ఆటకే ... అమ్మ ఒడి
ఆటకే... అమ్మ ఒడి !
ఓ తరం పాటూ
కమ్మగా నిదరోయే కలల పానుపు
బ్రహ్మకో కల్పం పగలూ
మరో కల్పం రాత్రీ అయినట్టూ-
ఓ తరం రాత్రే కానీ...
తర్వాతో మూడు వారాలే - పగలు;
నాకు తెలిసీ తాతమ్మల తరం నుంచీ!
తాతమ్మనీ నానమ్మనీ అమ్మనీ
తరం తరం నిరంతరంగా
అందర్నీ అక్కున చేర్చుకుని
గోముగా లాలించింది!
ఇప్పుడు అమ్మాయినీ...
రానున్న తరం ప్రతినిధిగా
తల ఎత్తబోయే కొత్త మొలకకు
ఆలంబనమయ్యే వేదిక!
అమ్మల గన్న అమ్మలకే
అమ్మ ఒడి... ఓ చెమ్మ తడి!
అయినా
వంటింటి ఆటకే
పాపం, దానికి అమ్మ ఒడి!
*
మంచాల దగ్గరా
వివక్ష ఉంటుందనుకోలేదు
పంటను విత్తే పట్టిమంచం
రాజ దర్పంతో పడక గదిలో
పరుపుల మెత్తదనం కప్పుకుని పడుకుంటే...
పంట నందించే పురుటి మంచం-
వంటింటి ఆటకకే పరిమితం...
వంటింటికే అంకితమైన
అమ్మలా అమ్మమ్మలా తాతమ్మలా!
అమ్మతనాన్ని పొదువుకుందుకు...
చిట్టి కాళ్ళతో
బల్లి పాకుతున్న స్పర్శ-
రాతి గోడ గుండె కైనా పులకింత..
నిటారుగా నిలిపే నిశ్చింత!
జారిపోతూ పట్టు కోసం
చొక్కాను బిగించే చిరు గుప్పిట-
చక్కిలిగిలి...గిలిగింత!
ఎత్తుకున్న చంటి దాన్ని
కావాలని జారవిడుస్తాను
నెమ్మది నెమ్మది నెమ్మదిగా-
అమ్మతనాన్ని పొదువు కుందుకు...
చెమ్మదనాన్ని చదువుకుందుకు...
అమ్మలైతే...
వ్యాధి వేలాడేసిన దిగులు మొహాల్లో
జీవితేచ్చను వెలిగించిన దీపం!
క్షతగాత్రుల బాధల పాటల పల్లవికి
నిత్య జాగరనా చరణ సవ్వడుల
చరణాలను రాత్రంతా పాడిన నైటింగేల్!
పరిచర్యను 'అమ్మ'లా చేసేదొక్క నర్సమ్మే!
నర్సమ్మలందరూ అమ్మ తెరెసా లే కాదా?!
అమ్మలు కాకపోతే మరెవరు చెయ్యగలరు?
అంత ఓర్పుగా...అత్యంత నేర్పుగా...
అంత సున్నితంగా...అత్యంత సుందరంగా..
సేవకు రూపు కదా ఆడతనం!
సేవా వృత్తులను అమ్మలకే వదిలేద్దాం
ఓ టీచర్...
ఓ డాక్టర్ ...
ఓ లాయర్...
అమ్మలైనప్పుడు-
లోకాన్ని వొళ్ళో వేసుకుని
లాలిస్తూ మంచిని చెబుతారు...
మానవత్వం మప్పుతారు!
- మాకినీడి సూర్య భాస్కర్