భమిడిపాటి ఫణిబాబు మ్యూజింగ్స్ ద్వారా ఎన్నెన్నో కబుర్లు చెప్తుంటారు కదా. ఈసారి మనకోసం ఒక మరాఠీ సినిమా గురించి పరిచయం చేస్తున్నారు.
భమిడిపాటి ఫణిబాబు Says...
మరాఠీ సినిమాలకి అఖిలభారత స్థాయిలో ఎక్కువ ప్రాచుర్యం లేదు. కానీ,కొన్నికొన్ని ఆణిముత్యాలు వచ్చాయి. ఈసంవత్సరం భారత ప్రభుత్వ ఆస్కార్ ఎంట్రీ కూడా ఒక మరాఠీ సినిమా'హరిశ్చంద్రాచీ ఫాక్టరీ' అవడం గమనార్హం. ఇంక ప్రస్తుతానికొస్తే, మామూలుగా మరాఠీ సినిమాలు, చాలా తక్కువ ఖర్చుతో తీస్తూంటారు ,కానీ దీనికి విరుధ్ధంగాఈ సినిమాకి భారీగానే ఖర్చు పెట్టారుట. సినిమా పేరు వినగానే అదేదో చారిత్రాత్మక సినిమా అనుకుంటే పొరబాటే.
ఈ సినిమా ముంబైలో ఒక బ్యాంకు లో పనిచేసే ఒక గుమాస్తా గురించి, తనూ,తన కుటుంబం(భార్యా, నటి అవాలని తపిస్తున్న ఒక కుమార్తె, ఇంజనీర్ అవాలనుకునే ఒక కుమారుడు).అతనికి మధ్యతరగతి గృహస్థు లాటి ఆశలూ,కోరికలూ చాలా ఉంటాయి
ఆఫీసు నుండి వస్తూ ఓ 'మాల్' లోకి వెళ్ళి 'విండో షాపింగ్' చేయడం,ఒక బ్రాండెడ్ షర్ట్ పాపం చాలా నచ్చుతుంది, కానీ దాని ఖరీదు చూస్తే తన తాహతుకు మించి ఉంటుంది. ప్రతీ వారం ఆ 'మాల్' లోకి వెళ్ళడం,తన ప్రియతమ షర్ట్ ని ఒకసారి తాకి, ఆనందించడం.ఒకసారి ఆ కొట్టు యజమాని ఇతన్ని అవమానపరిచి బయటకు తోసేస్తాడు,'కొనడానికి తాహతు లేనివాడు,మాల్ లోకి రావడానికి అనర్హుడూ'అంటూ.అలాగే చేపల మార్కెట్ లోకూడా,అవమాన పడతాడు.ఇవన్నీ చూసి తను చాలా బాధ పడతాడు,'తను మహరాష్ట్రియన్' గా పుట్టడం వల్లే ఈ అవమానాలన్నీ అవుతున్నాయనుకుంటాడు.మిగిలిన భాషలు మాట్లాడే వాళ్ళు,అక్కడ బ్యాంకులో పనిచేసేవారైనా,లేక రోడ్డుమీద వెళ్ళేవారైనా,తనకంటేఎక్కువ స్థానంలో ఏదో బాగుపడిపోతున్నట్లు ఇతనికి ఒక 'ఆత్మన్యూనతాభావం'వస్తుంది. ఇది ఇలా ఉండగా, తను కుటుంబంతో ఉంటున్న బంగళా (తనకి వారసత్వం లో వచ్చింది)మీద ఒక రియలెస్టేట్ వాడి కళ్ళు పడతాయి. ఎలాగైనా,చవకలో ఈ బంగళా కొట్టేసి, అక్కడొక షాపింగ్ కాంప్లెక్స్
కట్టేద్దామని,మన హిరో ఇంటికి ఒక ప్రతిపాదన తో వస్తాడు.ఊరికి ఎక్కడో దూరంగా ఉండే 'బద్లాపూర్' లో ఒక ఫ్లాటూ, ఓ శాంట్రో కారూ, 50 లక్షలూ ఇచ్చేటట్లుగానూ, విలేపార్లే లో వీళ్ళుంటున్న బంగళా తనకు అమ్మేటట్లూనూ.
మన హీరో భార్యా,పిల్లలూ ఎగిరి గంతేస్తారు. ఇతను ససేమిరా ఒప్పుకోడు.అక్కడ కూతురు సినిమాల్లో చేరడానికి,ఆడిషన్స్/స్క్రీన్ టెస్ట్ లకి వెళ్ళినప్పుడు,ఆ ప్రొడ్యూసర్,'నీ యాక్షన్ బాగానే ఉందికానీ, నీ పేరు(భోస్లే ) బాగొలేదు,మార్చేసుకో' అంటాడు.అలాగే కొడుకు కి ఎంట్రెన్స్ పరీక్షలో ఒక మార్కు తక్కువయ్యేటప్పడికి, పేమెంట్ సీటే గతౌతుంది.అంత డబ్బు వీళ్ళదగ్గర లేదు.తనకి ఎవరో పేద్ద రాజకీయ నాయకుడు క్లాస్ మేట్ ఉంటే అతని దగ్గరకి కొడుకుని తీసికొని వెళ్తాడు.'ఎక్కడైనా బావ కానీ,వంగతోటలో కాదు' అన్నట్లుగా ఇంజనీరింగులో ఏముందీ,ఊరికే డబ్బు వేస్టూ, శుభ్రంగా గ్రాడ్యుఏషన్ చేయించేసి, బ్యాంకులో ఉద్యోగం చేయించేయ్ అంటాడు.
ఈ రెండు సంఘటనలతో,హీరో పూర్తిగా నిరుత్సాహపడిపోయి, తను 'మరాఠీ మానూస్' అవడంవల్లే తనకు, ఇలాటి
అవమానాలు ఎదురతున్నాయనుకుంటాడు. ఈ సమయంలో ఇతను పడే వేదనంతా ఎక్కడో'రాయఘడ్' లో ఉన్న శివాజీ మహరాజ్ కి వినిపిస్తుంది.ఇక్కడనుండి, సినిమాలో 'లగేరహో మున్నాభాయ్' ఛాయలు కనిపించడం మొదలెడతాయి.శివాజీ తన అనుచరుడితో'ముంబై'వచ్చేసి, ఇతనికి జ్ఞానబోధ చేస్తాడు.నువ్వు 'మరాఠీ మానుస్' అవడం వల్లకాదూ,నీ కష్టాలూ,నీ వ్యక్తిత్వలోపం వల్లే నిన్నందరూ చిన్నచూపు చూస్తున్నారూ, అని ఇతనిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాడు.ఇంక మన హీరో పేట్రేగిపోతాడు. ఇంక మన హీరోని పట్టుకోవడం ఎవరి తరమూ కాదు.ఇతను ఏదైనా సమస్యలో పడితే 'శివాజి మహరాజ్' ఇన్స్పిరేషన్ తో అన్నింటినీ అధిగమించి ఆఖరిగా విజయం పొందుతాడు.
సినిమాకి సంభాషణలు ఓ హైలైట్.మహరాష్ట్రలో గత 45 ఏళ్ళుగా ఉండడం వలన, మరాఠీ సంభాషణలు అర్ధం చేసికోవడం, ఆస్వాదించడం ఏమీ కష్టం కాలేదు.క థానాయకుడు 'దినకర్ రావు భోస్లే' గా సచిన్ ఖేడ్కర్ అద్భుతంగా పాత్రలో జీవించేశాడు. శివాజీ మహరాజ్ పాత్రలో మహేష్ మంజ్రేకర్ ఫరవా లేదు. ఒక మధ్యతరగతి గృహస్థు కి ఉండే ఆశలూ,అవి తీర్చుకోలేని అసహాయతా, దీనివలన వచ్చే 'బక్క కోపం',దానిని అర్ధం చేసికోలేని కుటుంబసభ్యులూ, వారి ప్రవర్తనా, వీటిని 'క్యాష్' చేసికోవడానికి 'గుంట కాడి నక్క' లా ఉన్న,రియల్ ఎస్టేట్ బిల్డరూ,వాడు హీరో భార్యకిచ్చే 'తాయిలాలూ' బలేగా చిత్రీకరించారు.