ఈ రాస్తున్న వ్యక్తి గురించి పరిచయం చేసే ధైర్యం నేను చేయను. కనుక మీరే హాయిగా చదివేయండి.
సుజాత says...
ఈ బ్లాగు పేరు చూస్తే మాంఛి యూత్ ఫుల్ గా ఉందనిపించింది.అందుకే ఈ బుక్సూ మరియూ గాల్ ఫ్రెండ్స్ కోసం ఒక యూత్ ఫుల్ పుస్తకం గురించి రాద్దామని చిన్న ప్రయత్నం!
ఈ పుస్తకం చదువుతుంటే శేఖర్ కమ్ముల చేతిలో పడితే మంచి సినిమా అవుతుందనిపిస్తుంది.ఎందుకంటే ఇందులో కథ ఉండదు.కేవలం స్క్రీన్ ప్లే మాత్రమే ఉంటుంది.అందుకే ఈ పుస్తకం చదువుతుంటే హాపీ డేస్ సినిమా కూడా గుర్తొస్తూ ఉంటుంది. కాకపోతే ఈ నవల ఎప్పుడో 1986లో అంటే డాలరుకి పన్నెండు రూపాయల మారకం విలువ వున్న రోజుల్లో 23 ఏళ్ళక్రితం రాసింది కావడం వల్ల అమ్మాయిలూ, అబ్బాయిలూ స్నేహితులుగా ఉన్నా 'ఒరే" "ఒసే" అనుకోరు.చక్కగా పేర్లతో పిల్చుకుంటారు పాపం!
ఈ నవల పేరు "రోజులన్నీ మావే"! రాసింది పుట్టగుంట గోపీ చంద్ అనే యువకుడు.(అప్పట్లో).ఆంధ్ర జ్యోతి డైలీ లో సీరియల్ గా వచ్చింది. అంతకు ముందు గోపీచంద్ 'మేఘన"అనే సూపర్ హిట్ నవల ఒకటి రాశాడు(అది కూడా నా దగ్గరుంది).ఈ నవల సీరియల్ గా వచ్చినపుడు చదవలేదు గానీ తర్వాత గుంటూర్లో సండే మార్కెట్ లో పాత పుస్తకాల్లో దొరికింది.పైగా స్వయంగా రచయిత ఎవరో వెంకటేశ్వరరావు గారికి ప్రేమతో ఆటోగ్రాఫ్ అనగా సంతకం పెట్టి మరీ ఇచ్చిన పుస్తకం. ఆ వెంకటేశ్వర్రావుకి బొత్తిగా మొహమాటం లేదల్లే ఉంది.పాత పుస్తకాల్లోకి పంపించాడు.
నీతి,సుదీప్,సంయుక్త,అన్వేష్,నటాష,పవన్ వీళ్లంతా అమెరికాలో పీజీ చదవాలన్న గాఢమైన కోరికతో ఒకే కాలేజీలో కొత్తగా డిగ్రీ పూర్తి చేసిన ఇరవయ్యేళ్ల యువతీ యువకులు.కానీ అమెరికా వెళ్ళిచదవడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి, కనీసం అక్కడ యూనివర్సిటీల్లో అర్హత పరీక్షలు పాస్ కావడానికి అయ్యే ఖర్చన్నా తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా సంపాదించాలని నిశ్చయించుకుంటారు. కానీ ఎలా అన్నదే ప్రశ్న! ఇప్పట్లాగా అప్పుడు షాపింగ్ మాల్స్ లోనో మల్టీ ప్లెక్సుల్లోనో యువతీ యువకులకు పన్లు దొరికే అవకాశాలు తక్కువ.నవల చదువుతున్నంత సేపూ ఇది 1986లో రాసిన నవలని గుర్తుపెట్టుకోవాలి.
వీరికి సలహాలనిస్తూ మోరల్ సపోర్ట్ ఇచ్చేది కాలేజీ ప్రిన్సిపాల్ కృపాకర్.GMAT,TOEFL వంటి పరీక్షలు ఎక్కడ రాయాలో, ఎంత ఖర్చు అవుతుందో అప్లికేషన్లు ఎలా తెప్పించుకోవాలో మొత్తం వివరాలు ఆయన సహాయంతో సంపాదిస్తారు.పరీక్షలకు ఇంకా నెల రోజుల టైముంటుంది.ఒక్కొక్కరికీ రెండువేలు చొప్పున ఆరుగురికీ కలిపి పన్నెండువేలు కావాల్సివస్తాయి. ఎలా సంపాదించాలి?
ఇదే ఆలోచన వాళ్లలో! టిప్పులూ అవీ వస్తాయి కాబట్టి ఒక బార్ లో పని చేయడానికి సిద్ధపడి వెళ్తారు. బార్ ఓనర్ హరికృష్ణ పగలబడి నవ్వి "ఎంత యూత్ అయితే మాత్రం ఎప్పటినుంచో పని చేస్తున్నవాళ్ళని తీసేసి మిమ్మల్ని పెట్టుకోవాలా?"అంటాడు. కొంచెం ఆలోచించి తనకు తెలిసిన మరో బార్లో కొద్ది రోజులుగా సేల్స్ పడిపోయాయనీ, వాటిని పెంచడానికి మంచి సలహా కావాలనీ అడుగుతాడు.
ఆ బారుకి ఎక్కువగా వయసు మళ్ళినవాళ్లు వస్తున్నారని గ్రహించిన మన బృందం పాత హిందీ,తెలుగు సినిమాల వీడియో కాసెట్ల ను సంపాదించి (అప్పట్లో ఇలా టీవీలు బార్లలో పెట్టడం లేదనుకుంటాను) వాటిని ప్లే చేస్తారు.దానితో వచ్చిన వాళ్ళు అంత త్వరగా పోలేక, వచ్చేప్పుడు కొత్త స్నేహితులని కూడా తీసుకురావడం మొదలెడతారు.
బారు జయమాని వీళ్ళ టెక్నిక్ ఫలించిందుకు సంతోషించి తలో వెయ్యీ ఇస్తాడు. ఇంకా ఆరు వేలు కావాలి.
ఒక సబ్బుల కంపెనీ తాము కొత్తగా తయార్ చేయబోయే సబ్బుకు కొత్త రకం ప్రచారం సూచించిన వారికి నగదు బహుమతి ప్రకటిస్తుంది.వీళ్ళు ఆ కంపెనీని కలిసి కొన్ని సబ్బులు తీసుకుని విజయవాడలో ఒక సిటీ బస్సు ఎక్కుతారు.విజయవాడ గురించిన ప్రశ్నలు అడుగుతూ సరైన సమాధానం చెప్పిన వారికి ఒక సబ్బు బహుమతిగా ఇస్తారు. ఆ తర్వాత ఆ కంపెనీ నుంచి ఏ సమాచారమూ ఉండదు. ఈ లోపు మిగిలిన డబ్బు సంపాదించడానికి రకరకాలుగా ప్రయత్నిస్తారు.సోఫాలు క్లీన్ చేయడం నుంచీ ఫ్లవర్ బొకేలు అమ్మడం వరకూ అన్ని పన్లూ చేస్తారు.
పరీక్ష రాయడానికి అందరూ బాంబే వెళ్తారు. నటాషా బంధువైన ఒక మిలిట్రీ ఆయనింట్లో దిగుతారు.అక్కడ లోకల్ రైల్లో పేకాటాడి కొంత డబ్బు సంపాదించడానికి కూడా వెనకాడరు.లోకల్ గా జరుగుతున్న ఒక ట్రేడ్ ఫెయిర్లో పాల్గొని తన ప్రింటింగ్ మెషీన్ ని ప్రమోట్ చేసుకోవాల్సిన మిలిట్రీ బాబాయి కాలు విరగ్గొట్టుకుని మూలపడటంతో ఈ బృందం దాన్ని విజయవంతంగా నిర్వహించి ముసలాయనకు మూడులక్షల లాభం చూపిస్తారు.దాంతో ఆయన వీళ్లకు అమెరికా టికెట్స్ తనే కొంటానని ప్రకటిస్తాడు.
తిరిగొచ్చి, మునిసిపల్ ఎన్నికల్లో ఒక అభ్యర్థి గెలవడానికి వార్డుల్లో అడ్డమైన పన్లూ చేస్తారు.అతడు గెలిచాక డబ్బివ్వకుండా ఎగ్గొట్టడంతో,అతడికి కొంత నాటకీయంగా బుద్ధి చెప్పడం సినిమాటిక్ గా ఉంటుంది.
చివరికి అందరికీ వీసా వచ్చి సుదీప్ కి రాకపోవడంతో అందరూ అమెరికా వెళ్లకూడదని నిర్ణయించుకున్నా, మరో సారి మరోలా ప్రయత్నించి సుదీప్ వీసా సాధిస్తాడు.ఈ లోపు సబ్బుల కంపెనీ వీరి ప్రచారాన్ని మెచ్చుకుని నగదు బహుమతిని పంపుతుంది. రాజకీయ నాయకుడికి బుద్ధి చెప్పి వసూలు చేసిన డబ్బు చేతికొస్తుంది.వీళ్ళ పట్టుదల శ్రమ చూసిన తల్లిదండ్రులు చదువుకయ్యే లక్ష రూపాయలు(లక్ష రూపాయలతో M.B.A..అప్పట్లో)ఖర్చుపెట్టడానికి ఒప్పుకోవడంతో కథ సుఖాంతం!
"ఇక రోజులన్నీ మావే"అని రెక్కలు కట్టుకుని అంతా అమెరికా ఎగిరిపోతారు.
కథేమీ లేకున్నా నవలంతా బోరు కొట్టకుండా సరదాగా సాగిపోవడమొక్కటే ఈ నవల్లోని సుగుణం.అందుకే శేఖర్ కమ్ముల సినిమాతో పోల్చింది. రోజుకు 24 గంటలూ పాటలు పాడుతుండే నీతి, ఒకరు చేసే పని ఒకరికి తెలీకుండా ఉండాలని పడే జాగ్రత్తలు,బొంబాయి రైలో పేకాడి డబ్బు సంపాదించడం, ఇవనీ సరదాగా ఉంటాయి.
మేఘన,రోజులన్నీ మావే ..నవలలు రెండూ హిట్టే అయినా పుట్టగుంట గోపీచంద్ ఆ తర్వాత ఏమీ రాయకపోవడానికి కారణం తెలీదు కానీ, రాస్తే మరిన్ని మంచి నవలలే వచ్చేవి.
1988 లో నవభారత్ బుక్ హౌస్ ప్రచురించిన ఈ నవల ఇప్పుడు బయట దొరకదు. విజయవాడలోనో, గుంటూర్లోనో ఏదన్నా పాత పుస్తకాల షాపులో దొరకాలి తప్పించి.
*** *** ***
Thanks. ఇంతకు మించి ఏమీ చెప్పలేను. The word says it all.
తెలుగు బ్లాగర్లందరికీ ఆహ్వానం. మీకు వీలైతే ఇలాగే మా బ్లాగులో మీ పుస్తకానుభూతులని పంచుకోగలరు.
Once again many thanks to
సుజాత గారు.
చైతన్య కళ్యాణి