BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...



క్షీరగంగ బ్లాగర్ రచయిత శ్రీధర్ గారు ఇచ్చిన ఆణిముత్యం...

నిందాస్తుతులు మన తెలుగుసాహిత్యంలో చాలా ఉన్నాయి. స్తుతులు చేసి చేసి ఆలసి, సొలసిపోయిన భక్తులు దైవసహాయాన్నో లేక దైవసాక్షాత్కారాన్నో కోరి వాటిని పొందలేని నిస్సహాయ స్థితిలో కడుపు మండి చేసిన ఆర్తనాదాలుగా వాటిని పరిగణించవచ్చు. అలాటిదే కంచెర్ల గోపన్న(రామదాసు) కీర్తన “సీతమ్మకి చేయిస్తి చింతాకు పతకము---“ అన్నదాన్ని చెప్పుకోవచ్చు.

అలా కాకుండా సామాజికస్పృహతో సంఘవిద్రోహ శక్తులు విజృంభించి చేసిన సర్వనాశనాన్ని చూడలేక, నిరంకుశుడైన కవి హృదయస్పందన దావానలమై పొంగి పొరలగా వచ్చిన నిందాస్తుతి మన తెలుగు సాహిత్యంలో ఒకటుంది. “శతృసంహార! వేంకటాచల విహార!” అనేది.ఈ శతకంలో 98 పద్యాలు ఉన్నాయి. చివరి రెండు దొరకకపోవడం వల్ల కవి పేరు తెలియదు. అయితే కవి, “ననుబోటి బాపడైనను,” అన్నాడు కాబట్టి ఇతడు తప్పకుండా బ్రాహ్మణుడై వుంటాడు. పైగా “దేవ! నీ సొమ్ము గట్టిగాఁదిన్న కవిని గాన” అన్నాడు కాబట్టి ఇతడు ఆలయోద్యోగియో లేక అర్చకుడో అయి ఉండాలి.. ” అకట! లలాట శూన్యము పాపమెట్లు మానగనేర్తు నుదుటను నామమిడక!” అన్నాడు గనక, అతడు వైష్ణవుడుని చెప్పవచ్చు.

తురుష్కులు దేవాలయాల లో ప్రవేశించి దేవుళ్లను బ్రద్దలు చేసారు. జిగురు పాలకని రావిమ్రాకులను నజ్జు నజ్జుగా కొట్టారు. వైష్ణవుల పట్టి నామములు నాకినారు. బ్రహ్మణులపిల్ల జూట్టు పీకినారు. తిరుమలయ్యా! నీవిదంతా చూస్తున్నావు గదయ్యా? అని నొచ్చుకొంటాడు.అదే! ఆ వేదనలోంచే వచ్చిందొక పద్యం.చూడండి.

సీ:-
వడిగుళ్లు సొచ్చి దేవళ్ల బద్దలు చేసి> థట్టించి తేజీలఁ గట్టునపుడు
జిగురు పాలకటంచుఁ జిగిరించు, రావి మ్రాఁ, కులనజ్జు నజ్జుగాఁ గొట్టునపుడు
గురు సార్వభౌముల గోడుపోనుక పట్టె నామము ;ల్మొదలంట నాకునపుడు
గద్దించి వెన వైదికపు బాపనయ్యల, పిల్ల జుట్లూడంగఁ బెరుకునపుడు

తే :-

సెక్కమా నీకుఁ దురకలఁ జిక్కుసేయ విన్నవించితి నా వెఱ్రి విన్నపంబు
పరగ మీ చిత్తమిదె నాదు భాగ్య మౌర, శతృ సంహార వేంకటాచల విహార!

సీ:-

గతిబట్టి బోడి సన్యాసుల, ఢీయని త్రాకులాడించునొకడు
సోమయాజుల బ్రహ్మసూత్రముల్ ధ్రెంచిపిం గాణివిండ్లకు నల్లెఁ గట్టు నొకడు
పైకాలు గొమ్మని బల్మిఁ గోమటి వారి. చెలువ పైఃబడి బూతుసేయునౌకడు

తే :-

ఈయవన సమ్మర్ద దుర్దినంబైన దిగువ తిరుపతిని జూడుమిటువంటి తఱిని నిదుర
పోవుచున్నాడు మీయన్న లేవలేక శతృ సంహార! వేంకటాచల విహార!


సీ:-
మామిడి క్రింది సోమరిపోతు శ్రీభాష్య కారుల కేల నంగరము గొధువ
అలుమేలు మంగ సొమ్ముల పెట్టియలు కాచు కొని యుండుటే చాలు హనుమనికిని
ఠీవిని బంకమంటి విరు ల్సమర్పించి తెరు గాటు కరగెను గురువ నంబి
మించుమిఠారితో బంచ బాణ క్రిడ లౌలుడయ్యెను కప్పడాల నృహరి


తే:-
నీకు మరి గోపమింతయు లేకపోయెఁ బోయె గాకేమి తొండమా న్భూపాలుఁ
డున్న నింతకుఁ దురకల మన్ని గొనడె శత్రు సంహార! వేంకటాచల విహార!

ఈ శతకము మొత్తము, దక్షిణ దేశమున తురుష్కుల దండ యాత్రకు సంబంధించిన విషయాలతో నిండిఉంది.. కవి దీన్ని వ్రాయడానికి ముందు ఎంతభాధపడ్డాడో? ఆ కవి హృదయం ఎంత యాతనకు గురి అయిందో వేరే చెప్పాలా?


సామాజిక స్పృహ లేని కవిత్వం స్పందన లేని కవి హృదయం ఎక్కువ కాలం మనలేవని అంటారు. ఆ విషయంలోఈ శతకకర్త కృతకృత్యుడయ్యాడని చెప్పక తప్పదు.


ఇదండీ! నిందా సాహిత్యం యొక్క నమూనా!

Posted by జ్యోతి Dec 21, 2009

Subscribe here