BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...


రియాలిటీ షోలలో జనాల జడ్జిమెంటుఈరోజు దాదాపు అన్ని చానెల్స్ లో రియాలిటీ షోలు జరుగుతున్నాయి. పాటలు, ఆటలు అని. నిజంగా అవి ఆ వ్యక్తుల అసలు టాలెంట్ ని వెలికి తీస్తున్నాయా? పిల్లల షోలు చూస్తుంటే సంతోషం కలగడం ఏమో కాని కోపం, బాధ , ఆవేశం వస్తుంది. ఆ చిన్నారులను ఎంతగా హింసిస్తున్నారో అని. తల్లితండ్రులు, నిర్వాహకులు, న్యాయనిర్ణేతలు కలిసి ఆ పిల్లల బాల్యాన్ని ,అమాయకత్వాన్ని కలుషితం చేస్తున్నారు. అలాగే న్యాయనిర్ణేతలు అంటే. అందరివీ నాటకాలే. అనవసరపు గొడవలు, తిట్టుకోవడాలు, ఏడ్వడాలు . అసలు ఇదంతా నిజమా?నటనా? అని అందరికీ అనుమానమే. ప్రేక్షకులే కదా ఫూల్స్ అయ్యేది. ఇటువంటి రియాలిటీ షోల గురించి ఒక మహిళ ఆవేదన . ఇది అందరిదీను..


ఈ మధ్య టీవి చానల్స్ బాగా పెరిగిపోయాయి. ఏడుపుగొట్టు సీరియల్స్, డబ్బింగ్ సినిమాలు, కాకుండా వేరే ఏదైనా కొత్తగా జనాలకి హత్తుకునేలా, కొంతలో కొంత సాధారణ ప్రజలలో ఉన్న నైపుణ్యాలు వెలికి తీసి ప్రపంచానికి చాటి చెప్పేలా చేసిన ప్రయోగం "రియాలిటి షో". సాధారణ పౌరులు / బాలలు లో దాగి ఉన్న గాన/నాట్య/నటన ఇత్యాది కళల కౌశలాన్ని వెలికి తీసి మరింత ఉత్సాహపరచాలి అనేది ఈ షోల ప్రాధమిక ఉద్దేశ్యం. మొదట్లో కొంత కాలం బాగానే సాగింది. మరి చానల్స్ బాగా పెరిగిపోయి టి.ఆర్.పీ. రేటింగుల్లో ఈ షోల ప్రాభవం అన్ని చానల్స్ వారు గుర్తించి రక రకాల వైవిధ్యభరితమైన కార్యక్రమాలు చేపడుతూ జనానికి మరింత దగ్గర కావాలి అనే తపనలో పడి అసలు కార్యక్రమం ఉద్దేశ్యాన్ని విస్మరిస్తున్నారు. గత కొంతకాలం గా నేను గమనించిన సత్యం ఏంటంటే, ఈ తరహా కార్యక్రమాలు ఆయా కళలలో ప్రముఖులచే తీర్పు ఇవ్వబడినంత వరకు బాగానే సాగాయి. ఈమధ్య కాలంలో పుట్టిన కొత్త తెలివి ఏంటంటే వీటి తీర్పు ప్రేక్షకుల చేతిలో పెట్టడం. కార్యక్రమంలో నామ మాత్రపు న్యాయనిర్ణేతలు ఉంటారు, అప్పటికప్పుడు మంచి చెడు పరిశీలించి అభ్యర్దులని మందలించడం/హెచ్చరించడం/భుజం తట్టడం వీరి పని. ఇక కార్యక్రమం అయిపోగానే ఓటింగ్ లైన్లు తెరుస్తారు. నిర్ణీత సమయం లోగా ఏ అభ్యర్ధికి ఎక్కువ ఓట్లు (ఫోన్ మేస్సేజీలు) పడతాయో వాడు విజేత, ఎవరికీ అతి తక్కువ వోట్లు పడతాయో వారు ఆ వారం కార్యక్రమం నుంచి వైదొలుగుతారు.
సరే ఇది కూడా బానే ఉందిగా అంటారా? అస్సలు బాగోలేదు... ఇందులోనే ఉంది తిరకాసు. ప్రేక్షకులు వేసే ఈ ఓటు (పంపే మెస్సేజ్) కేవలం ఆ అభ్యర్ధి నైపుణ్యం మీద ఆధారపడి వేయడంలేదు. ఎలాగంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక పాటల పోటీ తీసుకుందాం, ఏ పేరొందిన గాయకున్నో, సంగీత దర్శకుడినో న్యాయనిర్ణేతగా పెడితే వచ్చే ఫలితం, కేవలం ప్రేక్షకుల ఓటింగ్ వలన వచ్చిన ఫలితం పోల్చి చూడండి. ఇక్కడ కనిపిస్తుంది అసలు తేడా. ఈ ఓటింగ్ లో అభ్యర్ధి ఆడపిల్ల అయితే ఆమె అందచందాలు, మగపిల్లాడు అయితే ప్రాంతీయత లాంటివి ప్రభావం చూపుతున్నాయి. ఇది నేను ఏదో ఒకటి రెండు షోలు చూసి కాదు, గత ఏడాదిగా, నాలుగు అయిదు చానల్స్ గమనిస్తూ చెపుతున్న విషయం. నేను విదేశంలో నివాసం కాబట్టి నాకు ఓటు హక్కు, నా అభిప్రాయానికి ఓ విలువా ఎలాగూ లేదు, తటస్థంగా ఉండి కార్యక్రమాలు చూసిన అనుభవం మీద మాత్రమె చెపుతున్నాను. మీరు కూడా గమనించి చూడండి, ప్రతి వారం బహిష్కరణకు గురి అవుతూ ఉన్న వారు, తక్కిన వారిలో ఒకరిద్దరి కన్నా బాగానే టాలెంట్ ఉన్నవారు అవుతారు. ఒక్కోసారి జనం తీర్పు మరీ అన్యాయంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రదర్శనకి విచ్చేసిన ప్రముఖుల పొగడ్తలు అందుకున్న అభ్యర్ధికి ఆ తరువాతి వారమే మంగళం పాడుతారు ప్రేక్షకులు.

ఇంతకీ ఈ నా భావాలన్నీ పనిగట్టుకుని ఇప్పుడే ఎందుకు చెపుతున్నాను అంటే, ఈ సారి "ఇండియన్ ఐడోల్ - 5"నీ, అందులో ప్రజల తీర్పుని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాను కాబట్టి. పదమూడు మంది అభ్యర్ధులతో మొదలయిన ఈ విడత కార్యక్రమంలో ప్రేక్షకుల తీర్పుతో ఒక్కటి రెండు సార్లు మాత్రమె ఏకీభవించాను నేను. ముఖ్యంగా ఒక అభ్యర్ధి (ఆడపిల్ల), ముంబాయి వాసి, ఈమె ప్రదర్శన ఏ రోజు కూడా న్యాయనిర్ణేతలని సంతృప్తి పరచలేదు. కనీసం తన తోటి పోటీదారులని కూడా. పన్నెండు మంది అభ్యర్దులని ఈమె పై అభిప్రాయం అడిగితె పది మంది ఈమెకి వ్యతిరేకత తెలిపారు. స్వరం బాగానే ఉంటుంది కానీ, లయ జ్ఞానం అస్సలు లేదు. మరి ఈ అమ్మాయి గత ఏడు వారాల నుంచి మంచి ఓట్లు సంపాదిస్తూ సురక్షితంగా ఉంది.... ఎలా???? నాకు కళ్ళకి కనిపించింది మాత్రం ఒక్కటి.. ఈ అమ్మాయి మిగతా అందరిలోనూ అందగత్తె. ఇది ఈమె ఉదాహరణ, అయితే ఇంకొకరి గురించి చెపుతా..... అర్పిత అనే అమ్మాయి, కలకత్తా నివాసి, చక్కని స్వరం, మంచి లయ జ్ఞానం, అన్ని రకాల పాటలు అలవోకగా పాడేసే నైపుణ్యం ఈమె సొంతం. ఈమెకి రెండు వారాల క్రితం ఉద్వాసన పలికారు, ఎందుకు అంటే మళ్ళీ నా బుర్రకి తట్టిన కారణం ఈమె కొంత బొద్దుగా, రంగు తక్కువగా, పొట్టిగా ఉంటుంది. ఏవో చిల్లర మల్లర ప్రోగ్రామ్స్ స్థానిక స్థాయిలో జరిగేవి అంటే పెద్దగా పట్టించుకోనవసరం లేదు. ఇవి ఆ అభ్యర్దులకి జీవన్మరణ సమస్య, వారి బ్రతుకు తెరువుకి సంబంధించినవి. ఆడిషన్స్ కోసం తల్లి ఒంటి మీద బంగారం తెగనమ్మి ప్రయాణం ఖర్చులు ఇవ్వగా వచ్చిన అభ్యర్ధులు కొంతమంది అయితే, అసలు సంగీతం కోసం ఇల్లు వదిలి బయటకొచ్చి చిన్న చితకా పనులు చేసుకుంటూ సంగీతం నేర్చుకుని ఈ వేదికపై చేరిన కధలు కొందరివి. మరి ఇంత తపనతో, ఆశతో, భవిష్యత్ మీద కోటి ఆశలతో, కొండంత ఉత్సాహంతో వచ్చే వారికి ప్రేక్షకుల తీర్పు పేరుతొ జరిగే అన్యాయం ఎంత వరకు సమంజసం? ఏదో కంటికి ఇంపుగా కనిపించిన వారి పేరు టైపు చేసి గెలిపించేసిన జనానికి ఒరిగేదీ తరిగేదీ ఏమీ లేదు, చక్కటి నైపుణ్యం కలిగి ఉండి కూడా, ఇంత గొప్ప వేదికన వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోలేకపోయనే అని కుమిలిపోయి అఘాయిత్యాలకి పాల్పడే వారిని ఓదార్చేది ఎవరు?

తప్పు ఎక్కడ జరుగుతూ ఉంది. ప్రేక్షకుల చేతికి తీర్పు పగ్గాలు ఇచ్చేసిన చానల్స్ వారిదా? లేక స్వచ్చమైన కళను కళగా గుర్తించి నిస్పాక్షింగా తీర్పు ఇవ్వలేని ప్రజలదా? ఈ పద్ధతి ఎప్పుడు మారుతుంది? ప్రజలు కేవలం చెవులతో పాట విని/ కళ్ళతో డాన్స్ చూసి, మనసుతో ఓటు వేసే రోజు ఎప్పుడు వస్తుంది?

కల్యాణి..

Posted by జ్యోతి Jul 2, 2010

Subscribe here