BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...






"ఓడ మీద ఉండి ప్రస్తుతం నేను చెయ్యగలిగిందేమీ లేదు.అందు చేత తీరానికి పోయి ఏవో సాహసకృత్యాలు చెయ్యాలని,గుప్తధనం ఉన్న చోటు నా మిత్రుల కంటే ముందు కనిపెట్టి వాళ్ళను ఆశ్చర్యపరచాలని ఒక ఊహ తట్టింది.వెనకాముందూ ఆలోచించుకోకుండా అయిదారుగురు కళాసీలున్న ఒక బోటులోకి దూకేసాను....ఇది వట్టి తెలివితక్కువ ఆలోచనే కావచ్చు. కానీ నేనలా చెయ్యకపోతే మా ప్రాణాలు నిష్కారణంగా కాంచన ద్వీపానికి బలి అయిఉండేవి..."


"వంద గజాల దూరంలో ఒక చిన్న కొండ ఉంది.హఠాత్తుగా దాని శిఖరం నుంచి రాళ్ళు, రప్పలు దొర్లటం ప్రారంభించాయి.కొంతసేపటికి ఒక ఆకారం శిఖరం మీద కనబడింది.అతివేగంగా ఎగురుతూ గెంతుతూ కిందకు వస్తోంది.అది ఎలుగుబంటో, కొండముచ్చో, మరే ఇత జంతువో తెలియలేదు.ఆకారం మటుకు అతి వికృతంగా ఉంది.దాన్ని చూసీ చూడగానే భయంతో ఒళ్ళు బిగుసుకుపోయినట్టయి ఆగిపోయాను."


"ఆ రోజు యుధ్ధంలో గాయాలు తిన్న ఎనిమిదిమందిలో అయిదుగురు అప్పుడే చనిపోయారు.మిగతావారిలో ఒకడు తిరుగుబాటుదారు.వాడికి డాక్టరుగారు శస్త్రచికిత్స చేస్తూండగానే గుటుక్కుమన్నాడు.మరొకడు మా హంటర్.ఇక మిగిలింది మా కెప్టెన్ స్మాలెట్.ఒక తూటా భుజంలోంచి దూసుకుపొయింది.మరొకటి ఎడమకాలికి తగిలింది."


"జిమ్! దూరంగా నుంచో. ఇదిగో ఈ పిస్టల్ తీసుకో.అవసరం రవచ్చు," అన్నాడు.అంటూనే కళాసీలకూ,గోతికీ దూరంగా జరిగాడు.అతని చూపుల్లో ఇప్పుడు నాపై ద్వేషం, క్రోధం మచ్చుకైనా లేవు.ప్రపంచెంలో నాకంటే ఆప్తుడు లేడన్నంత ప్రేమగా చూస్తున్నాడు.క్షణ క్షణానికీ మారిపోయే అతని చిత్త ప్రవృత్తి చూసి నాకు పరమ అసహ్యం కలిగింది..."


ఈ సన్నివేశాలు "కాంచన ద్వీపం" అనే Robert Louie Stevenson రచించిన సాహసోపేతమైన పిల్లల నవల Treasure Island లోనివి. అవటానికి పిల్లలదే అయినా పెద్దలకు కూడా ఉత్కంఠత కలిగిస్తుందీ నవల.


తెలుగు చదవటం నేర్పించాలన్న ఉద్దేశంతో మా చిన్నప్పుడు నాన్నగారు ఇలాంటి ఇంగ్లీష్ నవలల అనువాదాలను కొనేవారు. సముద్రపు దొంగలూ,వారు దాచిపెట్టిన ధనం, సాహసకృత్యాలతో,మంచి మానవతా విలువలను తెలియచేసే ఈ "కాంచన ద్వీపం" కధ 18వ శాతాబ్ద మధ్యాంతంలో రాయబడినదైనా కూడా, ఇప్పటికీ ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. అప్పటి UK ప్రధాని William Ewart Gladstone ఈ పుస్తకాన్ని పూర్తి చెయ్యటానికి 2a.m దాకా మెలకువగా ఉండి చదివారని చెప్పుకుంటారు. William Butler Yeats, Henry James, Gerard Manley Hopkins వంటి అప్పటి సమకాలీన నవలా రచయితలచే ప్రశంసలందుకుందీ నవల.



"కాంచన ద్వీపం" కధ:

ఇది జిమ్ హాకిన్స్ అనే పిల్లవాడి కధ.అతడే ఈ కధానాయకుడు. అతని తండ్రి ఇంగ్లాండ్లోని ఒక సముద్రతీరపు పల్లెలో "ఎడ్మిరల్ బెన్ బౌ" అనే హోటల్ నడుపుతూ ఉంటాడు.వారి హోటల్ కు ఒక రోజు "బిల్లీ బోన్స్" అనే ఒక వృధ్ధ నావికుడు వస్తాడు. డబ్బు కట్టకుండా చాలా రొజులు హోటల్లో నివాసముంటూ వాళ్ళను నానా ఇబ్బందులకూ గురి చేస్తాడు.అనుకోని పరిస్థితుల్లో కొద్ది రోజుల తేడాలో జిమ్ తండ్రి అనారోగ్యంతోనూ, విపరీతమైన తాగుడు వల్ల ఆ "బిల్లీ బోన్స్" , ఇద్దరూ చనిపోతారు. అసలు కధ అప్పుడు మొదలౌతుంది.


బిల్లి బోన్స్ చనిపోకముందే అతడిని వెతుక్కుంటూ పెద్ద సముద్రపు దొంగల ముఠా ఒకటి ఊరిలోకి వస్తుంది. ఒక చిన్నపాటి యుధ్ధంలో కొందరు దొంగలు చనిపోగా మిగిలినవారు పారిపోతారు. చనిపోయిన బిల్లీ బోన్స్ పెట్టేలో జిమ్ కు ఒక "ద్విప పటం" దొరుకుతుంది. దాని కోసమే ఘర్షణ జరిగిందని తెలుసుకుంటారు అందరూ. సముద్రపు దొంగలు తాము దోచుకున్న సొమ్మునంతా దాచిపెట్టిన చోటు(ట్రెజర్ ఐలాండ్)కు దారి చూపే మ్యాప్ అది.మొత్తం "1,00,000 pounds" గుప్తధనం ఉన్న చోటు.(ఎప్పుడో 1883లో అంత పెద్ద మొత్తం అంటే...అద్భుతమే కదా)


ఆ ఊరి జమిందారు ట్రేలానీ, ఆయన స్నేహితుడు డాక్టర్ లివ్ సే, జిమ్ హాకిన్స్ ముగ్గురూ జమిందారుగారు ఏర్పాటు చేసిన "హిస్పానియోలా" అనే ఓడలో, కొందరు సహాయక సిబ్బందితో, కెప్టెన్ స్మాలెట్ ఆధ్వర్యంలో "కాంచన ద్వీపానికి" బయల్దేరుతారు. మార్గ మధ్యలో అదృష్టవసాత్తూ జిమ్ హాకిన్స్ వల్లనే ఓడలో కొందరు సముద్రపు దొంగలు చేరినట్లూ, వారు ఒక కుట్ర పన్నినట్లూ తెలుస్తుంది. ఓడలో వంటవాడిగా చేరిన "లాంగ్ జాన్ సిల్వర్" అనే ఒంటికాలు మనిషే దొంగల నాయకుడు అనీ, అతడు రెండు కాళ్ళు ఉన్న టైం లో పేరుమోసిన సముద్రపు దొంగ అనీ తెలుస్తుంది.


కాంచన ద్వీపానికి వారంతా ఎలా చేరారు, మధ్యలో ఎన్ని కుట్రలు జరిగాయి, తీరా వెళ్ళాకా అక్కడ డబ్బు ఉందా? వెళ్ళిన వారిలో ఎందరు తిరిగి వచ్చారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే "కాంచన ద్వీపం" నవల చదవాల్సిందే మరి..!!


నండూరి రామమొహనరావుగారు అనువదించిన ఈ "కాంచన ద్వీపం" నవల 1951-52 ప్రాంతాలలో ఆంధ్రవారపత్రికలో సీరియల్ గానూ,ఆ తరువాత ముడుసార్లు పుస్తకరుపంలోనూ ఆనాటి పాఠకులను ఉర్రుతలూగించింది.నా దగ్గర ఉన్నది 1979 edition, నవోదయా పబ్లిషర్స్ ద్వారా ప్రచురితమైంది.ఆ తరువాత ఎన్నిసార్లు అచ్చయ్యిందో తెలీదు మరి. సముద్రపు దొంగలూ, సాహస కృత్యాలూ, సముద్రయానాలతో నిండిన ఈ నవల నాకు చాలా ఇష్టం. ఇప్పటికీ మళ్ళీ మళ్ళీ చదువుతూనే ఉంటాను.


ఈ నవలను గురించిన వివరాలు,కధ తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి…!! 

Posted by జ్యోతి Oct 26, 2009

Subscribe here

భువన సుందరి సీరియల్ చదవండి

భువన సుందరి సీరియల్ చదవండి
Keira Knightley: Beautiful Lady reading a Book

You said it!