BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...

ఎప్పటి నుంచో జ్యోతి గారిని మన B&G కోసం ఒక చక్కని క్లాసిక్ ని అందించమని అడుగుతున్నాను. జ్యోతి గారి బ్లాగ్ లో అందించే వీడియో టపాల టపాల గురించి తెలిసిందే. అలాంటి ఒక వీడియో టపా మనందరి కోసం ఇవాళ అందించారు. ఇంకెందుకు ఆలస్యం? వచ్చేయండి.


జ్యోతి says


నరుడా ఏమి నీ కోరిక?? సాహసం శాయరా డింభకా??

ఈ మాటలు వినగానే , చూడగానే మీ మనసు ఎక్కడికి వెళ్లిందో తెలుసు. ప్రేమించిన రాజకుమారి కోసం నేపాళ మాంత్రికుడి సాయంతో కత్తులబోను దాటి పాతాళభైరవిని చేజిక్కించుకుంటాడు మన అందాల ఎన్.టి.ఆర్. అంటే ప్రేమకోసం ఎంతటి కార్యానికైనా వెనుకాడని హీరోలు ఆకాలం నుండి ఉన్నారన్నమాట. అలాగే తమ ప్రయోజనాలకోసం సామాన్యులు, అమాయకులను బలితీసుకోవాలనుకునే జిత్తులమారి మాంత్రికులూ ఉన్నారు.

పాతాళ భైరవి అంటే మనకు ఎప్పటికి గుర్తుండేది ఎన్.టి.ఆర్. ఎస్.వి.ఆర్ ధరించిన తోటరాముడు, నేపాళ మాంత్రికుడు పాత్రలు. ఈ చిత్రం 1951 లో కె.వి.రెడ్డి (కదిరి వెంకట రెడ్డి) చేసిన అపూర్వ ప్రయోగం. ఒక ఇరాకీ కథ ఆధారంగా మధిర సుబ్బన్న దీక్షితులు అనే రచయిత పాతాళ భైరవి కథ రాసుకుంటే, దీన్ని పొంది కె.వి.రెడ్డి చలనచిత్రంగా మలిచారు. అమాయకమైన ప్రేమ, మాంత్రికుడి మాయాజాలం, ప్రేమకోసం ప్రాణాలు కూడా లెక్కచేయని శౌర్యం వీటన్నింటికి తోడుగా ఘంటసాల గారి అద్భుతమైన సంగీతం వెరసి పాతాల భైరవిని ఒక ఆణిముత్యంగా తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది .

కథానాయకుడు తోటరాముడు ఉజ్జయినీ రాజమహల్ పక్కనే తల్లితో కలిసి నివసిస్తుంటాడు. సామాన్యుడైన అతడు రాజకుమారి ఇందుమతిని చూసి ప్రేమలో పడతాడు.ఆమె కూడా తోటరాముడిని ప్రేమిస్తుంది. మధ్యలో రాకుమారి మేనమామ వీర ధీర శూరసేనుడు "వినవే బాలా నా ప్రేమ గోల" అంటూ వెంటపడతాడు. కుమార్తే ప్రేమ వ్యవహారం , ఆమె పట్టుదల తెలుసుకున్న మహారాజు తోటరాముడిని పిలిచి తనతో సరిసమానమైన ఆస్థిపాస్థులు సంపాదించి అప్పుడు పెళ్లి గురించి మాట్లాడమంటాడు. అది విని రోషంతో సరే అని సవాలు చేసిన తోటరాముడు ధనం సంపాదించడానికి వెళుతూ నేపాళ మాంత్రికుడి మాయలో పడిపోతాడు. తనతో వస్తే బోలెడు ధనం సంపాదించే మార్గం చూపిస్తాను, రాజకుమారిని చేపట్టవచ్చు అని ఆశపెడతాడు. అసలైతే అపూర్వమహిమలు గల పాతాళ భైరవిని వశం చేసుకోవడానికి ఒక వీరుడైన యువకుడిని కాని, మహా శక్తిసంపన్నుడైన మాంత్రికుడిని కాని బలివ్వాల్సి ఉంటుంది. దానికోసం ఈ తోటరాముడిని ఎంచుకుంటాడు మాంత్రికుడు. అమాయకంగా ప్రేమకోసమై వలలో పడతాడు నాయకుడు. అలా వెళుతుండగా ఒక చోట బొట్టుదేవర విగ్రహం ముందు నిలబడి అక్కడి ఉక్కు గదతో ఆ విగ్రహం బొడ్డుపై కొట్టి పగులగొట్టమంటాడు మాంత్రికుడు. కష్టపడి అది పూర్తిచేసి కత్తులబోను దాటి వెళ్లి పాతాల భైరవి విగ్రహం వద్దకు చేరుకుంటారు.


ఆ దేవతను ప్రసన్నం చేసుకొవడానికి పూజలు చేయాలి పుష్కరిణిలో స్నానం చెసి శుద్ధుడివై రమ్మని తోటరాముడితో చెప్తాడు మాంత్రికుడు. కాని అక్కడ అనుకోని రీతిలో ఒక దేవత అసలుసంగతి చెప్తుంది. అది తెలుసుకున్న తోటరాముడు మాంత్రికుడిని చంపి పాతాళ భైరవిని ప్రసన్నం చేసుకుంటాడు. ఆ దేవత విగ్రహంతో తిరిగి వచ్చి రాజమహల్ ఎదుటే దానిని తలదన్నే మాయామహల్ చిటికెలో నిర్మిస్తాడు. అది చూసి నచ్చి, మెచ్చి మహారాజు తన కూతురిని ఇచ్చి కన్యాదానం చేస్తాడు. కాని తన శిష్యుడి సాయంతో నేపాళ మాంత్రికుడు ప్రాణలతో లేచొచ్చి రాజకుమార్తెను, మాయామహల్ ని మాయం చేస్తాడు. తిరిగి పూర్వస్థితికి వచ్చిన తోటరాముడు రాకుమారి అన్వేషణలో బయల్దేరి వెళ్లి మాయామహలులో రాకుమారిని పొందడానికి విశ్వప్రయత్నం చేస్తున్న మాంత్రికుడిని సంహరించి పాతాళ భైరవి ప్రతిమ, రాకుమారి, మాయమహలుతో తనవాళ్లను కలుసుకుంటాడు. ఇదీ చిత్రకథ.

1951 మార్చిలో విడుదలైన ఈ చిత్రం ఏకంగా 28 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. ఈ చిత్రంలో ప్రముఖంగా చెప్పుకోతగ్గది ఎస్.వి.రంగారావు వేసిన నేపాళ మాంత్రికుడి పాత్ర. ఆ పాత్ర అప్పుడే కాదు ఎప్పటికీ నిత్య ‘రాక్షసమే’. అదే ఎస్‌.వి.ఆర్‌.ని ఒక గాంభీర్యం, ఒక నిండుదనం, ఒక విలక్షణ పోషణ, ఒక అసమాన నటనా కౌశలం ఉన్న నటుడిగా పరిచయం చేసింది. మీకు తెలుసా మహానటి సావిత్రి ఈ సినిమాలో ఒక చిన్నపాత్రతో తెరంగ్రేటం చేసింది. ఎప్పుడంటారా?? తోటరాముడు మాయామహల్ లొ మహారాజును, అతని పరివారగనాన్ని ఆహ్వానించి విందులు,వినోదాలు చేసినపుడు ఏర్పాటు చేసిన నృత్య కార్యక్రమంలో ఒక నర్తకిగా చేసింది. జాగ్రత్తగా గమనిస్తే తెలిసిపోతుంది. పింగళి వారి మాటల చాతుర్యం , ఘంటసాల వారి సంగీతం , పాటలు ఈ చిత్రాన్ని యాభై ఎనిమిదేళ్ల తర్వాత కూడా మరపురానిదిగా నిలబెట్టింది.

ఇందులో కొన్ని ముఖ్యమైన , మరిచిపోలేని డైలాగులు... జయహో పింగళి అనిపించకమానవు. పుట్టించకపోతే మాటలెలా పుడతాయి అన్న మహానుభావుడు...

* సాహసము సేయరా ఢింభకా రాజ కుమారి లభించునురా


* మాంత్రికుని ప్రాణం పిట్టలో ఉన్నదిరా ఢింభకా


* జనం అడిగింది మనం చేయవలెనా? మనం చేసింది జనం చూడవలెనా?


* జై పాతాళ భైరవి


* నరుడా! ఏమి నీ కోరిక?


B&G special...
ఈ సినిమా లోని పాటలన్నీ ఆల్ టైమ్ సూపర్ హిట్. అందుకే మీకోసం వారాంతపు సెలవల సందర్భంగా ఆ పాటలన్నీ ఇక్కడ.

కనుగోలనో లేదో సఖిని



ప్రేమకోసమై వలలో పడెనే




కలవరమాయే మదిలో




వినవే బాల




ఎంత ఘాటు ప్రేమయో




Have a nice weekend Dear B&G readers, జ్యోతి: కలవరమాయే


గీతాచార్య


Posted by గీతాచార్య Oct 30, 2009

Subscribe here

భువన సుందరి సీరియల్ చదవండి

భువన సుందరి సీరియల్ చదవండి
Keira Knightley: Beautiful Lady reading a Book

You said it!