BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...

అమెరికా తెలుగు కథకు పర్యాయ పదం చిట్టెన్. అమెరికా తెలుగు కథానికను గురించి ఏం చెప్పాలన్నా ముందుగా చిట్టెన్ రాజు గారి గురించి చెప్పుకోవాల్సిందే!


అమెరికాలో తెలుగు కథానికాలతకి పాదు చేసి పందిరి వేసిందాయనే. ఆ లతకు పూసిన పూల తావిని నేడు మనం ఆఘ్రానించగల్గుతున్నాం. ౧౯౭౪ లోనే ఖండాంతరాలు దాటిన ఆయన అమెరికాలో అప్పుడే 'తెలుగు వెలుగు' దీపాన్ని వెలిగించారు. ఆ నాటి గోరంత ఆ దీపమే నేడు కొండంత వెలుగును ప్రసరిస్తూ... అమెరికా తెలుగు అక్షరాలను మన కళ్ళకు కడుతోంది.


పాతిక నాటికలు, హాస్య, వ్యంగ్య భరిత కథలు, వ్యాసాలూ అనేకం రాసిన అయన సంపుటీకరించిన హాస్య కథల పుస్తకం 'అమెరికామెడీ' కథలు. శీర్షికను ' అమెరికామెడీ' అనడం లోనే మంచి హస్యముంది. ఇది ముళ్ళపూడి మార్కు హాస్యం. ‘ముందు మాట' తీరులో ముళ్ళపూడి కొన్ని అభినందన వాక్యాలు రాశారు. బాపు దానిని ' లిపి' చేశారు. మహాప్రస్థానానికి చలం 'యోగ్యతాపత్రం' లాంటి దాన్ని చిట్టెన్ రాజు గారి హ్యూమరసానికి 'బాపూరమణ' అడగకుండా రాసివ్వడముందే - అది చాలు- చిట్టెన్ రాజుగార్ని గొప్ప కథకుడని.. గొప్ప హాస్య కథకుడని చెప్పడానికి. బాపూ రమణలు సంయుక్తంగా...బాపు గీతని, రమణ రాతని జోడించి ఇచ్చిన కితాబు-


" అనగనగా ఒక వంగూరి చిట్టేన్ రాజు
వూరి పేరు వంగూరయినా కాకినాడలో పుట్టేన్ రాజు
జోకుల్తో గూబలు వాయగొట్టేన్ రాజు
హ్యూమ-రైటింగును వరించినా ఇంజనీరింగును ధరించి
డాలర్స్-లాండును మెట్టెన్ రాజు
హ్యూస్టన్ లో, కాలు పెట్టెన్ రాజు
అయినా కాకినాడనూ కాజాలనూ విడిచిపెట్టని రాజు


అమెరికా - కొత్తల్లో చైనాసుమంగలి
చేతిలో తల పెట్టెన్ రాజు
చివరికి అమాయకంగారుగా బాహుమూల రుచుల్ చూపెట్టేన్ రాజు
ఏకుల్లాంటి మేకుల్లాంటి బాకుల్లాంటి
జోకులతో చెంపగలగొట్టెన్ రాజు
నేను చెప్పేది నవ్వు మీద ఒట్టేన్ రాజు
అందుకే బాపుగీత రమణరాత వేసి పెట్టేన్ నేడు
జై చిట్టెన్ రా-రాజు" అన్నారు.



'చెంపగలగొట్టెన్' - ' చెంప పగలగొట్టెను' అన్న వాక్యం లోని వరసగా వచ్చిన ' ప' లలో ఒక దాన్ని ఎగర గొట్టేసి రాయడంలో హాస్యం నర్మగర్భంగా దాక్కు నుంది. అలాగే అమాయకం , కంగారు కలిస్తేనే ' అమాయకంగారు'. వాక్యంలో పదాల్ని పదాల్లో అక్షరాల్ని , అక్షరాల్లోని ఒత్తుల్ని కత్తుల్నీ ఒలిచేసి పీకేసి పారేసి చక్కని హాస్యాన్ని పండించడం ముళ్ళపూడి మార్కు హాస్యం. ' సీగాన పెసూనాంబ' - ఎంత హాయిగా ఉంది పలకడానికి. బోల్డంత హాస్యాన్నీ పలుకుతోంది. రాజు గారు కూడా పుస్తకం శీర్షికలో అదే పని చేసారు - ' అమెరికామెడీ' కథలంటూ! ఇంతకీ ఈ పుస్తకం అంకితం ఎవరికో తెలుసా?


"అంకితం - ఇంకెవరికీ...
బాపూ రమణ లకే - ఎందుకు?
ఎందుకేమిటీ? వాళ్ళిద్దరూ మిత్రులు - మీకూ నాకూ,
మొత్తం తెలుగు ప్రపంచానికీ ఆత్మీయులు, అజాత శత్రులు
అనేక రంగాలలో అద్వితీయ ప్రతిభాసంపన్నులు
వాళ్ళిద్దరి లాటి వాళ్ళు నభూతో నభవిష్యతి - అందుకూ!"


అంటూ అంకిత మిచ్చారు, బాపూ రమణ లకు. అంకితం తీసుకుని బాపు రమణ లు ఆయనకెంతో గౌరవాన్ని కలిగించారు. మరెంతో కీర్తినీ కట్టబెట్టారు. ఎందుకంటే, ఆ హాస్య ద్వయం ... స్వయం హాస్యం... ఇప్పటి వరకు ఎవరి పుస్తకాన్నీ అంకితం తీసుకున్నది లేదు. వంగూరి వారే మొట్టమొదటి వారు.


నవ రసాలలో మొదటిది శృంగారం. తర్వాత రెండో స్థానం హాస్యానిదే. హాస్యరసం సున్నితమైంది. పరిష్కారం మాటెలాగున్నా, ఎంతటి తీవ్ర సమస్యనైనా సూటిగా బోధపడేలా బుర్రలో కెక్కించి మానసికోల్లాసం కలిగించే శక్తి హాస్యానికుంది. అదే చిట్టేన్ రాజుగారి హాస్య కథలకీ ఉంది


హాస్యం సృష్టించడం మాటలతో అయ్యే పని కాదు. కానీ మాటలతోనే హాస్యం పుడుతుందనుకోండి! హాస్య కథ కంటే ఒక విషాద కథని ఎంతో సులభంగా రాయొచ్చు. రాసి మెప్పించొచ్చు. గుండెల్నీ పిండేయోచ్చు. హాస్య కథ రాయడం ఎంత కష్టమో రాయడానికి ప్రయత్నిస్తే తెలుస్తుంది. ఏదో నాలుగు నిముషాలు నవ్వించేదే కాదు హాస్య రచన. అది నాలుగు కాలాల పాటూ ఆలోచింప చేసేది కూడా. ఏక కాలంలోనే ఆనందంతో పాటూ విషాదాన్ని కూడా కలిగించేదే కాకుండా పరిస్థితుల దౌర్బల్యాన్ని కళ్ళకు కట్టేదే మంచి హాస్య రచన. ఇది సునిశితమైన పదునైన వ్యంగం వల్ల కలుగుతుంది. ఈ కథలు చదువుతుంటే కడుపుబ్బే నవ్వుతో పాటు, అమెరికాలో మనవాళ్ళ పాట్లు తెలిసి ' అయ్యో పాపం' అని బాధేస్తుంది. అందుకే చిట్టేన్ రాజుగారి కథలు అయ్యాయి విజయవంతం.



హాస్య రసాన్ని పోషించాలంటే ఎంతో మెలకువ కావాలి, రచయితకి. మోతాదు ఎక్కువైతే వెగటు పుడుతుంది. అలాగని తక్కువైతే నవ్వు రాదు. భాషలోని సొంపు, భావంలోని ఇంపు, పలుకుబడి సౌందర్యం అన్నీ తెలిసుండాలి హాస్య రచయితకి. అప్పుడు గాని చక్కని చిక్కని హాస్యం చిక్కదు - కానీ చిక్కిపోతుంది! ఇదండీ...ఇంతుంది, హాస్య కథ పేలాలంటే. అయితే చిట్టేన్ రాజుగారు అలానే బాగానే పేలారు. ప్రేలారు కూడా! సుతిమెత్తని ప్రేలాపన లేకపోయినా హాస్యం పండదు. అలాగని ఇతరుల్ని ఎగతాళి చేసి మనసును కష్టపెట్టేది హాస్యం అనిపించుకోదు. అది శాడిజం అవుతుంది. అలాంటీ శాడిజంలోకి చిట్టేన్ కథ సాగిపోలేదు. అందుకు హాస్య కథకునిగా ముందాయన్ని అభినందించాలి.



మొదటిది ' జులపాల కథ'. ఇలా మొదలౌతుంది- " అది నేను కొత్తగా అమెరికా వచ్చిన రోజులు లేదా అమెరికా వచ్చిన కొత్త రోజులు. వచ్చిన మొదట్లో రోడ్డు మీద పెద్ద పెద్ద కార్లు- నా గుండెల్లో రైళ్ళు పరిగెత్తేవి..." ఇక్కడ శబ్దాల్ని ఆశ్రయించుకుని ఉంది హాస్యం. ' నేను కొత్తగా అమెరికా వచ్చిన రోజులు' లేదా 'నేను అమెరికా వచ్చిన కొత్త రోజులు' - రెండు వాక్యాల భావం ఒకటే స్థూలంగా, ఏదో మాటల గారడీ అనిపించడం తప్ప. రెండు వాక్యాల్లోనూ అభివ్యక్తి తేడా తప్పించి భావం ఒకటే కదా అనిపిస్తుంది.అయితే ' కొత్తగా అమెరికా వచ్చిన రోజులు' అనడంలో విదేశీ వాతావరణం కనిపిస్తే, ' అమెరికా వచ్చిన కొత్త రోజులు' అనడంలో కొత్తవైన భాషా సంస్కృతులతో బ్రతుకులో కొత్తయిన రోజులు తడతాయి. మాటల గారడీ అనిపించే హాస్యం మాటున ఇంత గంభీరమైన విషయం దాగుంది. చిట్టేన్ రాజు గారి డిక్షన్ అంతా ఇలాగె ఉంటుంది - ఇంచుమించూ. రెండో వాక్యం చూడండి - ' గుండెల్లో గుబులనో' మరేదనో రాయొచ్చు. కాని ' రైళ్ళు పరిగెత్తేవి' అని రాయడంలో హాస్యం సుతిమెత్తగా తొంగి చూస్తోంది. ఎందుకని? రోడ్డు మీద కనిపించే పెద్ద పెద్ద కార్లు - మన ఇరుకు రోడ్డుల్ని నిక్షిప్తం చేసుకున్న ఇరుకిరుకు గుండెలో పట్టలేదు సరికదా, ఆ ఇరుకులో కారులే రైళ్ళులా తోచాయని భావం. ‘అవి నేను క్రొత్తగా అమెరికా వచ్చిన రోజులు' అంటున్నారంటే, ఏదో ఐడియా వచ్చేయగానే రాసేసింది కాదీ కథ అని తెలుస్తుంది. అమెరికా సమాజంలో మమేకమయ్యాక, కొత్తలో కలిగిన తన అనుభవాల్ని బేరీజు వేసుకుంటూ జాగ్రత్తగా రాసిన కథలివి.



అక్కడి విశేషాలతో ఉత్తరం రాయమని అమ్మ దగ్గర్నుంచి వారానికో ఉత్తరం. ఏముంటాయి, ఉన్న సంగతులంటే - అమ్మాయిలు బావుండడం, ఎవరికీ కనబడకుండా అదో రకమైన సినిమాలు చూడడం వగైరాలు తప్పిస్తే అమ్మకీ, బాబుకీ ఉత్తరంలో రాసే విషయాలా ఇవి! అంచేత ఉత్తరంలో పేజి నింపడానికి 'కళ్యాణం' గురించి రాశారట. కళ్యాణం అనగానే పెళ్లనుకుంటాం, కానీ అసలు కళ్యాణమేంటో తెలిసే సరికి హాయిగా నవ్వుకుంటాం.



అమెరికా వెళ్ళే ముందు వేషం, భాషణం మార్చుకున్నార్ట చిట్టేన్ రాజు. అక్కడందరూ జులపాలతో ఉంటారు కనుక, బాగా జులపాలు కష్టపడి పెంచి ' యా-యా' అంటూ మాట్లాడ్డం ఆ మార్పులు. తీరా అక్కడ చూస్తే జనం అంతా మాములుగానే ఉన్నారు - ఎక్కడో డౌన్ టౌన్లో రాత్రి పూట తప్ప జులపాలవాళ్ళు కనబడలేదు(ట). తద్వారా నేర్చుకున్న మొదటి పాఠం ఏమిటంటే - " ఈ దేశములో చీకటి పడిన తరువాత డౌన్టౌన్కు వెళ్ళిన యడల సదరు జులపాల వారిచేత మగ్గింగు చేయబడి జేబులో ఉన్న నికేలూ, డైమూ కూడా లాక్కొనబడును " అని హటాత్తుగా గ్రాంధికంలో చెబుతారు. హాస్య రస పోషణలో ఇదో ఒరవడి అనిపించింది. మామూలు వ్యావహారిక భాషలో అప్పటి వరకు సాగిన కథనంలో హటాత్తుగా గ్రాంథిక ఛాయలతో కూడిన ఒక వాక్యం ఇలా తగిల్తే - ఓ రకమైన హాస్యం కలుగుతుందని ఈ కథలో చదివినప్పుడు తెలుస్తుంది.



ఇంతకీ క్రాపింగు చేయించుకోడానికి పడ్డ పాట్లు ఈ కథలో చెప్పారు. క్షౌరశాలను వెదుక్కోవడం దగ్గర్నుంచీ ఎంతో హాస్యస్ఫోరకంగా రాశారు. " ఇచ్చట అందముగా క్షవరం చేయబడును, ప్రొ. వీర్రాజు' లాంటి బోర్డుల కోసం వెతికితే ... వెతికితే ... Hair Shaft అన్న బోర్డు కనబడడం, బోర్డులో Hair అన్న పదం ఉంది కనుక, " ఈ కడ్డీ గాడికి బార్బరు షాపు సంగతి తెలియకపోతున్దా అడిగి చూద్దా"మని చూస్తే, " బయట నుంచి అంతా గ్లాస్, లోపల కర్టెన్లు, తలుపెక్కడో ... సరేని ఆ గాజు ఒక పక్క నుంచి మెదలెట్టి తోసి, లాగి, నానా విధాలుగా తంటాలు పడీ" - ' కాళుల బడి గడ్డమంటి బతిమాలి ఎటులో దురవస్థనంది లోపల బడినా'నన్నట్లు - లోపల పడితే, చిమ్మ చీకట్లో ' May I help you' అంటూ ఆడ గొంతు - ఓ పెద్ద బల్ల, వెనుక కృష్ణదేవరాయల సింహాసనం లాంటి కుర్చీలో తెల్లటి పిల్ల, నందివర్ధనం పుష్పంలా!



అప్పుడిద్దరి మధ్యా నడచిన సంభాషణ చదవాల్సిందే. సరే, క్షుర కర్మకి ఏర్పాటు చేస్తానని చెప్పి ఆ అమ్మాయి ఓ కాగితం ముక్కమీద సంతకం పెట్టమంటుంది. కథకుడిలానే, జుత్తు కత్తిరించాడానికీ ఈ సంతకానికీ ఏమిటి సంబంధమనే మీమాంస మనకీ కలుగుతుంది. చదివితే, అందులో- " క్షవరం చేసినప్పుడు నా బుర్రకి, మరే అవయవాలకు గాని దెబ్బలు తగిలినా, కొసుకున్నా దావా వెయ్యను గాక వెయ్య"నని ఆ కాగితం ముక్క సారాంశంమట. ' అమ్మ అమెరికోడా' అనిపిస్తుంది. నానా రకాల విన్యాసాలతో క్షుర కర్మ పూర్తి అయ్యాక, నెత్తిమీద బరువు దిన్చుకున్నాకా, వెంటనే చొక్కా చేతులు పైకి మడతెట్టేసి, చెయ్యి పైకెత్తేసి బాహుమూల రుచుల్ చూపెట్టేస్తే," వెర్రి వెధవని చూసినట్టు చూసి, అమెరికాలో అక్కడ క్షవరం చెయ్యరు బాబూ" అని విశదీకరిస్తే నేర్చుకున్న పాఠం - " అమెరికాలో బార్బరులు కేవలం మెడకి పై భాగంలో మాత్రము కత్తెర వేస్తారు.మిగిలినవన్నీ మనమే తంటాలు పడాలి" అన్నది. మళ్ళీ గ్రాంథిక శైలిలో వాక్యం. శుద్ధ వ్యావహారిక కథనంలో హట్టాతుగా ఒక గ్రాంథిక వాద్యం ఆ సందర్భంలో ఉన్న హాస్యాన్ని ఇనుమడింప చేస్తుందన్న విషయాన్ని బలపరుస్తుంది.



క్రాపయ్యాకా, నందివర్ధనం ఇచ్చిన కంప్యూటరు బిల్లు చూస్తే నందివర్ధనం కాస్తా పర్వత వర్ధినిలా కనబడి, చేసేదేమీ లేక తిట్టుకుంటూ 20 డాలర్లు అంటే, 160 రూపాయలు చెల్లించి బయట పడతాడు కథకుడు. ఇది 1975 లో మాట. అప్పుడు డాలరు కేవలం ఎనిమిది రూపాయలు. ఇప్పుడు నలభై రూపాయల పైనే ఉందనుకుంటా. అంటే క్షవరానికి రూ. 800 పై మాటేనన్న మాట. అమెరికాలో క్షవరం చేయించుకోవడం నిజంగానే క్షవరమన్న మాట.అక్కడ తిరు క్షవరం లాభసాటిగా ఉండేలాగుంది, జుట్టు పెరగడానికి కాస్త ఎక్కువ రోజులు పడుతుంది కనుక.



ఈ జులపాలోపాఖ్యానానికి 2005 లో సిల్వర్ జ్యుబిలీ అని గుర్తుకొచ్చి, సెలెబ్రేట్ చేసుకుందుకు వెతుక్కుంటూ వెళ్తే, ఎన్నెన్నో మార్పులు. తెల్ల మంగల్ల స్థానంలో వియత్నాం వాళ్ళు బార్బర్ షాపుల్ని కబ్జా చేయడం. అక్కడ అన్ని కుర్చీల్లోను మన పవిత్ర భారతీయులే ఉండడం వగైరా.వగైరా. ఈ కథల్లో అక్షరాక్షరంలోనూ హాస్యం...గిలిగింతలు పెట్టె లాస్యం. పేజీలు తిరగేస్తుంటే అన్ని కథలూ ఇదే తీరని తెలుస్తుంది.



భాషా దోషం' అని ఒక కథ. ఈ కథలో రాజా వారు (రచయిత) మాట్లాడుతుంటే, అక్కడి వారికెంతకీ బోధపడని తెలుగింగ్లీష్ భాష గురించి వ్యంగ్యంగా చర్చించారు. స్నేహితు డింట్లో తారస పడిన వ్యక్తి తనకు తాను పరిచయం చేసుకుంటూ , " అయాం మెంగాపెటీ" అంటే, అతడే గుజరాతీయో, బీహారోడో అనుకొంటుండగా, " కంగారు పడకు, మంగపతిలే " అని చెప్పేసరికి 'అమ్మయ్య' అనే ఫీలింగుతో మొహం వికసిస్తుంది, రచయితకే కాదు, మనక్కూడా. అమెరికా ఇంగ్లీషు మాట్లాడే పధ్ధతి అతని దగ్గర నేర్చుకో నెంచిన రచయితకి long distance tution పదేళ్లుగా చెప్పించుకుంటున్నా భాషాదోషం పోకపోవడం ఈ కథలో కొసమెరుపుగా అనిపిస్తుంది. commonly mistaken spellings - tuition, vacuum వంటివి. 'చైనా వాడి కథ'లో చైనీయుల ఇంగ్లీషు గమ్మత్తుగా ఉండి బలే నవ్వు తెప్పిస్తుంది.




మనకు నిత్య జీవితంలో తారసపడే కొందరు వ్యక్తులు, సాహిత్యంలో కొన్ని పాత్రలు మన పెదాలపై నవ్వుల పూలు పూయిస్తాయి. తెలుగు హాస్య రచయితల్లో కొందరు సృష్టించిన పాత్రలు వాటి పేరుతోనే అజరామరం అయ్యాయి- చిలకమర్తి వారి గణపతి,పానుగంటి వారి జంఘాల శాస్త్రీ , మునిమాణిక్యం కాంతం, మొక్కపాటి బారిస్టర్ పార్వతీశం, గురజాడ గిరీశం, భానుమతి అత్తగారు, ముళ్ళపూడి బుడుగు, అప్పుల అప్పారావులు, ఎమ్బీఎస్ అచలపతి - ఇలా. మరికొందరు రచయితలు వ్యంగ్య చతుర చమత్కార సంభాశానలతోను , పదాల ' పన్ను' గాట్లతోనూ హాయిగా నవ్వించేస్తారు. చిట్టేన్ రాజు గారు ఈ రెండు రకాలుగాను కథల్లో హాస్యాన్ని విరగ పండించారు. వారి ' శివరాం గాడు' (శివరాం గాడని ఆయనన్నతలుగా అలానే అనాలనిపిస్తుంది. అంటే ఆ పాత్ర చిరస్థాయిగా నిలుస్తుందనే అర్ధం) ఏ హాస్య పాత్రకీ తీసిపోని వ్యక్తి అయితే, వారి రచనా సంవిధానం - హాస్యం తనంత తానుగా వచ్చి అక్షరాలుగా మారిపోయి కుప్ప పోసుకున్దనిపించేలా ఉంటుంది.




ఇక మూడో విశేషం కూడా ఉండి. ఆయన వ్యక్తిగా ' స్మిత పూర్వాభిభాషి'. ఇది నేనన్తున్న మాట కాదు. ' సి ఫర్ కామెడీ' అంటూ, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారే స్వయంగా ముందుమాటలో అన్నారు. ' సి' ఫర్ చిట్టేన్ రాజు అండ్ ఆల్సో ఫర్ కామెడీ! తెలియని వారితో కూడా ఆయన కళ్ళు నవ్వుతూ మాట్లాడతాయి. ఆ నవ్వుల మాటలే ఆయన కథల్లోనూ దొర్లుతాయి. అందుకే ఆయన రాసిన ' అమెరికామెడీ కథలు' మంచి హాస్య కథలయ్యాయి.



--
Makineedi Surya Bhaskar

Posted by జ్యోతి Jan 11, 2010

Subscribe here

భువన సుందరి సీరియల్ చదవండి

భువన సుందరి సీరియల్ చదవండి
Keira Knightley: Beautiful Lady reading a Book

You said it!