బాల్యం - రాత్రే!
వెన్నెలంత చల్లగా...
చందమామంత నిండుగా...
గాఢనిద్రంత మత్తుగా...
కలల ఊహలంత కొత్తగా... వింతగా...
బాల్యం - ఒక రాత్రే!
***
ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో
లేలేత కిరణాలతో
శరీరాన్నీ, మనసునీ వేడెక్కిస్తూ
నాలో నవోదయ యౌవనాన్ని పుట్టించ్చాడు.
ఆ అందానికి దాసోహమై
ఈ కన్నె మనసును అర్పించేసాను...
నిన్ను విడచి ఉండలేనని ప్రమాణం చేసేసాను.
ఆ ధైర్యంతోనే కాబోలు,
వేడెక్కించే సహజ నైజం కాస్తా పోయి
చిటపటలతో చిర్రెత్తించడం మొదలెట్టాడు.
నాకూ కోపమొచ్చింది... ఒళ్ళు మండిపోయింది.
ఎంతైనా బలవంతుడు కదా!
నా నెత్తినెక్కి మొట్టికాయలు మోదాడు.
బాధతో
అతనికి దూరంగా
రూపాలు మార్చేసుకుంటూ నీడనై
నా పిల్లలతో సేద తీరాను.
***
ఎంత కాలముంటుందా పొగరు?
తగ్గుతూనే వచ్చింది!
పాపం, అంతలోనే వృద్ధాప్య భారం మీద పడిపోయింది.
చైతన్యం పోయి పడమటికి సాగిపోతూ...న్నాడు !
***
ఎంత కాలముంటుంది నా కోపం మాత్రం!
అతని బాధకి కరిగి చేరువై పోయాను.
నన్ను చూసేసరికి అతని మొహంలో ఎంత కళనీ!
చెప్పకపోడమే... నాలో కూడానూ!!
ఇద్దరం కలిసి మరోసారి అరవై ఏళ్ల పెళ్ళికి ముస్తాబయ్యాము...
రెండు పండిన
శిశు హృదయాలకు జరిగే పెళ్లి!
***
ఆడుతూ, పాడుతూ, త్రుళ్ళుతూ
కువకువలుగా...
రవరవలుగా
ఆ రెండు పిల్ల మనసులూ
నెమ్మదిగా
చీకటితో ఏకమయ్యాయి!
***
రాత్రయి - మరో తరం
బాల్యాన్ని పుట్టిస్తాయి!