అద్భుతమైన కథ, మరపురాని, మధురమైన పాటలు, నటన, సంగీతం ఇలా వెరసి తెలుగువారు సగర్వంగా “ఇది మా తరగని చెరగని ఆస్థి” అని చెప్పుకోదగ్గ అద్భుత కళాఖండం "మల్లీశ్వరి”. తెలుగు చలన చిత్ర రంగంలో ఒక అద్భుత దృశ్యకావ్యంగా నిలిచిపోయింది. Illustrated Weekly లో పడ్డ ఒక కథ, బుచ్చిబాబు రాసిన "రాయల కరుణకృత్యము" అనే రేడియో నాటకం .. ఈ రెండింటి వల్ల స్పూర్థి చెందిన బి.ఎన్.రెడ్డి "మల్లీశ్వరి" చిత్రనిర్మాణానికి పూనుకున్నారు. దేవులపల్లి కృష్ణశాస్త్రికి తొలిసారిగా చిత్ర రచన, పాటల బాధ్యత ఇచ్చారు. ప్రణయ మాధుర్యానికి, వియోగ, సంయోగాన్ని సున్నితంగా, అందంగా చెప్పడంలో సిద్ధహస్తుడైన భావకవి కృష్ణశాస్త్రి రచనతో ఈ చిత్రం తెలుగువారి హృదయాలలో ఒక వెలకట్టలేని ఆణిముత్యంగా నిలిచిపోయింది.
ఈ చిత్ర కథ రాయలవారి కాలంలో విజయనగర సామ్రాజ్యంలోని వీరాపుర గ్రామంలోజరిగింది. బావా మరదళ్లైన మల్లి , నాగరాజులు చిన్నప్పటినుండి ఒకరంటే ఒకరు ప్రేమగా, అభిమానంగా ఉంటారు. ఒకరినొకరు ఉడికించుకుంటూ అల్లరి చేస్తుంటారు. ఆర్ధికంగా కాస్త ఉన్నత స్ధితిలో ఉన్న మల్లీశ్వరి తల్లి వారిద్దరికి పెళ్లి చేయడానికి ఒప్పుకోదు. ఒకరోజు తిరునాళ్లకు వెళ్లి తిరిగివస్తూ మల్లీ, నాగరాజులు ఒక పాడుబడిన సత్రంలో తలదాచుకుంటారు. అదే సమయంలో రాయలవారు తన ఆస్థాన కవితో కలిసి మారువేషంలో అక్కడికి వస్తారు. వారికి ఆతిథ్యమిచ్చిన తర్వాత మల్లీశ్వరి చేసిన నాట్యానికి వారు మిక్కిలి సంతుష్టులవుతారు. నాగరాజు వారితో సరదాకి రాయలవారికి కలిస్తే మా మల్లికి రాణివాసపు పల్లకీ పంపమని చెప్పమంటాడు. కాని తాము చెప్తున్నది రాయలవారికే అని తెలుసుకోరు. కాని రాయలవారు ఈ చిన్నారుల గురించి తన రాణికి చెప్తాడు. ఆమె కూడా సంతోషంగా పల్లకీ పంపమంటుంది.
సంపాదన లేని తనకు మల్లి దక్కదని తెలుసుకున్న నాగరాజు సంపాదించడానికి నగరానికి బయలుదేరతాడు. అతను లేని సమయంలో రాణీవాసపు పల్లకీ వస్తుంది. బావ చెంత లేనప్పుడు ఎక్కడ ఉన్నా ఒకటే అని తల్లి బలవంతం మీద మల్లి రాణీవాసానికి వెళ్తుంది. సంపదతో తిరిగివచ్చిన నాగరాజు మల్లీశ్వరి లేకపోవడంతో పిచ్చివాడై ఆమె రూపాన్నే శిల్పాలుగా చెక్కుతాడు. అది చూసిన రాయలవారి ఆస్థాన శిల్పాచారి అతనిని నర్తనశాలలో శిల్పాలు చెక్కడానికి నియమిస్తాడు. అనుకోకుండా ఒకరోజు మల్లీ , నాగరాజులు కలుసుకుంటారు. అలా కలుసుకున్న తర్వాత ఇద్దరూ ఈ రాచరికపు సంకెల్లు తెంచుకుని పారిపోవాలనుకుంటారు. ఆ ప్రయత్నంలో నాగరాజు పట్టుబడతాడు. చావు తప్పదని తెలిసినా ,అతనికి తోడుగా మల్లీశ్వరి కూడా భటులకు పట్టుబడుతుంది. అంతఃపురంలో ఉన్న ఆడవాళ్లు బయటి మగవారితో జత కట్టరాదు. అలా పట్టుబడినవారికి ఉరిశిక్ష తప్పదు. వీరిని విచారించిన రాయలవారు పెద్ద మనసుతో వారిద్దరికి స్వేచ్చజీవితాన్ని ప్రసాదిస్తాడు. సత్రంలో తమకు కలిసిన పెద్దమనిషి సాక్షాత్తు రాయలవారే అని తెలుసుకుని మల్లి నాగరాజుల ఆనందం మిన్నంటుతుంది. ప్రభువులకు, ఆస్థానకవి కి నమస్కరిస్తారు. ఆస్థానకవిగా నటించింది రేడియో అన్నయ్య న్యాపతి రాఘవరావుగారు.
ఈ చిత్రంలో భానుమతి, రామారావు పాత్రల్లో నటించారనడం కంటే జీవించారనడం సబబేమో. సన్నివేశాలు, పాటలు, సంభాషణలు ప్రతీది సహజత్వంతో కనువిందు చేస్తాయి. ఈ చిత్రంలో సంగీతం, సాహిత్యం కలిసి ప్రేక్షకుల మనసుల్లో మల్లెలు పూయించాయి. స్వరవిరించి సాలూరు రాజేశ్వరరావు, భావకవి కృష్ణశాస్త్రి, బి.ఎన్.రెడ్డి .. వీరు ముగ్గురికి ఆంధ్రప్రేక్షకలోకం సదా రుణపడి ఉంది ఇటువంటి మహాధ్భుతాన్ని అందించినందుకు. మల్లీశ్వరి పేరు చెప్పగానే మనకు గుర్తు వచ్చేది అందులోని అఫురూపమైన సంగీతం, సాహిత్యం. ప్రతిగీతం ఒక ఆణిముత్యం. ఇందులో కధకంటే పాటలకు, సంగీతానికి ఎక్కువ మార్కులేయొచ్చేమో. చిత్రం ప్రారంభంలో వినిపించే వ్యాఖ్యానాన్ని, ‘ లంబోదర లకుమికరా’ గీతాన్ని అందించినవారు నాగయ్య.
“కోతీబావకు పెళ్లంటా” పాటలో చిన్నపిల్లల అల్లరి, బాకాబాజా, డోలు సన్నాయి అంటూ పెళ్లిసందడిని సంగీతపరంగా చూపించారు. “పరుగులు తీయాలి, గిత్తలు ఉరకలు వేయాలి” పాటలో మల్లి, నాగరాజుల అమాయకపు ప్రేమ, వాన రాబోతుందని నల్లని మబ్బులతో పాటు గిత్తలను కూడా పరుగులు తీయిస్తూ పాడే పాట ఇది. సత్రంలో కలిసిన పెద్దమనుష్యులకు ఆతిధ్యమిచ్చి తన గాన,నాట్య ప్రతిభను చూపించడానికి మల్లి పాడిన పాట “పిలచిన బిగువటరా” బయట హోరుమనే వానతో పాటు ఈ పాట కూడా పోటీ పడుతుందనిపిస్తుంది. “ఆకాశవీదిలో హాయిగా ఎగిరేవు” కాస్త నా బావ జాడ కనుక్కోవా అని మల్లి మేఘాలతో మొరపెట్టుకుంటుంది. నాగరాజు కూడా నీలి మబ్బులతో కబురుంతాడు. అమాయకమైన ఆమె హృదయవేదన తెలుపుతూ ప్రేమికుల వియోగాన్ని ఎంతో హృద్యంగా ఈ పాటలో మనకు కళ్లముందుంచారు కృష్ణశాస్త్రి. చాలాకాలంగా దూరమైన మల్లి,నాగరాజులు కలిసి సమయంలో వారి మనోభావాన్ని మన మనసులో కనిపించే విధంగా “ మనసున మల్లెల మాలలూగెనే” పాటలో రాశారు కవి. ఇక చిత్రీకరణ, నటన,సంగీతం మాట చెప్పనవసరంలేదు. ఈ విరహగీతంలో నాయిక మనోభావాలను వ్యక్తం చేస్తూ తన వ్యక్తిత్వాన్ని విశ్లేషించుకునేలా మల్లీశ్వరి అంతరంగాన్ని ఆవిష్కరించారు కవి. “ఎన్నినాళ్లకీ బ్రతుకు పండెనో, ఎంత హాయి ఈ రేయి నిండెనో” అని మల్లి పాడుతుంటే వియోగం తర్వాత చేరువైన ప్రియుడి సన్నిధిలో ఆమె పొందిన అనుభూతి ఆ మాటలలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అంత:పుర చెరసాలనుండి శాశ్వతంగా బయటపడబోతున్నాననే ఆనందంలో మల్లి తన మందిరంలో చెప్పరాని ఆనందంతో పాడుకునే “ఎందుకే నీకింత తొందర” పాటలో ఆమె ఆనందం, బావతో కలిసి ఉండబోతున్నాను అనే ఆత్రం కనిపిస్తుంది. ఇలా ప్రతీ పాట సినిమాలో ఆయా సంధర్భానికి సరిగ్గా అతికినట్టు ఉంటుంది. విడిగా విన్నప్పుడు కూడా ఆ దృశ్యం మన మనస్సులో కనిపించేలా పాటలు రాశారు దేవులపల్లి.
విడుదల : 20 – 12 – 1951
నటీనటులు : ఎన్.టి.ఆర్, భానుమతి, కుమారి, టి.జ.కమలాదేవి, శ్రీవత్సవ, రుష్యేంద్రమణి. న్యాపతి రాఘవరావు.
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు, అద్దేపల్లి రామారావు
రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
నిర్మాత, దర్శకత్వం: బి.ఎన్.రెడ్డి
పిలచిన బిగువటరా
ఏడ తానున్నాడో బావ
మనసున మల్లెల మాలలూగెనే
ఎంధుకే నీకింత తొందర
ఈ చిత్రంలోని వీడియోలు ఇవి మాత్రమే లభించాయి. ఆడియో పాటలన్నీ వినాలంటే నాబ్లాగుకు రావలసిందే..
ఈ క్లాసిక్ మూవీ సమీక్ష గీతాచార్యకోసమే. ఎందుకో అతడే చెప్పాలి మరి..