మాలా కుమార్ గారి గురించి ప్రత్యేకంగా మన B&G పాఠకులకి పరిచయం చెయ్యక్కర్లేదు. అందరూ అమెరికా వెళ్ళి అవి చూశాము, ఇవి చూశాము, అక్కడ ఇలా... ఇక్కడ ఇలా అని కబుర్లు చెపుతారు. మాల గారు మాత్రం ఒక టచీ విషయం చెప్పారు. అమెరికా అనగానే వారికి గుర్తొచ్చే అంశం!
చదవండిక్కడ...
మా మనవరాలు అదితి కి వంట్లో బాగాలేదు అంటే చూద్దామని , రెండోసారి ( మొదటి సారి అదితి పుట్టినప్పుడు వెళ్ళాను ) , అట్లాంటా ( అమెరికా ) కు వెళ్ళాను . నేను వెళ్ళిన మూడు నెలల తరువాత , మా వారు పిల్లల బలవంతము మీద ఒక నెలరోజులుందామని మొదటిసారి అమెరికాకు , వచ్చారు . ఆయన వస్తున్నరోజు , హంట్స్ విల్లే నుండి , మా అబ్బాయి , కోడలు అట్లాంటాకు వచ్చారు . మా అబ్బాయి ని రెండు సంవత్సరాల తరువాత , మావారు చూడటము అప్పుడే ! ఏర్ పోర్ట్ నుండి ఇంటికి రాగానే , మా వారు సూట్ కేస్ లు విప్పుతుంటే అందరూ , చాలా క్యూరియస్ గా ఎవరికే బహుమతులు తెచ్చారా అని చూస్తున్నారు . ఒక సూట్కేస్ నిండా స్వీట్ బాక్స్ లు ! ఇన్ని స్వీట్స్ తెచ్చారేమిటీ అంటే అవి మనవి కాదు , మా ఫ్రెండ్స్ , వాళ్ళ పిల్లలకు ఇవ్వమన్నవి అని రెండో సూట్కేస్ లో నుండి కూడా కొన్ని స్వీట్ బాక్స్ లు తీసి అవి మనకు అని ఇచ్చారు . సరే పిల్లలందరికీ తలా ఒక కానుక ఇచ్చారు . సూట్కేస్ ఖాళీ ! అసలు మీ బట్టలేవండీ ????? అని నేనడుగుతే పాపం అప్పుడు చూసుకున్నారు తన వస్తువులేవీ తెచ్చుకోలేదని ! మరునాడు ఉదయమే బిపు ఆయనను తీసుకెళ్ళి , కావలసినవి కొని ఇచ్చి , ఆయన తెచ్చిన స్వీట్స్ అన్నీ పాక్ చేసి , ఎవరివి వాళ్ళకు పంపి , నేను ఫ్రైడే వచ్చి మిమ్మలిని హంట్స్ విల్లే తీసుకెళుతాను అని , మినియాపూలీస్ కు టూర్ మీద వెళ్ళాడు .
ఫ్రై డే మద్యాహనం ఏ అన్నీ సద్దేసుకొన్నాము . వచ్చి నాలుగు రోజులే కదా అయ్యింది , నెక్స్ట్ వీక్ వెళుదురుగాని అని మా అమ్మాయి కాస్త గునిసింది . ఇక్కడ స్నో చాలా పడుతోంది , ఫ్లైట్స్ అన్ని కాన్సిల్ అయ్యాయి రేపు పొద్దున్నే వస్తానని బిపు కాల్ చేసి చెప్పాడు . సరే , సాయం కాలము కాసేపు తిరిగి వచ్చి పడుకున్నాము . మద్యరాత్రి మా మనవరాలు ఏడుస్తుంటే పాలు కలుపుదామని లేచాను . ఫోన్ లో ఆన్సరింగ్ మిషిన్ బీప్ . . . బీప్ అంటోంది . చూస్తే , మా మరిదిగారి మెసేజ్ , అన్నయ్యా నీతో మాట్లాడాలి అర్జెంట్ అని వినిపించింది . వెంటనే మా వారిని లేపాను . ఆయన ఇండియాకు కాల్ చేసారు . మా ఆడపడుచు విజయ లిఫ్ట్ చేసింది . ఏటమ్మా విజయా , వెంకట్ ఫోన్ చేసాడు అంటే , నాన్న తో మాట్లాడు అన్నయ్యా అని , మా మామగారికి ఇచ్చింది . మాధవా అమ్మకు వంట్లో బాగాలేదురా , కోడలిని తీసుకొని వెంటనే బయిలుదేరి రా అన్నారు , మా మామగారు . మళ్ళీ ఇద్దరూ రండి , నువ్వొక్కడివే కాదు అన్నారు . ఏమైంది నాన్నా అంటే మీరు రండి , అమ్మకు చాలా సీరియస్ గా వుంది అన్నారు . అంతే , ఎవరికీ ఏమి మాట్లాడాలో తెలీలేదు . మా అమ్మాయి సంజు వెంటనే , ఫ్లైట్ టికెట్స్ కోసం ప్రయత్నం మొదలు పెట్టింది . మేము వచ్చిన కోరియన్ ఏర్లైన్స్ ఆ రోజు లేదు . తను టికెట్స్ కోసం ప్రయత్నము లో వుంది . మావారేమో మాటా పలుకూ లేకుండా నిశబ్ధం గా వున్నారు . ఎట్టకేలకు డెల్టా ఏర్లైన్స్ లో 5000$ తో దొరికాయి !
అప్పటికి తెల్లవారుఝాము నాలుగైంది . టికెట్స్ దొరికాయి , బయిలుదేరుతున్నారు అని మామాగారికి చెప్పింది సంజు . అప్పుడు , మావారు ఫోన్ తీసుకొని , నాన్నా అమ్మతో ఒక్కసారి మాట్లాడుతాను , అమ్మకివ్వు ఫోన్ అన్నారు . మా అత్తగారు ఫోన్లో చిన్నగా ' మాధవా ' ' మాధవా ' అని రెండుసార్లు పిలవటము స్పీకర్ల లో నుండి వినిపించింది అమ్మా నేను వస్తున్నాను ఎక్కడికీ వెళ్ళకమ్మా అని ఘట్టిగా ఏడ్చేశారు . మా అందరికీ కళ్ళళ్ళో నీళ్ళు తిరిగాయి . ఓ పదినిమిషాలకు మా అత్తగారు ఇకలేరు అన్న వార్త తెలిసింది . ఆవిడ గొంతు విన్నప్పుడు , పరవాలేదేమో అనుకున్నాము , కాని అదే ఆవిడ చివరి మాట అని తెలుసుకోలేక పోయాము .
సారీ డాడీ సారీ , నిన్ను రమ్మని బలవంతము చేయక పోతే బామ్మ దగ్గరే వుండే వాడివేమో అని సంజు వల వలా ఏడ్చేసింది . అవును . . . మావారు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లో వుండగా , చైనా వార్ లో వెళ్ళేందుకు , చదువు వదిలేసి ఆర్మీ లో షార్ట్ సర్వీస్ కమీషండ్ ఆఫీసర్ గా చేరారట . అప్పుడు మా అత్తగారు ఎంతచెప్పినా , మన అవసరమున్నప్పుడే మాతృభూమికి సేవ చేయాలి అని యుద్ధానికి వెళ్ళారుట . ఇంజనీర్ అవుతాడనుకుంటే , మొండివాడు ఎంతబతిమిలాడినా వినకుండా వెళ్ళాడు అని మా అత్తగారు ఎప్పుడూ అనేవారు . మేము బరోడాలో వుండగా , మావారు , రాజస్తాన్ లో ఎక్సర్సైజ్ కు వెళ్ళినప్పుడు , మా అత్తగారు చాలా సీరియస్ అయ్యారు . ఆయన వెళ్ళింది బార్డర్ కు . అక్కడికి వార్త చేరటము కష్టం . ఆ రోజులలో , మొబైల్ ఫోన్ లు కాదు ఇళ్ళలోనే లాండ్ ఫోన్ లు కూడా వుండేవికావు . యూనిట్ నుండి వార్త వెళ్ళాలి . మేము చేద్దామన్నా వీలుకాని పరిస్తితి . అసలు నాకూ ఆ వార్త అందలేదు ! మావారు పదిహేను రోజుల తరువాత తిరిగి వచ్చాక తెలిసింది . అంతే వెంటనే వెళ్ళారు . ఈయనను చూడగానే , అదృష్టవసాత్తు , అప్పటికే కోలుకొన్న మా అత్తగారు , ఇక నువ్వు హైదరాబాద్ వచ్చేయరా మాధవా అని భోరున ఏడ్చేసారుట . బరోడా రాగానే వాలంటరీకోసం అప్లై చేసారు . ఆయన సీ. ఓ ఇంటికి వచ్చి మరీ , నువ్వు లెఫ్ట్ నెంట్ కల్నల్ గా అప్ర్రూవ్ అయ్యావు , ప్రమోషన్ తీసుకొని ఆజ్ ఏ కల్నల్ గా రిటైర్ అవ్వచ్చుకదా అని నచ్చ చెప్పారు . కాని , ఇప్పుడు ప్రమోషన్ తీసుకుంటే ఇంకో రెండు సంవత్సరాలుండాలి , అప్పటి వరకు నేనుండలేను , అమ్మ కోసం వెళ్ళాల్సిందే అని ఆర్మీ వదిలి హైదరాబాద్ వచ్చేసారు . జన్మభూమికి అవసరమైనప్పుడు , చదువును మధ్యలోనే వదిలేసి 19 సంవత్సరాల వయసులోనే ఆర్మీలో చేరారు . జనని కి అవసరము అనుకున్నప్పుడు , వచ్చిన ప్రమోషన్ ను తృణప్రాయముగా వదులుకొన్నారు . ఇప్పటికీ ఆయన ఆర్మీ ఫ్రెండ్స్ అంటూ వుంటారు , నువ్వు వాలెంటరీ తీసుకోకపోతే బ్రిగేడియర్ వి అయ్యేవాడివి అని . ఆ రోజు నుండి నాలుగు రోజుల క్రితం అట్లాంటా వచ్చేవరకూ అమ్మను కనిపెట్టుకొనే వున్నారు . విధివిలాసం . . . . . వెళ్ళి పిల్లల దగ్గర కొన్ని రోజులు గడిపిరమ్మని పంపిన అమ్మ అంత అకస్మాతుగా వెళ్ళి పోవటము ఆయనకు చాలా పెద్ద షాక్ . . .
మేము చెక్ ఇన్ అవుతుండగా బిపు వురుకులు పరుగులు మీద వచ్చాడు . చాలా భారమైన గుండెలతో బయిలు దేరాము . హైదరాబాద్ ఎలా చేరామో తెలీదు . ఇంటికి రాగానే వాకిట్లో బల్ల మీద , పచ్చని మోములో ఎర్రని కుంకుమతో , ఆకుపచ్చని గుంటూరు జరీ చీర తో మెరిసిపోతూ పడుకొని వున్నది మా అత్తగారి పార్ధివ శరీరము అంటే నమ్మకము కలగ లేదు . 84 సంవత్సరాల పండు ముత్తైదువ , అని చూసేందుకు , ఆమె కాళ్ళకు నమస్కరించేందుకు మొత్తం బర్కత్ పురా వాసులంతా తరలివచ్చారా అన్నట్లుగా మనుషులు కిట కిట లాడుతూ వున్నారు . ఎవరెవరెవరో తెలియని వాళ్ళు కూడా బుట్టల కొద్ది , పూలు , పసుపు కుంకుమ తెచ్చి , చల్లి నమస్కరించి వెళుతున్నారు . విష్ణుసహస్రనామము పారాయణ చేస్తుండగా , చివరిసారిగా ప్రియ కుమారుడితో , కావాలని పెట్టుకున్న పేరు , ' మాధవా , మాధవా ' (అసలు పేరు ప్రభాత్ ఐనా , ఇంట్లో మావారిని మాధవ అనే పిలుస్తారు ) అని పిలిచి మాట్లాడి వెళ్ళిపోయారు . ఎంత పుణ్యాత్మురాలో అని అందరూ కీర్తించటమే . ' చావు కూడా పెళ్ళి లాంటిదే ' అనేది నిజమే అనిపించింది .
అమెరికాకు నాలుగు సార్లు వెళ్ళినా ఎవరైనా మీ అమెరికా అనుభవం చెప్పండి అంటే నాకు అప్రయత్నముగా ఇదే గుర్తొస్తుంది .