BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...నా మటుకు నాకు కొత్తొక వింత-పాతొక రోత అనే సామెత వర్తించదు. పాతెప్పుడూ విలువైనదే! పాత పుస్తకాలు, పాత పాటలు, పాత జ్ఞాపకాలు! ఇలాంటి నేపధ్యంలోనే ఒక పాత జ్ఞాపకాల ను జ్ఞప్తికి తెచ్చే కొత్త సమాచారం ఒకటి తెలిసి ఎంతో సంతోషించాను.

దీనికి కొంత బాక్ గ్రౌండ్ చెప్పాల్సిందే! చిన్నప్పటి నుంచీ నాకు రేడియోతో అనుబంధం ఎక్కువ టీవీతో కంటే!ఆలిండియా రేడియో విజయవాడ ప్రోగ్రాములంటే ప్రాణాలిచ్చేసేంత అనుబంధం! పొద్దున్నే మంగళ వాద్యంతో మేలుకొలుపు పాడటానికి ముందే నాన్న గారు వయొలిన్ తో ప్రారంభమయ్యే సిగ్నేచర్ ట్యూన్ తో సహా వినిపించే వారు, మమ్మల్ని లేవగొట్టడానికి! చిరుచీకట్లు తొలగుతున్న వేళ పక్షుల కిల కిలా రావాలతో పాటు, రేడియోలో ఆ మంగళ వాద్యం, తర్వాత దేశభక్తి గీతం, వందేమాతరం, తర్వాత భక్తి రంజని ...వినడం ఎంత చక్కని అనుభవం!

కార్తీక మాసంలో మంచు తెరల్లోనించి బద్ధకంగా సూర్యుడు రానా వద్దా అని బద్ధకిస్తూ బంగారు కాంతులు సర్దుకుంటున్న వేళ "శ్రీ సూర్యనారాయణా..మేలుకో హరిసూర్యనారాయణా..."అంటూ ప్రారంభమయ్యే సూర్య స్తుతి సూర్యుడిని సైతం బద్ధకం వదిలి మైమరచిపోయేలా చేస్తుంది కాదూ!

"పొడుస్తూ బాలుడు పొన్న పూవూ చాయ పొన్న పూవూ మీద పొగడ పొగడపూవూ చాయ"...ఎంత చక్కని వర్ణన!

"మధ్యాహ్న  బాలుడు మల్లె పూవూ చాయ

మల్లె పూవూ మీద మంకెన్న పూ చాయ" --అద్భుతం అనిపిస్తుంది నాకైతే!

ఆకాశవాణి కళాకారులు పాడిన లింగాష్టకం నాకెంతో ప్రియం. బాలసుబ్రహ్మణ్యం పాడిన లింగాష్టం ఏమిటో విచారంగా పాడినట్లు గా అనిపిస్తుంది. :-)

ఆ లింగాష్టకం, దాని తర్వాత వచ్చే విశ్వేశ్వర స్థుతి, వీటన్నింటినీ మించి చివర్లో కమాండింగ్ గా
"భవాయ చంద్ర చూడాయ, నిర్గుణాయ గుణాత్మనే" అంటూ ఓలేటి వారి గొంతులోంచి సమ్మోహనంగా వినపడే మంగళం.....సాక్షాత్తూ మంచుకొండల్లో మహదేవుడి సన్నిధిలో ప్రమథ గణాల అసెంబ్లీలో మనమూ నిల్చున్న అనుభూతి!.

ఇవన్నీ ఎప్పటికీ మాసిపోని అందమైన చిత్తరువులు నా మనో ఫలకంపై!

మల్లిక్ మార్దవంగా ఆలాపించిన రాజ రాజేశ్వరీ మాతృకాస్తవం ఇంకెవరు అలా పాడగలరు?

పెద్దయ్యాక....
చదువయ్యాక.....,
పెళ్ళయ్యాక....

వూరొదిలి వచ్చేశాక ఆ..... పాత మధురాలన్నీ ఆపాత మధురాలుగానే స్మృతుల్లో మిగిలిపోయాయి. ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినపుడు వినడమే!

వెన్నెల రాత్రుళ్ళు ఆరుబయట కొబ్బరి చెట్టుకింద మడతమంచం మీద కొబ్బరాకుల టప టపలతో కలిపి రేడియో నాటకాలు వినడం ఒక గొప్ప క్లాసిక్ హాబీగా ఫీలైన రోజులెన్నో!అందునా విజయవాడ రేడియో కేంద్రం వేసే పాత హాస్య నాటకాలు అక్కడ తప్ప ఇక ఎప్పటికీ ఎక్కడా వినలేం!

ఏడింటికి సైనిక సోదరుల కోసం వేసే జయమాల,8-15 కి హవా మెహెల్(అందులో సగం హిందీ మాటలు అర్థమయ్యేవే కాదు అప్పట్లో..అయినా సరే). తొమ్మిదిన్నరకి ఆప్ కీ ఫర్మాయిష్, పదింటికి ఛాయాగీత్..ఎలా మర్చిపోగలం ఆ వివిధ భారతిని?

రేడియో కోసమే ఎమ్మెస్ సుబ్బులక్ష్మి, భీమ్‌సేన్ జోషి, డి.కె పట్టమ్మాళ్,బాలమురళి, ఎమ్మెల్ వసంత కుమారి, ఇంకా అసంఖ్యాక అద్భుత కళాకారులు పాడిన అమర సంగీతాన్ని ఆస్వాదించగలగడం ఎంత గొప్ప వరం?

మరి ఆ రోజులన్నీ ఒక్కసారిగా తిరిగొస్తే? అందమైన ఆ జ్ఞాపకాలు వాస్తవ రూపం దాల్చి కళ్ళముందు నిల్చి చేతులు చాచి ఆహ్వానిస్తే! ఆ సాంస్కృతిక కళా రూపాలన్నీ ఇంట్లో అడుగు పెడితే? అమ్మో, సంతోషంతో గుండె ఆగదూ?

ఆ సమాచారమే శివరామ ప్రసాద్ గారి సాహిత్య అభిమాని .గారి బ్లాగులో చదివి ఆనందాశ్చర్యాలతో తలమునకలయ్యాను.

ఆనాటి పాత నాటకాలు,(ప్రస్తుతానికి చిలకమర్తి వారి గణపతి,కాళ్ళకూరి నారాయణరావు గారి వరవిక్రయం,తిరుపతి వెంకట కవుల పాండవోద్యోగ విజయాలు,కన్యాశుల్కం నాటకాలు అందుబాటులో ఉన్నాయి) లలిత సంగీతం, పద్య నాటకాలు,శాస్త్రీయ సంగీతం,(గాత్రం వాద్యం ...రెండూను) వీటన్నింటినీ ఆకాశవాణి సీడీల రూపంలో అందుబాటులోకి తెచ్చిందని తెలిసింది. ఆనందం అర్ణవమైంది.

హైదరాబాదు రేడియో స్టేషన్ లో (అసలు అక్కడ ఒక రిసెప్షన్ కౌంటర్ అనేది లేకపోవడమే పెద్ద వింత నాకు!) తగిన రెస్పాన్స్ లేదని శివ గారి బ్లాగులో చదివి ఎందుకైనా మంచిదని విజయవాడ రేడియో స్టేషన్ కే వెళ్ళాను. గేటు లోకి అడుగు పెడుతుండగానే ఎదురుగానే ఉంది ....Archives sales coutner!

అద్భుతమైన కలెక్షన్ చూసి తీరవలసిందే గానీ వర్ణించలేను. శాస్త్రీయ సంగీత కచేరీలు, జుగల్ బందీలు,వివిధ భాషల్లో దేశభక్తి గీతాలు, లలిత గీతాలు, భక్తి రంజని లోని స్తోత్ర మాలికలు... ఒకటా రెండా?

ఆ రోజుకిక భోజనం అక్కర్లేదన్నంతగా కడుపు నిండిపోయింది.

ఆ తర్వాత ఏం చెప్పను? లెనిన్ సెంటర్లో పాత పుస్తకాలకు పోగా మిగిలిన డబ్బంతా సీడీలకు ఖర్చు చేసి సంతోషం నిండిన మనసుతో,సీడీలతో నిండిన బాక్ పాక్ తో బయట పడ్డాను.

ఇప్పుడు మా ఇంట్లో ప్రతిరోజూ విజయవాడ రేడియో కళాకారుల భక్తి రంజనితో ఉదయాలు శ్రావ్యంగా మొదలవుతున్నాయి, నా జ్ఞాపకాల పరిమళాలను ఇల్లంతా నింపుతూ!

ఈ అపురూప సంపద కావలసిన వారు హైద్రాబాదు, విజయవాడ ఆలిండియా రేడియో స్టేషన్లను సంప్రదించవచ్చు!

Posted by సుజాత Dec 2, 2009

Subscribe here