మన జీవితంలో ఆశ నిరాశలు, సుఖ దుఖాలు సర్వసాధారణం. అప్పుడప్పుడు కాస్త వెసులుబాటుగా ఉంటుందని సినిమాలకు వెళ్తాం. మనం చూసే సినిమాలన్నీ సందేశాలు ఇచ్చేవి, వినోదాన్ని ఇచ్చేవి మాత్రమే కాదు. మనసారా నవ్వుకునేలా చేసే హాస్యరసప్రధానమైన చిత్రాలెన్నో వచ్చాయి. ఈనాటి సినిమాల్లోని హస్యం అసంబద్ధంగా, వెకిలిగా ఉంటుంది. ప్రతీ కథలో హాస్యాన్ని బలవంతంగ జొప్పిస్తున్నారేమో అనిపిస్తుంది. కాని కొన్ని హస్య చిత్రాలు ఎప్పటికీ మనను నవ్విస్తూనే ఉంటాయి. తెలుగు సినిమాల్లో హాస్యానికి పెద్దపీట వేసి, చిత్రం మొత్తం హాస్యప్రధానంగానే నిర్మించిన ఘనత దర్శకుడు జంధ్యాలకే దక్కుతుంది. అడవిరాముడు, డ్రైవర్ రాముడు వంటి మాస్ సినిమాలకు మాటలు రాసిన జంధ్యాల హాస్యం కూడా తనకు పిల్లలాటే అని సున్నితమైన హాస్యంతో ఎన్నో సినిమాలు నిర్మించారు. అతని సినిమాలన్నింటిలో కామెడీకి పరాకాష్ట లాంటిది 1987 లో దర్శకత్వం వహించిన "అహా నా పెళ్లంట" అని చెప్పవచ్చు.
సత్యనారాయణ (నూతన్ ప్రసాద్) శ్రీమంతుడు . భార్య చనిపోయినా కొడుకు కృష్ణమూర్తి (రాజేంద్రప్రసాద్) కోసం మళ్లీ పెళ్లి చేసుకోకుండా ఉంటాడు. ప్రేమ వివాహాలంటే తండ్రికి ఇష్టం లేకున్నా రాజేంద్రప్రసాద్ తన స్నేహితుడి పెళ్లిలో చూసిన పద్మ (రజని) ని ప్రేమిస్తాడు. ప్రేమ పెళ్లి వద్దని ఎంత చెప్పినా కొడుకు వినడు. పైగా పద్మ వెంకటాపురంలో పిసినారుల్లో మహా పిసినారి లక్ష్మీపతి కూతురని తెలుసుకుని అస్సలు వద్దంటాడు నూతన్ ప్రసాద్. ఐనా కూడా ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని మొండిపట్టు పట్టిన కొడుకుకు మూడునెలల్లొ తాను లక్షాధికారి కొడుకును అని చెప్పకుండా ఆ లక్ష్మీపతిని ఒప్పించమంటాడు. సరే అని వెంకటాపురానికి బయలుదేరుతాడు. లక్ష్మీపతి నౌకరు సాయంతో అతని ఇంట్లోనే అద్దెకు దిగుతాడు. ఇక అక్కడినుండి మొదలవుతుంది నవ్వులవాన. ఎక్కడా ఉధృతి తగ్గకుండా సినిమా ఆఖరు వరకు మనను నవ్విస్తూనే ఉంటుంది. పిసినారి మామకు అతనికి తెలియని మరిన్ని పిసినారి సలహాలు చెప్తూ అతనిని మించిన పిసినారిగా తనను తాను పరిచయం చేసుకుంటాడు. ఇక్కడ మరో వ్యక్తి గురించి చెప్పకుంటే ఈ సినిమా కథ పూర్తి కాదు. అతనే అరగుండుగా నటించిన బ్రహ్మానందం. ఈ చిత్రంతో తెలుగు చిత్రసీమకు ఒక మంచి హాస్యనటున్ని అందజేసారు జంధ్యాల. రాజేంద్రప్రసాద్ ఎత్తులు, జిత్తులు, బ్రహ్మానందం అవస్థలతో, లక్ష్మీపతి తనకంటే పిసినారి ఐన కృష్ణమూర్తిని తన అల్లుడిగా చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. సినిమా చివరలో జరిగిన ట్విస్టుతో మారిన లక్ష్మీపతి తన పిసినారితనం వదిలేసి దానధర్మాలు చేస్తాడు.
ఈ సినిమా పేరు వినగానే ప్రతీవారి పెదవులపై మందహాసం రాకమానదు. వెంటనే కోటశ్రీనివాసరావు పిసినారి చేష్టలు, తన నౌకరు బ్రహ్మానందాన్ని చీటికి మాటికి జీతం కోసేయడం, అప్పుడతడు కడుపు మండి తిట్టే తిట్లూ, (శవాల మీద పైసలేరుకునే పీనాసి యెదవా, పోతావ్ రొరే, నాశనమైపోతావ్) అతని నటన, నత్తితో పడే పాట్లు అద్భుతం. రాజేంద్రప్రసాద్ చెప్పిన పొదుపు చిట్కాలు కోటకు తెగ నచ్చేసి వెంటనే అమలు చేస్తుంటాడు. ఉన్నది చాలక ఇంకా ఆదాయం పొందడానికి లక్ష్మీపతి రాత్రుళ్లు ముసుగేసుకుని బస్ స్టాండులో టీ అమ్మడం అది చూసి అతని బామ్మర్ది కలెక్టర్ కావలసినవాడు పిచ్చివాడైపోవడం, వంట కోసం వీధుల్లో పారేసిన అగ్గిపుల్లలు ఏరుకోవడం, కోడిని వేలాడదీసి ఉత్త అన్నం తింటూ కోడికూర తింటున్నట్టు ఊహించుకుని తృప్తి పడడం, ఐనదానికి కానిదానికీ పనివాడి జీతం కోసేయడం వగైరా చెప్పాలంటె ఎన్నో సీన్లు నవ్వులజల్లును కురిపించాయి.