BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...

నాకు మొదటి నుంచీ చందమామ కన్నా బాలజ్యోతి అంటే ఎక్కువ ఇష్టం. ఎందుకో కారణం చెప్పలేను. బాలజ్యోతి 1980 లో విడుదలైనప్పటి నుంచీ ఎనభై ఆరు దాకా మా ఇంట్లో ఉన్న కాపీలను దాదాపూ ప్రతి రోజూ పారాయణం చేసినందువల్ల కావచ్చు. అలా అని చందమామంటే గౌరవభావం లేదని కాదు. లిటరల్లీ చందమామంటే గౌరవం, భక్తీ, బాలజ్యోతి అంటే ఒక రకమైన సన్నిహితత్వం. 

పిశాచ గిరి, మహావీరుడు భిల్లూ, కిట్టిగాడు, నాకున్నది ఒక చక్కని బొమ్మ, దక్షిణ ధృవ యాత్ర, అగ్నిదత్తుడు, మొదలైన సీరియళ్ళు, నేను పుట్టక ముందు వ్రాయబడినవే అయినా, నా నాలుగైదు తరగతుల చదువు సమయంలో వాతితో పెనవేసుకున్న బంధం ఇప్పటికీ అలాగే ఫ్రెష్‍గా...

దానికితోడు అందులో ఇచ్చిన మినీ సీరియళ్ళు భలే ఉండేవి. వాటి ముందు నాకు ఎందుకో చందమామ వెల వెల బోయినట్లుండేది. అప్పుడప్పుడూ ఎవరన్నా తెచ్చినప్పుడు మాత్రం చందమామ చదివేవాడిని. ఆరో తరగతిలో ట్రాజన్ వార్, ఆపైన ఏడొ తరగతిలో ఆడిస్సి (Odyssey ) నేను చదివిన తొలి పాశ్చాత్య సాహిత్యం. అందులో నాకు యూలిసీజ్ (Ulysses or Oddysseus ఆడీశ్యజ్) బాగా నచ్చాడు. భుజ బలం కన్నా బుద్ధి బలం కలిగిన వాడు, పైగా మన సరస్వతీ దేవికి సమాంతరంగా చెప్పబడే ప్యాలస్ ఎతీనీ (Pallas Athene) అనుగ్రహం ఉన్న వాడు. ఎక్కడికక్కడ తన తెలివితేటలను ప్రాక్టికల్ పర్పస్ కోసం ఉపయోగించుకునే తీరు భుజ బలం కన్నా బుద్ధి బలాన్ని ఎక్కువగా వాడాల్సిన నాకు బాగా యూలిసీజ్ నచ్చటానికి కారణమయ్యాయి. మరి అలాంటి ట్రాజన్ వార్ ని చందమామలో ఇస్తున్నట్టు తెలిశాక తెలుగులో అయితే మరింత బాగా ఎంజాయ్ చెయ్యొచ్చనే ఆత్రమ్ తో చందమామ తెచ్చుకునే వాడిని. 

నరసరావుపేట ఈశ్వర్ కూల్ డ్రింక్స్ దగ్గరున్న మేగజైన్ల స్టాల్ వద్ద నేను పరిచయమ్ పెంచేసుకుని (వాడి కూతురు శ్రియ కాదు లెండి ;-)) ఎప్పుడన్నా డబ్బులు లేకున్నా పుస్తకమక్కడే కూచుని చదివేసిచ్చి వెళ్ళేవాడిని. సరిగ్గా పావుగంట వదిలేవాడు. అది నాకు సరిపోయేది. అయినా మధ్యలో కొన్ని ఎపిసోడ్లు మిస్ అయ్యాను. ఒక్కోసారి ఆలశ్యంగా రావటం, లేకపోతే ఆయన కూతురు కూచోటమో అలా మిస్ అయ్యేవి. నాన్న కన్నా కూతురు తెగ ఇబ్బంది పెట్టేది. పుస్తకమిట్లా ఇస్తే బేరాలు తగ్గుతాయని.

ఆ కథనానికి చందమామలో పెట్టిన పేరు భువన సుందరి. కాస్త నేను చదూకున్న ఇంగ్లీషు కథనానికన్నా మార్పులున్నా, అబ్బబ్బ ఆ కథనమే వేరు ఎంతైనా చందమామ చందమామే. లేని పుస్తకాలెటూ లేవు. ఉన్న పుస్తకాలు కూడా ఇంటి సర్దుళ్ళలో గవించాయి. అప్పటి నుంచీ చందమామ 1995/96 సంచికల వేట మొదలెట్టానిగానీ, అవి దొరకలేదు. 

ఇందు మూలంగా (ఎవరా ఇందు? ఏమా కథ అని మాత్రం అడగొద్దు. ఈ కారణాన అని అర్థం తీసుకోండి) చంపి లకు నా రిక్వెస్టు. కాస్త పుస్తకాలాచూకీ తెలిస్తే నాకు ఇవ్వగలరు. మనం, మనం, మాట్లాడుకుందాం... 

ఆ భువన సుందరి ఉరఫ్ ట్రాజన్ వార్ అలియాస్ ఇలియాడ్ ని ట్రాయ్ అనే పేరుతో బ్రాడ్ పిట్ ని పెట్టి తీశారుగానీ, చేసిన మార్పులన్నీ మహాస్యాస్పదంగా ఉన్నాయి. మరొక్కసారి ఆ కథని చదవాలని ఉంది. ఇప్పటికి పుస్తకాలు లేవు. అందుకనే నాకు తెలిసిన కథని నా మాటల్లో ఇక్కడ B&G లో సీరియల్ లాగా అందించే ప్రయత్నం చేసే సాహసం చేస్తున్నాను. చదివి నన్ను ప్రోత్సహించండి. తప్పులుంటే సరిదిద్దండి. 

అలాగే జై హనుమాన్ ఉన్న కాపీలు కూడా ఆచూకీ తెలిస్తే చెప్పండి.ఇకపై ప్రతి బుధవారం చూడండీ భువన సుందరి కోసం

Subscribe here