మరువం ఉష Says...
ప్రేమ జీవిస్తూనే వుందింకా,
ఏ అమృతం తాగిందో.
ఏ రూపున తానుందోనని
నేను వెదుకుతున్నానింకా.
నింగి వంక చూస్తే
నేలకి సారించిన చూపులతో
ప్రేమారగ తడమను మబ్బుచేతులు
ఈ వంకే చాపుతున్నట్లుంది.
నేల తీరును గమనిస్తే
కురిసే మంచు పొదివిపట్టి
గోరువెచ్చని కౌగిలితో హత్తుకోమని
సూరీడుకి కబురంపుతుంది.
సూరీడు యేడని వెదికితే
కడలి కన్నె వెంట అడుగులేస్తూ
ప్రియమార తనలోకి అదుముకోను
బొట్టు బొట్టునీ చుట్టుముట్టేస్తున్నాడు.
కడలి ఒడ్డున అడుగులేస్తే
అలల తనువు వెల్లకిలా పరుచుకుని
అంగుళం విడవక సైకతతిన్నెల్లో
తన ప్రియుని రూపు చిత్రిస్తుంది.
ఇసుక రేణువు మెరుపు ఎందుకంటే
ఎన్నిమైళ్ళన్నా ఈదులాడి
ఓ గవ్వ లోని బుల్లి నేస్తాన్ని
కవ్విస్తానన్నట్లే వుంది.
మువ్వంటి మగువ కెదురుపోతే
గువ్వంటి మావ గునుస్తుంటే
ప్రేమ తీర్థం ఇస్తానంటూ
కంటిపాత్రలు మళ్ళీ నింపుకుంటుంది.
పడతి మనసు దోచిన మగని పలుకరిస్తే
ప్రేమ సిరాతో లిఖించిన లేఖ
వేవేల పారాయణాలు చేస్తూ
జగతిన వున్నది తామిద్దరమేనన్నాడు.
ప్రేమలేఖలెన్నని లెక్కించబోతే
వసంతుడు తన చివురాకులు చూపాడు
లెక్కలేనన్ని చిరునామాలలో ప్రణయదేవత ఫక్కున నవ్వుతూ
నన్నాలింగనం చేసుకుని అడిగింది "ప్రేమ" ఎక్కడుందీ అని.
Many thanks to ఉష గారు.
చైతన్య కళ్యాణి