BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...

పి ఎస్ ఎమ్ లక్ష్మి గారు యాత్ర బ్లాగ్ ద్వారా సుప్రసిద్ధులు. వారు మనసున మనసై పాట గురించి ఇలా చెప్తున్నారు.


అందరికీ తెలిసిన ఒక తెలుగు సినిమా పాట గురించి మళ్ళీ చెప్దామనుకుంటున్నాను.  ఎందుకీ సుత్తి అంటారా  ఎన్నో ఏళ్ళనుంచి వింటున్న ఆ పాత పాటలో ఇవాళ నాకు క్రొత్త అర్ధాలు స్ఫురించాయి.    అద్భుతమైన రచనల గురించి ఆలోచిస్తున్నకొద్దీ కొత్త కొత్త అర్థాలు  బయటపడతాయి.  అందుకేనేమో పూర్వం ఒక్కో గ్రంధానికి అనేకమంది అనేక వ్యాఖ్యలు రాసేవారు. 

                 మనసున మనసై బ్రతుకున బ్రతుకై
                 తోడొకరుండిన అదే భాగ్యమూ, అదే స్వర్గమూ

ఆణి ముత్యాల్లాంటి ఇలాంటి భావాలు పాట రూపంలో పెల్లుబకాలంటే ఆ కవి హృదయంలో ఎంత అంతర్మధనం జరిగుండాలో మరి.  మన మనసూ, బ్రతుకూ, అంతా తానై నిండి వుండే తోడు కావాలని ఎవరికనిపించదండీ.  ఆ తోడు జీవిత భాగస్వామే కానక్కరలేదు.  ఎందుకంటే వివాహమనే లాటరీలో అలాంటి తోడు అందరికీ లభిస్తుందని గ్యారంటీ లేదుకదా. 

                   ఆశలు తీరని ఆవేశములో
                   ఆశయాలలో, ఆవేదనలో
                   చీకటి మూసిన ఏకాంతములో                
                   తోడొకరుండిన  అదే భాగ్యమూ, అదే స్వర్గమూ

ఏ మనిషికైనా బ్రతుకు పోరాటంలో తీరని ఆశలు, నెరవేరని ఆశయాలూ తప్పవు.  వాటికోసం పోరాటాలూ, ఆరాటాలూ అంతకన్నా తప్పవు.  ఇలాంటి సమయాల్లో మన హృదయానికి చేరువగా వచ్చి మన ఆరాటాలనర్ధం చేసుకుని వెన్నంటి నిలిచే నేస్తం వుంటే వాళ్ళ బ్రతుకులు ధన్యంకావా!?

                    నిన్ను నిన్నుగా ప్రేమించుటకు
                    నీకోసమే కన్నీరు నించుటకు
                    నేనున్నానని నిండుగ పలికే
                    తోడొకరుండిన అదే భాగ్యమూ, అదే స్వర్గమూ

ఎంత గొప్ప భావమండీ!  వెతికితే ఎన్ని అర్ధాల రతనాలేరుకోవచ్చో ఈ చిన్ని మాటల్లోంచి.  నిన్ను నిన్నుగా ప్రేమించుటకు.....అంటే మనలోని లోటుపాట్లని కూడా అర్ధంచేసుకోగలగాలి, భరించగలగాలి, ఆ లోటుపాట్లతో సహా మనల్ని ప్రేమించ గలగాలి.  మన భంగపాటు తనదిగా బాధ పడటమే కాకుండా అలాంటి సమయాల్లో నీకు తోడుగా నేనున్నానని నిండుగా, మనస్ఫూర్తిగా పలకాలి.  అలాంటి స్నేహితులున్నవారి బ్రతుకే బ్రతుకుకదా.

                      చెలిమియె కరువై వలపే అరుదై
                      చెదరిన హృదయమే శిలయైపోగా
                      నీ వ్యధతెలిసీ నీడగ నిలిచే
                      తోడొకరుండిన, అదే భాగ్యమూ, అదే స్వర్గమూ

చెలిమి కరువైనప్పడూ, వలపు అరుదైనప్పుడూ ఆ జీవితమే వ్యర్ధమనిపిస్తుంది.  మనిషి డిప్రెషన్ లోకి వెళ్ళి పోతాడు.  అలాంటి వ్యధలో  తన నీడగా నిలిచి బ్రతుకుపై తీపి పెంచి, బ్రతుకు విలువ తెలిపి జీవితాన్ని నిలబెట్టే తోడుకన్నా మనిషికి కావాల్సిందేముంటుంది.

అతి మామూలు చిన్న చిన్న మాటలలో తరచినకొద్దీ వెలువడే అపురూపమైన అర్ధాలు పొదిగి ఈ పాట వ్రాసిన మనసు కవి శ్రీ ఆత్రేయగారు నిజంగా ధన్యులు.  ఈ పాటను తెలుగు తెలిసిన ప్రతి ఒక్కరూ వినే వుంటారు, వారి వారి పరుధుల్లో అర్ధం చేసుకునే వుంటారు.  అలాగే  మొదటిసారి విన్నప్పటినుంచీ ఇప్పటిదాకా  నాకూ ఇది అత్యంత ప్రీతిప్రదమైన పాట.  రోజూ పిచ్చిగా విననుగానీ విన్నప్పుడల్లా హృదయం ఆర్ద్రతతో నిండిపోతుంది.  ఎంత గొప్ప భావాలు పలికించారు శ్రీశ్రీ గారు.  అలాంటి పాటలు వ్రాయాలంటే ఎంత అదృష్టం వుండాలి.

ఆకస్మాత్తుగా ఇవాళ అర్ధ రాత్రి ఆ ఆలోచనలు ఇంకో కోణంలో మనసుని తట్టిలేపాయి.  పాట బాగుందనుకున్నావు...ఇన్నాళ్ళూ విన్నావు.....ఆలోచించావు...అలాంటి నేస్తం వుండాలని ఆరాట పడ్డావు...సరే...ఇవ్వన్నీ సహజాలు....కానీ నువ్వు ఎవరికైనా అలాంటి నేస్తంగా వుండాలని ప్రయత్నించావా అని ప్రశ్నించాయి.

కవి వ్రాసిన గీతానికీ, నేను ఆ పాటని అంతగా ఇష్టపడ్డదానికీ నిజమైన విలువ ఆ ఆలోచనలతోనే లభించిందనిపించింది.

తమకలాంటి తోడు కావాలనుకోవటం ప్రతి మనిషికీ సహజం.  కానీ ప్రతి మనిషికీ అలాంటి తోడు దొరకటం జరిగే పనేనా?   కడుపునిండిన కొందరైనా ఆరాటాల సుడిగుండాల్లో చిక్కుకున్నవాళ్ళకి జీవితాంతంకాకపోయినా తత్కాలంలో వున్న సమస్యకు సాదరంగా స్పందించి సాంత్వన ఇవ్వగలిగితే, కనీసం ఆ సమస్య తీరేదాకానైనా అతలాకుతలంగావున్న వారి హృదయాలలో ధైర్యం నింపి  ప్రశాంతతని ప్రసాదించగలిగితే, ఆ చేయూతతో వారి జీవిత నావ భవసాగరాలు దాటదా అలా ఒకరికొకరైతే ప్రపంచం అంతా అందరికోసమూకాదా?  అప్పుడు సమస్యల అడ్రసెక్కడ?  ఒక వేళ ఎక్కడైనా ఒకటీ అరా తలెత్తినా ప్రేమ అనే వెచ్చని సూర్య రశ్మితో మంచు తెరల్లా కరిగిపోవా?

ఇవ్వన్నీ ఒక్క క్షణంలో, ఒక్క రోజులో అయ్యే పనులు కావు.  కానీ ఆలోచించగలిగిన ప్రతి ఒక్కరూ కొంతయినా ఆచరిస్తే ప్రపంచం ఎంత బాగుపడుతుంది.  అప్పుడు చిక్కల్లా ఒక్కటే.  ఇలాంటి అద్భుతమైన పాటలు రాకపోవచ్చు.

అంధకారం గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా చిరుదివ్వెని వెలిగించే ప్రయత్నం చెయ్యి అనే సుజన సూక్తి ఆధారంగా, ఇప్పటికే వెలుగుతున్న దీపాలకు తోడుగా ఇంకొన్ని దీపాలు వెలిగించాలనే ఉద్దేశ్యంతో ఈ పోస్టు.

Posted by జ్యోతి Nov 13, 2009

Subscribe here