చెన్నై నుంచీ డైరెక్ట్ గా ఫ్లైటు లో విజయవాడలో అదేలే గన్నవరంలో దిగబడగానే రవి నాకు ఎదురొచ్చాడు. నేను దయ్యం కాకుండా మొత్తానికీ దేవుడు చర్యలు తీసుకున్నాడని ఆనందంగా.
నీకేం పోయే కాలం వచ్చింది. దయ్యం ఎందుకు అవుతావు? అంటారా. చెప్తాను వినండి. జీవితంలో ఒక్క సారైనా విమానం ఎక్కాలని. ఇప్పటిదాకా కుదరలేదు. దాంతో ఇప్పటికిప్పుడు చచ్చిపోతే నేనెక్కడ దయ్యాన్ని అయిపోతానో అని చాలా కాస్త కొంచెం ధైర్యంగా (భయం లెండి. అలా అచ్చుతప్పు వచ్చింది) ఉండేది. కానీ ఇప్పుడా ప్రమాదం తప్పిపోయిందని నేనూ వాడూ కల్సి నాలుగు నిమ్మకాయ షోడాలు కొట్టి (నాకింతవరకూ నిమ్మకాయ షోడాకీ, లెమన్ షోడాకీ తేడా తెలియదు. ఇంగ్లీషోళ్ళకి ఉప్పు నచ్చదని స్వీట్ గా చేస్తారు. అందుకే దాన్ని ఇంగ్లీష్ లో లెమన్ షోడా అంటారని సరిపెట్టుకున్నాను ఇప్పటి దాకా) పండగ చేసుకున్నాము.
అక్కడి నుంచీ నాకు డైరెక్ట్ గా నరసరావుపేట బస్సు దొరకటంతో మళ్ళాగుంటూరు వెళ్ళాలనే ఆలోచన ప్రక్కన పెట్టి, చుసారా ఎన్ని పది రూపాయల బిళ్లలో.
ఆఁ ఏంటి చెప్తున్నాను? అదీ. నరసరావుపేటకే డైరెక్ట్ గా టిక్కెట్టు తీసుకుని, హాయిగా చేతిలో ఉన్న పుస్తకాన్ని ఓపెన్ చేసి చదవటం మొదలెట్టాను. ఆ పుస్తకం గురించి ఇక్కడే చెప్తాను కానీ అసలు విషయానికి వస్తాను. నరసరావుపేట చక్కటి ఎండలకి ప్రసిద్ధి. ఆ ఎండానందాన్ని అనుభవించాలే కానీ చెప్పనలవి కాదు. ఎండా కాలవేఁవిటే. ఈ ఎండగోల ఎట్లు పడగలనే... (రామాకనవేమిరా...) స్టైల్లో మా వేదక్కయ్య నా చిన్నప్పుడు పాడేది. అంతటి ఎండలన్నమాట. కావాలంటే ’సుజాత’ గారిని అడగండి.
ఆ ఎండకి తట్టుకోలేక పక్కనే ఉన్న బాదంపాల బండీ దగ్గరికి వెళ్ళి రెండుగ్లాసుల బాదంపాలు ఖాళీ చేసి వెళ్ళబోతున్న సమయంలో ఇద్దరు అమ్మాయిలు (కళ్ళు పెద్దవి చేయకండి. ఖళ్ళు పొహోథాయి. ఝహాఘర్త. :-)D) లెమన్ వాటర్ కోసం ఒక బిళ్ళని ఇచ్చారు. "ఏంటమ్మా ఇది? దొంగ డబ్బులా?" అన్నాడు. ఆ బిళ్ళని ఎడా పడా పైకీ క్రిందకీ చూస్తూ. ఆ పిల్లలు (పది పదకొండేళ్ళు ఉంటాయి) బిక్క మొహం వేశారు.
నేనా బిళ్ళని నా చేతిలోకి తీసుకుని ఒకసారి పరిశీలించి అన్నాను. ఇది పది రూపాయల బిళ్ళే. వాడు తటపటాయిస్తుండగానే నేను నా పేపర్ పరిఙ్ఞానాన్ని ఉపయోగించి "నేను ఇది తీసుకుని మీ బదులు పది రూపాయిల నోటు ఇవ్వనా?" అన్నా. వీరపాండ్య కట్ట బొమ్మన్న (పోలిక బాగోకున్నా తప్పదు. ఫ్లోలో వచ్చింది ఫాలో కావాల్సిందే) మాదిరిగా. ఓ మూడు గంటాలక్రితం వరకూ తమిళనాడులో ఉన్న విషయం మీకు తెలుసు కదా. :-)
వాళ్ళు మహా కృతఙ్ఞతగా నా వైపు చూసి "అలాగే అన్నా," అన్నారు మహదానందంగా. వెళ్తూ వెళ్తూ నాకు పది సార్లు థాన్క్స్ చెప్పారు. ఉత్తిపుణ్యానికే. ఆ బిళ్ళ ఇలా ఉంది.
అదండీ సంగతి. ఇవాళ రెండు ఆనందాలు. ఒకటి ఎన్నాళ్ళుగానో అనుకున్న ఫ్లైటు ప్రయాణం చేశాను. తమిళమ్మాయి దయవల్ల. Advanced birthday gift క్రింద. రెండోది మా వాళ్ళలో అందరికన్నా ముందు పదిరూపాయిల బిళ్ళని సాధించాను. కుమారి పిన్నీ, రమాపిన్నీ, శరత్, అందరూ అడిగినా ఇవ్వకుండా అదేదో ప్రైజ్డ్ పొసెషన్ లాగా. అదో ఆనందం. నాది కాస్త పిల్ల మనస్తత్వం. దేన్నైనా చాలా ఈజీగా ఆనందిస్తాను.
ఇక ఈ సందర్భంగా రెండు తీర్మానాలు చేశాను.
ఏడాది క్రితం డబ్బులు లేక మండుటెండలో మియాపూర్ నుంచీ సికింద్రాబాద్ వరకూ నడిచిన నేను ఆరునెల్ల క్రితం తర్డ్ ఏసీలో ప్రయాణం చేయగలిగేదాకా ఎదిగి ఇదిగో ఇప్పుడు ఇవాళ ఫ్లైటులో ప్రయాణించే దాకా వచ్చాను. ఇప్పటికి నా దబ్బులు కాకున్నా, నేనూ సంపాదించటం మొదలెట్టాను. వేగంగా ఎదుగుతున్నాను. ఎలాంటి పరిస్థితిలో అయినా సంపదించగలను అనే నమ్మకం నా నరనరాల్లో జీర్ణించుకున్నది. ఇది ఒక శుభసూచకం.
మొదటిది... ఇక ముందు నా ప్రయాణాలు వీలైనంతలో విమానాల్లోనే జరగాలి. :-D
రెండోది... వీలైనన్ని పది రూపాయిల బిళ్ళలని సేకరించి, నా డబ్బాలో దాచిపెట్టి వాటితో కొత్త టెన్నిస్ రాకెట్ కొనుక్కోవాలి.
వైయస్ తన చేవెళ్ళ చెల్లెమ్మ సెంటిమెంట్ తో సీయం అయ్యాడు. ఈ పది రూపాయిల బిళ్ళ నన్ను సీయం కాకున్నా కనీసం పీయం చేస్తుందేమో చూడాలి. మన్మోహన్ లాగా. :-D
Anything is possible in a rational and benevolent universe అంటారు కదా. :-)