BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...

నేను---నా బ్లాగ్  బ్లాగర్ సునీత గారు అందించిన ఆణిముత్యం ఇది.

Sunita says...

నేను Ayn Rand సాహిత్యంలో ముందు చదివిందే The Fountainhead గురించి. కనుక నేను ముందు "The Fountainhead" గురించే వ్రాస్తాను. ఇంకో ముందు మాట నేను ఎక్కడా రాండ్ ఫిలాసఫీ గురించి రాయను. ఇక్కడ ఈ చిన్న సమీక్షలో అదంతా వివరించడం కష్టం. నేను సర్వేపల్లి వారి ఫిలాసఫీ కూడా చదివాను. రాండ్ రచనల్లోనూ ఎక్కువగా ఫిలాసఫీ కనపడుతుంది కానీ నేను కధ కిచ్చిన ప్రాముఖ్యత ఫిలాసఫీ కివ్వలేదు. అందునా నాకు ఈ పుస్తకం పరిచయమవడమే గమ్మత్తుగా జరిగింది.( అది ఇక్కడఅప్రస్తుతం).

Mills & Boon, Jeffrey Archer, Sir Arthur Conan Doyle  (Sherlock Holmes రచయత) రాజ్యం చేస్తున్న కాలంలోఇంగిలీషు పుస్తకాలు గమ్మత్తు కోసమే చదివేవాళ్ళు. కాలక్షేపం బఠాణీల్లాగా. ఎందుకంటే అందులోభావోద్వేగాలు అర్ధమయ్యేవికావు. (ఇది నా అభిప్రాయం మాత్రమే ఆ రోజుకి నా చుట్టూ ఉన్న వారిగురుంచి). కాలక్షేపం పుస్తకాలు కాక ఇంకొంచం అలోచింపచేసే దశగా ఉన్న పుస్తకాలు చూసే నేనెరగని ప్రపంచం అది.

అందులో ఒకానొక రచయత మాటల్లో నాకు గుర్తున్నంత వరకూ, మామూలు జీవితానికి యుద్ధమూ, శాంతీ, సమ్యమనం, బ్రతుకూ ఇలాంటివి అర్ధంలేనివ్యర్ధపదాలు. ఎందుకంటే నీ భోజనం, నీముందు నీ ఇంట్లో, నువ్వు నీ పనికెళుతున్నావు వస్తున్నావు, నీ పిల్లలుచదువుకుంటున్నారు, నీ అరోగ్యం బాగుంది, ప్రతివారం కోడికూర, సినిమా, సగటు జీవితం పై మాటలు, ట్రాష్, కానీ అదే నువ్వు, ఒక అగ్ని పర్వతం పేలో, ఒక ప్రళయం వచ్చో, సుడిగాలో ఇంకోటో, ఇంకోటో, లేదా పరాయి దేశం నీవున్న పట్టణంపై బాంబ్ వేస్తే, చేతికందిన వస్తువులతో,తిండితో, భుజాన పసిపిల్లలతో, ఓపికుడిపోయిన అమ్మా నాన్న తో, నడవలేని భార్యతో ప్రాణ భీతితో, పరుగులు పెడుతుంటే అప్పుడర్ధం అవుతుంది ఆ శాంతి విలువ ఆ పైన అనుకున్న ఆ ట్రాష్ విలువ. సరిగ్గా ఈ భావం ఇంకొంచంమంచి పుస్తకాలకోసం వెదికేలా చేసింది. అప్పుడు నాకు దొరికిందే The Fountainhead. ఐతే కల్పనే ఐనప్పటికీ, ఇంతగా ఈ పుస్తకం నచ్చడానికి కారణం నాకూ అంతు బట్టలేదు.

రాండ్ పుస్తకాలు ఆవిడ అలోచనా తీరు నాకు పరిచయమైందాకా నా చుట్టూ ఉన్నవి అర్ధం పర్ధం లేని పోచికోలు కబుర్లే. నాకు అప్పట్లో విపరీతంగా నచ్చింది కనుక అందరికీ నచ్చాలని రూలేమి లేదు. ఎందుకూ? ఏమిటీ ఆవిడ గొప్ప?  అంటే నా దగ్గర జవాబూ లేదు.ఈ షేరు మార్కెట్లూ, ఐటీలూ, మహిళా శక్తులూ ఏవీ లేవు. ఎపుడైనా ఎవరైనా శ్రీ శ్రీ గురుంచి ఆవేశపడితే కుతూహలంగా చూడటం తప్ప. నేను కొత్తగా ఇంగిలీషు నవలలు చదవాలీ అని అనుకున్నప్పుడు నా ముందు రూట్స్, ఫౌంటెన్‍హెడ్ ఉంచబడ్డాయి,ఎందుకోతెలియదు నా చెయ్యి రూట్స్ మీద ఆగింది ఆ తరువాత 5 సంవత్సరాలకు "Howard Roark " నాకు పరిచయమయ్యాడు.

అప్పట్లో ఆ పాత్ర అంతగా నచ్చడానికి కారణం ప్రతి మనిషిలోనూ అంతర్గతంగా వుండే తిరుబాటు ధోరిణి. గిరి గీసుకుని సమాజ
చట్రంలో బ్రతకడానికి, నచ్చినట్లు తన అలోచన ప్రకారం రాజీ లేకుండా బ్రతకడం కష్టం. కానీ అదే చేసి చూపిన హీరో కాబట్టి అంతగా నచ్చాడు అని నేను అనుకుంటున్నాను.

నేనురూట్స్ చదివేనాటికే నా ద్రిష్టిలో హీరో అర్ధం మారిపోయింది. కన్వెన్షనల్ హీరోలు జోకర్స్ అనిపించడం మొదలు పెట్టారు.

అప్పటికి ఆవిడ వెలిబుచ్చిన భావాల మీద, సిద్దాంతాల మీద నాకు చాలా అస్పస్టతలు. చాలా విషయాల మీద వేటికీ సమాధానాలు లేవు. అందుకే ఆమె చెప్పిన ఫిలాసఫీ వదిలేసి కధతో సంతోష పడ్డాను. ఎందుకంటే ఈ పరంపరలో నేను We the Living, Atlas Shrugged కూడాపారాయణంచేసాను (చదవలేదండీ పారాయణం) ఎందుకు అంటే జస్ట్ ఓ ష్రగ్ అంతే! ఒక విశిష్టమైన వ్యక్తిత్వం potentiality కి ఇంకో మాట దొరకలేదు, ఇలాంటి హీరో ఉంటాడా అని అబ్బుర పడ్డాను.కలే ఐనప్పటికీ ఓ చక్కటి కల ఉంటుంది అనిచూపెట్టినందుకు నేను ఆమెకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. నేను ప్రత్యేకం! ఎలా అమ్మాయి? నీకూ అందర్లా ఒక ముక్కు రెండు కళ్ళేకదా? కాదు అనగలిగే భావజాలం, ఇలా కూడా అలోచించంచవచ్చు అలోచించు అన్నందుకు,సుదూరంగా కొన్ని సంవత్సరాలు ముందుకు చూడగలిగిన ఆ దార్శినికతకు నేను " ఫిదా" (ఇది హిందీమాట) ఐపోయాను.
న్యూయార్క్ నేపధ్యంగా ఆర్కిటెక్చర్ ప్రధానాంశంగా అల్లిన కధ ఇది. కధ చెప్పిన విధానం పాత్రలు నచ్చేకొద్దీ చదవాలనిఅనిపిస్తుంది. ఐతే ఫిలాసఫీ కొంచం విసుగు తెప్పిస్తుంది. ఏటికి ఎదురీదటం ఎంత కష్టమో ఒకవేళ ఎదురీదినా గెలుపు వస్తుందని చెప్పినందువల్లే ఆమె రచనలు ఇంత పాపులర్ అయ్యాయనిపిస్తుంది.

ఇహ కధలోకి వస్తే కధ ఎత్తుకోవడమే కధా నాయకుణ్ని ఆర్కిటెక్చర్ స్కూల్ నుంచి తొలగించడంతో మొదలవుతుంది. ఎందుకు తొలగించబడ్డాడు అంటే కొత్తవి సృష్టించలేము, పాత వాటిని అనుసరించి మాత్రమే ముందుకెళ్ళగలం అనే సిద్దాంతాన్ని వ్యతిరేకించబట్టి. ఇక్కడ Roark ను ఇలా పరిచయం చేసింది రచయిత్రి. సొంత అలోచన ఉన్నవాడు, అమెరికన్ సమాజం లో డిగ్రీ దాకా వచ్చి అది వదిలేసుకోవటం అదీ భావ వ్యతిరేకిత వల్ల అంటే అది చిన్న విషయం కాదు. ఇక్కడే ఇంకో ముఖ్య పాత్ర Peter Keating. మామూలు భాషలో చెప్పాలంటే వెన్నెముక లేనివాడు, స్కాలర్ షిప్ తో ముందుకి చదువా, ఉద్యోగమా తేల్చుకోలేక Roark నే అడిగి ఉద్యోగం చెయ్యడానికి వెళతాడు.

ఫ్రాంకన్ అండ్ హేయర్ (Francon & Heyer) అనే కంపనీ లో కీటింగ్ అనుభవాల ద్వారా ఒక్క ప్లాను గూడా గియ్యకుండా కేవలం కంపెనీ బ్రాండ్ నేమ్ ఉపయోగించుకుని ఎలా నడిపేస్తారో, నడప వచ్చో చెబుతుంది. సరే మన హీరో హెన్రీ కామెరన్ (Henry Cameron) అనే ఒక తాగుబోతు దగ్గర పనికి కుదురుకుంటాడు. డిగ్రీ కాగితం లేకుండా పని ఇవ్వాలం టే ఎంతో కొంత నలుగురి కంటే భిన్నంగా అలోచించే వాడై ఉండాలి. Henry Cameron సరిగ్గా అలాంటి వాడే. గత వైభవం తప్ప ఇంకేమీ మిగలని విఖ్యాత architect.

ఏ సభ్యసమాజం లోనైనా పోలీసింగ్ లేదా వాచ్ డాగ్ లేదా ఏపేరైనా వివిధ వృత్తుల్లో మంచి చెడ్డలూ వాటిని గమనించడాలూ మీడియాలో ప్రకటించడాలూ ఉంటాయి. ఇది అమెరికాలో ఇంకా ఎక్కువ. మీడియా ఎలా ప్రభావితం చేస్తుందో అది టూయీ (Ellsworth Toohey)  (రచయత)పాత్ర ద్వారా చెబుతుంది. ఈయన మేనకోడలూ ఆమెకు కీటింగ్‍ తోచిన్నపాటి అఫైరు ఇంకో  పిట్టకధ . ఈ కీటింగ్ ద్వారా మెత్తగ నే ఉంటూ పనులు చేసినట్టే కనిపిస్తూ వాళ్ళనే నిచ్చెనగా చేసుకుని ఎలా పైకి ఎదగొచ్చో చెబుతుంది. ఇవి రెండు నవలలో ముఖ్య పాత్రలు.

Henry Cameron ఆఫీసు మూత పదటంతో తప్పని సరై కీటింగ్ ఆఫీసులోనే పనిలో చేరతాడు Roark. ఒక రోజు  కట్టుబడిలో ఉన్న బిల్డింగ్ చూడటానికి వెళ్ళిన Roark కు మైక్ అనే వ్యక్తితో (ప్లంబర్) పరిచయం అవుతుంది. తన స్వంత నిర్ణయాలూ, ఆలోచనలూ తనకు నచ్చని దాన్ని వ్యతిరేకించే స్వభావం ఇవన్నీ మైక్ ని ఆకట్టుకుంటాయి. Roark వీటివల్లే వల్ల ఉద్యోగం కోల్పోతాడు. మధ్యలో ఇంకో పత్రికాధిపతి గైల్ వైనాండ్ (Gail Wynand). New York Banner అనే పత్రిక అతనిది. కథలో సగభాగం వరకూ కనబడకపోయినా అంతర్లీనంగా కథాగమనాన్ని శాశించే పాత్ర అది. ఆ అంశంలో రాండ్ ప్రతిభ ప్రశంసించ దగ్గది.

ఇలా స్కూల్ నుంచీ ఉద్యోగం నుంచీ గెంటివెయ్యబడ్డ హీరోకు ఎవరూ మరలా ఉద్యోగం ఇవ్వరు. ఎన్నో ప్రయత్నాల తరవాత జాన్ ఎరిక్ స్నైట్ (Jan EriK Snyte) అనే పెద్ద మనిషి ఉద్యోగమిస్తాడు. అతని కింద ఓ ఐదుగురు భిన్న భిన్న డిసైనర్లు పనిచేస్తుంటారు అందరికీ కాంపిటీషనే.  అందరి  డిజైన్లనూ చూసి ఆఖరుకు తనకు నచ్చిన ఒకదాన్ని ఎన్నుకుంటాడు స్నైట్. అలా తన పనిని ఎన్నుకోక పోయినా తాను చేసిన దానిని మార్చకుండా ఉంచటం వల్ల Roark కీ జాబ్ శాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. ఆ క్రమం లో ఒక సారి హెల్లర్ (Heller) అనే వ్యక్తి ఇచ్చిన కమీషన్ సమయంలో Roark డిసైను ఎన్నుకోబడుతుంది. ఆ సమయంలో జరిగిన ఓ సంఘటన వల్ల అక్కడ ఉద్యోగం మానేసి Roark సొంత ఆఫీసు తెరుస్తాడు.

ఇంతలో ట్రేడు యూనియన్లూ, కాంట్రాక్టర్లూ గొడవ మొదలవుతుంది. అప్పుడే కీటింగు కి టూయీ పరిచయమౌతాడు. ఇలాటివి
సద్దుమణిగినాక హీరోయిను డామినిక్ ఫ్రాంకన్ (Francon & Heyers లో Francon గారి కుమార్తె) పాత్ర వస్తుంది. రావడమే
"బేనర్" లో ఫ్రాంకన్ కంపనీకి కీటింగ్ వేసిన డిసైనును ఘాటుగా విమర్శిస్తూ ప్రవేశిస్తుంది కధలో.

మొదటి అసైన్మెంటు ఐన Heller House తో కామరూన్ ను కలుస్తాడు Roark. ఎలాంటి మాట లేకుండా స్నాప్ షాట్స్ తెమ్మంటాడు. ఆ పని చేసి కొలోనియల్ స్టైల్లో కట్టిన హెల్లర్ ఇల్లు చూస్తానికి వెళ్ళినప్పుడు మళ్ళా మైక్ ఎదురౌతాడు. నీ దగ్గర పని ఉంటే నేనెప్పుడైనా రెడీ అన్న మైక్ తో స్నేహం చిరకాలం ఉంటుంది. తనకి వచ్చిన అవకాశాల్లోచాలా వరకూ పాత వాటిని తిరిగి తయారు చెయ్యమనే, ఎందుకంటే అవి ఙ్ఞాపకాలు కనుక. ఐతే ఇవేవీ అతనికి సరె అనిపించవు. కష్టపడి కొంత మేర జేబులోంచి పెట్టి మరీ ఒక ఇల్లు పూర్తి చేస్తాడు ఐతే కట్టించుకున్న ఆసామీ బదులు అతని కుమారుడు ఆ ఇంట్లో ఉంటాడు మన వాడి రెజ్యూమే లో పోటీ కి పనికి రాడనే విశేషణం ఒకటి జోడవుతుంది.

హీరోయిను స్వభావం చూస్తే దేనికీ ఆశ పడని రకం, ఎందుకంటే  ఏదైనా ఆశ పడితే దానికోసం వంగాల్సిఉంటుంది. విషయాలన్నీ ఒకదానితో ఒకటి పడుగూ పేకలాగా కలిసిపోయి ఉంటాయనే రకం. ఆమె స్వభావం ఆమె తండ్రికి నచ్చదు. ఐతే ఫెన్సు మీద నుండి దూకుతూ డాడీ అని అరిచే చిన్న పిల్లగానే అతని స్మృతిపధం లో ఉండి ఆమె మీద కోపాన్ని కంట్రోలు చేస్తూ ఉంటుంది.

Heller House తరువాత పని తగ్గి అవకాశాలు మృగ్యమై, బిల్లులు కట్టలేని స్థితిలో ఉన్న Roark కి cameron వద్ద నుండి మళ్ళీ పిలుపు వస్తుంది. అసలు శతృవు వర్గ శత్రువు వైనాండ్ అని, తను పోరాడాల్సింది అతనితో అని చెప్పి కన్ను మూస్తాడు Cameron. మైక్ సాయంతో కొత్త కొలువు దొరుకుతుంది Roark కి. కన్నెక్టికట్ లోని ఒక గ్రానైటు క్వారీలో. Roark వెళ్ళి పోయే సమయంలోనే రోయార్క్ చేత తయారు చేయించి, తనకు తోచిన రీతిలో అలంకరించిన డిసైను ఇచ్చిన సక్సెస్ తో కీటింగ్ ఫ్రాంకన్ భాగస్తుడైపోతాడు. ఇదంతా పూర్వార్ధం.

వేసవి సెలవలకని కనెక్టికట్ వస్తుంది డామినిక్. ఇక్కడ డామినిక్ Roark ను చూస్తుంది. ఇదరికీ కొంత పరిచయమేర్పడుతుంది. ఐతే అతనెవరో  ఆమెకు తెలియదు పేరుతో సహా. అతను ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నమే చెయ్యడు. ఈలోపు Roger Enright  అనే వ్యక్తి కమిషను అందటంతో తిరిగి న్యూయార్క్ చేరుకున్న Roark ఒక పార్టీలో Dominique కి పరిచయమవుతాడు. ఐతే వీళ్ళిద్దరి రిలేషను నేనిక్కడ చర్చించడం లేదు. అది ఎవరికి వారుచదువుకుని అనలైజు చేసుకోవాల్సిందే. ఇది ఒకలాంటి లవ్ హేట్ సంబంధం. చూసేవాళ్ళ ద్రుష్టిలో వాళ్ళిద్దరికీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటది అనే అభిప్రాయం కలుగుతుంది.

మెల్లగా పని దొరుకుతూ రోయార్క్ ఆఫీసు పుంజుకుంటుంది. ఒకే సమయంలొ నాలుగైదు కమిషన్లు అందిన సందర్భాలూ వస్తాయి. ఇంతలో Hopton Stoddard (హాప్టన్ స్టాడర్డ్) అనే వ్యక్తి నిర్మించ దల్చిన StodardTemple కాంట్రాక్ట్ కూడా వస్తుంది. ఆ టెమ్పుల్ కవసరమైన శిల్పం కోసం డామినిక్ పనిజేస్తుంది. ఆ శిల్పం కోసం తనలాంటి భావజాలమున్న శిల్పినే పెట్టుకుంటాడు. ఆ శిల్పితో స్నేహం కూడా చివరిదాకా ఉంటుంది. అమెరికన్ సమాజం లో షేరు మార్కెట్ ప్రభావం ఎంత వుందో కూడా కధానుగుణంగా చర్చిస్తుంది రచయిత్రి. ఐతే ఈ Stodard Temple  సదరు Stodard గారికి నచ్చక చెప్పినట్లు కట్టలేదని కేసు వేస్తాడు. అందులో ఓడిపోయి మళ్ళా మొదటికే వస్తాడు Roark. డామినిక్ కీటింగ్ ను పెళ్ళిచేసుకుంటుంది. (జరిగిన సందర్భాన్ని, అందులోని ఆంతర్యాన్ని చదివే అర్థం చేసుకోవాలి కానీ, ఒకరు చెపితే అర్థమయ్యే విషయం కనుక ఇక్కడ చెప్పటం లేదు).

ఇప్పుడు కధలోకి News Paper owner వైనాండ్ ప్రవేశిస్తాడు. టూహీ Stoddard Temple  కోసం డామినిక్ మోడల్ గా నిలబెట్టి చెక్కిన శిల్పాన్ని బహుమతిగా ఇచ్చి కాస్త కమిషన్లు తగ్గిన కీటింగుకి వైనాండ్ కాంట్రాక్ట్ దక్కేలా చేస్తాడు. అలా డామినిక్ వైనాండ్ కి పరిచయం అవుతుంది. కీటింగ్ ప్రకారం తన జాబ్ కమిషను కోసం భార్యను వైనాండ్ కు అప్పచెప్పేస్తాడు.

ఓ రెండు నెల్లు Wynand yacht మీద అతనితో క్రూజ్ వెళ్తుంది డామినిక్. ఆ యాచ్ పేరు I Do. పడవ ప్రయాణానికి ముందు తన ఆర్ట్ గాలరీ అంతా డామినిక్ ను తిప్పి చూపిస్తాడు. ఒక వారం కలిసి కబుర్లాడుతూ యాచ్ మీద గడిపాక మళ్ళీ పెళ్ళి ప్రస్తావన వస్తుంది. డామినిక్ వైనాండ్ ను పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. కీటింగ్ కు విడాకులిచ్చి ఓ 600 మంది   అథిదుల మధ్య వివాహం చేసుకుంటుంది. మీడియా అంతా కోడై కూస్తుంది ఒక డైవర్సీని వైనాండ్ పెళ్ళి చేసుకున్నందుకు.

ఇది కూడా మనసులేని కాపురమే అని నిజాయితీగా ఒప్పుకుంటుంది. అతను కూడా అంతే నిజాయితీగా స్పందిస్తాడు, నేను నా ప్రేమ గురించి మాత్రమే అలోచించాను అని.

ఇదే సమయంలో Roark కు ఒక రెసార్ట్ వర్క్ దొరుకుతుంది ఒక రెండేండ్లు ఖాళీ లేకుండా ఉంటాడు ఐతే రెసార్ట్ గురుంచి ఎక్కడా చడీ చప్పుడు ఉండదు. అధిక లాభాలకి అమ్మేసి దివాళా పెట్టే పనిలో పనికిమాలిన architect గా Roark కు ఈ పని
ఇవ్వబడుతుంది.

 ఇంతలో వైనాండ్ నుండి పిలుపు వస్తుంది Roark కి కలవాలని. ఇద్దరూ ఒకరినొకరు అంచనా వేసుకున్నట్టే చూసుకుంటారు. అపుడు వైనాండ్ తన భార్య కోసం ఒక భవనాన్ని కట్టించాలని చెబుతాడు.రోయార్క్ ప్రతిభ ఆ భవనానికీ ప్రపంచానికి మధ్య
అడ్డుగా ఇంకే గోడలూ లేకుండా ఉండాలని చెబుతాడు.

డ్రాయింగులతో భవంతి కట్టాల్సిన స్థలానికి వెళ్ళి ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటారు. వైనాండ్ Roark ను ఇంటికి ఆహ్వానిస్తాడు. భార్యను చూపిస్తాడు తనే కొన్నిసార్లు స్వయంగా Roark ఆఫీసుకు వెళతాడు, తన స్టాఫ్ ను పిలిచి రోయార్క్ కు వ్యతిరేకంగా పత్రికలో ఏమీ రాయొద్దని చెబుతాడు.

ఇలా ఇద్దరి పరిచయం పెరుగుతూ భవనం కూడా పూర్తి అవుతుంది. డామినిక్ అందులో నివాసంమొదలుపెడ్తుంది. ఇంతలో వైనాండ్ పేపరు గురించి జనంలో వ్యతిరేకత ప్రబలటం మొదలవుతుంది టూయీ వల్ల. పీటర్ కీటింగ్ తన అవకాశవాదాన్ని మరలా బైటపెట్టుకుంటాడు కానీ Catherine (టూయీ మేన కోడలు, అతని తొలి ప్రేయసి) ను ప్రపోజ్ చెయ్యడం ద్వారా. ఐతే ఆమె కూడా మెత్తని చెప్పుతో కొడుతుంది.

కధ నడుస్తూనే ఉంటుంది పేపరులో గొడవలు పెంచేసి అవకాశం కోసం ఎదురుచుస్తుంటాడు టూయీ.  ఇంతలో Cartlandt హౌసింగనే ప్రభుత్వ హౌసింగు ప్రాజెక్ట్ టూయీ ద్వారా సంపాదించిన కీటింగ్ పనినంతా Roark చేత చేయించుకుని తన పేరు పెట్టుకుంటాడు. అందుకు ప్రతిగా తానే రకంగా వేస్తాడో, అలాగే అది నిర్మింపబడాలని Roark condition పెడతాడు. వైనాండ్ తో క్రూజ్ నుంచీ తిరిగొచ్చిన Roark ఆ ప్రాజెక్ట్ దగ్గరకు వెళ్ళి చూస్తే కీటింగ్ నిస్సహాయత వల్ల అదంతా మార్పుచేర్పులకు గురైనట్లు తెలుసుకుని Dominique సహాయంతో పేల్చేస్తాడు. ఆ సందర్భంలో అరెస్ట్ అయిన Roark ని సమర్ధించినందుకు Wynand పైన టూయీ తిరుగుబాటు లేవదీసి లొంగదీస్తాడు.

బైలు పైన బయటకొచ్చిన Roark వద్దకు వెళ్ళి ఆ విషయం పత్రికలకెక్కేలా చేసి Wynand ని విడాకులిచ్చేలా సన్నివేశం సృష్టిస్తుంది. దీని వల్ల మళ్ళా వైనాండ్ పేపర్ల సర్క్యులేషన్లు పెరుగుతాయి. ఆ పేల్చివేత కేసులో క్రియేటర్స్ గురించి, సెకండ్ హాండర్స్ గురించీ, Egoism ఎలా మంచిదో, దాని అసలు అర్థమేదో, స్వార్ధంలేకపోవడం ఎలా హానికరమో వివరిస్తాడు Roark. అతని వాదన విన్న జ్యూరీ అంతా కలిసి నాట్ గిల్టీ అని తీర్పు ఇస్తారు.

 వైనాండ్ డామినిక్ కు విడాకులిస్తాడు. Cartlandt project ని Enright తీసుకుని Roark కే అప్పగిస్తాడు.  వైనండ్ సెక్రటరీ  Roark  అప్పాయింట్మంట్ తీసుకుని వైనాండ్ బిల్డింగ్ కట్టేందుకు కాంట్రాక్ట్ ఇస్తుంది.


Roark వ్యక్తిత్వం సంపూర్ణంగా అర్థం చేసుకుని, తన లోపాల్ని సరిజేసుకున్న డామినిక్ ఇప్పుడు రొయార్క్ భార్య. గర్వంగా నేము ప్లేటుమీద Howard Roark, Architect అన్న అక్షరాలు చూస్తూ అతన్ని కోసం ఎలివేటర్లో పైకి వెళితే ఆ వైనాండ్ బిల్డింగ్ పైనుంచి అన్నీ కిందకు చిన్నగా కనిపిస్తే ఈ ఒక్క కట్టడం ఠీవిగా ఎత్తులో కనిపిస్తుంది.

స్తూలంగా ఇదీ కధ.

స్తూలంగా ఇదీ కధ.
***   ***   ***

ఈ టపా గురించి చెప్పాల్సింది ఇంకా చాలా ఉంది. అది నేను ఆదివారం చెప్తాను. ఆలోగా ఆస్వాదించండి ఈ అద్భుత నవలని.

గీతాచార్య


Posted by గీతాచార్య Oct 29, 2009

Subscribe here