BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...

లక్నో అనగానే అందరికీ గుర్తొచ్చేది ఖవాలీలు, వాహ్వాలు, నాట్యాలు, గుర్రపు బగ్గీలు, హుక్కాలు వెరసి ఒక అందమైన సాంస్కృతిక వాతావరణం. అంతే గాక లక్నో అనగానే వేశ్యలు వారి నృత్య విలాసాలకు ప్రసిద్ధి అంటారు. అటువంటి లక్నో నగరం, వేశ్యాజీవితాన్ని నేపధ్యంగా తీసుకొని 1981 లో ముజఫ్ఫర్ అలీ నిర్మించిన కళాత్మక దృశ్యకావ్యం "ఉమ్రావ్ జాన్" చిత్రం ఇప్పటికీ రసహృదయుల మనసుల్లో నిలిచిపోయింది. ఈ చిత్రంలో ఆనాటి సామాజిక స్థితిగతులు, వేశ్యా సంస్కృతి కళ్లకు కట్టినట్టుగా చిత్రించారు. వేశ్యా జీవితాలు ప్రధాన కథావస్తువుగా గతంలో కొన్ని చిత్రాలు వచ్చాయి. అందులో మోఘల్ ఎ అజామ్, గమన్ , మండి మొదలైనవి. ఆయా చిత్రాల్లో స్త్రీని విలాసవంతమైన వస్తువుగానే తప్ప పవిత్ర ప్రేమకు, సహధర్మచారిని పాత్రకు పనికిరానిదిగా చూపించారు. అది వాస్తవమే కదా. లక్నోలోని అప్పటి వేశ్యలు శరీరాన్ని అమ్ముకునే స్త్రీలు మాత్రమే కాదు. సంగీత , సాహిత్యాలలో నిపుణులై ధనవంతులైన పురుషులను ఆకట్టుకునేవారు.


ఉమ్రావ్ జాన్ చిత్రం మిర్జా హదీ రుస్వా రచించిన “ఉమ్రావ్ జాన్ అదా” అనే నవల ఆధారంగా నిర్మించబడింది. అమీరన్ అనే అమ్మాయిని చిన్నపుడు పక్కింటి వ్యక్తి ఎత్తుకెళ్లి లక్నోలోని వేశ్యాగృహంలో అమ్మేస్తాడు. ఆ వేశ్యాగృహం యజమాని ఆ అమ్మాయిని ఉమ్రావ్ అని పేరు మార్చి చదువు, సంగీతం, నృత్యం నేర్పిస్తుంది. అలాగే తన అందంతో మగవారిని ఎలా అకర్శించాలో కూడా చిన్నప్పటినుండే ఉమ్రావ్ కి నేర్పబడుతుంది. ఉమ్రావ్ పెరిగి పెద్దదై అందమైన యువతిగా తన నృత్య, గానాలతో అందరినీ ఆకర్షిస్తుంది అలరిస్తుంది. నవాబ్ సుల్తాన్ , ఉమ్రావ్ జాన్ ప్రేమించుకుంటారు. కాని నవాబ్ ఆమెని పెళ్లి చేసుకొలేడు. కుటుంబ మర్యాద కోసం వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. దానితో ఉమ్రావ్ కృంగిపోతుంది .ఆ తర్వాత ఆమె జీవితంలోకి గజదొంగ ఫైజ్ ప్రవేశిస్తాడు. అతనితో పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఈ నాట్య వృత్తిని వదిలేసి అందరు స్త్రీలలా గౌరవప్రదమైన గృహిణిగా గడపాలనుకుంటుంది. కాని పోలీసులు ఆ గజదొంగని కాల్చి చంపుతారు. దానితో గత్యంతరం లేక తిరిగి తన వృత్తికే రాకతప్పదు. చిన్ననాటి మిత్రుడు గౌహర్ మిర్జా సాన్నిహిత్యంలో మనఃశాంతి, రక్షణని పొందుతుంది. ఈ అనుబంధాల మధ్య ఉమ్రావ్ జాన్ ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా ఎదుగుతుంది. బ్రిటీషువారి ఆక్రమణతో లక్నోవాసులందరూ పారిపోవాల్సి వస్తుంది. అలా పరిపోయిన ఉమ్రావ్ జాన్ బృందం ఒక గ్రామంలో ఆగుతారు. అది తన ఊరేనని, చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటుంది ఉమ్రావ్. తన తల్లి, సోదరులను కలుసుకుంటుంది. చనిపోయిందనుకున్న వ్యక్తి తిరిగిరావడంతో అందరూ సంతోషిస్తారు కాని వేశ్య ఐన కారణంగా ఆమెని తమ కుటుంబంలోకి ఆహ్వానించలేము, అంగీకరించలేమంటారు. హతాశురాలైన ఉమ్రావ్ జాన్ వేరే దారి లేక లక్నో చేరుకుంటుంది. అక్కడ శిథిలమైన వేశ్యావాటిక కనిపిస్తుంది. చివరకు ఆమెకు మిగిలింది ఆమె సంగీతం, కవిత్వం, వృత్తి..1981 లో విడుదలైన ఈ చిత్రం రేఖ అత్యున్నత నటనా వైదుష్యాన్ని ప్రదర్శించింది. సౌందర్యమూ, సున్నితత్వమూ కలబోసిన ఉమ్రావ్ జాన్ చిన్నప్పటినుండి ఎదుర్కొన్న పరిస్థితులు , ఆమె ఎదుర్కొన్న సమస్యలు, విభిన్నమైన వ్యక్తుల ప్రభావం. వీటివల్ల నేర్చుకున్న పాఠాలతో తనను తాను మెరుగుపరుచుకుని మహోన్నత వ్యక్తిగా ఎదుగుతుంది. ప్రతీ ఆడపిల్లలా జీవితం గడపాలి. పురుషుడి ప్రేమలో మునిగిపోవాలి. ఈ వేశ్యావృత్తి వదిలి పెళ్లి చేసుకుని అందమైన జీవితం గడపాలని పడే ఆత్రుత, ఆ ఆశలు భగ్నమైనపుడు పడే ఆవేదనని ఉమ్రావ్ జాన్ గా ప్రతిభావంతంగా నటించింది. అసలు ఉమ్రావ్ జాన్ అంటేనే రేఖ అన్నట్టు చిత్రం మొత్తం ఆమే నిండిపోయింది. నటన ఐనా, నాట్యమైనా ఆమెకు ఆమే సాటి అని ఒప్పుకోక తప్పదు. రేఖ నటనకు ఆశా భోస్లే గానం తోడుకాగా, ఒక్కో పాటని మరచిపొలేని ఆణిముత్యంలా మలిచారు సంగీత దర్శకులు ఖయ్యాం. ఆ పాటలు ఇప్పటికీ నిత్యనూతనాలే.


Posted by జ్యోతి May 29, 2010

Subscribe here