సురుచి బ్లాగర్ , పెద్దవారు జ్ఞానప్రసూనగారు అందించిన అపురూపమైన కథా విశేషాలు..
హాస్యం వ్రాయడం అనేది హాస్యం కాదు. అలా అని అసంభవం కాదు. హాస్యం కొందరిలో చిరుజల్లుగా మొదలయి సన్నటి పాయయై సెలయేరుగా వురుకుతుంది. ఆ ముర్ముర ధ్వనుల సొగసే వేరు. పాఠకుల హృదయాల్ని కదిలించి, గిలిగింతలు పెట్టి, కవ్వించి, నవ్వించి, వ్యధలను వదలగొడుతుంది. ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అలాటి హాస్యంతో కథలు వ్రాసే రచయిత్రులలో డా. సోమరాజు సుశీలగారొకరు. వారు రచించిన ఇల్లేరమ్మ కథలు ఇంపైన కథలు. అందులో నాకు నచ్చిన కథ " కిటికీలో పూలతోట".
ఇల్లిల్లూ ఏలుతూ తిరిగే సుశీలకి ఇల్లేరమ్మ అని ముద్దుపేరు. ఎంత తెలివిగలదో అంత అమాయకంగా ప్రశ్నలు వేసి అమ్మ చేత మొట్టికాయలులాటి మాటలు తింటూంది. నలుగురితో తిరిగి పరిచయాలు చేసుకోవడం, రుచికరమైన వంటలు తినడం, తన దృక్పధానికి భిన్నంగా వ్యవహరించే వ్యక్తుల్ని చూసి ఆశ్చర్యపోయి నోరు వెళ్ళబెట్టడం ఇల్లేరమ్మ స్పెషాలిటీలు. ఒకసారి ప్రయాణపు హడావిడిలో పులిహోర తినేసి అన్నం ఎలా అని అడిగి అమ్మతో తిట్లు తిన్న ఇల్లేరమ్మ కొత్త ఇంట్లో నిద్రపోతుంది. అక్కడ పూలపరిమళం తట్టిలేపగా ఒక కిటికీలోంచి రాధామనోహరం తీగ, మరొక దాంట్లోంచి గిన్నె మాలతి పూలు, మూడోదాంట్లోంచి జాజితీగలాంటిది ఉంటాయి. కిటికీల్లోంచి పూలతీగలు వాటంతటవే పూస్తుంటే చూసి ఏలూరు వాళ్లు ఎంత పుణ్యం చేసుకున్నారో అనుకుంటుంది సుశీల.
కొత్త ఇంట్లో పాలు పొంగిస్తూ... "పాలు పొంగుతుంటే పొంగుతున్నాయి అని అరవకూడదు . అలా కాకుండా సూర్యనారాయణమూర్తికి దణ్ణం పెట్టుకొంటే పాలు పొంగినట్టు సంసారం పొంగనిస్తాడు”: అన్న అమ్మ మాటలు విని ఓహో! అనుకుని పాలు తాగి వెళ్లిపోతుంది ఇల్లేరమ్మ. కొత్త ఇంటి పెరడులో తిరుగుతుంది . అక్కడ జామచెట్టును చూసి ఇంటివాళ్లకి జాంచెట్టు పెంచడం తెలియదు. నేలకి వంగి ఉన్న చిన్న చిన్న కొమ్మలను పిల్లలు చూస్తే బతకనిస్తారా అంటుంది. తను చిన్నది కానట్టు. వయసులో చిన్నతనం, ఆలోచనలో పెద్దతనం .... ఒకోసారి జామచెట్టు కొమ్మలు పట్టుకుని ఊగుతుంది. మళ్లీ దేవుడికి ఇష్టమని గ్లాసెడు పారిజాతాలు ఏరుకుని తెస్తుంది. కొత్త ఇంట్లో సామాన్లు సర్దే పని ఉండగా నాన్న పులిహోర తిని సైకిలెక్కి సైటుకెల్లిపోతే అమ్మ ఒక్కతి ఈ సామాన్లు ఎలా సర్దుకుంటుంది.. ఈ నాన్నకు జాలైనా లేదు అనుకుంటుంది. ఆకతాయితనంగా కనిపించినా అన్ని సంగతులు గమనించి తెలుసుకుంటుంది చిట్టి.
ఒకసారి పచ్చి పసుపు కొమ్ములా పార్వతీ దేవిలా ఉన్న మామ్మగారు వచ్చి మా మనవరాలితో ఆడుకోమని చెప్తుంది. ఆ అమ్మాయి పొడుగైన జడలు చూసి "వాళ్లమ్మ నైసుగా దువ్వి గంటసేపు వేసి ఉంటుంది. మా అమ్మ ఎప్పుడూ చిక్కే తియ్యదు. పైపైన దువ్వుతుంది అడిగితే రేపు తీస్తా.. మాపు తీస్తా అంటుంది "అనుకుంటుంది సుశీల. పిల్లలు తల్లితో గట్టిగా అనకపోయినా లోలోపల ఎలా నిర్ణయాలు చేసేసుకుంటారో!!
ఉయ్యాల ఊగుదాం రమ్మంటే ఆ పిల్ల మొహమాటంగా "ఉయ్యాల బల్ల మీద తాతయ్య ఉన్నారే " అంటుంది. పూర్వం పిల్లలకు పెద్దవాళ్లని లెమ్మనడం కాని , వాళ్లు పిలవకుండా పక్కన వెళ్లి కూర్చోవడం కాని చేయడానికి జంకేవారు. ఇల్లేరమ్మ "ఆ ఉయ్యాల కాదు జామచెట్టుకు ఉన్న ఉయ్యాల" అని చెప్తుంది. "ఏమిటో! సొంత జామచెట్టు వుంచుకొని ఉయ్యాల ఊగవచ్చని కూడా తెలియదు. ఏం మనుష్యులో" అనుకొంటూంది. ఉన్నదాని ఉపయోగం, దానిని అనుభవించడం తెలియని మనుష్యులెంతమందో లోకంలో?
సున్నితమైన హాస్యం, తెలుగు నుడికారం, ఆచారాలు, అంతరంగ చిత్రాలు .. భావప్రకటనలు, పెద్ద చిన్న మధ్య మర్యాద మన్నన ఎన్నో ఈ కధలో ఉన్నాయి. ఇల్లేరమ్మ రాలుగాయితనానికి విస్తుపోతూ, నిశితమైన ఆలోచనలకి మురిసిపోతూ ఈ పాత్రని మదిలో పదిలపరుచుకొంటాం. గుర్తుకొచ్చినప్పుడల్లా హాయిగా నవ్వుకొంటాం. ఇంతకంటే ఫలితం ఇంకేం కావాలి కథకు..
టి.జ్ఞానప్రసూన