This is a series on James Cameron's movies, and the technology he introduced in the movies. This is to be treated a tribute to that poineering legend. The series starts now
By గీతాచార్య
Prologue:
అవతార్ ఫ్లాప్ అయితే అసలు సినిమాలు తీయటం (కామెరాన్ కాదు) మానేయ వచ్చు. ఇది నేను సినిమా చూడటానికి రెండు రోజుల ముందన్న మాట. అవతల విన్న వాళ్ళు నవ్వారు.
*** *** ***
Chapter 0 మే నెలాఖరులో “నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విలా…” పాట విని గో గో గో (ఉరఫ్ పో పో పో) చూడాలనుకున్నాను. సినిమా వచ్చిందాకా ఎదురుజూస్తూనే ఉన్నాను. సినిమా వ(చ)చ్చింది. expectations అన్నీ గల్లంతు. పాట సినిమాని నిలబెట్టిందని కొందరు సినీ పే(ట్రియాట్)కేయులన్నా అది ఉత్తుత్తి సినిమానే, వంశీ ఏదో అలా అలా లాగించాడని అందరికీ (ఈవెన్ వంశీకి కూడా తెలిసిన విషయమే).
దరిదాపుల దసరా టైమ్. ఒకరోజు విజయవాడ మ్యూజిక్ వరల్డ్ లో ఉన్నా. నాతో పాటు వచ్చిన రవి అక్కడ హెడ్ఫోనులు పెట్టుకుని పాటలు వింటుండటం గమనించాను. సర్లే అని ఊరుకుని నాక్కావాల్సిన సీడీల్ని తీసుకుని బయటకొస్తున్నప్పుడు చెప్పాడు. ఏక్ నిరంజన్ పాటలు నెట్లో దొరికితే ట్రై చెయ్. బాగున్నాయి. ఏదో తలూపాను. ఇంటికొచ్చాక మర్చిపోయాను. పుదొవ్కిన్ ఫొటో కోసం వెతుకుతూ ఆయన సినిమాల గురించి యూట్యూబులో వెతుకుతుంటే అప్పుడు ఇందాకన వాడన్న సంగతి గుర్తొచ్చి రాగా ఓపెన్ చేసి ఏక్ నిరంజన్ పాటల కోసం చూశాను. ముందుగా మణి శర్మ మీద నమ్మకంతో (టైటిలు/హీరోగారి సోలో సాంగులు బాగా చేస్తాడని) ఏక్ నిరంజన్ అని ఉన్న పాట మీద క్లిక్కాను. అప్పుడు టైము రెండూ ఇరవై నాలుగు. నైటౌట్లో ఆ రాత్రంతా ఆ పాట మ్రోగుతూనే ఉంది. మధ్య మధ్యలో మిగతా పాటలు. అసలు సినిమా ఎనౌన్స్ చేయగానే మాంఛి అంచనాల మీదున్నా. పాటలు బాగుండటంతో ఇంకా అంచనాలు పెరిగాయి. (జనం కూడా ఆ టైటిల్ సాంగు వినే సినిమాకెళ్ళారని...) LOL. ఈ సినిమా కూడా తుస్సంది. పూరీ కూడా ముంచేశాడు. (సినిమా నాకు కొన్ని angles లో బాగా నచ్చింది. అది వేరే విషయం).
Chapter 1 "మీరు అనుకున్న విధమైన వ్యాఖ్య వీటిలో ఒక్కటైనా ఉందా? మీరు వ్రాసిన వ్యాసాన్ని ఒక్కరైనా మీరెలా అనుకున్నారో అలా అర్థం చేసుకున్న వాళ్ళెవరైనా ఉన్నారా?" ఆయన్ని అడిగాను. సమాధానం నాకు బాగానే గుర్తుంది.
అవతార్!
ప్రపంచం మొత్తం ఎదురుజూసిన సినిమా. లేదా అలా అని జనం అనుకున్న/లేదా మార్కెటింగు మాయాజాలం నమ్మించిన సినిమా. టైటానిక్ డైరెక్టర్ అద్భుత సృష్టి. ప్రచార సాధనాల హోరు. నేనూ, నా స్నేహితుడూ మాట్లాడుకుంటున్న సందర్భంలో మా మాటలు అవతార్ మీదకి వెళ్ళాయి. నేను అన్నా, "ఇన్నాళ్ళు కష్టపడి తీశాడు. సినిమా ఫ్లాపైతే ఇక మునిగినట్టే. ఇన్నాళ్ళ శ్రమా బూడిదలో పోసిన పన్నీరే"
మా వెనుక ఉన్న మా నాన్న గారన్న మాట... "ఆడుతుంది. ఇది కామెరాన్ సినిమా కదా." ఎప్పుడో టెర్మినేటర్ (నేను ఇంగ్లీషు సినిమాలు చూడటానికి గేట్లెత్తిన సినిమా) చూసిన నమ్మకం. టైటానిక్ తో పెరిగింది.
Chapter 2 పనామా, వెనిజులా, ప్యూర్టోరికో, మొదలైన లాటిన్ అమెరికన్ దేశాలు, ఆయిలుత్పత్తులున్న అర(డ)బ్బు దేశాలు, ఇంకేమన్నా చిన్నా చితకా దేశాలు. ఇవి దొరికితే అమెరికన్లు వదిలిపెట్టరని ప్రతీతి. ఏ రేంజిలో అంటే ఒక కన్సల్టెంటునక్కడికి పంపి, వాళ్ళ చేత ఫాల్స్ అంచనాలు జేయించి, అనవసరపు ప్రాజెక్ట్లకి ఉసిగొల్పి, అభివృద్ధి పేరుతో ఆ దేశాలకప్పులిచ్చి, వాళ్ళని వల్లో వేసుకుని...
లేదా తీవ్రవాదమనే బూచో, అణ్వాయుధాలనే మిథ్యా శతృవులను చూపెట్టి దాడులకు తెగబడి అక్కడ తమకు అనుకూలుడైన వ్యక్తిని డమ్మీగా కూచోబెట్టి...
దాదాపూ ఒక అర్థ శతాబ్దపు కథ ఇది. ఇప్పుడు మరో క్రొత్త దోపిడి మొదలైంది. ఈ కథలన్నీ మనకి చెప్పి పుస్తకాలు వ్రాసి, అయ్యో అప్పుడు నేను ఆ వ్యూహంలో పావుగా వాడుకోబడ్డాను. నన్ను క్షమించమని కూడా అడగను. కానీ ఎంతకాలమో ఆ దురాగతాలు జరుగ కూడదు. అందుకే ఆ రహస్యాలు నాతోనే అంతం కాకుండా బహిరంగ పరుస్తున్నాను (ఎంతైనా అమెరికన్లు అమెరికన్లే) అంటూ డబ్బు చేసుకునే... జనానికిచ్చే పెర్కులు. ;)
జేమ్స్ కామెరాన్ కథని కాస్త ముందుకు జరిపాడు. 2154 వ సంవత్సరం. భూమ్మీద వనరులు అయిపోయాయి. మనాసీయులు క్రొత్త గ్రహం ఉనికిని కనుక్కున్నారు. అక్కడ బ్రహ్మాండమైన వనరులున్నాయి. We are desperate to have a control on them.
Chapter 3 చాలా సాదా సీదా కథ. కానీ ఎంతో లోతైన ఆలోచనలున్నాయందులో. ఆ లాటినో/అరబ్బు జనాల బదులు పండోరా అనే అద్భుతమైన గ్రహాన్ని సృష్టించాడు. అందులో ఏలియన్లని కాస్త మనసున్న జీవుల్లా ఊహించుకుని, వాళ్ళకీ మమతలూ అనుబంధాలూ ఉంటాయని నమ్మాడు. ఒక మానవీయ కోణాన్ని ఆవిష్కరించాడు.
మరి మన మనుషులు? ఆ గ్రహమ్మీదున్న వనరుల మీద కన్నేశారు కదా. వారెలా ఆ లక్ష్యాన్ని చేరేందుకు ఒక ప్రణాలిక వేశారు. దానికోసం ఒకరిని అక్కడ జనాలతో కలిసిపోయేలా చేస్తే! ఆ మనిషక్కడ రహస్యాలను ఛేదించి వివరాలందజేస్తే... ఆ గ్రహం మీద ఉన్న నిధులనలా ఆ వ్యక్తి సాయంతో దక్కించుకోవచ్చనేదే ఆ ప్రణాళిక.
Chapter 4 ప్లాను సరే. దాన్ని అమలు జరిపే మార్గమేది? ఇతర గ్రహమంటే మనకనుకూలమైన వాతావరణ పరిస్థితులుండవు. తగినంత ఆక్సిజనుండదు. ఎలా? అక్కడికి పంపబడిన మనిషి మనుగడ ఎలా?
అందుకే ఆ గ్రహాన్ని తట్టుకోగలిగే శరీరాలను సృష్టించారు. వాటిలోకి బుద్ధి జీవుల్ని ప్రవేశ పెట్టారు. ఇక్కడ వారిని బజ్జోపెట్టి ఆ గ్రహమ్మీద క్రొంగొత్త శరీరాలతో పనిజేసేలా ప్రయోగం చేశారు. అలా వాళ్ళనుకున్న హిట్మాన్లని అక్కడకు పంపగలిగారు. మెదడు ద్వారా ఆపరేషన్. దీన్నే విఠలాచార్య పరకాయ ప్రవేశంగా చూపెట్టాడు. కామెరాన్ ఒక సైన్సు ప్రయోగంగా మార్చాడు.
Chapter 5 కామెరాన్ కథని సాదా సీదాగా ఊహించలేదు. ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా ఊహించాడు. అసలు నాదో ప్రశ్న! కామెరానీ సినిమా ఎందుకు తీశాడు? ఎవరికోసం తీశాడు?
జేమ్స్ కామెరాన్ ఈ సినిమాని కేవలం తన కోసమే తీశాడు. Yes. Only for himself. అందుకే తను అనుకున్న రీతిలో టెక్నాలజీ డెవలప్ కానంత వరకూ కథ మీద దృష్టి పెట్టాడు. సినిమాని ఆత్రంగా తీసేసి సొమ్ముజేసుకోవాలనుకోలేదు. కారణం... ప్రేక్షకులో, ఇతరులో ఇచ్చే జజ్‍మెంట్ కన్నా తన జజ్‍మెంట్ ముఖ్యం. తాను అనుకున్నది అనుకున్న రీతిలో తీశాడా లేదా అన్నది మాత్రమే తనకు ముఖ్యం.
ద టెర్మినేటర్... ఒకప్పుడు సంచలనం సృష్టించింది. అలా ఇలా కాదు. సైఫి లో ఒక లాండ్ మార్క్ ఆ సినిమా. ఉన్న అతి తక్కువ బజెట్ తో అనుకున్న ఎఫెక్ట్ ని రాబట్టిన ప్రతిభ. దర్శకత్వం చేసే అవకాశం ఇచ్చేందుకు స్క్రిప్ట్ ని కేవలం ఒక్క డాలర్ అంటే ఒక్క డాలర్ కి అమ్మేశాడు. అదీ తన మీదా, తన సామర్థ్యం మీదా కామెరాన్ కి ఉన్న నమ్మకం.
ఏలియన్స్ గురించి నాకంతగా తెలియదు.
ఎబ్బీస్... అండర్ వాటర్ సన్నివేశాలను అత్యంత చాకచక్యంగా, నిజమనే అనుభూతి కలిగేలా తెరకెక్కించి సినిమా దర్శకత్వానికి ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశాడు.
టెర్మినేటర్ 2 జజ్‍మెంట్ డే... అందులో చూపిన ఛేజింగు సన్నివేశాలని పదేళ్ళ తరువాత వచ్చిన టీత్రీ లో కూడా వాడుకున్నారంటేనే తెలుస్తుంది కామెరాన్ చిత్రీకరణ సామర్థ్యం. అందులో విలన్ కి సంబంధించిన సన్నివేశాలు, విలన్ జాన్ కానర్ ని చంపబోయినప్పుడు ఆర్నాల్డ్ ఆ పిల్లాడిని రక్షించేందుకు రావటం, అప్పుడు జరిగిన ఛేజింగ్ న భూతో నభవిష్యతి అన్నరీతిలో ఉంటాయి. సినిమా మొదటి నుంచీ చివరిదాకా కామెరాన్ దర్శకత్వ ప్రతిభ (తక్కువ మాటేమో), స్క్రీన్ ప్లే ని గ్రిప్పింగ్ గా నడిపించిన తీరూ కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ట్రూ లైస్ ఎంత బాగుంటుంది?
ఆపైన టైటానిక్. మూడున్నర గంటల సినిమాని మూడు నిమిషాలే అన్నంత ఈజీగా జనం చూశారంటే అది చాలదూ. పన్నెండేళ్ళ పాటూ ఒక్క సినిమా కూడా తీయకుండా ఉన్నా, జనం ఇంకా టైటానిక్ డైరెక్టర్ అని గుర్తుంచుకున్నారంటేనే తెలుస్తుంది ఆ సినిమా సంచలన విజయం. కేవలం టెక్ ఓరియంటెడ్ సన్నివేశాలే కాదు. హీరో విలన్ పాత్రల మధ్య ఉన్న కాంట్రాస్ట్ ని ఎస్టాబ్లిష్ చేసిన విధానం కూడా గొప్పగా ఉంటుంది. వయొలిన్ వాయించే వారి సన్నివేశాలూ, హీరో హీరోయిన్ని కాపాడబోయి రేప్ కేసులో ఇరుక్కునేటప్పుడు హీరోయిన్ అసలు విషయం చెప్పే తీరూ (ఆ సమయంలో హీరోయిన్ వ్యక్తిత్వాన్ని మనకు ఎస్టాబ్లిష్ చేసిన తీరు గమనించ దగ్గది), హీరో అప్పర్ క్లాస్ పార్టీకి వెళ్ళిన సన్నివేశాల్లో వచ్చే డైలాగులు... చెప్పుకుంటూ పోతే ఎంతైనా ఉంటుంది. లోపాలున్నాయి. కానీ, వాటిని మించిన మ్యాజిక్ చేశాడు కామెరాన్.
డాన్స్ చేస్తూ కేట్ లెన్ (డికాప్రియో) మీద పడే సన్నివేశం ఒక్కటి చాలు. కామెరాన్ టచ్చేసిన హైట్స్ ని అర్థం చేసుకునేందుకు. ఆ సినిమా వచ్చిన క్రొత్తల్లో ఆంధ్రజ్యోతి మహిళా పేజీలో రోజ్ ఐ లవ్యూ అన్న పేరుతో వచ్చిన ఒక వ్యాసం ఈ విషయాన్ని చాలా కూలంకుషంగా చర్చిస్తుంది. మన హీరోయిన్లకీ, కామెరానియన్ హీరోయిన్లకీ మధ్య ఉన్న తేడానీ, ఆ రోజ్ పాత్రని మలచిన తీరూ, కామెరాన్ కహనీ, పాత్రలనీ ఎస్టాబ్లిష్ చేసిన, నడిపించిన విధానం గురించి చాలా గొప్ప వ్యాఖ్యానం అది. నా పీజీ ముగిసే దాకా ఆ కటింగుండేది నా దగ్గర. ఎప్పుడైనా టైటానిక్ గుర్తొస్తే అది తీసి చూసుకునేవాడిని. (ఎవరికన్నా అది గుర్తు ఉంటే/తెలిసి ఉంటే చెప్పండి. చాలా మంచి వ్యాసం).
ఇక్కడ చెప్పినవి వేటి కవే గొప్ప చిత్రాలు. విమర్శకులు గుర్తించినా గుర్తించక పోయినా తాను ఎలా తీశానన్నది కామెరాన్ కి తెలుసు.
*** *** ***
As of his intentions, it is an articlein the FAMEnator series.