకుండా సమీక్షలు అందరూ రాసేయడం వల్ల :)
సరే గీతాచార్యగారి పుణ్యామా అని మొన్న నాకు గుర్తువచ్చిన ,ఇష్టమైన సినిమా మీద మొదటిసారిగా ఇలా రాస్తున్నాను .. ఆ సినిమా పేరు గృహలక్ష్మి ..ఆగండాగండి ఇది 1938 లో నాగయ్యగారు నటించిన గృహలక్ష్మి కాదు 1984 లో మోహన్ బాబు గారి సినిమా అసలే కాదు . 1967 లో భానుమతి గారు, అక్కినేని నాగేశ్వరరావు నటించిన భరణి పిక్చర్స్ వారి గృహలక్ష్మి.
అలనాటి మేటినటులైన ఎస్.వి రంగారావు గారు,సూర్యకాంతం గారు ,పద్మనాభం,రమణా రెడ్డి లాంటి అనేక మంది హేమాహేమిలు ఈ సినిమాలో నటించారు.. ఇక సినిమా కధ కొస్తే క్లుప్తం గా ఇది .
ఎస్.వి రంగారావు,సూర్యకాంతం గారి ఏకైక కుమారుడు నాగేశ్వర రావు ..హీరో చదువుతుండగానే కొన్ని కారణాలవల్ల అతనికి భానుమతి నిచ్చి వివాహం చేసేస్తారు పెద్దవారు. అయితే ఇక్కడే మొదలవుతుంది అసలు స్టోరీ .
వివాహం విధ్యానాశాయ అంటారు కాబట్టి చదువు పూర్తి అయ్యేవరకూ అబ్బాయి కోడలి తో మాట్లడరాదు,చూడరాదు అని అనేక కండిషన్లు పెడతాడు హీరో తండ్రి ..పెళ్ళయ్యాక కూడా పుట్టింట్లో ఉంటే నలుగురూ నానా రకాలు అంటారని భానుమతి మామ గారి ఇంట్లోనే ఉంటుంది.కొత్తగా పెళ్ళయిన జంట ఒకే ఇంట్లో ఉండి ఒకరితో ఒకరు మాట్లాడుకుండా ఉండటం ఆ జంటకు కష్టం గా ఉంటుంది. ఒక ప్రక్క హీరో తల్లి క్రొత్త జంటను విడదీయడం పాపం అని భర్తకు చెప్పి చీవాట్లు తింటూ ఉంటుంది ..ఇదిలా ఉంటే హీరో భార్యతో మాట్లాడడానికి అనేకానేక ప్లాన్లు వేసి కుదరక తండ్రికి దొరికిపోయి చీవాట్లు తిని చివరకు బావమరిది పద్మనాభం సహాయం తో భానుమతి తల్లిగారికి వంట్లో బాలేదని అల్లుడిని ,కూతురిని చూడాలంటుంది అని టెలిగ్రాం ఇప్పిస్తాడు ..రంగారావుగారికి పని ఉండటం వల్ల చేసేది లేక కోడలిని జాగ్రత్తగా ఆమె తల్లిగారి దగ్గరకు దింపమని కొడుకుకి పురమాయిస్తాడు.
అయితే ఆమెను నేరుగా ఒక పెద్ద హొటల్ కి తీసుకు వెళ్ళిపోతాడు హీరో.. అప్పటివరకు తల్లి గురించి ఆందోళన పడుతున్న భానుమతి విషయం విని మండిపడుతుంది .పెద్ద వాళ్ళకు తెలిస్తే పరువు పోతుంది వెనుకకు పోదామని బ్రతిమాలు కుంటుంది.హీరో ఒప్పించి ఆమెను రూం కి తీసుకు పోయి ఒక వింత కోరిక కోరతాడు. తన పెళ్ళి తండ్రి హడావుడిగా జరిపించడం వల్ల ఆస్వాదించలేక పోయాడు కాబట్టి మళ్ళీ పెళ్ళి చేసుకుందాం అంటాడు. ముందు భానుమతి ఒప్పుకోకపోయినా భర్త సరదా కాదనలేక పోతుంది.
అయితే ఇక్కడే వారికి చిక్కు మొదలవుతుంది .అదే లాడ్జ్ లో అనేక జంటలకు వీరి వ్యవహారం అనుమానం వచ్చేదిగా అనిపిస్తుంది. హీరో ఎవరో అమ్మాయిని పెళ్ళికాక మునుపే తీసుకుని వచ్చేసాడని ,ఇది సంసారులు ఉండే లాడ్జని,ఇలాంటి వారిని ఆ లాడ్జ్లో ఉండనిస్తే తామంతా ఖాళీ చేసి వెళ్ళిపోతామని ఆ లాడ్జ్ యజమానిని బెదిరిస్తారు.ఒక ప్రక్క డబ్బు తెస్తానని వెళ్ళిన బావమరిది ఇంకా రాక హీరో చిక్కుల్లో పడతాడు.
కూతురి కాపురం ఎలా ఉందో చూద్దామని వచ్చిన భానుమతి తల్లిదండ్రుల ద్వారా అసలు విషయం రంగారావు గారికి తెలిసి పోతుంది.ఈ చిక్కులన్నిటిని ఎలా తప్పించుకుని బయటపడ్డారు ఆ జంట అనేది చివరి సన్నివేశం.
నటన విషయం వస్తే రంగారావు గారు ఒక మంచి మామ గారిగా ఎలా నటిస్తారో అన్నది అందరికీ తెలిసిన విషయమే ,ప్రతీ తల్లిదండ్రి ఇంతమంచి మామగారు ఉన్న కుటుంభానికి తమ పిల్లను పంపాలి అనే తరహాలో ఆయన నటన ఉంటుంది..ఇక సూర్య కాంతం గారు గయ్యాళిగా నటించి ఎంత మెప్పిస్తారో ఒక అమాయకపు తల్లిగా అంతే బాగా నటించి మెప్పిస్తారు,రమణారెడ్డి,పద్మ నాభం గార్ల కామేడీ గురించి చెప్పనక్కరలెదు వారు హాస్యానికి రారాజులు.. నాగేశ్వర రావుగారు ఈ పాత్రకు చక్కగా సరిపోయారు..అయితే భానుమతి గారే ఈ పాత్రకు ఏ మాత్రం నప్పరు.ఆమె లావుగా నాగేశ్వరరావు గారికి అక్కలా ఉంటుంది.అయితే ఆ రోజుల్లో అందం కంటే అభినయానికి ప్రాధాన్యత ఇచ్చేవారు కాబట్టి అడ్జస్ట్ అవ్వాలి ఆ విషయానికి. అయితే నటనా పరం గా ఈ పాత్రకు ఆమె బాగా సరిపోయారు .ఒక ప్రక్క అత్త,మామలను గౌరవించే కోడలిగా మరొక ప్రక్క భర్త అల్లరికి కళ్ళెం వేసే చిలిపి భార్యగా బాగా నటించారు.
ఈ సినిమా ప్రధానం గా భార్యా,భర్తల విరహానికి సంభందించినదైనా ఏ మాత్రం ఎబ్బెట్టు లేకుండా హాస్యం మిళితం చేసి తీసారు .
ఇక పాటల విషయానికొస్తే భానుమతి గారి సంగీతం సంగతి తెలిసిందే.ఇందులో మేలుకోవయ్య కస్తూటి రంగ సాంగ్ తెల్లవారు జామున వింటే మనసు ఎంతో ప్రశాంతం గా అయిపోతుంది .అలాగే మావారు శ్రీవారు మా మంచివారు పాట చక్కని సాహిత్యం తో అలరిస్తుంది .ఇంకా లాలి లాలి గోపాల బాలా లాలి ,కన్నులె నీకోసం కాచుకున్నవి లాంటి ఎన్నో చక్కని పాటలు మనసునును రంజింపజేస్తాయి .
మొత్తం మీద హాయిగా నవ్వుతూ సరదాగా ఎంజాయ్ చేస్తూ చూడదగ్గ సినిమా
*** *** ***
B and G Special
గృహ లక్ష్మి సినిమాలోని ఒక చక్కని పాట చూడండి. Tried to provide lyrics, but of no avail. Can anybody help us? :-)
BOOKS AND GALFRIENDS కోసం ఒక చక్కని సినిమా సమీక్షని అందిమ్చిన నేస్తం గారికి మా మన:పూర్వక కృతఙ్ఞతలు
చైతన్య కళ్యాణి