BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...

నవ్వితే నవ్వండి అంటూ మనందరినీ నవ్వేట్టు చేస్తున్న బులుసు సుబ్రహ్మణ్యంగారు మీ సినిమా అనుభవం ఏదైనా చెప్పండి అంటే ఇదిగో ఇలా చెప్పారు.





నేను ఆనర్స్ ప్రీ ఫైనల్లో ఉండగా అంటే 1963 సంవత్సరం, నా రూమ్మేటు వీరేంద్ర చౌదరి వివాహం జరిగింది. నువ్వు తప్పకుండా రావాలిరా అని వాడు వేడుకోవడంవల్లా, వాళ్ళ నాన్నగారు ఇంతింత మీసాలు పెంచుకొని, కరుకుగా మాట్లాడుతూ పంతులూ నువ్వు రెండు రోజులు ముందర వచ్చెయ్యి అని ఆజ్ఞ జారిచేయడం వల్ల నేను ఆ పెళ్ళికి వెళ్ళేను ఒక రోజు ముందర. నేను వాళ్ళ ఊరు వెళ్ళడానికి సకల వాహనాలు ఉపయోగించ వలసి వచ్చింది. నిడదవోలు దాకా రైలు, ఆపైన బస్సు, ఆ తరవాత, రెండెడ్ల బండి ఎక్కి సుమారు మధ్యాహ్నం మూడు గంటలకు వాళ్ళ ఇల్లు చేరాను. నన్ను చూసి వాళ్ళ నాన్నగారు “ఆ వచ్చేసావా ?” అని అడిగేరు. నేను వచ్చినందుకు ఆనందించాడో, లేక మొహమాటానికి పిలుస్తే వచ్చేసాడేమిటి అన్న భావమో నాకు అర్ధంకాలేదు. “ఒరేయ్ రంగా! పంతుల్ని అబ్బాయి దగ్గరకు తీసుకెళ్ళు” అని చెప్పి వెళ్ళిపోయారు. రంగాగారు రండి మాష్టారు అంటూ నన్ను ఇంట్లోకి తీసుకెళ్ళాడు.
అలాంటి ఇల్లు నేను అప్పటి దాకా చూడలేదు, పెద్ద హాలు. హాలుకి అరడజను గుమ్మాలు, వాటిలో గదులు. వాటిని దాటి వెళ్ళితే మధ్యన వరండా, మళ్ళీగదులు. ఈ గది లోంచి ఆ గదిలోకి పరుగు పెట్టే పిల్లలు, ఉంగరాలు లేని వేళ్ళు లేని వాళ్ళు, సిల్కు లాల్చీలు, సిల్కుపంచెలు ధరించిన మగవారు హడావిడి గా తిరిగేస్తున్నారు. పట్టు చీరలు కట్టుకొని, చీర కూడా కనిపించకుండా నగలు పెట్టేసుకొని, కదిలే మార్వాడీ కొట్టు లాగ అడుగులో అడుగు వేసుకుంటూ, బంగారం వాసన వేస్తూ తిరిగే మహిళామణుల మధ్య నించి, నన్ను లాక్కెళ్లి అబ్బాయి దగ్గర దిగపెట్టేడు. వచ్చావా, రా అన్నాడు అబ్బాయి. ఇంతలోనే ఓ పెద్ద ప్లేటు నిండా నాలుగు స్వీట్లు, అన్నేరకాల కారం పలహారాలు పట్టుకొచ్చి చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు ఓ పెద్దమనిషి. అబ్బాయి చుట్టూ అమ్మలు, మధ్యలో అమ్మాయిలు పరాచికాలు, పగలబడి నవ్వడాలు. ప్లేటులోవి తినాలో, వాళ్ళ మాటలు వినాలో అర్ధం కావట్లేదు. అబ్బాయితో మాట్లాడటానికి కూడా సందు దొరకటంలేదు. సరేనని చేతిలోపని మీద దృష్టి పెట్టేను. ఎల్లాగో సందు చూసుకొని అబ్బాయి గారు నాదగ్గరికి వచ్చాడు.
“ఒరేయ్! నీ బస మా శాస్త్రి గారింట్లో ఏర్పాటు చేసారు నాన్నగారు. మా జనాల మధ్యన ఉండగలను అనుకుంటే ఇక్కడ ఉండు లేకపోతే అక్కడికి వెళ్ళు”. “ఒరేయ్ రంగా సార్ ని జాగ్రత్తగా చూసుకో”. పెళ్ళికొడుకు నాకు జాగ్రత్తలు చెప్పి మళ్ళీ ఆడవారి మధ్య కెళ్ళిపోయాడు. రంగా గారు అక్కడేఉన్న ఆడవారిని, అటూఇటూ తిరుగుతున్న మగవారిని పరిచయం చేస్తున్నాడు. నాకు ఆ బంగారం వెనకాల మనుషులు కనిపించడం లేదు.అంతా బంగారమే కనిపిస్తోంది. మీఇంట్లో ఘోషా ఉన్నట్టు ఉంది రంగా అన్నాను రంగా నవ్వేసాడు. రండి. మిమ్మల్ని శాస్త్రి గారింటికి తీసుకెళ్ళతాను అని నా బేగ్ భుజాన తగిలించుకుని బయల్దేరాడు.
ఓ ఐదు నిముషాలు, రెండు వీధులు తిరిగిం తర్వాత ఓ ఇంటి ముందు ఆగి శాస్త్రి గారూ అని పిలుస్తూ లోపలికి తీసుకు వెళ్ళాడు. టైము చూసాను అప్పుడే నాలుగు అయింది. ఈ ఊరు వచ్చి గంట దాటిందా అని ఆశ్చర్య పోయాను.
ఇంతలో శాస్త్రిగారు వచ్చారు లోపలి నించి.
“రా బాబూ కూర్చో” అన్నారు ఒక కుర్చీ నాముందుకు తోసి. నేను కూర్చున్నాను
“మీది భీమవరమా?”
నేను అవును అన్నట్టు తల ఊపాను
“చౌదరి గారి అబ్బాయి స్నేహితుడవా?”
“విశాఖపట్టణం లో కలసి చదువు కుంటున్నారా?”
“మీ నాన్న గారు తెలుగు పండితులా?”
“మీరిద్దరూ హాస్టల్లో ఒకే రూము లో ఉంటారా?”
నేను అన్నింటికి తలఊపాను. అన్నీ ఆయనకి తెలిసిన ప్రశ్నలే వేసారే అని ఆశ్చర్యపోయాను. నాభావం తెలుసుకున్న వాడై రంగా చెప్పాడు. మీ గురించి అబ్బాయి గారు అన్నీ చెప్పారు అన్నాడు. శాస్త్రిగారి భార్య కాఫీ పట్టుకొచ్చి ఇచ్చింది ఆవిడ కూడా అవే జవాబు అఖ్ఖర్లేని ప్రశ్నలు వేసింది. నేను షరా మామూలుగానే తలనూచాను.
“మొహమాటకు పడకు నాయనా. ఏమైనా కావల్సివస్తే అడుగు.” అని మళ్ళీ లొపలికి వెళ్ళి పోయింది ఆవిడ.
ఏమి అడగాలా అని ఆలోచిస్తుంటే, ఏదైనా అవసరం అనుకుంటే అడుగు నాయనా అని శాస్త్రి గారు వీధిలోకి వెళ్ళారు. ఇప్పుడు అనుమానం వచ్చేసింది. అవసరం అంటే ఏమిటీ అని ఆలోచించడం మొదలు పెట్టాను. “మీరు ఏమీ ఆలోచించకండి. మై హూ హై” అన్నాడు రంగా. “ఈ మధ్యనే హిందీ నేర్చేసుకుంటున్నాను. బొంబాయి వెళ్ళాలి”అన్నాడు రంగా. నేనేం మాట్లాడలేదు. మళ్ళీ హిందీ లో వాయించేస్తాడని. మనకి బొత్తిగా అర్ధంకాని భాష అది. ఇంగ్లీషు సినిమా లైనా కొంచెం అర్ధం అవుతాయేమో కాని హింది అసలు నహీ. “సరే సార్ మీరు ఓ గంట విశ్రాంతి తీసుకోండి. నేను మళ్ళీ వస్తాను” అని చక్కాపోయాడు.

సరే అని నేను మంచం మీద నడ్డి వాలుద్దామనుకుంటుంటే, శాస్త్రి గారి భార్య వచ్చేసింది. మాఊరు వాళ్ళ ఊరూ దగ్గరే అని కనిపెట్టేసి మాఅమ్మ వాళ్ల గురించి, నాన్న వాళ్ల గురించి, మా గోత్రాలు, ఋషులు మొదలగు వారిగురించి కూలంకషంగా చర్చించి, ఔఇంకా పెళ్ళి ఎందుకు కాలేదు నాయనా?” అని అడిగేసింది ఆవిడ. అప్పుడే తొందరేమండి. “ఇంకా చిన్న వాడినే గదా” అని అన్నాను. “అయ్యో అదేమిటి నాయనా! నీవయసు లో ఈయన మా మామగారిని తాతని చేసేసారు”. నాకు అర్ధం కాలేదు. ఆవిడ నవ్వింది. మట్టి బుర్ర ఆప్పుడు అర్ధం అయింది. ఇక్కడే ఉంటే ఈవిడ నాకు సంబంధాలు చూస్తుందేమోనని భయం వేసింది ఊరు చూసోస్తానని ఆవిడ కి చెప్పి బయట పడ్డా. అన్ని పల్లెటూర్ల లాగే ఉంది. పచ్చగా, హాయిగా చల్లగాలి వీస్తోంటే మెల్లగా నడుచుకుంటూ వెడుతున్నాను

రెండు వీధులు తిరిగే టప్పటికి రంగా వచ్చేసాడు. “అప్పుడే బోరు కొట్టేసిందా మాఉరు అంటూ “రండి ఆచివర సినిమా హాల్ ఉంది. అందులో కూర్చుందురు గాని మంచి కాలక్షేపం” అన్నాడు. ”ఇప్పుడా?” అన్నాను టైము చూస్తూ ఐదు అయింది. “ఇంకో గంటన్నర ఆట ఉంటుందండి. ఏదో పేరు చెప్పేడు జానపద సినిమా” అన్నాడు. హాల్ మనదే అన్నాడు. సరే ఆవిడ తో కబుర్ల కన్నాఇదే మంచిది అనుకొని “టూరింగ్ టాకిసా?” అని అడిగాను . “కాదండి ఫుల్ సినిమా హాల్” అన్నాడు. నాకు అర్ధం కాలేదు. “మీ పట్నం లాగానేనండి. సిమెంటు బిల్డింగ్, నేలా, బెంచి, కుర్చీ, రిజర్వుడు పైగా బాల్కని కూడా ఉందండి. ఈ చుట్టుపక్కల పదిహేను ఊర్లకి ఇదే పెద్ద సెంటరండి సినిమాలకి . చుట్టుపక్కల ఊళ్ళలో నాలుగు టూరింగ్ టాకీసు లున్నాయండి మన ఊర్లోనే ఫుల్ సినిమా హాలండి. మూడు అభిమాన సంఘాలున్నాయండి మా ఊర్లో”. అని అడగకుండానే ఆ సినిమా హాలు హిస్టరీ మొత్తం చెప్పేసాడు. “అబ్బో పెద్ద చరిత్రే ఉందే మీ ఊరుకి” అన్నాను. “అప్పుడప్పుడు కొత్తసినిమాలు కూడా వస్తాయండి విడుదలయిన నెలరోజుల్లో”. ఆహా అన్నాను. ఇంతలో హాలు దగ్గరికి వచ్చేసాం. నన్ను తీసుకెళ్ళి బాల్కనీ లో కూర్చో పెట్టేడు. నేను మళ్ళి సినిమా అయేటప్పటికి వస్తానండి అని వెళ్లి పోయాడు.

నేను కూర్చుని చుట్టుపక్కల సర్వే చేసాను.మొత్తం 12 సీట్లు ఉన్నాయి మొదటి వరుస మూడు, రెండోవరుసలో నాలుగు, మూడో వరుస లో ఐదు ఉన్నాయి.చివరి వరుసలో నలుగురు కూర్చున్నారు. రెండో వరుసలో ముగ్గురు ఉన్నారు. మొదటి వరుసలో నేను మధ్య సీటులో ఫాన్ కింద కూర్చున్నాను. తెరమీదకి చూసాను. రాజుగారు గుఱ్ఱం మీద, వెనకాల సైనికులు గుఱ్ఱాల మీద, కాల్బంటులు, శూలాలు, గదలు, కత్తులు పట్టుకొని పరుగెడుతున్నారు. వెనకాల సంగీతము దడదడ లాడించేస్తోంది. వ్యతిరేక దిశలో ఇంకో రాజు గారు అంతమంది సైనికులతో వచ్చేస్తున్నారు. సరిగ్గా అదే టైము లో నాపక్కన రెండు సీట్లలో ఇద్దరువచ్చి కూర్చున్నారు. కొద్దిగా మందు వాసన వేస్తోంది. “యుద్ధం మొదలవుతోందిరా” అన్నాడు ఒకడు. “సిగతరగా! నిన్నా ఇదే టైముకి వచ్చాం రా” అన్నాడు ఇంకోడు. రెండు సైన్యాలు ఒకరి కెదురుగా ఇంకోరు పరిగెడుతున్నారు.

ఒకడు: అబ్బాయి గారి స్నేహితుడు గారు రా
రెండో వాడు: అవును రా సినిమాకు వచ్చినట్టున్నారు.
సినిమాలో సైన్యాలు పరిగెత్తేస్తున్నాయి.
ఒ: పావుగంట ముందు వస్తే పాట వినేవాళ్ళం గదా
రెం: ఇంకో పాట ఇప్పుడు వస్తుంది గదా
సి: రెండు సైన్యాలు ఒక దాని ఎదురుగా ఒకటి నిల్చున్నాయి.
నేను జేబు లోంచి సిగరెట్టు తీసి వెలిగించాను.
ఒ: ఫ్రెండుగారు సిగరెట్లు కాలుస్తారనుకుంటాను రా
రెం: అబ్బాయి గారు కూడా కాలుస్తారాండి
నే: కాలుస్తాడండి
సి: ఇద్దరు రాజులు కత్తులు దూసారు
ఒ:, రెం:, చుట్టలు వెలిగించారు
సి: రాజులెక్కిన గుఱ్ఱాలు గుండ్రంగా పరిగెడుతున్నాయి.
నే: ఉత్సాహంగా చూస్తున్నాను ఎప్పుడు యుద్ధం మొదలవుతుందా అని
గుఱ్ఱాలు ఆగాయి.రాజు ఒకటికి రాజు రెండుకి ఓ ఇరవైగజాల దూరం
ఒ.రా: ఓరోరి దురాత్మా!. కదనమున నన్ను గెలవగలవా?
రె.రా:నీచా! దుష్టా! నీ పొగరణచెద కాచుకొమ్ము
ఒ: ఈళ్ళిప్పుడు ఇంకో పది మాటల యుద్ధం చేస్తారండి. అప్పుడు కత్తి యుద్ధం మొదలు
రె: అబ్బాయి గోరు అవి నిజంకత్తులేనంటారా
ఒ.: నీ మొహం. నిజంకత్తులైతే చస్తారు. అట్ట కత్తులు
రె: సౌండ్ వస్తుంది కదరా
ఒ: అది ఎనకాల మూజిక్ రా
సి: కత్తి యుద్ధం మొదలయింది టంగ్ టంగ్ టటంగ్ టంగ్ టంగ్ టటంగ్ టంగ్
చేగోడీలు చేగోడీలు మధ్యలో అమ్మేవాడు రంగప్రవేశం
ఒ: అర్ధరూపాయివి ఇవ్వరా
వాడు ఇచ్చాడు వీళ్ళు నమలడం మొదలు పెట్టారు. రెండు చెవుల్లోను కర్ ఖర్ ఖ్ఖర్
టంగ్ టంగ్ టటంగ్ టంగ్ టంగ్ టటంగ్ టంగ్
కర్ ఖర్ ఖ్ఖర్ కర్ ఖర్ ఖ్ఖర్
ఒ: ఇప్పుడు ఆడి పెళ్ళాం ఈడి పెళ్ళాం పాట పాడుతారు డూయెట్టు
టంగ్ టంగ్ టటంగ్ టంగ్ టంగ్ టటంగ్ టంగ్
కర్ ఖర్ ఖ్ఖర్ కర్ ఖర్ ఖ్ఖర్
ఒ:రా.పె.: కరుణించుమా కనకదుర్గా నా నాధుని గెలిపింపుమా
రె.రా.పె.: కాపాడుమా పరమేశ్వరా నాపతికి జయము నీయుమా
టంగ్ టంగ్ టటంగ్ టంగ్ టంగ్ టటంగ్ టంగ్
కర్ ఖర్ ఖ్ఖర్ కర్ ఖర్ ఖ్ఖర్
ఒ.: పరమేస్వరుడు గెలుస్తాడా పార్వతీ దేవి గెలుస్తుందా
నే: నిన్న చూసారుగా. మీకు తెలిసే ఉండాలి కదా
రె.: నిన్న సరిగ్గా పాట అయేటప్పటికి కరెంటు పోయింది
టంగ్ టంగ్ టటంగ్ టంగ్ టంగ్ టటంగ్ టంగ్
కర్ ఖర్ ఖ్ఖర్ కర్ ఖర్ ఖ్ఖర్
ఒ:రా.పె.: కరుణించుమా కనకదుర్గా ఆఆఆఆ ఆఆఆఆ
రె.రా.పె.: కాపాడుమా పరమేశ్వరా ఆఆఆఆ ఆఆఆఆ
ఇంతలో ఒ.రా. చేతిలో కత్తి విరిగిపోతుంది. ఒ.రా దొర్లుకుంటూ ,రె.రా కత్తి విసురుతూ, దొర్లుకుంటూ, విసురుతూ ఒక నది దగ్గరకు వచ్చేస్తారు. నదికి ఒక తాళ్ళ వంతెన ఉంటుంది.
కర్ ఖర్ ఖ్ఖర్ కర్ ఖర్ ఖ్ఖర్
ఒ:రా.పె.: కరుణించుమా స సా రి రీ రిర్రీ గగ్గా గ్గాఆఅ పదనిస పాదానీసా
రె.రా.పె.: కాపాడుమా గా గా పాప్పానా న్నా అమామ్మామాపాదనిసాఆఆ
కర్ ఖర్ ఖ్ఖర్ కర్ ఖర్ ఖ్ఖర్
ఇక్కడ ఒ.రా రె.రా లు వంతెన మీద యుద్ధం ఒ.రా, రె. రా చేతిలో కత్తి ఎగర కొట్టేస్తాడు. ఇద్దరు ముష్టి యుద్ధం మొదలు పెడతారు.
ఢుషుం ఢుషుం ఢుషుం ఢుషుం ఢుషుం
కర్ ఖర్ ఖ్ఖర్ కర్ ఖర్ ఖ్ఖర్
ఒ:రా.పె.: కనకదుర్గా
రె.రా.పె.: పరమేశ్వరా
ఢుషుం ఢుషుం ఢుషుం ఢుషుం ఢుషుం
అప్పుడు రె.రా నీళ్ళలో పడిపోతాడు. ఒ.రా నీళ్ళలోకి దూకేస్తాడు. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి
ఢుషుం ఢుషుం బుడుంగ్ బుడుంగ్ ఢుషుం ఢుషుం బుడుంగ్ బుడుంగ్ ఢుషుం
కర్ ఖర్ ఖ్ఖర్ కర్ ఖర్ ఖ్ఖర్
ఒ.రా.పె.: కరుణించుమా
రె.రా.పె.: పరమేశ్వరా
ఇంతలో రెండు మొసళ్ళు నీళ్ళలో కొట్టుకుంటున్న వారి దగ్గరగా వచ్చి ఘ్ర్యీ: ఘ్ర్యీ: అంటాయి
ఒ.రా.పె.: కనక దుర్గా దుర్గా దుర్గా ఆఆఆఆఆఅ
రె.రా.పె.: కాపాడుమా మా మాఆఆఆఆఆఆఆ
రె.రాపె గారి దగ్గర ప్రమిద ఆరిపొతుంది. ఒరా గారి దీపం ఆరి, వెలిగి, వెలిగి ఆరిపోయేటట్టు ఉన్నట్టుంటే కరెంటు పొతుంది.
రె.: సిగతరగా, సరిగ్గా నిన్నా ఇక్కడే కరంటు పొయిందండి.
ఒ.: ఇప్పుడు ఏమవుతుందండీ అబ్బయి గొరూ,
నే.: నాకు తెలియదు ఈ సినీమా నేను చూడలేదు
రె.: మీరు డైట్రు అయితే ఏం చేస్తారు
నే.: రెండో దీపం కూడా ఆర్పేస్తాను.రెండు మొసళ్ళూ ఇద్దరిని తినేస్తాయి. ఇద్దరు పెళ్ళాలు ఆత్మహత్య చేసుకుంటారు. అప్పుడు రెండు రాజ్యాలలో ప్రజలు సుఖంగా జీవిస్తారు.
హహహహహ్హహ్హహ్హ అని ఘట్టిగా నవ్వి నేను అక్కడనించి పారిపోయాను.

Posted by జ్యోతి Oct 31, 2010

Subscribe here

భువన సుందరి సీరియల్ చదవండి

భువన సుందరి సీరియల్ చదవండి
Keira Knightley: Beautiful Lady reading a Book

You said it!