BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...

This article was published in Navatarangam two years ago. After a surprising incident, I wish to republish this one here for B&G. You can know about that incident here...

పొద్దున్నే అంటే, నాలుగు గంటలకు, లేచి సంధ్యోపాసన చేసి, దైవ ప్రార్ధన చెసి, నిర్మలమైన మనస్సుతో కూర్చుంటే, నాలోని భ్రమలు తొలగి, అహం అణగి, మదమాత్సర్యాలు నశించి, ఆకాశాన సందె చుక్క కనిపించింది. దాని అందానికి ముగ్ధుడనై నే నాకసము వైపు నా దృక్కుని సారించగా తారల తళుకు బళుకులు నన్నమితాశ్చర్యమునకు గురి చేసినవి. అప్పుడే నాకు నేనెంత చిన్న వాడిననే భావన కలిగినది.

ఈ అందమైన పృకృతిని సృష్టించిన ఆ భగవానునికి మ్రొక్క బోగా, “నన్ను కాదు నాయనా, నన్ను గూర్చి తెలుసుకున్న వారి గురించి ఆలోచింపుము.  నీ సత్యాన్వేషణ ఫలిస్తుంది,” అన్న మాటలు ఎక్కడినుంచో వినవచ్చాయి. ఎవరా అని ఆలోచింపక, ఆ మాటల సారాన్ని అవగతం చేసుకునే ప్రయత్నమున మునిగి నాను. 

అంత నాకొకటే భావన…

భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములన్,
శివాది షణ్మతముల గూఢములన్,
ముప్పది ముక్కోటి సురాంతరంగముల భావముల నెరిగి
భావ రాగ లయాది సౌఖ్యముచే చిరాయువుల్ గలిగి నిరవధి సుఖాత్ములై త్యాగరాప్తులైన వారెందరో మహానుభావులూ……ఆఆఆ…..

ఇక మనసాగలేదు. అందుకే ఆ త్యాగ బ్రహ్మని తలంచుచూ… నా ఈ చిరు ప్రయత్నమును ప్రారంభించాను.
నాగయ్య గారు నటించిన త్యాగయ్యని అప్పట్లో చూడని తెలుగు వారు ఉండి ఉండరు. మా నాన్నగారి మాటల్లోనైతే మా ఊళ్ళో వాళ్లు బళ్ళు కట్టుకుని మరీ చూసిన సినిమా అది. సినిమా అనే మాట తక్కువ. చిత్రరాజం… ఊహూఁ. చూద్దాం. ఏమంటామో చివరకు. నటీ నటుల గురించి చెప్పనవసరం లేదు. ఈ కళాఖండానికి కర్త, కర్మ, క్రియ అన్నీ చిత్తూరు వి. నాగయ్య. అంటే నాగయ్యగారు. (ఇప్పుడు దొరికే DVD/VCD ల మీద లేబెల్ అలాగే ఇస్తున్నారు).

ఆయన ప్రతిభ గురించి మాటలాడే సాహసం చేయను. కానీ అతి కొద్ది మాటలలో నా అనుభూతులను పంచుతాను. మొదటి సారి గా నేను ఒక వేమన సినిమాని చూశాను. నా వయసుకప్పటికి అది మహా విసుగు అనిపించింది. నటీ నటుల గురించి నేను చెప్పను. కానీ కొన్ని రోజులతరువాత నేను ‘భక్త పోతన’ సినిమా చూశాను. అందులో పోతన పాత్ర దారి శాంత గంభీరమైన నటన, సరళ గంభీరమైన గాత్రం, నన్ను ఏవేవో లోకాలకి తీసుకుని పోయి, మైమరపించి, అలా టీవీకి నన్ను కట్టి పడేసినాయి.

అప్రస్తుతమైనా ప్రస్తుతమే ఇది. అందుకే ఇక్కడ వ్రాస్తున్నాను. ‘బొబ్బిలిరాజా’ సినిమా చూసి, అందులో వెంకటేష్ నటనకి My మరిచి కొన్నాళ్ళు ఆ అనుకరణ చేసిన నాకు, ఈ వ్యక్తీ నటన నచ్చటం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. (అదే నా జీవితం లోని తొలి, ఆఖరి అనుకరణ. ఎందుకో నాకు అనుకరణ అంత నచ్చదు. ఎప్పుడన్నా ప్రయత్నించినా పొత్తు కుదరదు). కానీ నాకు ఆశ్చర్యం కలుగలేదు. ఆ నటునిలోని మహత్తు అలాంటిది. అందుకే ఇంకొటేదో సినిమా వస్తుంటే చూశాను. అందులోనూ ఆ పోతనే. అంతే. నేను మళ్ళీ టీవీ కి అతుక్కుని పోయి చూసిన ఆ సినిమా ‘నాగయ్యగారి వేమన’.

నా వయసు వారికి ఆ రోజుల్లో ఉండే అభిమాన నటులు కాకుండా Break the Rules అంటూ నాకు అభిమానం లో ఒక కొంగ్రొత్త కోణాన్ని చూపించిన నాగయ్యకి నివాళిగా…

ఈ చిత్రానికి ‘ఎందఱో మహానుభావులు’ పని చేశారు. వారిలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది, ‘జపేశన్’ పాత్రధారి ఐన ‘ముదిగొండ లింగమూర్తి’ గురించి. అసలు మన ముందు ఆ జపేశనే ఉన్నాడా అనేటంత సహజమైన నటనని ప్రదర్శించారు. ‘ఏమిరా త్యాగూ’ అంటూ ఆయన చెప్పే డైలాగ్ అప్పట్లో వాళ్ల బడిలో ఎవరన్నా మాట వినక పోతే వాళ్ల మాష్టారు వాడేవారని మా గురువు గారు చెప్పేవారు. అంటే అంత నలిగి ఉంటుంది ఆ తరం వారి నోళ్ళలో. ‘సుకవి నిల్చు జనుల నాల్కల పైన…’ అని చిన్నప్పుడు చదువుకున్నాను. గొప్ప నటులు కూడా అంతే. వారి వారి మేనరిజాల వల్ల. (ఇప్పుడూ ఉన్నారు. అది నా బాధ్యత కాదు).

కానీ ఆ మాటలు త్యాగరాజ మహాకవి విషయంలో మాత్రం ఎవరికీ చెప్పనవసరం లేదు. ఆయన సుకవే కాదు భక్త కవి కూడా. అంతేనా ఒక గొప్ప సృష్టి కర్త కూడా. ఎన్నెన్నో రాగాలని సృజియించిన సృజనశీలి ఆయన.
అంతటి ఆ మహా వాగ్గేయకారుని చరిత్రని తెరక్కెక్కించే సాహసానికి ఒడిగట్టారు నాగయ్యగారు. ఎంతో సాహసంతో, భక్తితో ఎన్నో విమర్శలు ఎదుర్కుని, ఖర్చుకోర్చి, తీసిన ఆ చిత్రం ఆయనని భక్తి చిత్ర నటునిగా అమరత్వాన్ని కలుగజేసింది.

త్యాగరాజ మహాకవి జీవితం లోని కొన్ని మధుర ఘట్టాలనూ, ఆయన మనకి ప్రసాదించిన గీతాలలో కొన్నింటిని, నాగయ్య గారు తనకే సాధ్యమైన శైలిలో మనకి అందజేసి మనలను ధన్యులని చేశారు. ఆయన గళం లో నుంచీ జాలువారిన ఆ త్యాగరాజ కృతులు ఎంతటి ఆనందాన్ని కలిగిస్తాయో… ఆ చక్కని పద ఉచ్ఛారణ అంత మహత్తరంగా ఉంటుంది. (కొందరు పెద్దలు పాడినప్పుడు వారి పాండిత్య ప్రదర్శనే తప్ప హావ భావాలలో త్యాగరాజ హృదయాన్ని అందుకోలేక పోయారు. ఎన్నోసార్లు విని నేను చెపుతున్న మాట ఇది. ఆ భక్తి కూడా కానరాదు). కానీ నాగయ్యగారి ప్రత్యేకత అక్కడే మనలని కట్టి పడేస్తుంది. ఆయన లీనమై, మనని కూడా లీనం చేస్తారు. భక్తి తప్ప ప్రదర్శనా ధోరణులు ఎంతమాత్రం కానరావు. ఆ రోజుల్లోనే కారులో తిరిగిన భోగి ఐన ఆయన ఈ భక్తి యోగి పాత్రని అంత గొప్పగా పోషించారంటే ఎంత ఆశ్చర్యమో నాకు. చేసే పని మీద దృష్టి తప్ప అన్యం తెలియదేమో ఆ మహా నటునికి. తప్పు తప్పు. మహానుభావునికి. కేవలం నటించటమే కాదు. దర్శకత్వాన్ని కూడా నేరిపి, సంగీతాన్ని అందించి, గానామృతాన్ని పంచ గలిగారంటేనే ఆయన బహుముఖ ప్రజ్ఞ, శక్తి సామర్ధ్యాలూ, చేసే పని పట్ల అనురక్తీ మనకి అర్ధం అవుతాయి.

ఇక సినిమా గురించి చెప్పాలంటే ముందు ఆయన ఇచ్చిన వివరణని గురించి చెప్పాలి. కొంచం అటూ ఇటూ గా ‘This is not an historically accurate account. Many popular legends are taken into account. This is for dramatization’s sake.” అందుకే కొన్ని చరిత్రకందని విషయాలూ ఉన్నాయి ఆ చిత్రం లో. అందులో ముఖ్యమైనది… ‘నారద మహర్షి’ మారు రూపం లో ప్రత్యక్షం అయ్యే సన్నివేశం.

అంతకు మునుపు స్వరార్ణవం కొరకు త్యాగయ్య బాధ పడే సన్నివేశాలని ఎంతో హృద్యంగా చిత్రీకరించ బడినాయి. అర్ధరాత్రి పూట స్వర రచనకు పూనుకుని, సాధించలేక (శిష్యుడు ‘బాగుంది గురువుగారూ’ అన్నా ఆయన తృప్తి పడరు.) ఆ తరువాత ఒక రోజున ఆయన వద్దకు ఒక బ్రాహ్మణుడు వచ్చి, ఎంతో దూరం నుండీ నేను మీ పాటను వినటానికి వచ్చాను. అని ఆయనను అడుగుతారు. అప్పుడు ‘రామానుగ్రహం పొందలేని మంద భాగ్యుని’ అని బాధపడటం, ఆ వ్యక్తి ఒక పోత్తమునిచ్చి ఆయనను పరిశీలించమనటం వెనువెంటనే జరిగిపోతాయి.
ఆయన పరిశీలించే సమయం లో ఆ సంగీత జ్ఞానం, సరస్వతీ కటాక్షం అక్షరాల రూపం లో అక్షరంగా ఆయనలో కలిసి పోవటం అప్పటి టెక్నికల్ స్టాండర్డ్స్ అనుసరించి అద్భుతమనే చెప్పాలి.
“ఎవరు స్వామీ మీరు?” అని అడుగగా ఆయనకు ప్రాప్తమైన సమాధానం… “మా అమ్మ వీణ వాయిస్తుంది.”
ఈ సమాధానం మరో మహానుభావుడు సముద్రాల రాఘవాచార్య (సముద్రాల సీనియర్) వ్రాసినది. ఈ చిత్రానికి వీరే సంభాషణలను కూర్చారు. వీరి గురించీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరు మా స్వగ్రామానికి చెందిన వారు.
ఈ సన్నివేశంలో చిత్రం ఏమిటంటే అప్పటి దాకా త్యాగరాజు పొందిన ఆవేదనంతా చేత్తో తీసేసినట్టుగా పోతుంది. అప్పుడు కలిగిన పులకరింతలో ‘శ్రీ నారదా మౌనీ’ అనే కీర్తనని పాడుతారు. మనకీ మనసు పులకరిస్తుంది. అరె! నారద మహర్షి ఇలాగే ఉంటారా? అని అనిపిస్తుంది. అతిశయోక్తి కాదు. ఒక్క సారి నారద మహర్షి రూపం (ఈ సినిమాలో వచ్చే క్షణకాలంలో) చూస్తే మన మనసులలో నుంచీ తొలగిపోదు. అనుభవించాలే గానీ వర్నించనలవిగాని ఆనందం కలుగుతుంది ఆ ఒక్క సన్ని వేషంతోనే. చారిత్రకంగా జరిగిందని చెప్పలేక పోయినా ఆ నారద మౌని అనుగ్రహం కలుగనిదే త్యాగ బ్రహ్మ ఇంతటి వ్యక్తిగా నిలిచేవారు కాదేమో. నా ఉద్దేశ్యం నాగయ్యగారు కూడా ఆ దేవర్షి అనుగ్రహం పొందారేమో!.

మరొక సన్నివేశం… “ఎందఱో మహానుభావులు” కీర్తన వచ్చే సమయంలో. ఆ సన్నివేశంలో ఎందఱో మహానుభావులు, సంగీత విద్వాంసులు ఒక సభలో కూడి ఉంటారు. త్యాగయ్య తన గురువు గారి ఆజ్ఞ మేరకు అచటికి వెళ్లి వారి ఆశీర్వాదములను, ఆనతిని (ఆయనే పాడమని కోరుతారు) పొంది ప్రారంభించే “ఎందఱో మహానుభావులు” అజరామరమై నిలిచి ‘పంచరత్నా’లలో ఒకటిగా కీర్తిని పొందగా, నాగయ్య గారి సన్నివేశ రూపకల్పన, imagination, గాత్రం, స్వరకల్పనా, తోటి నటుల నుంచీ తనకు కావలసిన effect ని పొందిన తీరూ, తెలుగు చిత్ర పంచరత్నాలలో ఒకటిగా చేశాయి.

త్యాగయ్య పాడటం అవగానే ఒక విద్వాంసుడు ‘బ్రహ్మానందం కలిగించారండీ త్యాగయ్య గారూ’ అనటం ఆ సన్నివేశంలో అక్కడి వారికే కాదు. చూసిన మనకి కూడా నాగయ్య గారు ‘బ్రహ్మానందాన్ని’ కలుగ జేశారు. అక్కడ త్యాగయ్య పాడే సందర్భంలో ఉన్నా వ్యక్తులు నిజంగానే లీనమైపోయి ఉంటారు. ఆ సహజత్వం చాలా అరుదు.

I planned a follow up for this article long ago. But did not finish it as I felt can I maintain the same standards. But now I finished one. And will publish it here in 10 days. 

Posted by గీతాచార్య Sep 16, 2010

Subscribe here

భువన సుందరి సీరియల్ చదవండి

భువన సుందరి సీరియల్ చదవండి
Keira Knightley: Beautiful Lady reading a Book

You said it!