BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...దశాబ్ధాల తరబడి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏకచత్రాధిపత్యానికి గండికొట్టగల సరైన ప్రత్యామ్నాయం ఉబుంటు (లినక్స్ debian కెర్నల్‌కి చెందినది) రూపంలో వచ్చింది. ఇన్నాళ్లూ లినక్స్ యొక్క వివిధ డిస్ట్రిబ్యూషన్లని కేవలం కంపెనీలు, సర్వర్ కంప్యూటర్లలోనే ఎక్కువగా వాడుతూ వచ్చారు. సాధారణ పిసి యూజర్లకు లినక్స్ డిస్ట్రిబ్యూషన్లు అన్నీ అంతగా మింగుడుపడనివిగానే ఉంటూ వచ్చాయి. విండోస్‌ని మొదట్లో ఎంత కష్టపడి అర్ధం చేసుకుని వాడడం మొదలెట్టారో దానిలో సగం బుర్రపెట్టినా లినక్స్ వినియోగం అర్ధమవుతుంది. అయితే ఏళ్ల తరబడి విండోస్‌కి అలవాటు పడిన వారు అంత త్వరగా మారలేకపోతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని దాదాపు విండోస్ స్వరూపాన్ని, అంతకంటే సులభంగా ఆపరేటింగ్ సిస్టమ్ ని ఉపయోగించగలిగే సౌలభ్యాన్ని అందించేందుకు ఇప్పటివరకూ అనేక లినక్స్ డిస్ట్రిబ్యూషన్లు విడుదల అయ్యాయి. వాటన్నింటిలో ఉబుంటు సాధారణ పిసి యూజర్లని విశేషంగా ఆకట్టుకుంటోంది. దాదాపు అన్ని పనులు చక్కదిద్దుకోవడానికి ఉబుంటులో ప్యాకేజీలు లభిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ ని ఎంత సులభంగా వాడవచ్చో అని మీకు పరిచయం చేసే ప్రయత్నమే ఇది .


అస్సలు లినక్స్ అంటే ఏమిటి? ...

Linux అనేది ఓ Kernel. ఏ ఆపరేటింగ్ సిస్టంకైనా ప్రధానంగా కావలసిన ప్రోగ్రామింగ్ భాగమన్నమాట కెర్నల్ అంటే. మనం రోజూ వాడే Windows కి కూడా ఆ మాటకొస్తే అంతర్గతంగా Kernel ఉంటుంది. ఒక ఆపరేటింగ్ సిస్టమ్ రూపకల్పనకు ఈ Kernel అనేది అత్యంత ముఖ్యమైనది ఆపరేటింగ్ సిస్టం పనిచేసే తీరూ, దాని నిర్మాణం, వివిధ హార్డ్ వేర్లతో అది కమ్యూనికేట్ చేసే విధానం, ఆపరేటింగ్ సిస్టంలో మనం ఇన్‌స్టాల్ చేసి వాడుకునే వివిధ అప్లికేషన్ ప్రోగ్రాములు కోరే మెమరీ రిక్వెస్టుల ప్రకారం ఏ పద్ధతిలో వాటికి మెమరీ కేటాయించాలి, ఎలా ప్రాసెసింగ్ జరపాలి వంటి అంశాలన్నీ kernel లోనే ప్రోగ్రామింగ్ చెయ్యబడి ఉంటాయి.


కెర్నల్ గురించి వివరంగా...

చాలామంది Linux అనే పదాన్నే ఒక ఆపరేటింగ్ సిస్టంగా పిలుస్తుంటారు. పైన మనం చెప్పుకున్నట్లు Linux అనే కెర్నల్ మాత్రమే! ఒక ఇంటికి పునాదులంటూ వేస్తే ఆ పునాదులపై మనకు నచ్చినట్టు ఇల్లు కట్టుకోవచ్చు కదా! అలాగే విండోస్‌లో Windows 9x, NT అని రెండూ రకాల kernels లు ఉన్నాయి. వాటిలో Windows NT కెర్నల్‌లోని స్టెబిలిటీ సదుపాయాలను పొందుతూనే, మరోవైపు Windows 9x కెర్నల్‌లోని సాధారణ యూజర్లకు ఉపయోగపడే సదుపాయాలను కలగలిపి Hybrid kernel ఆధారంగా విడుదల చెయ్యబడింది. Windows NT, 2000, Server 2003, Windows Vista, Server 2008 తదితర ఆపరేటింగ్ సిస్టమ్ లు NT kernel కోవకు చెందినవిగా భావించాలి.


అందుబాటులో ఉన్న లినక్స్ డిస్ట్రిబ్యూషన్లు..

పైన మనం చెప్పుకున్నట్లు Windows NT Kernel ఆధారంగా 2000, Server 2003 వంటి పలు ఆపరేటింగ్ సిస్టంలు ఎలా విడుదల చెయ్యబడ్డాయో Linux కెర్నల్ ఆధారంగా భారీ సంఖ్యలో ఆపరేటింగ్ సిస్టంలు (వీటిని లినక్స్ డిస్ట్రిబ్యూషన్ల పేరిట పిలుస్తుంటారు) అందుబాటులోకి వచ్చాయి. లినక్స్ డిస్ట్రిబ్యూషన్లని మళ్లీ ఈ క్రింది రకాలుగా వర్గీకరిస్తారు.

1. Debian ఆధారితమైనవి Ubuntu, Corel Linux, Elive, Neopwn వంటివి ఈ కోవకు వస్తాయి.

2. Knoppix ఆధారితమైనవి. Knoppix అనే వాస్తవానికి Debian ఆధారంగా రూపొందించబడింది. ఈ Knoppix ఆధారంగా Gnoppix, Morphx, Musix, Damn Small Linux వంటివి ఉంటాయి.

3. Ubuntu ఆధారితమైనవి. ఇప్పుడు మనం ఈ వ్యాసంలో ప్రధానంగా చర్చించుకోబోతున్న ఈ Ubuntu అనేది Debian ఆధారంగా పనిచేసే లినక్స్ డిస్ట్రిబ్యూషన్. మళ్లీ ఈ ఉబుంటుని ఆధారంగా చేసుకుని Ubuntu Server Edition, Kubuntu, Xubuntu, Edabuntu, Gobuntu, Ubuntu Mobile, Ubuntu Netbook Remix వంటి డిస్ట్రిబ్యూషన్లు వాడుకలో ఉన్నాయి.

4. RPM ఆధారితమైనవి. Redhat Linux కోసం అభివృద్ధి పరచబడిన RPM అనే ప్యాకేజ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఆధారంగా (అంటే మనకు విండోస్‌లో వివిధ సాఫ్ట్‌వేర్లు EXE ఫైళ్లని ఎలా కలిగి ఉంటాయో, ఈ సిస్టంలో ఎగ్జిక్యూటబుల్ సెటప్ ఫైళ్లు RPM ఎక్స్‌టెన్షన్ నేమ్ కలిగి ఉంటాయి. పైన మనం చెప్పుకున్న Debian ఆధారితమైన సెటప్ ఫైళ్లేమో .deb అనే ఎక్స్‌టెన్షన్ నేమ్ కలిగి ఉంటాయి ). పలు లినక్స్ డిస్ట్రిబ్యూషన్లు లభిస్తున్నాయి. RedHat Linux, SUSE Linux, Fedora, Linux XP, CentOS, Caldera Linux, Mandriva Linux వంటివీ, అలాగే Stackware ఆధారితమైన కొన్ని SLAX అధారితమైనవి కొన్ని.... ఇలా చెప్పుకుంటూ పోతే భారీ సంఖ్యలో లినక్స్ డిస్ట్రిబ్యూషన్లు అందుబాటులో ఉన్నాయి.


అన్నింటి పేర్లు విని భయపడకండి....

ఎన్నో రకాల లినక్స్ డిస్ట్రిబ్యూషన్ల పేర్లు మిత్రుల నోటివెంట వినేటప్పుడు.. ఇన్ని పేర్లా, అస్సలు ఏది వాడాలి అనే కన్‌ఫ్యూజన్ మొదట్ళో నాకూ కలిగిన మాట వాస్తవమే. పైన చదివినదంతా జస్ట్ ఆవగాహన కోసం రాసినది. లేదంటే "శ్రీధర్ గారు లినక్స్ గురించి రాసారు గాని అసలు డిస్ట్రిబ్యూషన్ల గురించి ప్రస్తావించనేలేదు " అని కొందరు గుర్రుగా చూస్తారని రాశాను తప్ప, కొత్తవారు అర్జెంటుగా పైన చదివినదంతా వెంటనే మర్చిపోండి. ఇప్పుడు సాధారణ పిసి యూజర్ల అవసరాలకు UbunTu (మనం తెలుగులో దీన్ని ఉబుంటు అని పిలుచుకోవచ్చు) చాలా చక్కగా సరిపోతుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది దీనిని వాడడం మొదలుపెట్టేశారు. విండోస్ కి ఉంబుంటు ప్రత్యామ్నాయం అవుతుంది. ఈ ప్రత్యేక వ్యాసపరంపరలో ఉబుంటు గురించి వివరంగా చర్చించడం జరుగుతుంది. సో పైన చెప్పిన అన్ని ఇతర డిస్ట్రిబ్యూషన్ల గురించి మర్చిపోదాం...

నల్లమోతు శ్రీధర్
కంప్యూటర్ ఎరా...

Posted by జ్యోతి Feb 6, 2010

Subscribe here