విభిన్నకుటుంబాలు,పెంపకం నుండి వచ్చి ఒక్కటైన భార్యాభర్తలు తమ సంసారంలో ఎదుర్కునే సంఘటనలు, వాటిని సరిదిద్దుకుని ఏ గొడవా లేకుండా సంసార నావ ప్రయాణం సాగడం.. ఇలా పెళ్లికావలసిన, పెళ్లైన వారికి ఉపయోగపడే మంచి పుస్తకం గురించి మనకు పరిచయం చేస్తున్నారు నా స్పందన బ్లాగర్ లలిత దాట్ల.
'కోమలి గాంధారం".... పేరేమిటీ ఇంత గంభీరంగా వుంది. ! పైగా ఇదేదో సంగీతానికి . సంబంధించినదిలా వుంది? కోమలి అనే ఆవిడ గంధార రాగం నేర్పిస్తుందా ఏవిటీ?
"కోమలి గాంధారం"...' పురుష సమాజం పోకడలపై నేటి మహిళ సన్నాయి నొక్కులు ' వారం రోజుల్లో సంగీతం నేర్పే పుస్తకం ఇది కాదని అర్ధమయిందికదా!
సరే ఇక పుస్తకం వివరాల్లోకెళితే.......
సాధారణ ఆధునిక మధ్యతరగతి ఇల్లాలు కోమలి. ఇంటా, బయటా ( ఉద్యోగం చేసేచోట) ఎదురయే , స్త్రీ పురుష అసమానతలను తనదైన పద్ధతిలో సంస్కరించడానికి ప్రయత్నిస్తుంది. సమాజంలో వేళ్ళూనుకు పోయిన పురుష అహంకార భావజాలాన్ని ప్రశ్నిస్తుంది . అలాగని తనేమీ మగాళ్ళమీద యుద్ధం ప్రకటించదు. కూర్చోబెట్టి సందేశాలు వినిపించదు. కొంపలు కూల్చే నినాదాలివ్వదు . తన సమయస్ఫూర్తితో , వాక్చాతుర్యం తో, అవసరమైన చోట్ల తన తెలివి తేటలతోను, పురుషాధిక్యతకు అడ్డుకట్ట వేస్తుంది. స్త్రీ పురుష అసమానతలను బయటపెడుతుంది . ' మగ ' అలోచనల్లోని సంకుచిత్వాన్ని బట్టబయలు చేస్తుంది.
"తెలుగు సాహిత్యంలో ముణి మాణిక్యం నరసిం హరావు గారి ' కాంతం కధలు ' , భానుమతీ రామకృష్ణ ' అత్తగారి కధలు ' తరువాత తెలుగు సంసారపు ముచ్చట్లతో , పాఠకులను సున్నితంగా గిలిగింతలు పెట్టిన రచన కోమలి గాంధారం "....అంటూ అబ్బూరి చాయదేవి గారు ప్రశంసించారు.
భార్యకి సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువైతే భర్తకి వళ్ళంతా కనిపించని వాతలే. ఈ కధల్లో కోమలి భర్త పరిస్ధితి కూడా అంతే. పైగా చాకచక్యంగా అత్తమామల్ని తనవైపు తిప్పేసుకుంటుందేమో ......ఇక పాపం ఆ మానవునికి దెక్కెవరు. అందుకేనేమో రచయిత్రి తన రచన గురించి చెపుతూ, ఈ రచన సాగుతున్న కాలంలో ( వార్త లో కాలం గా వచ్చేది) "మా కొలీగ్ ఒకరు కోమలి భర్త ఫేన్స్ అసోసియేషన్ పెడతామని బెదిరించారంటే , మగాళ్ళకి బాగానే కోపం తెప్పించానని అర్ధమై సంతోషం కలిగింది" అంటారు.
అయ్యోరామా......ఇంతకూ రచయిత్రి గురించి చెప్పలెదుకదూ !
ఆకాశవాణి, దూరదర్శన్ తో కాస్తో కూస్తో పరిచయం ఉన్నవారికి డా.మృణాళిని గారిని ప్రతేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం ఉండదేమో . చెదరని చిరునవ్వు, చక్కని ఉచ్చారణ, మాటల్లో చమత్కారం కలగలిపిన విధ్యాధికురాలు,( వామ్మో ఎన్ని డిగ్రీలో...) డా. మృణాళిని గారు. ఈ పుస్తకం చదువుతున్నంత సేపూ వారే , కోమలి గా.....నా తలపుల్లోకొచ్చేవారు.
చమత్కార సంభాషనల్తో, ఆసక్తిగా సాగుతుంది కోమలి గాంధరం .ఒక్కో సన్నివేశం ఒక్కో కధ. అన్నింటిలోనూ కోమలిదే ప్రధాన పాత్ర . కో. భర్త, కో. అత్తగారు, కో. కొలీగ్స్ , కో. స్నేహితులు , ఇందులో వచ్చిపోయే పాత్రలు . మన సంసారాల్లోనూ , సమాజంలోనూ అడుగడునా ఎదురయ్యే స్రీ పురుష అసమానతల మీద రచయిత్రి వేసిన చమత్కార బాణాలు ఈ కధలు. అవి గుచ్చుకున్నవారికే ...అర్ధమవుతుంది ఆ బాధ.
అసమానతలా ...అవెక్కడున్నాయ్?, ఆడవాళ్ళకీ ఉద్యగాలు చేసే అవకాశం ఇచ్చేసాంగా , మేం ప్రోత్సహించకుండానే ఇంత సాధించారా ! అని విరుచుకుపడే మగ ప్రశ్నలకు సమాధానం .......
"ప్రధానంగా ఆడ లక్షణాలుగా స్ధిరపడిపోయిన .....ఈర్ష్య , అలక, వ్యామోహం, అబధ్రత, జగడాలమారితనం , గాసిపింగ్ ఇంకా ఎన్నో గుణాలు పురుషుల్లోకూడా అంత స్ధాయిలోనూ ఉన్నాయని చెప్పటానికి ప్రయత్నించాను. మగతనంగా తాము భావించే వాటిలో ఎన్ని తమ బలహీనతలో పురుషులకు తెలియ చెప్పటానికి ప్రయత్నించాను " అంటారు రచయిత్రి .
కధల విషయానికొస్తే......54 చిన్న చిన్న కధలు . పుస్తకం చదువుతున్నంతసేపూ పెదవులపై చిరునవ్వు నాట్యం చేస్తూ వుంటుందంటేనే అర్ధం చేసుకోవచ్చు . కధలెంత చమత్కారంతో సాగుతాయో. కధలకు టైటిల్స్ పెట్టడంలోనే రచయిత్రి సెన్సాఫ్ హ్యూమర్ బయటపడుతుంది.
" మాయదారి ముగ్గు" , " నోమిని", "ఆయనదేనికి" , మగని జ్వరం", " భోజ్యేషు భర్త" , మూడిన కాలం", " ఆడబాస్" , " భార్య బదిలి" ," అలకానందుడు" ....ఇలా..ఇలా.
గుమ్మంలో అందరికంటే మంచి ముగ్గు వేసి తనపరువు కాపాడాలని , అయినా అడపుట్టుక పుట్టాక ముగ్గులెయ్యటం రాదని ఎలా అనుకుంటాం అని సతాయిస్తున్న అత్తగారితో ......."మనం పరిశోధన చెయ్యాలత్తయ్యా, ఆడపిల్లగా పుడుతూనే , ముగ్గులు పెట్టడం, పువ్వులు కుట్టడం, అంట్లు తోమటం పప్పురుబ్బటం, ఇల్లు ఊడ్చటం ఎట్లా వచ్చేయ్యాలో ఎందుకు వచ్చేయ్యాలో , మనం పరిశోధన చెయ్యాలత్తయ్యా ..." అని తప్పించుకో చూస్తుంది , మాయదారి ముగ్గు కధలో.
'ప్రేమచ్చవం ' కధలో .....ఎంగేజ్ మెంట్ వరుడి అతి ప్రేమను తట్టుకోవటం కష్టంగా ఉందని వాపోయిన స్నేహితురాలికి " ఇంత ఘాటైన ప్రేమకి నివారణోపాయం చాలా సింపుల్ , పెళ్ళి చేసుకోవటమే ....దెబ్బకు ప్రేమ కరిగిపోతుంది . నీకు ఊపిరాడుతుంది ." అని సలహా ఇచ్చి ఒడ్డున పడేస్తుంది కోమలి.
ఇంటిపనంతా నెత్తిన వేసుకొని , అనారోగ్యం పాలయి అదో పెద్ద త్యాగంలా చెప్పుకు మురిసిపోయే ఇల్లాళ్ళమీద వ్యంగాస్త్రం - 'త్యాగమయి ' కధ
'ప్రేమించే భార్య ' కధలో సినిమా హీరోయిన్ లా ఇరవై నాలుగ్గంటలూ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ....తనధ్యాసలోనే గడుపుతూ , తనొచ్చేదాకా భోజనం చెయ్యకుండా ఎదురుచూస్తూ , విరహగీతాలు ఆలపిస్తేనే తనమీద ప్రేమ ఉన్నట్టని , అవన్నీ మచ్చుకైనా చేయని తన భార్యకి తనమీద ప్రేమలేదని సాధిస్తున్న భర్తకి .... షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి ఈ ఆడరోమియోతో నా కొద్దు బాబోయ్ అనేలా చేస్తుంది
.
పరిపూర్ణ మహిళ పోటీలపై వ్యంగ్య " పరిపూర్ణమ్మ కధ"
" ఈ ఆడవాళ్ళు హంగామా చేస్తారు కానీ నిజానికి వంటెంత పనోయ్..." అంటూ మితృలందరి ముందూ బిల్డప్ ఇచ్చే భర్తకి అంతే తెలివిగా వంట పని అప్పచెప్పి ..." ఇంత అద్భుతంగా వంట చేసే మీరుండగా నాకెందుకు దిగులూ " అంటూ చురకవేసి ఉధ్యోగానికి వెళ్ళిపోతుంది' భోజ్యేషు భర్త ' కధలో .
ఈర్ష్య ' కధలో ఈ సన్నివేశం చదివితే నిజంగా నే కోమలి భర్తకి ఫేన్స్ అసోసియేషన్ అవసరమని తేలిపోతుంది.
రాత్రి భోజనాల తర్వాత కోమలి, కోమలి భర్త వాకింగ్ కు వెళుతున్నరు . కోమలి భర్త ప్రారంబించాడు .
" ఇవాళ సునంద నన్ను చూసి ఏమదో తెలుసా?"
" నాకు మీ ఆఫీసులో గూడచారుల్లేరు" అంది కోమలి
"పోన్లే నేనే చెప్తాను . నేను వరండాలో నడుస్తుంటే ' రాజు వెడలె రవితేజములలరగ ' అన్నట్టుంటుందట"
"పాపం ఆ అమ్మాయి ఎప్పుడూ రాజుల్ని చూసుండదు "
జ్ఞాపకాల తన్మయత్వం లో ఉన్న కోమలి భర్త వినిపించుకోలేదు
మొన్న నేనోరోజు సెలవు పెట్టాను చూడు , ఆ మరుసటి రోజు నేను వెళ్ళగానే వాసంతి ఏమందో తెలుసా ?"
" నిన్నటి దినం ఎంత సుదినమో అందా" కోమలి అడిగింది.
కోమలి భర్తకు వినపడలేదు . అరమోడ్పు కన్నులతో ఉన్నాడు.
నేనిలా ఆఫీసులో అడుగు పెట్టగానే ..." ఎదురు చూసి ఎదురుచూసి కన్నుదోయి అలసిపోయె" అని పాడుతోంది వాసంతి"
కోమలి గొంతు సరిచేసుకుంది. మీ ఆఫీసులో ఇంక ఎంతమంది అమ్మాయిలున్నారు ? లక్ష్మి, విజయ, కావేరి....వీళ్ళంతా ఏమన్నారో ఇప్పుడే చెపుతారా , వాయిదాల్లోనా?"
కోమలి భర్త ఆగిపోయాడు " ఏం పాపం ఈర్ష్య గా వుందే.."?
కోమలి నవ్వింది." ఇంతకాలం నాకొక్కదానికే నచ్చిన మగాణ్ణి కట్టుకున్నాను . అని బెంగగా ఉండేది . నా ఎంపిక ఇంత నాసిరకంగా వుందేమాని. ఇవ్వాళ్టి తో ఆ బెంగ తీరిపోయింది , వేరే ఆడవాళ్ళకు కూడా మీరే నచ్చారంటే నా జడ్జి మెంటు మరీ చెత్తదేం కాదు"
సాధారణంగా భార్య తన ప్రతిభతో పైకొచ్చి , పేరుతెచ్చుకుంటే ...నలుగురిలో మెప్పు పొందుతుంటే , ఆమె భర్తలో చెలరేగే అసూయ , కుళ్ళుమోతుతనం, పురుషహంకారం , ఇవేవీ పైకి కనపడకుండా పాట్లు పడుతూ , ఆదర్శ భర్త గా గుర్తించబడాలని తాపత్రయం ఇవన్నీ ...ఆమె భర్త, ప్రోత్సహించే భర్త , వంటి కధల్లో కనిపిస్తాయి .
ఇక్కడ నాదో చిన్న మాట: పురుషహంకార, స్త్రీ పురుష అసమానతలు ఇవి ఉచ్చరించినవారు సమాజ విద్రోహులుగానూ , ఇవన్నీ వినటానికి పెద్దమాటలుగానూ, మనకు సంభంధం లేనట్టూ అనిపించచ్చు కానీ...... మనం మనకే తెలీకుండా అలవాటు పడిపోయిన నిత్య సత్యాలు . నీకేం తెలుసు....నోర్మూసుకో.....నన్నే ప్రశ్నిస్తావా....నేను నీకు సమాధానం చెప్పాలా..... నీ హద్దులు తెలుసుకో .........ఎంత సంపాదిస్తే మాత్రం ఇంత పొగరా........... ఉధ్యోగం కావాలో ఇల్లూ పిల్లలూ కావాలో తేల్చుకో ........చ్చీ, చ్చీ, ఆడంగి పనులు నేను చెయ్యాలా.......నేను నువ్వూ ఒకటే ఎలా అవుతాం........నేనేం చేసినా చెల్లుతుంది.......నా మాటకు ఎదురు చెప్పొచ్చా........అబ్బో, ఇలా చాలా చాలా డైలాగులు అప్పుడు, ఇప్పుడూ మగాడి నాలుకే వర్షిస్తుంది.( అది పడే భూమాత ఓర్పును బట్టి ఆ వర్షంలో హెచ్చుతగ్గులుంటాయి) ) ఇదీ అసమానతే, పురుష అహంకారమే ....కాదంటారా ?
కోమలి గాంధారం చదివిన వారెవరైనా " కోమలి " అభిమానులయి తీరాల్సిందే.........లేదంటే గుమ్మడికాయ దొంగ మీరే.
కోమలి గాంధారం
హాసం ప్రచురణ