BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...
' యుగంధర్ ' - ఈ పేరు ఒకప్పుడు ఆంధ్రదేశంలో బాగా ప్రచారంలో వున్న పేరు. ఆబాలగోపాలాన్ని వుర్రూతలూగించిన పేరు. సామాన్యులే కాదు ఎందరో పెద్దలు, మేధావులు కూడా అమితంగా ఇష్టపడ్డ పేరు. ఎన్నో తెలుగు కుటుంబాల్లో సభ్యుడిగా, ఎందరికో రోల్ మోడల్ గా మారిపోయిన పేరు. కొంతకాలం పాటు తెలుగువారికి ఆ ' యుగంధర్ ' తో విడదీయరాని అనుబంధం ఏర్పడిందంటే అతిశయోక్తి కాదు.

ఇంతకీ ఎవరీ ' యుగంధర్ ' ?

' యుగంధర్ ' పుస్తకాల్లోని ఒక పాత్ర. అదీ ఒక డిటెక్టివ్ పాత్ర. పుస్తకాల్లో పాత్రకు ఇంత ప్రాముఖ్యతా అని ఇప్పటి తరం ఆశ్చర్యపోవచ్చు. కానీ అప్పటి తరానికి ఆడా, మగా తేడా లేకుండా అందరికీ ఆ పాత్ర గుర్తుండే వుంటుంది. వాళ్ళకి ఆ ప్రాముఖ్యత ఏమిటో అనుభవ పూర్వకంగా తెలిసే వుంటుంది. ఆ రోజుల్లో అలాంటి వ్యక్తి నిజంగానే వున్నాడనే భ్రమలో వుండేవారు పాఠకులు. అంతగా ప్రభావితం చేసిన ఆ పాత్ర సృష్టికర్త కొమ్మూరి సాంబశివరావు గారు. అపరాధ పరిశోధన కోసం యుగంధర్ వేసే ఎత్తుగడలు, అవలంబించే వ్యూహాలు, చేసే సాహసాల ముందు జేమ్స్ బాండ్ బలాదూర్.


అప్పటి రోజుల్లో ప్రతి ఇంట్లోను బహిరంగంగానో, చాటుగానో ఈ పుస్తకాలు చదవని వారు లేరు. ఆడా మగా తేడా లేకుండా అందరూ చదివేవారు. అనువైన పుస్తక పరిమాణం, అందుబాటు ధర ఆ పుస్తకాల ప్రత్యేకత. అంతేకాదు ఆ పుస్తకాలు రోజువారీ అద్దెకు కూడా దొరికేవి. కిళ్ళీ బడ్డీల్లో తోరణాలుగా కట్టి అమ్మేవారు. పేట పేటకీ ఒక అద్దె పుస్తకాల దుకాణం వుండేది. వాటిలో ముప్పాతిక భాగం డిటెక్టివ్ పుస్తకాలే ! అందులోనూ కొమ్మూరి గారి పుస్తకాలే ఎక్కువ భాగం ఆక్రమించేవి. 

సంచలన రచయిత, చలం గారి తమ్ముడి కొడుకు, ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావు గారికి బావ అయిన కొమ్మూరి సాంబశివరావు గారు తెనాలిలో జన్మించారు. చాలా చిన్నవయసు లోనే అప్పటి మద్రాసు నగరం చేరి ఆంధ్రప్రభ, తెలుగు సినిమా పత్రిక మొదలైన వాటిలో పనిచేశారు. తర్వాత స్వంతంగా డిటెక్టివ్ రచనలకు శ్రీకారం చుట్టారు. తండ్రిగారి ఆధ్వర్యంలో స్వంత ప్రచురణ సంస్థను నడిపారు. కొన్ని సాంఘిక నవలలు, కథలు రాసినా ఆయనకు ఎనలేని పేరు, డబ్బు తెచ్చినవి మాత్రం డిటెక్టివ్ రచనలే !  1960 నాటికే మద్రాసులో విశాలమైన ఇల్లు, కారు కలిగి వున్న రచయిత కొమ్మూరి.

ఇంతగా తెలుగు పాఠకలోకాన్ని ప్రభావితం చేసిన ' యుగంధర్ ' అనే పేరు ఆ పాత్రకు ఎలా వచ్చిందో తెలుసుకుంటే......... జేమ్స్ బాండ్ 60 వ దశకంలో వస్తే మన యుగంధర్ 50 వ దశకంలోనే వచ్చేశాడు. సుమారు 1950 ప్రాంతంలో కొమ్మూరి గారు ' లక్షాధికారి హత్య ' అనే డిటెక్టివ్ నవల రాయడానికి ఉపక్రమించారు. అదే ఆయన మొదటి డిటెక్టివ్ నవల. అప్పటికే కొన్ని రచనల ద్వారా పాఠకలోకానికి పరిచయం. అప్పటికి ఆయనకు పాతిక సంవత్సరాలుంటాయేమో !

మద్రాసులో తెలుగు చిత్ర పరిశ్రమ వెలుగుతున్న రోజుల్లో టి. నగర్ లోని పానగల్ పార్క్ ప్రతి రోజూ సాయింత్రం సినిమా పక్షులతో కళ కళలాడేది. అప్పట్లో పాండీబజార్లో వున్న చెట్లకు పక్షులెన్ని వేలాడుతాయో, ఆ ఫుట్ పాత్ ల మీదా, పానగల్ పార్క్ లోను అంతమంది సినిమా వాళ్ళు వుంటారని చెప్పుకునేవాళ్ళు. బాయ్స్ దగ్గరనుండి లబ్ద ప్రతిష్టుల వరకూ ఆ పార్క్ లో సాయింత్రాలు గడిపేవారు. ఎన్నో సినిమాలకు కథలు అక్కడే పుట్టుకొచ్చేవి. చాలా సినిమాలకు బారసాల అక్కడే జరిగేవి. మన ' యుగంధర్ ' కి కూడా అక్కడే బారసాల జరిగింది.

పానగల్ పార్క్ లో క్రమం తప్పకుండా హాజరయ్యే ప్రముఖుల్లో అప్పటి ప్రముఖ రచయిత మల్లాది రామకృష్ణశాస్త్రి గారు ఒకరు. ఒకరోజు ఆయన తన శిష్యగణంతో అక్కడ కొలువుదీరి వుండగా కొమ్మూరి సాంబశివరావు గారు అక్కడికి వెళ్ళారు. మల్లాది వారి కొలువులో చేరారు. ' లక్షాధికారి హత్య ' అనే పేరుతో డిటెక్టివ్ నవలా రచన ప్రారంభించానని చెప్పి ఆ నవలలో డిటెక్టివ్ పాత్రకు పేరేం పెట్టాలో పాలుపోవడంలేదని ఆయన దగ్గర తన గోడు వెళ్ళబోసుకున్నారు.

మల్లాదివారు ఈ విషయం గురించి పెద్దగా ఆలోచించలేదు. ఎక్కువ సమయం తీసుకోలేదు.
" దానికి అంత ఆలోచన ఎందుకు ? మనకు డిటెక్టివ్ యుగంధరుడు వున్నాడుగా ! " అన్నారు.

ఎవరా యుగంధరుడు ?
కాకతీయ సామ్రాజ్యాన్నేలిన ప్రతాపరుద్రుని మంత్రి. ప్రతాపరుద్రుని బంధించినపుడు తన శక్తియుక్తులన్నీ ఆచూకీ తెలుసుకోవడం కోసం యుగంధరుడు మారు వేషంలో ఢిల్లీ వీధుల్లో ' ఢిల్లీ సుల్తాన్ పట్టుకు పోతాన్ '   అని అరుస్తూ తిరుగుతూ విషయ సేకరణ చేస్తాడు. మన చరిత్రలో వున్న గొప్ప గూఢచారి యుగంధరుడు. అతని పేరే ఆ పాత్రకు పెట్టడం బాగుంటుండని మల్లాదివారు కొమ్మూరివారికి సూచించారు. అలా బారసాల జరుపుకున్న ' యుగంధర్ ' సుమారు పాతికేళ్ళపాటు తెలుగువారిళ్ళల్లో తిష్ట వేసాడు.


కొన్ని దశాబ్దాల క్రింద డిటెక్టివ్ రచనలకు విపరీతమైన క్రేజ్ కలిగించిన డిటెక్టివ్ యుగంధర్, సృష్టికర్త కొమ్మూరిగారి గురించి అమూల్యమైన వ్యాసాన్ని అందించిన శిరాకదంబం బ్లాగర్ SRRaoగారికి ధన్యవాదాలు..

Posted by జ్యోతి Jun 8, 2010

Subscribe here