BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...

ఈ మధ్య దాదాపు అన్ని టీవీ చానెళ్లలో సందేహాలు - సమాధానాలు అనె కార్యక్రమం వస్తుంది. అలాంటిదే ఓ కొంటె కార్యక్రమం. రచన డి.వి.హనుమంతరావు. హాస్యం ఎక్కడినుండో పుట్టదు. అది మన మాటల్లోంచే పుడుతుంది. "పంచ్" ఉంటే ప్రతీ డైలాగ్ నుంచీ నవ్వులు పూయించొచ్చు అని నిరూపించిన హాసం క్లబ్బు నుండి ఈ సమర్పణ.

యాంకరు: నమస్కారము. "సందేహాలు - సమాధానాలు" కార్యక్రమంలో మీ సందేహాలకు సమాధానాలు చెప్పడానికి మన స్టూడియోకి శ్రీమతి విజయలక్ష్మిగారు వచ్చారు. నమస్కారమండి విజయలక్ష్మిగారు!

విజయ : నమస్కారమండి.

యాంకరు: "సందేహాలు -సమాధానాలు" అనే మన ఈ కార్యక్రమానికి ప్రేక్షకుల నుండి విశేష స్పందన వస్తుంది. అలాగే చాలా మంది తమ సందేహాలతో మాకు ఉత్తరాలు రాస్తున్నారు. వాటికి మీ సమాధానాలు కోరుతున్నారు. మరి కార్యక్రమం మొదలుపెడదామా?

విజయ : తప్పకుండానండీ - అడగండి.

యాంకరు: వరంగల్ నుండి రుద్రమదేవిగారు రాస్తున్నారండి. ఆవిడ కొన్న కొత్త చెప్పులు కరుస్తున్నాయట. దానికేమైనా రెమెడీ ఉందా? అని అడుగుతున్నారు.

విజయ : మీరిక్కడ ఓ విషయం గమనించాలి. మన పూర్వీకులు ఈ విషయంలో చాలా ముందు చూపుతో వ్యవహరించేవాళ్లు. వాళ్లు కిర్రు చెప్పులు వాడేవారు. నాయుడుబావ కూడా కిర్రు చెప్పులు వాడినట్టు పాటలు కూడా ఉన్నాయిగా.

యాంకరు: అంటే ఇప్పుడు ఆవిడని కిర్రు చెప్పులు వాడమంటారా?

విజయ : కిర్రు - కిర్రు అని మొరిగే చెప్పులు.. మొరిగె కుక్కల్లాగానే కరవవు. అంచేత రుద్రమదేవిగారు మీరు కిర్రు చెప్పులు వాడండి.

యాంకరు: బాగా చెప్పారు. మరో ప్రశ్న. జయపూర్ నుండి జయమ్మగారు అడుగుతున్నారు. ఎన్నిసార్లు చేసినా గారెలు బాగా నూనె పీల్చుకుంటున్నాయంట. లేకపోతే గట్టిగా, రాళ్లలా అవుతున్నాయంట. కోపంతొ విసిరేయాలనిపిస్తుందంట. బాగా మృదువుగా , తక్కువ నూనెతొ గారెలు, వడలు ఎలా చేయాలని అడుగుతున్నారు.

విజయ : గారెలు చేసేటప్పుడు ప్రతివారికి ఈ ప్రాబ్లం వస్తుందండి. నూనె పీల్చకుండా ఉండాలంటే - గారెల పిండిలో బ్లాటింగ్ పేపరు వేయాలి.

యాంకరు: బ్లాటింగ్ పేపర్ అంటె పెన్ను కక్కిన ఇంకును పీలుస్తుంది. అదేకదండి.

విజయ : అదే.. చిన్న చిన్న ముక్కలు చేసి గారెల పిండిలో కలిపితే అది నూనె పీల్చేస్తుంది. గారెలు బాగా వస్తాయి. గట్టిపడవు కూడా. యెటొచ్చి తినేటప్పుడు పిప్పి మింగకూడదు. పొరపాటున మ్రింగితే ఆ బ్లాటింగ్ పేపర్ శరీరంలొ రక్తాన్ని పీల్చే ప్రమాదముంది

యాంకరు: నిజమే - ఎనీమిక్ అయిపోతాము.

విజయ : ఇంకో విషయం గారెలు - వడలు గట్టిగా వచ్చాయి కదా అని కోపంగా విసిరేయకూడదు పాపం --- మగాళ్లకు తగిలితే.... పాపం. మన మగాళ్ళు ఆ వడదెబ్బకు తట్టుకోలేరు.

యాంకరు: ఇంకొక ప్రశ్నండి. ఏలూరు నుండి పూర్ణగారు అడుగుతున్నారు. ఎప్పటినుండో పూర్ణపు బూరెలు చేద్డామనుకుంటున్నాము. ఎప్పుడు ట్రై చేద్దామన్నా నూనెలో వేసేటప్పటికి చీదేస్తున్నాయ్. బూరెలు చీదకుండా బాగా రావడానికి ఏదైనా ఐడియా చెప్పమంటున్నారు పూర్ణమ్మ గారు.

విజయ : ఇది కూడా చాలామందికి వచ్చే ప్రాబ్లం. దీనికేం చేస్తారంటే బూరెలు చెయ్యడానికి చొ పిండి ఉంటుంది కదా. అందులో 1/2 కేజి పిండికి 10 గ్రాముల విక్స్ వేపోరబ్ కాని అలాంటిదే మరోటి కాని వేసి కలిపి, దానితో బూరెలు వేస్తే ఇక బూరెలు చీదమన్నాచీదవు.

యాంకరు: అలా కలిపితే వంటికి హాని చెయ్యదా మరి?

విజయ : భలేవారండి. ఎంతమాత్రమూ చెయ్యదు. పైగా ఈ బూరెలు తింటే ఊపిరితిత్తులకి మంచిది కూడాను. అసలే చలికాలం.

యాంకరు: నిజమేనండోయ్.. విన్నారు కదా పూర్ణమ్మగారు - అలా చేయండి. ఇంకో ప్రశ్నండి. పేరవరం నుంచి పేరిందేవిగారు రాస్తున్నారు.ఆవిడ మనవరాలికి తలలో పేలు విపరీతంగా వున్నాయట. పేలు పోవడానికి ఏమైనా చిట్కా చెప్పమంటున్నారు

విజయ : పేరిందేవిగారు!మీ మనవరాలి తలలో పేలగురించి అంత వర్రీ అనవసరం. ఇది కామన్ సమస్యే.. మీరేమి చేస్తారంటే.. అమ్మాయికి గండ్ర ఇసకతో బ్రాందీ కలిపి బాగా తలకు పట్టించండి.

యాంకరు: కిక్ ఇస్తుంది.. ఆ బ్రాందీయేనా?

విజయ : అవునండి . ఆ బ్రాందీ తాగిన పేలు ఇక చూడండి.మత్తెక్కి వాటి చిన్న కళ్ళకు పెద్ద కొండల్లా కనపడే ఇసక కణాలను గుద్దుకుని చచ్చిపోతాయి. కాని అప్పుడు అమ్మాయి తల ముద్దేట్టుకోవాలంటే మాత్రం జాగ్రత్త. మీకు మత్తెక్కే అవకాశముంది. తస్మాత్ జాగ్రత్త.

యాంకరు:ఆఖరిగా ఒక ప్రశ్న. జలజాక్షిగారు విశాఖ నుండి రాస్తున్నారు.ఆమెకు జంతికలు బయట అమ్మేవాటిలాగా చక్కగా రావట్లేదంట. ఎం చెయ్యమంటారు?

విజయ : ఏముంది. జంతికల పిండిలో ఫెవికాల్ కలిపి వేయించమనండి. చచ్చినా విరగవు.

యాంకరు: ఫెవికాలా ??

విజయ : అవునండి. అదే పగిలిన గుండెలు తప్ప ఏదైనా ఆతికించగల ఫెవికాల్.

యాంకరు: చాలామంచి విషయాలు చెప్పారండి. మా శ్రోతల తరఫున . నా తరఫున మీకు కృతఙ్ఞతలు.

విజయ : మీ తరఫున అంటున్నారు. అదేంటి ప్రత్యేకంగా?

యాంకరు: అవునండి. మీ సూచనలు నాకు బాగా అవసరం మా ఇంటిలో వంట చేసేది నేనే. మరి సెలవు. నమస్కారం

విజయ : నమస్కారం.
ఇది సరదాకి రాసింది. మరీ సీరియస్సుగా తీసుకోవద్దని మనవి..

పంపినవారు. ఎం.వి.అప్పారావు ( రేఖాచిత్రం)

Posted by జ్యోతి Dec 7, 2009

Subscribe here