ఒకసారి పేపర్లో న్యూస్ చూసి అలాగే కూచుండిపోయాను. లినెట్ వచ్చి పిలిచిందాకా అందులో చూసిన విషయం గురించే నా ఆలోచన. అసలు ఆటగాళ్ళు దేని కోసమని ఆడుతారు? దేనికోసమని ఆడాలి?
డబ్బా? పేరా? అభిమానులకోసమనా? ఆత్మ తృప్తికోసమనా? ఇవేవీ కాకుండా మరేదైనా ఉన్నదా?
ఒక ఇండియన్ క్రికెట్ అభిమాని తల పగిలి రక్తం కారుతున్న ఫొటో నేనప్పుడు చూసింది. క్రికెట్ కోసం గంగవెర్రులెత్తే జనమున్న దేశమది. క్రికెట్ ఒక మతం, క్రికెట్ ఒక భాష, క్రికెట్ ఒక జీవన విధానం. కులం కోసమనీ, మతం గురించనీ, డబ్బూ హోదాల తేడాలున్నా కూడా "స్కోరెంత?" అన్న ఒక్క మాట మాత్రం అందరినీ ఒక్కటిగా చేస్తుంది.
ఉక్కబోత వాతావరణం, విపరీతమైన హ్యుమిడిటీ, కడుపెప్పుడు ఖరాబెప్పుడౌతుందో తెలియని పరిస్థితులు, అబ్బో, తొలిసారి అక్కడికి వెళ్ళినప్పుడు మహా ఇబ్బందులెదురయ్యాయి. డీన్ (జోన్స్) కొట్టిన రెండొందల (విఖ్యాత టైడ్ టెస్ట్) గురించి మేమిప్పటికీ ఎందుకంత గొప్పగా చెప్తామంటే ఆ పరిస్థితులలాంటివి మరి. రాను రానూ పరిస్థితులు మారాయి. కానీ ఇక్కడి అభిమాన జనం, వారి ఆశల్లో మాత్రం మార్పులేదు.
ఆటంటే వారికి ప్రాణం. క్రికెట్ ని ఇంతలా అభిమానించిన వాళ్ళు వేరెక్కడా నాకు కనబడలేదు. వారి ఆ అభిమానమే నాకు వారంటే గౌరవభావాన్ని పెంపొందించింది. దెబ్బలు తిని ఏడ్చుకుంటూ వెళ్ళే అభిమానుల్ని చూసే ఉంటాను. క్తమోడేలా కొట్టే పోలీసుల్నీ చూసి ఉండొచ్చు. కానీ ఆ కుర్రాడిని చూసినప్పుడు కలిగిన ఆవేదన మాత్రం వర్ణనాతీతం. నెత్తి మీద జుట్టుతో ఇండియా బొమ్మ హెయిర్ స్టైల్. త్రివర్ణాలున్నాయి.
ఎందుకు వాళ్ళు అంత తయారయి వచ్చేది? గుర్తింపు కోసమా? ఆట మీద మోజుతోనా? సరదా కోసమా?
తమ జట్టు గెలిస్తే చూడాలని. తమ అభిమాన ఆటగాడు సెంచురీలు కొడితే చూడాలని, వికెట్లు పడగొడితే కేరింతలు కొట్టాలని. అంత ఖర్చు పెట్టుకుని వస్తున్నది స్టేడియాలకు, తమ జట్టు గెలిస్తే చూడాలని మాత్రమే. ఓడిపోవటమ్మీద వారికసలు ఆలోచన ఉండదు. కేవలం తమ జట్టు గెలవటమ్మీద మాత్రమే వారి దృష్టి.
అలాంటి అభిమానుల్ని, వారి ఆలోచనలని చూస్తే మేము ఆడాల్సింది కేవలం గెలవటానికే. ఆడినా, ఓడినా మా డబ్బు మాకొస్తుంది. మా జీవితమే క్రికెట్. మాకది తప్ప వేరే లోకం లేదు. కానీ వారికి? వారి జీవితాలున్నాయియి. వారి పన్లున్నాయి. కానీ, అవన్నీ మానుకుని, కేవలం మా కోసం... అంటే తమ అభిమాన ఆటగాళ్ళ కోసం వారు స్టేడియాలకు తరలి వస్తారు. మేము గెలవాలనే.
అందుకనే నేను ఆడేప్పుడు, ఓటమి అంచున ఉన్నప్పుడు గుర్తొచ్చేది ఆ అభిమానులూ, వారి ఆకాంక్షలు. డబ్బే ప్రధానం కాదు. ఒక ఎలక్ట్రానిక్ గా౨డ్జెట్ను కొనే ముందు ఎన్నో ఆరాలు తీస్తాము. పెర్ఫామెన్స్ బాగుంటుందా లేదా అని వంద ప్రశ్నలు వేస్తాము. పెట్టిన ప్రతి డాలర్కూ ఫలితాన్ని పొందగలిగామా లేదా అని ఆలోచిస్తాము. సంవత్సరాలు తీసే సినిమాల భవితవ్యాన్ని కేవలం ఒక్క క్షణంలో తేలుస్తాము. ఎందుకు పెట్టిన పైసకు తగిన పతిఫలం ముట్టిందా లేదా అని. మరలాంటిది మేము ఆడినప్పుడు చూడాలని వచ్చిన జనం పెట్టిన ఖర్చుకు ప్రతిఫలాన్ని ఇస్తున్నామా?
నా దగ్గరకు వచ్చే యువ ఆటగాళ్ళకు నేను ఈ ఫొటోనే చూపుతాను. పేరూ డబ్బూ సరే, వాటంతట అవే వస్తాయి. కానీ, అభిమానులు వచ్చేది మాత్రం మనం గెలిస్తే చూడాలని మాత్రమే. అందుకే ఆడాల్సింది కేవలం గెలవటానికి మాత్రమే. గెలవాలంటే మనమాడాల్సింది తిరుగు లేని విధంగా. తిరుగులేని ఆటగాడంటే ఎవరికైనా గౌరవమే. అందుకే Play to win. Rest follows. రక్తం ఓడుతున్న ఆ అభిమానిని గుర్తుకు తెచ్చుకోండి. టికెట్ కోసమతను పడ్డ కష్టాన్ని గురించి ఆలోచించండి. ఎండనకా, ఆననకా అతను క్యూలలో నిలబడి మరీ వచ్చేదెందుకా అని ఒక్క క్షణమాలోచించండి. తన విలువైన సమయాన్ని వృధా చేసుకునేది, ఒక విజయాన్ని చూడాలని మాత్రమే. ఆ ప్రతిఫలాన్ని అతనికి దక్కించండి.
మరి మా తృప్తో అంటారా? గెలవటంలో ఉన్న తృప్తి డబ్బు వల్ల కూడా రాదు. అయినా ఆ విషయాలను మళ్ళా కలిసినప్పుడు...
(ఈసారి సెహ్వాగ్స్ 195).
This one is abridged slightly. Full version in English will be published later :)