BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...




రెండేళ్లలో ప్రపంచమంతా మునిగిపోతుంది. తట్టాబుట్టా సర్దుకోండి. సర్దుకున్నాం బానే ఉంది. ఎక్కడికెళదాం? అసలు 2012 లో ప్రపంచం అంతమవుతుంది అన్న సన్నాసి, ఈ సినిమా అద్భుతంగా ఉన్న వెర్రివెదవ ఎవడు? ఒక భూకంపం, ఒక సునామి, ఒక అగ్నిపర్వత విస్ఫోటనం, ఒక జళ ప్రళయం ఇలా మరికొన్ని సంఘటనలు కలిపి అందమైన గ్రాఫిక్స్ తో స్లైడ్ షో చేసి , వాటిని అతికించడానికి మన బాలయ్య, చిరు లాంటి సూపర్ హీరో ఉంటే అహా! మహాద్భుతమైన హాలీవుడ్ తెలుగు సినిమా కాదూ. చూసి నమ్మేవాళ్లు ఉంటే తప్పకుండా అవుతుంది.

అసలు ఈ సినిమాలో కథ ఏంటి? అంటే రెండేళ్ల తర్వాత భూమిలోని మార్పుల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఉపద్రవాలు సంభవించి మొత్తం నాశనమవుతుంది అని. అసలు ఈ సినిమా తీసింది జనాలను భయపెట్టడానికా? దానికి 2012 మాత్రమే ఎందుకు తీసుకోవాలి? భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదం వస్తే చూడడానికి, చూసినా బ్రతికి మిగతావారితో చెప్పుకోవడానికి మనం బ్రతికి ఉండము కదా.అందుకే పురాణాల్లో దేవుళ్లు భవిష్యత్తు చూపించినట్టు ఇలా తెరకెక్కించి , భయపెట్టి, జనాలను ఫూల్స్ చేసి తాము పెట్టిన పెట్టుబడి ఎప్పుడో వసూలు చేసుకున్నారు.

సినిమా రిలీజ్ కాకముందు, ఐన తర్వాత నుండి మా పిల్లలు మా వెంట పడి టికెట్లు బుక్ చేసి పంపించారు. సినిమాలు చూసి ఆనందించే శక్తి, ఓపిక ఎప్పుడో పోయింది. సరే అందరూ అంటున్నారు , దాని సంగతేంటో చూద్దామని IMAX వెళ్లాము. ఒకసారి ఈ పెద్ద తెర ఎలా ఉంటుందో అని కూడా అనుకున్నాము. అసలు ఈ జనాలు థియేటర్లకు సినిమా చూడడానికి వస్తారో , తినడానికి వస్తారో నాకర్ధం కాదు. దాదాపు సగం కంటే ఎక్కువ మంది ప్రేక్షకులు టికెట్టుతో పాటు పేలాల పొట్లాలు, బ్రెడ్ ముక్కలు, పురుగుల మందు డబ్బాలు పట్టుకుని వచ్చారు. నాలాంటి చాదస్తపు రాయుళ్లు ఇంట్లోనే సుబ్బరంగా అన్నం, పప్పు తినేసి నీళ్ల బాటిల్ కూడా తెచ్చుకున్నారు.

ఇక కథ విషయానికొస్తే ... ఇక్కడ నాకు నచ్చిందేంటి అంటే.. కథ లేదా సినిమా విజయవాడ నుండి ప్రారంభమైంది. కానీ నాకో సందేహం. విజయవాడ రైల్వే స్టేషన్లో విజయవాడ అని హిందీలో బోర్డ్ ఉందా? హైదరాబాదు అంటే ఉంటుందిలే అనుకోవచ్చు.. మరి విజయవాడలో హిందీలో బోర్డ్ అంటే?? ఇక్కడి శాస్త్రజ్ఞులు జరిపిన పరిశోధనల్లో తేలిన విషయం ఏంటంటే భూమి అడుగు పొరల్లో వేడి పెరిగి రెండేళ్లలో అంతమైపోతుంది. సరే బాగుంది. ఇది అమెరికావోడికి తెలిసింది. అపురూపమైన చిత్రాలు జాగ్రత్త చేస్తారు. అక్కడెక్కడో చైనాలో డ్యాం కడుతున్నారంట. హీరో సంగతి చూస్తే అతను ఒక రచయిత. ఒకసారి అతనికి ఒక పార్క్ లో ఒక రేడియో జాకీ ద్వారా చైనాలో ఒక స్పేస్ షిప్ తయారు చేస్తున్నారు. ప్రత్యేకమైన వస్తువులు, జంతువులు, మనుష్యులను అక్కడికి తరలిస్తున్నారు. ప్రపంచం అంతమైనా వారు సురక్షితంగా ఉంటారు అని తెలుస్తుంది. (ఇవన్నీ అతడికెలా తెలిసాయో మరి. ఆ ఒక్కటీ అడగొద్దు).. హీరో తన భార్యా పిల్లలను రక్షించుకోవడానికి ఒక ప్లేన్ మాట్లాడుకుని శరవేగంతో ఇంటికెళ్లి వాళ్లను , భార్య స్నేహితుడిని కూడా తీసుకుని బయలుదేరుతాడు. అప్పటికే విధ్వంసం మొదలైంది. భూకంపం వచ్చి ఇల్లు, ఫ్లై ఓవర్లు, రోడ్లు అన్నీ పేక మేడల్లా కూలిపోతుంటాయి. దూసుకుపోతున్న హీరోకారు వెనకాలే రోడ్డు విరిగిపోతుంటుంది. ముందు ఏమీ కాదు. అలా రాకెట్ వేగంతో కారును పరిగెత్తిస్తాడు రచయిత హీరో. రచయిత ఐతే మాత్రం సూపర్ డ్రైవర్ కాకూడదా?. మన బాలయ్య ఇండియాలో కొండమీదినుండి జంప్ చేసి పాకిస్తాన్ లో ప్యారచూటుతో దిగలేదా? అలాగే ఇదీను.. బుల్లిప్లేన్ దగ్గరకొస్తే పైలట్ అప్పటికే డామ్మన్నాడు. భార్య స్నేహితుడి కొంచం కొంచం ప్లేన్ డ్రైవింగ్ తెలుసు. అతడిని బలవంతంగా ప్లేన్ ఎక్కిస్తారు. ఇక్కడా సేమ్ సీన్ రిపీట్. ప్లేన్ తప్ప అంతా నాశనమవుతుంది. పైలట్ కానివాడు ప్లేన్ నడిపితే కూలిపోతున్న రెండు భవంతుల మధ్యనుండి సునాయసంగా దూసుకుపోతుంది తెలుసా? చివరికి కిందా మీదా పడి చైనా చేరుకుంటారు వీరంతా. అప్పటికే సగం ప్రపంచం నేలమట్టమైపోయింది. ప్రముఖులందరూ చైనా చేరుకున్నారు. ఇక్కడ కొన్ని ట్విస్టులు. ఒక గేట్ మూసుకోదు. జళప్రళయం సంభవిస్తుంది. షిప్ అంతా నీరు చేరుతుంది. హైడ్రాలిక్ సిస్టంలో ఏదో సమస్య. హీరో ఆ చుట్టుపక్కలే ఉంటాడు. ఆ సంగతి తెలుసుకుని , నేను చేస్తా అని వీరోచితంగానీటిలో మునిగి , ఈదుకుంటూ వెల్లి ఆఖరి ఐదు సెకన్లలో సరిచేస్తాడు. గేటు మూసుకుంటుంది. ఎవరెస్ట్ శిఖరాన్ని ఢీకొట్టాల్సిన స్పేస్ షిప్ వేగంగా పక్కకు తిరిగుతుంది. హమ్మయ్యా! గండం గడిచింది. కాని నాకు ఇక్కడ పేద్ద డౌటు. స్పేస్ షిప్ అంటే అందరూ స్పేస్ లోకి వెళతారు అని ఎదురుచూస్తూ ఉన్నా. కాని అలా జరగలేదే. మరి అలా ఎందుకన్నారబ్బా?? చివరికి ఆఫ్రికాలో కొంత భాగం మిగిలిపోతుంది. మిగతా ప్రపంచమంతా మటాష్.

ఖేల్ ఖతం!!

నిజంగా 2012 పెద్ద ఉపద్రవం సంభవిస్తుంది అనే భయం, ఈ సినిమా చూస్తే వివరాలు తెలుస్తాయి అనుకుంటే మాత్రం చూడకండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం, నాస్ట్రాడామస్ పుస్తకాలు చదివితే ఏయే వింతలు, అద్భుతాలు జరగనున్నాయో తెలుస్తుంది . కాని ఈ చిత్రం Independence Day, The Day after Tomorrow లా ఒక అద్భుతమైన గ్రాఫిక్స్ మాయజాలం అని మాత్రం చెప్పగలను. మిగతావిషయాల గురించి ఆలోచించకుండా సినిమా అలా చూసి వచ్చేయడమే ఉత్తమ ప్రేక్షకుని లక్షణం.

Posted by జ్యోతి Nov 27, 2009

Subscribe here

భువన సుందరి సీరియల్ చదవండి

భువన సుందరి సీరియల్ చదవండి
Keira Knightley: Beautiful Lady reading a Book

You said it!