BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...

ఎన్నో గదులున్న కోటలాంటి ఇల్లు, మెరిసే చీరలు, లెక్కలేనన్ని నగలు, ఎప్పటికీ అందుబాటులో ఉండే పనివారు, అధికారం అన్నీ ఉన్న ఒక గృహిణి అదృష్టవంతురాలేనా? ఇవేనా ఆమెకు ఆనందాన్నిచ్చే సాధనాలు.. వీటన్నింటికి మించి భర్త సాంగత్యం, సాన్నిహిత్యం కూడా కోరుకుంటుంది ఆ ఇల్లాలు. స్త్రీకి వివాహమయ్యాక భర్తతోడిదే లోకం. అతని తర్వాతే మిగతా భోగభాగ్యాలు. కాని ఎన్ని భాగ్యాలున్నా కూడా భర్త ఆదరణ లేకుంటే ఆ ఇల్లాలు పడే మనసిక వేదన, భర్తకోసం పడే తపన, అతని కోసం ఏమైనా చేయగలిగే ప్రేమ .. ఇవన్నీ కలగలిపి చోటీ బహూ. సాహిబ్ బివి ఔర్ గులాం చిత్రంలోని నాయిక మరియూ కథాంశం కూడా..

సహచర్యం, ఎడబాటు, ప్రేమ, విరహం, భావుకత గాంభీర్యం కలగలిసిన మనుషులూ, మానవ సంబంధాలూ ఇవన్నీ ఏరి కూర్చి గురుదత్ నిర్మించిన చిత్రం "సాహిబ్ బీవీ ఔర్ గులాం" 19వ శతాబ్దం నాటి ఓ జమిందారి కుటుంబంలో చోటీబహు అనుభవాల్ని, ఆమె ఎదురుతిరిగీ, తనని తాను ఆర్పించుకున్న సందర్భాన్ని ఇందులో అద్భుతంగా చిత్రించారు.. బెంగాల్లో 19వ శతాబ్దంలో చౌదరీలది గొప్ప పేరున్న కుటుంబం. ఇద్దరు సోదరులు మజ్లే బాబు, చోటేబాబుల ఆధిపత్యంలో సాగే ఆ కుటుంబం ఓ పెద్ద హవేలీలో నివాసముంటుంది. ఆ ఇద్దరు సోదరులూ తమకు వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తిపాస్తుల్ని అనుభవిస్తూ మందులో తేలియాడుతూ క్రీడలు, వేశ్యాస్త్రీల సాంగత్యం తదితర అలవాట్లతొ కాలం గడిపేస్తూ ఉంటారు. ఇదంతా అలాంటి గృహాల్లో సర్వసాధారణం. ఎవ్వరూ ఆక్షేపించరు. వారి భార్యలు కూడా తమ భర్తల ఉదాసీనత , అలవాట్లకు ఎదురు మాట్లాడక సర్దుకుపోతుంటారు. కాని చిన్నవాడి భార్య చోటీ బహు మాత్రం భర్త నిర్లక్ష్యం సహించలేకపోతుంది. ఎన్ని విలాసాలు, ఆడంభరాలు ఉన్నాకూడా భర్త చెంతలేకపోవడంతో ఒంటరితనంతో విలవిలలాడిపోతుంది. ఆ సమయంలో ఆ హవేలీలో పనిచేసే తన బంధువు వద్ద ఉండడానికి వచ్చిన భూత్‌నాధ్ ఆమెకు పరిచయమవుతాడు. అతను ఒక సిందూర్ కంపెనీలో పని చెస్తుంటాడు. చోటీ బహూకు సిందూర్ తెచ్చి ఇస్తుంటాడు. ఆమె బాధను అర్ధం చేసుకుని ఒదారుస్తుంటాడు.

ఒకరోజు చోటీబహూ రోజులాగే వేశ్య దగ్గరకు వెళ్ళడానికి తయారవుతున్న భర్తను నిలదీస్తుంది. ఒక్కరోజైనా తనతో ఉండమంటుంది. భార్య కొంగు పట్టుకుని ఇంట్లో కూర్చునే దద్దమ్మనుకాదు. అందమైన భార్య ఉన్నా కూడా ఇలా విలాసవంతంగా ఉండడం, వేశ్యలతో తిరగడం మగవాడి హక్కు. ఎదురుచెప్పడం మీకు మంచిది కాదు. మీ జీవితం ఇంతే అని అంటాడు. ఐతే వేశ్య దగ్గర దొరికేది , ఆమె ఇచ్చేది ఇక్కడ కూడా దొరికిటే తనతో ఉంటారా అని అడుగుతుంది చోటీ బహూ,అతను తనతో ఉండేలా చేసుకోవాలనే ఆవేదనతో. ఐతే సరే నువ్వు నాకు ఇష్టమైన విధంగా ఉండగలవా? అందంగా తయారై నాకు మత్తెంకించేలా పాటలు పాడగలవా? ఆటలు ఆడగలవా? నాతో పాటు మధుపానం చేయగలవా? అని ప్రశ్నిస్తాడు భర్త. ముందు నిర్ఘాంతపోయినా భర్తను ఆకర్శించడానికి, బయటకు వెళ్లకుండా నిలువరించడానికి ఇవన్నీ చేయడానికి సిద్ధపడుతుంది. చేస్తుంది కూడా. అలా మొదలుపెట్టిన తాగుడు అలవాటుగా మారి చివరకు వ్యసనం అవుతుంది.

ఈ నేపధ్యంలో భూత్ నాధ్ పని చేసే చోట యజమాని కూతురు జాబాతొ పరిచయం కలిగి సాన్నిహిత్యం పెరుగుతుంది. భూత్ నాధ్ చోటీబహూ తాగుడు మాంపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు కాని, ఆమె ప్రతిరోజూ తాగకుండా ఉండలేకపోతుంది. ఒకరోజు హవేలీ వాతావరణంలో ఇమడలేక చోటీబహూ , భూత్ నాద్ తో కలిసి పారిపోవాలనుకుంటుంది. కాని ఆమె కుటుంబ సభ్యులు ఇది గమనించి కుటుంబ పరువు, ప్రతిష్ట అని ఆలోచించి ఆమెను తీసికెళ్లి చంపి, అదే హవేలీలో ఎవరికీ తెలీకుండా భూస్థాపితం చేస్తారు. అందరికీ ఆమ్ ఏమైందో తెలీదు. ఎక్కడికో వెళ్లిపోయింది అని చెప్తారు. కాని చాలా ఏళ్ల తర్వాత ఆ హవేలీ పునర్నిర్మాణ కార్యక్రమంలో పని చేస్తున్న భూత్ నాద్ ఆ తవ్వకాలలో బయటపడ్డ ఒక అస్థిపంజరాన్ని చూసి నిశ్చేష్టుడవుతాడు. అది ఎవరిదో అక్కడున్నవారెవ్వరికీ తెలీదు . కాని ఆ అస్థిపంజరం మీద ఉన్న నగలను గుర్తించిన భూత్ నాద్ అది చోటీ బహూ అని. ఆమెను చంపి అక్కడ భూస్థాపితం చేసారని అర్ధం చేసుకుంటాడు.

చిత్రం మొత్తం ఫ్లాష్ బ్యాక్ లో జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవలసింది చోటీబహూగా చేసిన మీనాకుమారి అద్భుతమైన నటన. భర్త కోసం తపన పడే సన్నివేశాలలో ఆమె అడిగే ఒక్కో ప్రశ్న అందరినీ కదిలించేస్తుంది. భర్త కోసం ఒక ఇల్లాలు మరీ ఇంతగా దిగజారిపోవాలా అని కూడా అనిపిస్తుంది ఆమె తన భర్తను ఇంట్లోనే ఉండేలా చేసుకోవడానికి తాగడం మొదలుపెట్టినప్పుడు. అలా మొదలై చివరకు ఆమెనే బానిసగా మార్చుకుంటుంది ఆ తాగుడు .. చివరకు అందరినీ ఎదిరించినా ప్రాణాలు కోల్పోక తప్పలేదు చోటీ బహూకు.

నటుడు, నిర్మాత, దర్శకుడిగా 21 ఏళ్లపాటు చిత్రసీమలో వెలుగొందిన గురుదత్ హృదయావిష్కరణ చేయడంలోనూ, తన ఆలోచనలనీ, అనుభూతులనీ దృశ్యమానం చేయడంలోనూ తనకు తానే సాటి. హిందీ చిత్రసీమ స్థాయిలో గమనిస్తే గురుదత్ ఎనలేని భావుకత కలిగిన అద్భుత చలన చిత్రకారుడు. ముఖ్యంగా ఆయన ప్యాసా, కాగజ్ కే ఫూల్, సాహిబ్ బీబీ ఔర్ గులాం తదితర చిత్రాలు భారతీయ చలన చిత్రసీమలో, ప్రేక్షకుల హృదయాలలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించాయి. గురుదత్ ఎన్నో ప్రేమాస్పదమైన చిత్రాలకి రూపకల్పన చేశారు. అలాంటి చిత్రాల్లో ఒకటి ' సాహిబ్ బీబీ ఔర్ గులామ్' 19వ శతాబ్దం నాటి ఓ జమిందారి కుటుంబంలో చోటీబహు అనుభవాల్ని, ఆమె ఎదురుతిరిగీ, తనని తాను ఆర్పించుకున్న సందర్భాన్ని ఇందులో అద్భుతంగా చిత్రించారు

మంచి కథ, నటన, అన్నింటికి మించి సంగీతం ఈ సినిమాను ఒక ఆణిముత్యంగా మలిచాయి అని చెప్పవచ్చు. పాటలన్నీ ప్రజాధరణ పొందినవే ఐనా "నా జావొ సయ్యా " అనే పాట మాత్రం అన్నింటికి మించి హైలైట్ అని చెప్పవచ్చు. ఈ సినిమా నిర్మించి 48 ఏళ్లు కావొస్తున్నా ఇప్పటికీ ఆదరించతగ్గ, అభినందిచ్చదగ్గ అద్భుత చిత్రం ఈ సాహిబ్ బివి ఔర్ గులాం..

సాహెబ్ బీబీ ఔర్ గులాం (హిందీ)

కథ : బిమల్ మిత్ర

సంగీతం : హేమంత్ కుమార్

దర్శకత్వం : అబ్రార్ అల్వి

నటీనటులు : గురుదత్, మీనాకుమారి, రెహ్‌మాన్, నాజర్ హుస్సేన్ మొ...


మరి పాటలు విందామా....

Posted by జ్యోతి Mar 27, 2010

Subscribe here