BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...

వండుకు తిందాం రండి...
చేపల్నీ, రొయ్యల్నీ,
ఆ జల పుష్పాల్ని


చంపుకు తిందాం రండి...
కోతుల్నీ, మేకల్నీ,
నేల మీది చిన్ని జీవుల్ని,


వేటాడుదాం రండి...
పులుల్నీ, సింహాల్నీ,
అడవిలోని మృగరాజాల్ని,


తింటానికేదీ లేనట్లు ...
మన ప్రకృతిని చంపుకు తిందాం
మూగ జీవాల్నీ,
అరుదైన ప్రాణుల్నీ


చిన్ని చేపలు నీటిలో కదలాడుతుంటే
చూసే కన్నులదే పండుగ...
మరి మన కడుపులో అరిగిపోతే
వాటి బ్రతుకు కాదా దండుగ?
చంపే జనం... ఆలోచించరే...!


సృష్టి కోసం వచ్చే నేస్తాల్ని
విచ్ఛిత్తి చేసే మనం...
రేపు మనకీ గతి పడితే ఏమౌనని
ఆలోచించరు జనం


చిన చేపను పెను చేప,
చిన మాయను పెను మాయ
ప్రకృతి సిద్ధం కానీ,
పుస్తెలమ్ముకుని తినాలా పులసల్ని
జీవ వైవిధ్యాన్ని నాశనం చేసే
మనం విడుస్తున్నాం విలువల వలువల్ని


ఇన్జన్రలు నాకు కవిత్వం రాదు. చదివేదీ తక్కువే, రాసేదీ తక్కువే. కథల్జెప్పమంటే ఎన్నైనా జెప్తం గానీ కవితల్రాయాలంటే కష్టమే. ఒక చిన్న సంఘటన జూసి పెద్ద కథని రాయగలను కానీ, ఒక సందర్భంలో భావావేశానికి గురయి కవితనల్లడం నాకు తెల్లేరు పై బైకు నడక. అంటే చాలా కష్టం అన్నమాట.

కానీ నాకో దురలవాటుంది. హఠాత్తుగా ఏదైనా సందర్భంలోనో, మాంఛి హుషారుగా ఉన్నప్పుడో నాకు ఏదో ఒక పాదం పుడుతుంది. (ఒక లైనలా strike అవుతుందలా). అక్కడి నుంచీ చెప్పాలనుకున్న కథలోని (అదే కవితలోని) లైన్లని ముందుకు కొన్నీ, వెనుకకు కొన్నీ అల్లుకుని కవితని సృష్టించేయగలను. కానీ అలాంటి సందర్భాలు చాలా అరుదు. కాస్తంత సున్నితత్వం ఉన్న వాళ్ళే కవితలల్లగలరు. Damn these emotions అనుకునే నాకు అన్నిసార్లూ ఆ శక్తి రాదు, ఆసక్తి ఉన్నా! ప్చ్.

ఇంతకీ విషయమేమిటంటే... మరువం ఉష గారు "జల పుష్పం" అని ఒక కవితా సంకలనం తలపెట్టారు. ఎవరి తల? ఎక్కడ పెట్టారు? I donno friends. ఏదో అలా ఫ్లోలో వచ్చింది ఫాలో కావాల్సిందే. మన్నించి. ఆ సంకలనాన్ని, దానికందిన ఒకటి రెండు కవితలు చూడగానే నాకో దుర్బుద్ధి పుట్టింది. అతిగా ఆశ పడే మగవాడూ, అతిగా ఆవేశా పడే ఆడదీ బాగు పడ్డాట్టు చరిత్రలో ఎక్కడా చెప్పబడలేదని తెలిసినా, పెద్దగా చరిత్రలేని ఊరు నుండీ వచ్చానన్న ధైర్యంతో ఒక కవిత రాద్దామనే దుస్సాహసానికి తలపడ్డాను. అయితే ఏం లాభం? ఆలోచన రాలేదు.


ఇందాకన బాబా గారిచ్చిన పులస అనే కవిత చదివాక హఠాత్తుగా "కడుపులో అరిగిపోతే వాటి బ్రతుకు కాదా దండుగ?" అనే వాక్యం/పాదం తట్టింది. వేటి బ్రతుకు? అనే ప్రశ్న వేసుకుంటే... చిన్నిచేపలు అనే ఆలోచన. సో, ఆ వాక్యం పైనపడ్డది. దండుగ అనే మాటతో word play ఆడితే ఐదో వాక్యం అలా వచ్చి చేరింది. ఇంటిగ్రిటీ దెబ్బ తిన్నా సరే అలా ఉంచేయాలని అనిపించింది. చిన్ని చేపలంటే మూగ ప్రాణులు కదా...! వాటికోసం ఆ పైన ఉన్న లైనూ, ఆలో చిస్తే ఏమని ఆలో’చించాలి’? వీటిలా మన బ్రతుకూ అయితే ఎలా అనే కదా! అలా ఆ క్రింది వాక్యం వచ్చి చేరాయి. ఇలా ప్రశ్నామృతం గ్రోలితే ఈ కవిత (నా బొంద దీన్నే కవితంటే మరి పెద్దలంతా వ్రాసేదాన్నేమనాలి? సో నాది తవిక) తయారైంది. అందుకే మూల వాక్యాన్ని (Pivot) బోల్డులో ఉంచుతున్నాను.

ఇందులో వేరే ఉద్దేశ్యాలు లేవు (అదే ఎవరన్నా మాంసాహారాన్ని తినే వాళ్ళని అవమానించటం????? ఇలాంటి ప్రశ్నలని లేవనెత్త వద్దు. నా ఉద్దేశ్యం కేవలం అరుదైన జీవుల్నైనా వదిలేయమని చేసే అభ్యర్థన. అంతే! అర్థమయిందనుకుంటున్నాను. అర్థం కాకపోతే కనీసం understand అన్నా చేసుకోండి).

కవిత సంకలనంలో చేర్చదగిన స్థాయిలో ఉందో లేదో నాకు తెలియదు. జలపుష్పం అనే సంకలనానికి సరిపోతుందో లేదో కూడా. అన్ని జంతువుల్నీ చేర్చాను కదా! జూలో పెట్టినట్లు. బోల్ట్లు. కనీసం ఒక మమ్చి పనిని మరికొంత మమ్దికైనా తెలియజెప్పాను కదా.

కవితేమన్నా బాగుంటే అది బబా గారి మాయే. అద్భుతమయిన కవిత ద్వారా నాకు స్పూర్తినిచ్చారు. బాలేక పోతే అది నాతప్పే. గొప్ప inspiration దొరికినా ఉపయోగించుకోలేనందుకు.

మామూలుగా ఆంగ్లంలో వ్రాసుకున్న కవితల్ని తెలుగులో అనువదించుకుని పెట్టుకుంటాను. (భావం మాత్రమే కలుస్తుంది. ఏభాషకా భాషలో natural గానే ఉంటాయి).  బ్లాగుల్లో ఇప్పటిదాకా వ్రాసినవి అలాంటివే. ఇదొక్కటే డైరక్ట్ గా తెలుగులోనే వ్రాశాను.

కవితా లేదు, పోయం లేదు భావావేశం అసలేలేదు ఏక్ నిరంజన్!

అదండీ సంగతి.

Posted by గీతాచార్య Oct 2, 2009

Subscribe here

భువన సుందరి సీరియల్ చదవండి

భువన సుందరి సీరియల్ చదవండి
Keira Knightley: Beautiful Lady reading a Book

You said it!