BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...ట్రాజన్ యుద్ధం గురించిన ఈ కథలో నేను చెప్పాలనుకున్న కొన్ని విషయాల కోసం కాస్త కథా గమనాన్ని మార్చవలసి వస్తున్నది. వీలైనంతలో హోమర్ ఇలియాడ్ ని అనుసరించే వ్రాస్తాను


ప్రోలోగ్:


నా గుర్రానికి అలుపు రావటంతో నేను ఒక చెట్టు నీడన ఆపాను. నా వెనుక వస్తున్న నా అనుచరులు కొందరు నాకు కాస్త దూరాన ఆగారు. మిట్ట మధ్యాహ్నం. ఎండ విపరీతంగా ఉంది. వళ్ళంతా చెమటతో తడిసిపోయింది. నా అనుచరులొక్కక్కరే గుర్రాల మీద నుండీ దిగి చెట్ల నీడన గుర్రాలను కట్టేసి నాకేసి రావటం మొదలెట్టారు. ఈ ప్రయాణమంతా నేను మౌనంగానే ఉన్నాను. నాకీ యుద్ధం ఇష్టం లేదు. కానీ తప్పదు. లేందే నా రాజ్యానికి ముప్పు. పైగా ఈ యుద్ధానికి నేను వెళ్ళ వలసి రావటానికి కారణం కూడా నేనే. ఎందుకంటే నేను చేసిన ప్రతిపాదన వల్లే ఈ పని చేయవలసి వస్తున్నది. 

కానీ ఈ యుద్ధానికి వెళ్ళటానికి నాకు మనస్కరించటం లేదు. మామూలుగా ఐతే ప్రయాణాలంటే నాకు చాలా ఇష్టం. చిన్నతనంలో ఎన్నో సాహస కృత్యాలు చేశాను. ఎన్నో యాత్రలు చేశాను. ఇప్పుడు పాతికేళ్ళ వాడిని. వివాహం జరిగింది. ప్రేమను పంచే భార్య ఉంది. ముద్దులొలికే చిన్నారి పుతృడున్నాడు. వృద్ధుడయిన తండ్రిని చూసుకోవలసిన బాధ్యత కూడా నా మీదే ఉంది. యుద్ధాలంటూ దేశాలు పట్టుకుని తిరుగితే నా రాజ్యంలో ఉన్న అంతర్గత శతృవులు నా రాజ్యాన్ని చేజిక్కించుకోవచ్చు. అందుకే ఎలాగైనా ఈ యుద్ధాన్ని తప్పించుకోవాలని ప్రయత్నం చేశాను. ఇక తప్పక వెళ్ళవలసిన పరిస్థితిని కల్పించి నన్ను రప్పించారు. మొత్తం గ్రీకు రాజ్యాలన్నిటిలో ఉన్న యోధులు అందరూ ఈ యుద్ధానికి సన్నాహాలు చేస్తుంటే ఒక ఆడంగిలా నేను యుద్ధాన్ని మానుకుని కూచున్నానంటే నాకు ఎంత బలమైన కారణముందో అర్థమవుతుందనుకుంటాను. కానీ ఆగమెమ్నాన్ నాకో బృహత్తరమైన బాధ్యతనప్పగించటానికి రప్పించాడు. సైన్యం పరంగా, సైన్యం పరంగా, ప్రస్తుతమున్న నా శారీరక మానసిక పరిస్థితులను బట్టీ యుద్ధంలో నేనంత గొప్ప సహకారిని కాలేక పోవచ్చు. అలా అని నేనేమీ యోధుడను కాకుండా పోను. ఏజాక్స్ తరువాత అంతటి యోధుడిని నేనే. నేను నా పూర్తి శక్తి సామార్థ్యాలతో పోరాడితే నా ముందు శతృవులు నిలువజాలరు. కానీ జీవతమంతా ఈ పోరాటాలకు సరిపుచ్చాల్సిందేనా? ఈ ఆలోచన నన్ను వేధిస్తున్నదీ మధ్య.

అఖిలీస్ (Achilles)!

గ్రీకుల్లోనే కాదు, ప్రపంచంలోనే నాకు తెలిసినంతలో అలాంటి యోధుడు లేడు. వేయ నౌకల్లో గ్రీకు వీరులంతా ట్రాయ్ మీద యుద్ధానికి సన్నద్ధులౌతుంటే, ఇద్దరు మాత్రం యుద్ధ సన్నాహక శిబిరం వద్ద లేరు. యుద్ధం తప్పించుకోవాలనుకున్న నేను, అసలు యుద్ధం గురించి తెలియనే తెలియని అఖిలీస్.

ఆగమెమ్నాన్ కీ అఖిలీస్ కీ అసలు పడదు. యుద్ధ కాంక్ష, సామ్రాజ్య విస్తరణ కాంక్ష ఎక్కువగా ఉన్న ఆగమెమ్నాన్ ప్రతి దాన్నీ, దేశ భక్తి క్రింద జమకడతాడు. అదే అఖిలీస్ కేవలం తన సామర్థ్యాన్ని చాటటానికీ, తన శౌర్య పరాక్రమాలకు అమరత్వాన్ని కల్పించటానికే యుద్ధం చేస్తాడు. అతని క్రింద మిర్మిడాన్లనే సుశిక్షితులైన వేయి మంది పైన యోధులున్నారు. అతని మాట జవదాటరు. వారు, అఖిలీస్ ఆధ్వర్యంలో ఎవరి పక్షాన యుద్ధంలో తలపడితే వారే విజయ లక్ష్మినందుకుంటారు. అందుకే గ్రీకులకు ఏ కష్టమొచ్చినా, యుద్ధం చేయాల్సి వచ్చినా అఖిలీస్ కోసం చూస్తారు.

ఈసారి అతని ఆచూకీ తెలియలేదు. అందుకోసమే నన్ను అతనిని వెతకమని పంపారు. ఎక్కడని వెతుకను? దారీతెన్నూ లేకుండా వెళుతున్న నాకు ఎథీనా (Pallas Athene/Athena) దక్షిణ దిశగా వెళ్ళమని చెప్పింది. అలా నా ఈ ప్రయాణం మొదలైంది. నా సైనికుల్లో కొందరిని నా వెంట ఉంచుకుని, మిగిలిన వారిని ఏజాక్స్ ఆధ్వర్యంలో ఉంచి, ఇలా వచ్చాను. 
***   ***   ***

"Sometimes you have to serve in order to rule"

1. ముచ్చట గొలిపిన వీరుడు

ఎథీనా చెప్పిన గుర్తులున్న ప్రదేశానికి చేరే సరికి నాతో బయలుదేరిన ఎనిమిది మంది అనుచరుల్లో కేవలమిద్దరే మిగిలారు. ఇద్దరిని ఒక వార్త తెలియజేయటానికి స్పార్టా పంపగా, నలుగురు మరణించారు. తీరా ఇక్కడకు వచ్చాక (నగర పొలిమేరలను సమీపించిన సందర్భంలో) అఖిలీస్ రానంటే? మొదలే ఆగమెమ్నాన్ కీ అఖిలీస్ కీ పడదు. అఖిలీస్ ఇంకా తమతో చేరకపోవటం గురించి ఆగమెమ్నాన్ చిర్రు బుర్రులాడుతూనే అతని గురించి వ్యంగ్యమైన మాటలను మాట్లాడుతున్నాడు..

నేను చేరకు ముందు నన్ను గురించియన్న మాటలను డయామీడీస్ చెప్పగా విన్నాను. నా ముందే అఖిలీస్ ని యుద్ధం తప్పించుకోజూస్తున్న చవట దద్దమ్మగా జమగట్టి మాట్లాడాడు. ఇంకా ఇంకా మాటలన్నాడు. అయినా చివరకు అతనికి ఆఖిలీస్ కావలసి వచ్చాడు. ఈ ఆలోచనల్లో నేనుండి నగరం వైపు అడుగులు వేస్తుంటే రివ్వున వచ్చిన బాణమొకటి నాకు అరంగుళం ప్రక్కనుంచీ దూసుకుని వెళ్ళింది. 

"దూరాన నించుని బాణాలు వేయటం కాదు. నీ వీరత్వాన్ని ప్రదర్శించాలంటే నాతో ద్వంద్వ యుద్ధానికి రా," అని కేక వేశాను నా గుర్రం పై నుండే.

"ఎవరు నీవు?" అంటూ ఒక తాడు సహాయంతో అందమైన బాలిక నా ముందు నిలుచుని కరవాలాన్ని తీసి నా వైపు చూపిస్తూ, యుద్ధానికి సన్నద్ధమే అని సైగ చేసింది. పదహారేళ్ళుంటాయేమో. ఆ ధైర్యానికీ, ఆ కత్తి పట్టుకున్న తీరుకీ అచ్చెరువొందాను. గ్రీకు స్త్రీలలో ఇంత అందమైన యోధురాలుందాని. ఉంటే నాకు తెలియును కదా.కీర్తి ప్రతిష్టలు వ్యాపించటం ఎమ్త సేపు. పైగా ఇదేమీ అఙ్ఞాత భూభాగమేమీ కాదు. మధ్యధరా సముద్ర దేవత థెటీస్ నడయాడు నేల. ఖచ్చితంగా ఎవరో పురుషుడే మారు వేషంలో ఉన్నారని గ్రహించాను. యుద్ధం చేయనిదే నన్ను ముందుకు కదలనివ్వనని బలవంత పెట్టటంతో నాకు కత్తి దూయక తప్పలేదు. ప్రయాణపు బడలికతో, పరిస్థితులను బట్టీ నిర్వేదంలో ఉన్న నేను చాలాసేపు పోరాడినా చివరకు ఓతమి బారిన పదబోతున్నా. ఇతన్ని/ఈమెను గెలిస్తేనేగానీ నాకు నగర ప్రవేశం దొరకదు. ఓడితే వెనుదిరగాలని నియమం పెట్టబడింది. 

కత్తి వేటు నుండీ తప్పించుకుని కాస్త ప్రక్కగా ఆగి మరల రాబోతున్న నన్ను జూసి, "పేరు జెప్పి శరణు వేడు. కనికరించి నగరములోనికి తీసుకుబోతాము," నన్న ప్రతిపాదన చేయబడింది. "పేరుజెప్పి శరణు వేడటం యోధుల లక్షణం కాదు. కాచుకో వస్తునాను," అని మీదకు వెళ్ళి తన కత్తి ధాటికి నా కత్తిపి అడ్డు ఉంచి, "అడుగో అఖిలీస్..." అని అరచాను. ఆ భామ వెనక్కి తిరిగి చూసే క్షణంలో కలిగిన ఏమరుబాటును సొమ్ముజేసుకుంటూ కత్తిని ఎగుర గొట్టాను. ఆశ్చర్యం, కోపంతో నావైపు దూసుకు రాబోతున్న సమయంలో ఒక ఎత్తైన భవనం లోంచీ వచ్చిన స్త్రీ మూర్తి అంది ఆ పిల్లతో, "ఆయనెవరో తెలుసా? ఆయన పైన కత్తిదూస్తావా? ఆయన ఇథాకా నగరాధీశుడు యూలిసీజ్."

ఆ పిల్ల ఆశ్చర్యానందాలతో రెండడుగులు వెనక్కు వేసి, "ఆఁ యూలిసీజ్? అంటే ఆడీశ్యజ్ అని మారు పేరు గల ఇథాకా నగర మహారాజా?" అంది.

(సశేషం)

Subscribe here