BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...

పున్నమి (నా భాషలో చెప్పాలంటే జమీల్య) చెప్పుకుంటూ పోయింది.


"'జమీల్య' ఎంత అందమైన పేరు? అసలు ఆ కథ సొగసంతా ఆ పేరులోనే ఉంది. చిన్ఘిజ్ ఐత్మాతోవ్ అద్భుతంగా చెప్పాడు కథని. సయ్యద్. ఒక చిన్న పిల్లడు. అతని మాటల్లోనే రచయిత తన కథని నడిపిస్తాడు. అంటే first person narration అన్న మాట."

నేను 'తమ్ముడి మాట' అనబోయి తమాయించుకున్నాను. ఆ కోకిల పాటకి అడ్డు రాకూడదని.

తను కొనసాగించింది. "మనిషి హృదయాన్తరాళాల్లో ఏ మూలో దాగున్న భావుకతని తట్టి లేపే కథ అది. జమీల్య ని సాదిక్ బలవంతంగా ఎత్తుకుని వచ్చి పెళ్లి చేసుకుంటాడు. అదెలాగంటే... జమీల్య తో ఒక సారి గుర్రప్పందేలలో ఒడి పోతాడు సాదిక్. ఆ అవమానాన్ని తట్టుకోలేక తనని బలవంతం గా ఎత్తుకుని వెళ్లి పెళ్లి చేసుకుంటాడు.

"అసలు మగాళ్ళంతా ఇంతేనా? అనిపిస్తుంది చాలాసార్లు. ఆడవాళ్ళు తమ మీద గెలిచినా వారికది అవమానమే! తట్టుకోలేరు. చేతనైతే గెలవాలి. లేదా ఓటమిని హుందాగా అంగీకరించాలి. సాదిక్ కి అది తెలీదేమో. అయినా స్త్రీని తనలా స్వీకరించలేని వాడూ ఒక పురుషుడేనా? ఐత్మాతోవ్ మనకా మాటని అంతర్లీనంగా చెప్తాడు. సయ్యద్ రూపంలో."Excuse me... One small doubt."


ఏంటన్నట్టు పున్నమి/జమీల్య కళ్ళెగరేసింది. "స్త్రీని తనలా... అర్థం కాలేదు." అన్నాను.నెత్తిమీద చిన్నగా మొట్టి చెప్పింది. "అమ్మాయిలకీ ఆత్మాభిమానం ఉంటుందని. అలా ఆత్మాభిమానం ఉన్న ఆడపిల్లలని, తమ ఆత్మాభిమానం లాటిదే వారిది కూడా అనీ, వారిని వారిలా..." నాకర్థమయిందని జమీల్యకర్థమయిందనుకుంటా. ఆపేసి మళ్ళా అసలు కథని కొనసాగించింది.


జమీల్య. తన పేరుకు తగ్గట్టుగానే అందమైంది. ఎంత అందమైంది? తన జీవితాన్ని ప్రేమించుకునేటంత అందమైంది. 'ఆమె స్వాభావం లో ఏదో మగవాళ్ళ లక్షణాలు, అదొక మోస్తరు దుడుకుతనం...తనని అకారణంగా పల్లెత్తు మాటైనా అంటే ఊరుకోదు. వాళ్ళని నోరేత్తనీయకుండా మొహం మీదే నాలుగూ అనేసేది' అని మనకి సయ్యద్ చెపుతాడు.

"ఇరుగు పొరుగు అమ్మలక్కలు తన అత్తగారికి చెపితే ఆమె సమర్ధనగా 'ఇదే మంచిది లెండి. మా కోడలు ఉన్నమాట చెపుతుంది. అనేదేదో మొహం మీదే అంటుంది. ఇదే నయం. ఎదుట నోరు నొక్కుకుని చాటున తిట్టటం కంటే. మీ వాళ్ల మౌనం ఓ నటన. ఆ మౌనం - కుళ్ళిన కోడి గుడ్డు: పైకంతా నునుపూ, నిగనిగా. ఇహ లోపలా - ముక్కు మూసుకోవాల్సిందే.' అంతటి అభిమానం. (అయినా...). అలా ఐత్మాతోవ్ మనకి జమీల్యాని పరిచయం చేస్తాడు.


"అసలు జమీల్యా అమ్మాయిలకి డ్రీం గాళ్. ఏ మాయామర్మమూ తెలీని, చిన్నపిల్ల లాంటి మనస్తత్వం. ఎంత ఒత్తిడిలో ఉన్నా కూడా తటాలున నవ్వటం! చెంగు చెంగున లేడి పిల్లలా గెంతతం. కాలాగాడు మరి. అత్తగారిని కావిలించుకుని చిన్న పిల్ల లా ముద్దెట్టటమ్. అబ్బ! అలా ఉండాలనీ, అంత హాయిగా జీవించాలనీ ఎవరికి ఉండదు.

"అందుకే జమీల్యా సయ్యద్ కి నచ్చింది. తనకి వదినె గారవుతుంది. బిడియం అంటే తెలీని తానంటే గ్రామంలో అందరికీ అంగీకృతం కాదు. అంతే గా తన జీవితాన్ని ప్రేమించటం అంటే ఈ లోకం లో ఒక నేరం. అలాటి వారిని అందరూ అంగీకరించలేరు.

"అవునబ్బాయ్! నువ్వు ఎందుకు చచ్చిపోవాలనుకున్టున్నావ్?" ప్రావాహానికి ఆనకట్ట వేసినట్టు అడిగింది. నా కళ్ళలోకి చూస్తూ.

"నీకేలా తెలుసు?" అడగ బోయాను. వెంటనే తను ఒక దయ్యం అనీ, తనకి ఆ మాత్రం తెలీటం ఆశ్చర్యం కాదనీ నాకు గుర్తొచ్చింది. అందుకే నేను "ముందు నువ్వు చెప్పు. తరువాత నేను చెప్తాను." అన్నా.

తను నిట్టూర్చింది. మళ్ళీ కొనసాగించింది. "చంటీ! ఆడ పిల్లలు కనిపిస్తే అబ్బాయిల కళ్లు ఎక్కువ గా స్కాన్ చేయాలనే ప్రయత్నిస్తాయి. యుద్ధం రోజులయి, ఆ ఊరిలో అందరూ అంటే చాలా కుటుంబాలలో వయసున్న వారిని సైనికులగా పంపాల్సి వచ్చేది. ఊళ్ళో మిగిలేది సంనాసులూ, చిన్న పిల్లలూనూ. అందరి కళ్ళూ జమీల్య మీదే.

"కొందరు సంనాసోల్లకి తానంటే ఏ ఆడదైనా పడి చస్తుందని ఒకరకమైన ఫీలింగు. అలాంటి వారు ఎక్కడైనా ఉంటారు. అలాంటి వాడే ఒస్మాన్. వాడొకసారి తనని అల్లరి పెట్టబోతే జమీల్యా అన్న మాటలు నాకెంత నచ్చాయో. 'యుద్ధం నుంచీ తిరిగి రాని సైనికుని భార్యగా నూరేళ్ళూ ఉంటానుకానీ నీ లాంటి చచ్చు దద్దమ్మ మొహం మీద ఉమ్మనైనా ఉమ్మను.'

ఇది కాదు. తన మనోభావాలని మనం చదవాలి. ప్రేమ లేని పెళ్లి ఎంత గొప్ప కుటుంబం లోకి తీసుకెళ్ళినా జమీల్యా లాంటి అమ్మాయి ఎక్కువ కాలం ఉండలేదు. అందుకే దనియార్ మీద తనకి ఉన్నది ప్రేమే అని గ్రహించగానే బంధనాల అడ్డుతెరాలు తొలగించుకుని వెళ్లి పోయింది.

"సాదిక్ తన ఇంటికి సైనిక స్థావరం నుంచీ ఉత్త వ్రాసే సన్నివేశాన్ని ఐత్మాతోవ్ చాలా బాగా చెప్తాడు. సంప్రదాయ బద్ధం గా పెద్దలందరికీ తన నమస్కారాలను చెప్పి చివరలో 'జమీల్యాని కూడా అడిగానని చెప్పండి.' అంటాడు. అక్కడే తనకి భార్య మీద ఉన్న ప్రేమ తెలుస్తుంది. అక్కడ సయ్యద్ భావాలని చదివితే అంతర్లీనంగా ఐత్మాతోవ్ ఎలాంటి సెటైర్ వేశాడో మనకి తెలుస్తుంది.

"ఇది కాదు చంటీ! అసలు విషయం ఇప్పుడు చెప్పుతాను."

నేను నాకు తెలీకుండానే ఆ మాటలని మంత్ర ముగ్ధుడనయి వింటూనే ఉన్నాను. నేను ఎప్పుడు వాలానో తెలీదు కానీ ఆ స్మశానంలో నా ఎడమ అరచేతిలో తల పెట్టుకుని అలా వింటూనే ఉన్నాను.

నేను వింటున్నానో లేదో అని ఒక సారి చూసి తను నవ్వింది. "ఎందుకు నవ్వావ్?" అడిగాను.

"నువ్వెక్కడ పడుకున్నావో తెలుసా?"

(సశేషం)సినిమాలకి సంబంధించి ఏ అంశం నాకు పెద్దగా దొరకలేదు. చైతికి వేరే పని ఉంది. అందుకే "పున్నమి చెప్పిన కథలు మరో భాగం ఇస్తున్నాను. 

Posted by గీతాచార్య Oct 9, 2009

Subscribe here