BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...


సురుచి బ్లాగర్ శ్రీమతి జ్ఞానప్రసూనగారు వేసిన ఈ చిత్రానికి ప్రమదావనం సభ్యులు కొందరు ఆశువుగా చెప్పిన అందమైన మాటలు, కవితామాలికలు...

సంజె కెంజాయ నారింజరంగు కుంకుమ పెట్టుకుని
వాలే పొద్దుల కెంపు ఎరుపుని చెక్కిళ్ళలో నిలుపుకుని
నడచి వచ్చే నిషా సుందరి వయ్యారాన్ని కన్నుల్లో కాటుక దిద్దుకుని
మేలిముసుగు సోయగాలతో , నును సిగ్గుల కలల బరువుతో
నా చూపుల తోరణాల దీపాలు నీ దారి కై వెలిగించుకుని
ఆశల లోగిలిలో, వలపు వాకిలిలో
ఒళ్లంతా కనులై, ఆ కన్నులనిండా నీవై
నిలిచి ఉన్నా.. నీ రాకకై..
సుభద్ర వేదులసందె రంగులలోని మెరుపమ్మని
గుండె సవ్వడిలోని తుళ్ళింతని
పండు వెన్నెల లోని విరి దండనీ
నిండు సందురుడా !!
లోకాల చిరుదీపాలని కంటి పాపలలో వెలిగించి
నీ రాకకై చూసే విరహిణిని
వాకిలి దాట లేని నీ మధురిమని
అత్త చాటు కోడలిని
తలుపు చాటు చామంతిని
నీ కౌగిలిలోని కస్తూరిని
శ్రీదేవి


ఆషాఢమాసాన అలనాటి ఉదయాన
తలపుల తూగుటుయ్యాలలో
నీ వలపు పిలుపులు వినిపిస్తుంటే
ఆచారాలు అడ్డం వచ్చి అడుగు ముందుకు పడకుంటే
తెల్లబోయిన పిచ్చి మనసుని
తుళ్ళిపడకుండా ఆపుదామని
కలలో వచ్చిన కలలన్నింటినీ కమ్మగా విడమరిచి
మేఘాల మాలికలో మమతలతో కలిపి గుచ్చి
నీకోసం పంపించా మేఘసందేశాన్ని...
కమ్ముకొస్తున్న మేఘాల చాటునుంచి పడే చినుకులో
కనులు ఎదురుచూసేది నీ జవాబు కోసమే అయినా
మనసు పలవరించేది మెత్తటి నీ అడుగుల సవ్వడికోసం..
అరమోడ్పులయిన కన్నులు మరింక ఆగలేనంటుంటే
సర్దుకోమంటున్న మనసుని సరిపెట్టుకోలేక
నీకోసమే వేచి చూస్తున్నా అభిసారికనై...

శ్రీలలితఅమృత ధారల్లే నీ ప్రేమ ధార కురిపించమని వేడుకుంటున్నా,

కరుణించి నీ చిరునవ్వుల చిరుజల్లుని వరమిస్తావని ఎదురుచూస్తున్నా...

సృజన రామానుజన్
కలవర పరిచిన కంటి చాటు తలపేదో ఘడియ వేసిన గడప దాటి రానంటోంది నేస్తం.
దిక్కులు తోచని చూపేదో తనలోకి తనే చూసుకుని చెప్పుకుంటోంది దారి కాచినా కాన రాని చెలుని వూసులేవో.
అమావాశ రాతిరి వెలుగుతున్న చందమామ నువ్వన్నావు...
వెలుగుతున్న నా చూపు చుక్కాని గా దిక్కులు దాటి వస్తానన్నావు..
ఎక్కడున్నావు మిత్రమా..
విరహపు మంటలను దాచుకున్న సూరీడు కుంగి పోయాడు ఆ భారమేదో మోయలేక..
నల్ల మోము చేసిన చందురుడూ కంటికగుపడలేదు..
నీ మూడో కన్నైన నెమలి పించమే నా జలతారు మేలి ముసుగు నావరించిన చూపు రూపమై....
యోజనాల కావల కూడా నిన్ను వెతుకుతోంది..
జాగు చెయ్యక రావా? నీ చెలి గుండెల విరహపు వలపుల నెగడున చలి కాచుకోవటానికి......

భావన
నిన్నటి వెన్నెలరాత్రి జగమ౦తా నా తోడునే అన్నావు నేను మయమరిచిపోయాను..
తొలిజామున నన్ను వీడలేక వెళ్ళుతున్నావని నీతడిక౦టి నీ మనస్సు చదివాను...
పగలు గడిచి౦ది,రేయి కరిగిపోతు౦ది నీ కోస౦ ఘడియలు,విఘడియలు లెక్కిస్తూన్నాను...
నీ కోస౦ చేసుకున్న అల౦కరణ నన్ను వెక్కిరిస్తున్నా,నీ మీద నమ్మక౦తో వేచి చూస్తున్నాను...
ఊరిపోలిమేరలో నీ పాదల స్పర్శ కి తుళ్ళిపడి లేచాను,వీధి మలుపున నీ అలికిడికి నాకే తెలియక తలుపు తెరిచాను

...సుభద్ర కనుమూరిమేలి ముసుగులోన దాగిన మూగ భావనలా .....?
కనుపాపల కవ్వించే వలపు తలపుల పులకింతలా....?
చంద్రవదన సోయగాల సంపెంగ నాసికా గుబాళింపులా..?

ఎవరి కోసమీ ఎదురు చూపులు ?

ఊహల ఊసుల విహరించే అతి లోక సౌందర్యమా !
హృదయ రాగాల పల్లకిని మోసే భావ చిత్రమా !
మధుర స్వరాలాపనల దాచి పెట్టే అరుణారుణ అధరామృత మాధుర్యమా !

ఎవరు నీవు .....?

పద్మకళఇక నాకైతే కవితలు రావుగాని కొన్ని మాటలు...

ప్రియా ఇది నీకు సమంజసమా? పెళ్లి అయిన పదిరోజులకే నన్ను వదిలి పొరుగూరు వెళ్లావు. నువ్వు చెప్పిన సమయం దాటి పది నిమిషాలైంది. ఇంకా రావేంటి? ఇంట్లో అందరూ ఉన్నా నువ్వు లేక ఒంటరినయ్యాను. గడియారం ముల్లు కూడా బద్ధకంగా కదులుతుంది. పదిరోజుల క్రిందవరకు నువ్వెవరో?నేనేవరో? ఈ మాంగల్యబంధం ఎంత విచిత్రమైనది. మనిద్దరిని ఇంత దగ్గర చేసింది. నువ్వే నా లోకం అనిపిస్తుంది. అమ్మావాళ్లు కూడా గుర్తురానంతగా నన్ను ప్రేమిస్తున్నావు, లాలిస్తున్నావు. ఇంత త్వరగా ఒకరినొకరు విడిచి ఉండలేకున్నాం. మరి మావాళ్లని వదిలి వచ్చినా నాకు బెంగ లేదేలనో? ప్రతిక్షణం నీ సాంగత్యం కోరుకుంటున్న ఈ మనసుని ఎలా బుజ్జగించను. కాలం కదలదు, కాలు నిలవదు. మనసు నీ కొరకు తపిస్తుంది. చూపు గుమ్మంవైపే ఉంటుంది. ఎప్పుడెప్పుడు నిను చూస్తానా అని కళ్లు కాయలు కాచాయి. ఎన్నో ఊసులు చెప్పాలని ఉంది.

Posted by జ్యోతి May 28, 2010

Subscribe here