తెలుగువారందరూ మరువలేని మహానటి సావిత్రి . ఆమె నటనాకౌశలం ఒక అపూర్వ గ్రంధాలయం. గుంటూరు జిల్లా చిర్రావూరు గ్రామంలో డిసెంబరు 6న గురవయ్య, సుభద్రమ్మలకు జన్మించారు. నాట్యంలోనూ, సంగీతంలోనూ ప్రవీణ్యురాలై, ఎన్నో ప్రదర్శనలిచ్చారు. పెదనాన్న ప్రోద్బలంతో సినిమా రంగం వైపు దృష్టి సారించి ఎన్నోకష్టాలకోర్చి, తిరుగులేని అభినేత్రి గా పేరు పొందారు.
తెలుగు వారు మరచిపోలేని పాత్ర సావిత్రి నటించిన "దేవదాసు"లోని పారు. అప్పటికీ,ఇఫ్పటికీ వన్నె తరగని చిత్రమది. అలాగే "మాయాబజార్"లోని శశిరేఖ పాత్ర. ఇప్పటికీ "అహనా పెళ్ళంట...." పాటని ఆ సన్నివేశాన్ని ఎవరూ మరువలేరు . ఆ చిత్రంలో చిలిపి చూపులతో, పెదవి కదలికలతో, తన నటనతో ఎందరినో మంత్రముగ్ధులను చేశారు ఆమె. "నర్తనశాల", "శ్రీకృష్ణపాండవీయం", "సుమంగళి", "నాదీ ఆడజన్మే", "నవరాత్రి" ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చిత్రాలు ఆమె నటనాకౌశలానికి దీపికలు. "దొంగరాముడు", "తోడికోడళ్ళు", "అభిమానం"," మురిపించే మువ్వలు (1960)", "మంచిమనసులు(1961)", "డా. చక్రవర్తి (1964)", "దేవత(1965)", "మనసే మందిరం (1971)"... వంటి చిత్రాలు ఆమె నటనకి మైలు రాళ్ళు. తెలుగు తమిళ, హిందీ చిత్రాలన్నిటిలో కలిపి 318 సినిమాలలో నటించారు. హిందీలో "బహుత్ దిన్ హుమై", "ఘర్ బసాకే దేఖో", "బలరామ్ శ్రీకృష్ణ", "గంగాకి లహరే" మొదలైన చిత్రాలు చేశారు.
తెరపైన, తెర వెనుక కూడా అనేక పాత్రలతో అశేష ప్రజానీకాన్ని అలరించిన సావిత్రి తెలుగు సినీ సామ్రాజ్ఞి. సినీ జీవితంలో అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినా, నిజ జీవితంలో అతిఘోరంగా విఫలమయ్యారు. ఆ బాధలో తాగుడు,మత్తుపదార్థాలకు అలవాటు పడి ఆరోగ్యం చెడి , అప్పులపాలై, అతి దయనీయ పరిస్థితుల్లో, చిన్నవయసులోనే మృత్యువుతో పోరాడిన ఆమె జీవిత చరమాంకం అందరికీ ఒక పాఠం. ఆమె నటజీవితం ఎందరో నటీమణులకి మార్గదర్శకం.
సావిత్రికి క్రికెట్ అన్నా, ఛెస్ అటలన్నా మిక్కిలి ప్రీతి. ఆమెకి ఎడమచేతి వాటం ఎక్కువ. తన పిల్లలని ప్రేమతో చూసుకునేవారు. దానధర్మాల విషయంలో అమెది ఎముకలేని చెయ్యి అని అందరూ ఒప్పుకునేవారు. ఒకసారి సావిత్రి నిండుగా నగలతో అలంకరించుకుని ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి ని కలిసేందుకు వెళ్ళి, అక్కడ మొత్తం నగలన్నిటినీ వలిచి ప్రధానమంత్రి సహాయ నిధికి దానమిచ్చేసారు.
అటువంటి మహానటికి Durga Dingari ఇస్తున్న సుమధుర నీరాజనం. ఈ కార్యక్రమం దుర్గ తెలుగువన్ కోసం చేసారు. నా అభ్యర్తన మేరకు BG కోసం ఈ ఆణిముత్యాన్ని అందించారు. థాంక్స్ దుర్గా..