కాలం ఎంత విచిత్రమైనది. అప్పుడే సంతోషంలో ఆకాశానికెత్తేస్తుంది. మరు నిమిషంలో దుఖంలో ముంచేస్తుంది. ఈ పరిణామం మనిషికి ఊహల్లోకి కూడా రాదు. మనిషి స్వయంకృషితో పైకొచ్చినవాడైనా, ఎంత అస్థి సంపాదించినా అంతా తన శక్తి సామర్ధ్యాలు అనుకుంటాడు. నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను . భవిష్యత్తు నా చేతిలో ఉంది. అది చేస్తా!. ఇది చేస్తా! అని ఎన్నో అనుకుంటాడు. కాని అతనికి తెలీని విషయం ఒక్కటి ఉంది . అది కాలం. దానిచేతిలో అందరం కీలుబొమ్మలం. భవిష్యత్తులో ఎన్నో చేయాలి, చేస్తాను అనుకుంటాము కాని మరో పది నిమిషాల్లో కాలం ఆడే ఆటలు ఊహించతరం కాదు. అలాగే ఎటువంటి గాయాన్నైనా చేసే శక్తి, అదే గాయాన్ని నయం చేసే శక్తి కూడా ఈ కాలానికి ఉంది.
భరించలేని బాధ కలిగినప్పుడు, ఏదైన ఉపద్రవం సంభవించినప్పుడు మనిషి కృంగిపోతాడు. ఇక తను బ్రతకడం కూడా వేస్ట్ అనుకుంటాడు. కాని కాలం అతని గాయాన్ని మెల్లిగా నయం చేస్తుంది. బ్రతకడానికి మరో దారిని, ఆశను కల్పిస్తుంది. అలాగే తన పెళ్లి పత్రికలు స్నేహితులకు ఇవ్వడానికి వెళ్లిన అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోవచ్చు. పెళ్లిపందిట్లోనే అగ్నిప్రమాదం జరిగి పెళ్లికొడుకుతో సహా మరికొందరు అగ్నికి ఆహుతి ఐన సంఘటనలూ ఉన్నాయి. అంతెందుకు ఈ మధ్య సంభవించిన వరదలు గుర్తున్నాయిగా?. రాజులెందరో పేదలయ్యారు. వేలమందికి అన్నం పెట్టే రైతన్న వరదల్లో సర్వం కోల్పోయి అన్నమో రాంచంద్ర లైన్లో నిలబడి చేతులు సాచాడు. కోటీశ్వరుడు కూడా కట్టుబట్టలతో మిగిలాడు. అసలు వై.ఎస్.ఆర్ కాని అతని కుటుంబ సభ్యులు కాని, ప్రజలుకాని ఇలా ప్రమాదం జరుగుతుంది అని కల్లో కూడా ఊహించి ఉండరు. ఒక్క గంటలో అంతా తల్లక్రిందులయ్యింది. మళ్లీ తిరిగి బాగుచేసుకోలేని నష్టం కలిగింది. ఇదే కాలమహిమ.
ఇలాంటి కథను మన కళ్లముందుంచే సినిమా అలనాటి ఆణిముత్యం, 1965 లో యష్ చోప్రా నిర్మించిన చిత్రం“Waqt”. ఈ సినిమాలో బలరాజ్ సహాని ఒక వ్యాపారవేత్త. కష్టపడి వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తాడు. తన వ్యాపారాన్ని విస్తరింపచేస్తున్న సందర్భంలోతన కొడుకుల పుట్టినరోజు ఒక వేడుక ఏర్పాటు చేస్తాడు. అతని ముగ్గురు కొడుకులూ వేర్వేరు సంవత్సరాలలో ఒకే నెలలో, ఒకే రోజు జన్మిస్తారు. అది ఒక విశేషంగా భావిస్తాడు లాలా. తన జీవితం తన చేతుల్లోనే ఉంది. ముందు ముందు తన ముగ్గురు కొడుకులూ తన అడుగుజాడల్లొనే ఎంతో పేరు సంపాదిస్తారు అని, తన స్నేహితులతో మురిసిపోతూ చెప్తాడు. తాను అనుకున్నట్టు పిల్లలు తయారు కాకున్నా సరే తన కండబలంతో వాళ్లను చివరిదాకా రాజాల్లా చూసుకుంటాను అని గర్వంతో చెప్తాడు. ఇంట్లో వేడుక జరిగిన రాత్రి హటాత్తుగా భూకంపం వచ్చి సర్వం నాశనమవుతుంది. భార్యా,పిల్లలు అందరూ చెల్లా చెదురవుతారు. లాలా హత్యానేరంతో జైలులో ఉంటాడు. పెద్ద కొడుకు దొంగ అవుతాడు. రెండో వాడిని పెంచుకున్నవాళ్లు న్యాయవాదిని చేస్తారు. చిన్నవాడు తల్లితో ఉండి చాలా బీదరికంలో ఉంటాడు. ఏదో ఒక సందర్భంలో అన్నదమ్ములు ఒకరికొకరు తారసపడుతుంటారు. రెండోవాడు సునీల్ దత్ ప్రేమించిన సాధనను రాజ్ కుమార్ ఇష్టపడతాడు. కాని అతను తన స్వంత తమ్ముడే అని తెలుసుకుని తప్పుకుంటాడు. పెద్ద కొడుకు రాజ్ కుమార్ బాస్ అతడిని ఒక హత్యా నేరంలో ఇరికిస్తాడు. నిర్దోషియైన తనను రక్షించమని లాయర్ ఐన తమ్ముడు సునీల్ దత్ ని అర్దిస్తాడు. ఎప్పుడు సరదాగా ఉంటూ, క్షణం కూడా ఆగకుండా వాగుతూ ఉండే సునీల్ దత్ చాక చక్యంగా వాదించి, న్యాయస్ధానంలో అసలు దోషిని అందరి ముందుకు తీసుకొస్తాడు. ఇందులో చిన్న కొడుకు శశికపూర్ తన తల్లి వైద్యం కోసం ఆ దోషి ( తన యజమాని) దగ్గర డబ్బులు తీసుకుని దొంగ సాక్ష్యం చెప్తాడు. కాని తల్లి మందలింపుతో నిజం చెప్తాడు. చివరికి అంతా సుఖం. ఇదే సమయంలో కుటుంబం మొత్తం కలుసుకుంటారు. వెనకాలే హీరోయిన్లూ వస్తారు. కథ సుఖాంతం అవుతుంది. కొడుకులతో కలిసి లాలా కొత్త వ్యాపారం మొదలుపెడతాడు. “ఇప్పుడే ఏమయింది? ముందు ముందు మీ వ్యాపారాన్ని ఇంకా ఎక్కువ వృద్ధిలోకి తీసుకొస్తాం” అన్న కొడుకుతో " వద్దు బాబు.. ఒకప్పుడు నేను కూడా ఇలాగే విర్రవీగాను. కాలం ఎప్పుడూ మన చేతిలో లేదు. ఎప్పుడు దానిని అంచనా వేయకు. మంచి కాని, చెడు కాని అంతా కాలం చేతిలొ ఉంది మన చేతిలో ఏమీ లేదు. నిమిత్తమాత్రులం "అని హెచ్చరిస్తాడు లాలా ..
బహుశా భారీ తారాగణంతో నిర్మించిన మొదటి చిత్రం ఇదేనేమో. రాజ్ కుమార్, సునీల్ దత్, బల్ రాజ్ సహాని, శశికపూర్, షర్మిలా తాగూర్, రెహ్మాన్, అచలా సచ్ దేవ్ వంటి ప్రముఖ నటీ నటులు ఈ చిత్రంలో నటించారు. భారీ సెట్టింగులు, ఖరీదైన కార్లు, వగైరా మసాలా దినుసులెన్నో ఈ చిత్రంలో ఉన్నాయి. అలాగే అన్నింటికి మించి అద్భుతమైన పాటలు, రవి అందించిన సంగీతం. ఈ చిత్రంలో రాజ్ కుమార్ అనగానే డైలాగ్ కింగ్. అతనికి మాత్రమే నప్పుతాయి, అతను మాత్రమే ఇలా చెప్పగలడు అనదగ్గ డైలాగులు ఇప్పటికీ అందరికీ గుర్తుండిపోతాయి. " యే బచ్చోంకి ఖేల్ నే కి చీజ్ నహీ.... హాత్ కట్ జాయేతో ఖూన్ నికల్ ఆయేగా" (ఇది పిల్లలు ఆడుకునే వస్తువు కాదు, తెగిందంటే రక్తం వస్తుంది) , "జిన్ కే అప్నే ఘర్ షీషే కే హో, వోహ్ దూస్రో పర్ పత్తర్ ఫేంకా నహీ కర్తే ( అద్దాల మహలులో ఉండేవాళ్లు ఇతరులపై రాళ్లు వేయరు), మరో విషయం. సాధనా కట్, టైట్ చుడీదార్లు ఈ సినిమాతోనే మొదలయ్యాయి. అమ్మాయిలందరినీ ఆకర్షించాయి ఆ రోజుల్లో.
ఈ సినిమాలోని అద్భుతమైన పాటలు ...
వక్త్ కే దిన్ ఆర్ రాత్..
ఏయ్ మేరె జోహ్ర జబీన్..
కౌన్ ఆయా కి ...
చెహ్రే పే ఖుషీ ఛా జాతీ హై...
హమ్ జబ్ సిమట్ కే ఆప్కే ..
దిన్ హై బహార్ కే...
ఆగే భీ జానే న తూ ..
ఈ వారాంతం హాయిగా గడపండి..