BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...



ఒక నిర్దిష్టమైన కథను ఎన్నుకుని దానిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, అద్భుతమైన దృశ్యకావ్యంగా మలచబడిన చిత్రం కె.విశ్వనాధ్ సృష్టించిన  "సాగర సంగమం".  1983 లో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ మన మనసుల్లో చెక్కు చెదరకుండా ఉంది. అందులోని పాటలు, సంగీతం, చిత్రీకరణ, నటీనటుల హావభావాలు .. ఆ కథలో మనకు గోచరించిన ఎన్నో అంశాలు మరపుకురానివి.

ప్రతిభ ఉన్నా గుర్తింపు రాని ఒక నాట్యకారుడి జీవన సంఘర్షణ ఈ చిత్రం.  బాలకృష్ణ (కమల్ హాసన్)ఒక పేద యువకుడు. స్వయంకృషితో నాట్యం నేర్చుకుని కూచిపూడి, భరతనాట్యం, కథక్ రీతులలో ప్రావీణ్యం సంపాదిస్తాడు. కాని కృతిమత్వం, విచ్చలవిడితనం, వాణిజ్య, వ్యాపారధోరణి,నిర్లక్ష్యంతో నిండిన సినిమారంగంలో ఇమడలేకపోతాడు. అతని కళకు తగిన గుర్తింపు దొరకదు ఎందుకంటే అతడు పేదవాడు కాబట్టి. తన విద్యతో అందరిని మెప్పించి గొప్పవాడై తల్లిని సుఖపెట్టాలని కోరుకుంటాడు కాని అతనికి సాయపడేవాళ్లు ఉండరు. అతనిలో ప్రతిభను గుర్తించిన మాధవి ( జయప్రద) అతనిని ప్రోత్సహించి డిల్లీలో జరిగే కార్యక్రమంలో అతని నాట్య ప్రదర్శన ఏర్పాటు చేయిస్తుంది. కాని చివరి క్షణంలో అతని తల్లి చనిపోవడంతో ఆ అవకాశం కోల్పోతాడు. అతనికి తోడుగా నిలిచిన మాధవిని ప్రేమిస్తాడు. కాని ఆమెకు చిన్నతనంలోనే పెళ్లైందని తెలిసి కృంగిపోతాడు. తిరిగి వచ్చిన భర్తకు ఆమెను అప్పగించి తాను దేశదిమ్మరిగా మారి తాగుబొతు అవుతాడు. కొన్నేళ్లకు అనుకోని పరిస్థితులలో మాధవి కూతురు శైలజ(శైలజ) నాట్యప్రదర్శనలో ఆమెని తప్పు పడతాడు. అప్పటికే తాగుడు వల్ల అతడి ఆరోగ్యం చెడిపోతుంది. కాని తన నాట్యానికి వారసులు లేరనే బాధ మిగిలేఉంటుంది. అది తెలుసుకున్న మాధవి బాలుని తన కూతురికి గురువుగా నియమిస్తుంది. భర్త పోయినా బాలుకి తెలియ కూడదని బొట్టు పెట్టుకుంటుంది మాధవి. వాళ్లిద్దరి స్నేహం చూసిన కూతురు కూడా అపార్ధం చేసుకుంటుంది. చివరకు  తన నాట్యకళనంతా శైలజకు నేర్పించి ఆమె నాట్యప్రదర్శన చూసి తృప్తిగా కన్ను మూస్తాడు బాలు.


ప్రతిభావంతుడైన ఒక కళాకారుడు తనను అష్టకష్టాలు పడి పెంచి నాట్యాన్ని నేర్పించిన తల్లి హటాత్మరణం, అండదండగా నిలిచి, ప్రోత్సాహాన్నిచ్చి జీవితాంతం తోడుంటుందనుకున్న స్నేహితురాలు దూరం కావడంతో నిరాశకు లోనై తాగుడు వ్యసనానికి బానిస అవుతాడు.  ఆ మత్తులొ తన బాధను మరచిపోవాలని అనుకుంటాడు. ఐనా కూడా ఆ కళాకారుడు తనలోని కళ తనతోనే అంతమైపోకూడదనుకుంటాడు. ఈ సినిమాలో మనకు నిత్యం ఎదురయ్యే సంఘటనలు స్పష్టంగా చూడవచ్చు. సినిమా ప్రపంచంలో కళలను వ్యాపారధోరణిలో అపహాస్యం చేస్తున్న తీరు, శైలజ నాట్యంలోని లోపాలు పట్టించుకోకుండా పత్రికలు, ప్రముఖులందరూ ప్రశంసించడం లాంటివి చూస్తుంటే నిజమైన కళాకారులకు అస్సలు గుర్తింపులేదనే విషయం అర్ధమవుతుంది. ఇక్కడ చెప్పుకోదగిన మరో విషయం కీర్తికాంక్ష, అహంకారంతో శైలజ చేసే నృత్యంతో చిత్రం ప్రారంభమవుతుంది కాని చివరికి అదే శైలజ వివేకం, మాతృభక్తి, గురుభక్తి కళమీది గౌరవంతో నాట్యంలో లీనమై ప్రదర్శన ఇస్తుంది. అప్పుడామెను చూసిన బాలు తనలోని కళను సంపూర్ణంగా ఆమెకు నేర్పించి మాధవి ఋణం తీర్చుకున్నానని సంతృప్తిగా కన్ను మూస్తాడు. బాలు మరణీంచినప్పుడు నాట్య ప్రదర్శనకు అంతరాయం కలగకుండా రఘు వీల్ చైర్ ని నిశ్శబ్దంగా బయటకు తీసికెళతాడు. అప్పుడే మొదలైన వానలో బాలు తడవకుండా మాధవి గొడుగుపడుతుంది. ఈ సన్నివేశంలో బాలు జీవితంలో చివరివరకు తోడున్న రఘు, మాధవి ఉన్నతమైన వ్యక్తిత్వాలు ఆవిష్కృతమవుతాయి.

మాధవి తనకు మహామహులైన కళాకారులు, విద్వాంసులు పాల్గోనే కార్యక్రమంలో తనకు కూడా చోటు కల్పించిందనే విషయం తెలిసినప్పుడు, ఆ ప్రదర్శనకు బయలుదేరేసమయంలోనే తల్లి మరణించిన సన్నివేశాలలో కమల్ హాసన్ ప్రదర్శించిన నటన అద్భుతం అని చెప్పవచ్చు. అవకాశం వచ్చిందన్న విషయం తెలిసినప్పుడు అతనిలో దుఖంతో కూడిన ఆనందం, నమ్మలేకున్నా అది వాస్తవమే అని కనపడుతుంటే అతనిలో పెళ్ళుబికిన ఆనందం, ఆశ్చర్యం నాట్యరూపంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. ఆ సందర్భంలో కమల్ నటన మహాద్భుతం అని చెప్పవచ్చు.  ఒకప్పుడు ఒకరినొకరు ప్రేమించి జీవితభాగస్వాములు కావాలనుకున్నా కూడా కాలేక తమ మధ్య అనుబందాన్ని ఇతరుల క్షేమాన్ని కోరుకునే స్నేహంగా మార్చుకుంటారు.  కళలను ప్రేమించే, గౌరవించే వారందరికీ కె.విశ్వనాధ్ అందించిన మరపురాని ఆణిముత్యం "సాగర సంగమం". ఈ చిత్రానికి అందించిన సంగీతానికి ఇళయరాజాకు జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుని పురస్కారం వచ్చింది. అలాగే ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంకు ఉత్తమ గాయకుని పురస్కారం లభించింది.  అలాగే ఈ చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారం కూడా లభించింది.


దర్శకత్వం : కె.విశ్వనాధ్
నిర్మాత : ఏడిద నాగేశ్వరరావు
సంగీతం : ఇళయరాజా
నటీనటులు: కమల్ హాసన్, జయప్రద,ఎస్,పి.శైలజ, శరత్ బాబు,

సాగరసంగమంలోని మధురమైన పాటలు వినండి మరి..

Posted by జ్యోతి Sep 14, 2010

Subscribe here

భువన సుందరి సీరియల్ చదవండి

భువన సుందరి సీరియల్ చదవండి
Keira Knightley: Beautiful Lady reading a Book

You said it!