ఇదెప్పుడో కిస్తుపూర్వం, అంటే భూంపుట్టకముందు చాలా కాలం క్రితం అంటే సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే అక్టోబరులో వ్రాశాను. అప్పటికి నా బ్లాగు కూడలిలో చేర్చబడలేదు. దీని ముందు టపాని ఇక్కడ చదవండి. అప్పటినుంచీ బ్లాగుల్లోనైతే పెట్టలేదు కానీ, మొత్తం ఇప్పటికి 11 కథలు వ్రాశాను, పున్నమి చెప్పినవి.
ఇక నుండీ B&G లో అవి నెలకు రెండు గా ప్రచురింపబడుతాయి.
ఆ మర్నాడు నన్ను నేను సెల్లు లో కనుగొన్నాను. అలా ఎందుకయ్యిందో తరువాత చెపుతాను. అంతకు ముందు ఓ పడి గంటల క్రితం నేను ఆ దయ్యం తో అన్నాను. "నీ పేరు నాకు నచ్చలా."
"ఎందుకు?"
"పున్నమి, 'పున్నామ నరకం' లాగా ఉంది. అందులోనూ నాకు పున్నమి చంద్రుడు నచ్చడు."
ఎవరో కిసుక్కున నవ్వినట్టు అనిపించింది. ఎవరా అని తల త్రిప్పి చూశాను. ఒక తలలేని ఆకారం. ఆడ దయ్యమే అనుకుంటా. "ఓరబ్బీ! నీగ్గానీ దిమాక్ఖరాబ్ గానీ ఐతున్నదా? అట్లగైతే నిన్ను ఎర్రగాద్దకి పంపాలె!" అంటూ నా మీదకి వచ్చింది. ఎంత చావాలనిపించినా ఆ తల లేని దయ్యాన్ని చూసి వెన్నులో ఒణుకు వచ్చింది. "బాబోయ్!" అని కేక వేయబోయా. "ఏయ్! సోనియా గాంధీ నువ్వూరుకో! తను నా ఫ్రెండ్." పున్నమి అంది.
తను కూచింది తన శవ పేటికలో. "ఎందుకట్టా లేచావ్?" అడిగాను. భయాన్ని దాచుకునే ప్రయత్నం చేస్తూ.
"పున్నమి సెంద్రుడు నచ్చట్లేదంటవ్? ఎర్రి నా కొడుకల్లె ఉన్నవ్ బిడ్డా!"
"ఓరి నాయనోయ్! నువ్వు తెలంగాణా దయ్యానివా? యాస సరిగ్గానే ఉందా?"
"అదా! నేను ఆ యాసని ట్రై చేస్తున్నాను. 'మళ్ళీ తెలంగాణా దయ్యం' అనకు. కేసీయార్ ఎగిరి తంతాడు." అంది సదురు సోనియా గాంధీ. "తను ఎక్కువ గా పున్నమి రోజుల్లోనే లేచి తిరుగుతుంది. అందుకే ఆ పేరు పెట్టాము."
"అంటే పూర్వ నామదేయాలు కూడా ఉంటాయా మీకు?"
"ఉన్నాయి అమ్మా నాన్నా పెట్టిన పేర్లు. ఇక్కడ మాకు నచ్చిన పేర్లు పెట్టుకుంటాము."
పున్నమి మా సంభాషణని ఎంజాయ్ చేస్తున్నట్టుంది. అందుకే మేలి ముత్యాలు ఒలక పోస్తున్నట్టు చిరు నవ్వులు చిందిస్తోంది. నెల రాజు 'తిండి తిని నెల రోజులయ్యింది' అన్న టైపులో మొహం పెట్టాడు. ఆమె ముందు వెల వెల పోతున్నందుకు.
"మరి నీ పేరు సోనియా గాంధీ ఎందుకు?" వినాశ కాలే విపరీత బుద్ధి అనుకుంటూ. ఎక్కడ అది నా మీద పడుతుందో అన్న భయం ఉన్నా నా చావు ఎప్పుడొచ్చినా ఏమిటి నష్టం అనుకుంటూ ధైర్యంగా ఉన్నా.
"దానికి బుర్ర లేదని ఆ పేరు పట్టాము కానీ, రా చంటీ! మనం మాతాడుకుందాం," అంది పున్నమి.
"నిన్ను నేను ఏమని పిలవను?"
"పున్నమి నచ్చలేదన్నావుగా! నువ్వే పేరు పెట్టు."
"జమీల్య!"
"చాలా బాగుంది. దాని అర్ధం తెలుసా?"
"తెలుసు. అరబ్బీలో 'అందమనది' అని అర్ధం."
"అబ్బో! చంటి బాబు కి అరబ్బీ కూడా వచ్చే?"
"రాదు." ఏడుపు మొహంతోఅన్నాను. "ఆ పేరు చిన్ఘిజ్ ఐత్మాతోవ్ వ్రాసిన ఒక నవల లోది. హీరోయిన్ పేరు. నాకుబాగా నచ్చిన పేరు అది."
"అబ్బో! అయ్యగారు కళా పోషకులే!" కళ్లు పెద్దవి చేస్తూ ఎక్కిరించింది.
"నీకా కథ తెలుసా?"
"చదివాను. ఈ మధ్యే! ఒక శాపులోనుంచీ కొట్టేసి. ఆ హీరోయిన్ నాకూ బాగా నచ్చింది. నాకూ తనలా ఉండాలనిపించింది."
"ఐతే ఆ కథ చెపుతావా?"
"చదివానన్నావ్?"
"నీ మాటల్లో వినాలనీ..."
"సరే! విను" అంటూ మొదలెట్టిందికాదు కానీ ఆ కథ గురించి చెపుతాను. అయినా ఇది చెప్పు. నీకు పున్నమి అన్న నా పేరు ఎందుకు నచ్చ లేదు?"
"నాకు పంచమి చంద్రుడంటే ఇష్టం."
"గురుడికి తిక్కేమన్నా ఉందా?"
"కాదు పంచమి చంద్రుడు ఎలా ఉంటాడు?"
ఇలా అంటూ గాల్లో చూపించింది. నిజంగానే అక్కడ ఆ ఆకారం నాకు గాల్లో కనిపించింది. సంభ్రమాశ్చర్యాలకి లోనయ్యాను.
"ఇలా కదా! అలా చూడు. నవ్వుతున్నట్టు లేదూ! అదే పున్నమి చంద్రుడు అదోలా నోరు తెలుచుకుని నిద్దరోతున్న న్యాయం లా ఉంటాడు. అదీ కాక కొంచం ఏడుపు సింబల్లా!"
"నీలోనూ విషయం ఉందబ్బాయ్! ;-) కానీ ఏడుపు సింబల్ సరిగా లేదేమో! కథ విను." ముగ్ధ మనోహరంగా నవ్వింది.
ఆ కలకూజిత స్వరం లోనుంచీ ఆ కథ గురించి ఇలా విన్నాను.
(సశేషం)