మనిషికి ఉన్న అద్భుతమైన వరం మాట. ఆ మాటలోని భావాలెన్నో. అందించే సందేశాలెన్నో. ప్రకృతిలోని అందాలు చూసి కలిగే భావోద్వేగాన్ని వ్యక్తపరచడానికి మాట ఒక సాధనం. ప్రతి మనిషికి మాట్లాడడం, ఆ మాట వినేవాడు తప్పకుండా కావాలి. మాటలేకుంటే ప్రపంచమే మూగపోతుందా? స్తంభించిపోతుందా? ఆ మాటకు శబ్దం లేకపోతే ఎలా? తెలుగు, హిందీ, మరాటీ, తమిళం, కన్నడ ఇలా మాటకు ఎన్నో భాషలు. కాని ఇద్దరు మూగ చెవిటి వాళ్లు ఎలా మాట్లాడుకోగలరు? సూర్యాస్థమయం, చల్లని వెన్నెల, పూవుల అందాలు ఇవన్నీ చూడగలిగీ ఆ ఆనందాన్ని మన మాటల్లో, పాటల్లో వ్యక్తీకరించి పంచుకోగలం. కాని ఈ అదృష్టం లేని వారి గురించి ఎప్పుడైనా మనం ఆలోచించామా?
అందరిలా మాట్లాడలేక , చెప్పింది వినలేక ఇబ్బందులు పడే ఇద్దరు మూగ,చెవిటి నాయికా నాయికలు, వారికి తోడుగా ఒక అంధుడు. వీరి చుట్టు అల్లుకున్న బంధమే "కోషిష్" సినిమా. ఒకరితో ఒకరు మాట్లాడుకోలేని, చూడలేని వీరు మనసుతోనే , స్పర్శతోనే మాట్లాడుకునేవాళ్లు. చీటికి మాటికి మాటపట్టింపులు, గొడవలు పెట్టుకునేవాళ్లు ఇలాంటి వాళ్లను చూసైనా మారడానికి ప్రయత్నించాలి అనే సందేశాన్నిచ్చారు గుల్జార్ ఈ సినిమా ద్వారా.
సంజీవ్ కుమార్ పేపర్ బాయ్. అనుకోకుండా అతనికి జయాబాదురి తారసపడుతుంది. అతని ప్రోత్సాహంతో మూగ,చెవిటి స్కూలులో చేరుతుంది. క్రమేనా వారి స్నేహం ప్రేమగా మారి పెళ్లి చేసుకుంటారు. వారికి పుట్టిన బిడ్డ కూడా తమలాగానే మూగ, చెవిటి అవుతాడేమో అని భయపడతారు. కాని ఆ బాబు అందరిలానే నవ్వుతూ , ఏడుస్తూ ఉంటాడు. కాని అనుకోని పరిస్థితులలో జయబాధురి తమ్ముడి మూలంగా వర్షపు రాత్రి పిల్లవాడు ఇంటి గడపదాటి నీళ్లలో పడి చనిపోతాడు. ఆ పిల్లవాడి ఏడుపు కూడా వినలేని అభాగ్యులు ఈ తల్లితండ్రులు. ఆ తర్వాత మళ్లీ పుట్టిన పిల్లవాడిని జాగ్రత్తగా పెంచి పెద్ద చేస్తారు. ఆ పిల్లవాడు అందరిలా మాట్లాడగలడు, వినగలడు. అతనికి పెళ్లి చేసే సమయంలో అమ్మాయి మూగ , చెవిటి కావడంతో పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో తండ్రికి కోపం వచ్చి తల్లి ఫోటో చూపించి ఒక మూగ చెవిటి తల్లితండ్రులకు పుట్టినవాడు ఆ మూగ చెవిటి అమ్మాయిని పెళ్లి చేసుకోకుంటే వేరే ఎవరు చేసుకుంటారు అని అడుగుతాడు. కొడుకు తన తప్పు తెలుసుకుని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి చేతివేళ్ల సహాయంతో చెప్తాడు. ఇదీ సినిమా కథ.
ఈ సినిమాని ఒక సాధారణ సినిమాగా చూడలేము. ఒక్కో సంఘటన చూస్తుంటే ప్రతి ఒక్కరికి కళ్ల నీరు రాకమానదు. దానికి ముఖ్యకారణం నాయికా, నాయకుల అద్భుతమైన నటన. జయాబాదురి స్కూలులో చేరినపుడు అక్కడి టీచర్ అంటుంది. వీళ్లు మామూలు వాళ్లకంటే ఎంతో గొప్పవాళ్లు , అదృష్టవంతులు. చెడు మాట్లాడలేరు, వినలేరు. భాషా బేధం లేదు, ఏ గొడవా లేదు. నిజమే కదా...తమకు పుట్టిన బిడ్డ తమలా అంగవికలుడు కాకుండా మాట్లాడగలడా, వినగలడా అని ఆరాటపడే మూగ, చెవిటి తల్లితండ్రుల ఆరాటం మనసులని కదిలించివేస్తుంది. ఆ పిల్లవాడు వర్షపు రాత్రిలో ఏడుస్తూ గడప దాటుతున్నప్పటి దృశ్యం మాత్రం హృదయవిదారకంగా ఉంటుంది. అయ్యో ఆ పిల్లాడు పడిపోతాడు. పాపం ఆ తల్లితండ్రులు వినలేరు, ఎవరైనా లేపండి అని ఆ సినిమా చూస్తున్న ప్రతీవారికి కలుగుతుంది. కాని ఇదేమీ తెలియకుండా అమాయకంగా నిద్రపోతుంటారు. అయ్యో! దేవుడు ఎంత అన్యాయం చేసాడు. అన్నీ అవయవాలు సరిగ్గా ఉన్న మనం ఎన్ని తప్పులు చేస్తున్నాము. అని ఆలోచించకుండా ఉండలేము. ఈ మూగ, చెవిటి దంపతులకు ఒక అంధుడు చుట్టం, స్నేహితుడు. వీరి మధ్య వారధి స్పర్ష మాత్రమే. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి మాట, వినికిడి, చూపు సమస్య ఉన్నా కూడా ఒకరికొకరు మంచి స్నేహితులు అవుతారు. . వారి మనసు ముచ్చట్లకు ఎటువంటి అడ్డంకి ఉండదు. ఇది ఒక సినిమానా,? నిజంగా కళ్లముందు జరుగుతున్న సంఘటనలా అన్నంత అద్భుతమైన నటన కనబరిచారు జయాబాదురి, సంజీవ్ కుమార్. వారి కళ్లే మాట్లాడతాయి. చేతులే ఎన్నో సంభాషణలు చేస్తాయి. వాటిని అర్ధం చేసుకోకుంటే మనమే దురదృష్టవంతులం. ఎన్ని సార్లు చూసినా పాతబడని, మనసును కదిలించకమానని అపురూప చిత్రం " కోషిష్.
చిత్రం : కోషిష్
విడుదల : 1972
దర్శకత్వం : గుల్జార్
నిర్మాత: సిప్పి సోదరులు
సంగీతం : మదన్ మోహన్
కొన్ని వీడియోలు:
కిరాణాకొట్టులో ఒక సరదా సన్నివేశం.
మూగ, చెవిటి స్కూలులో పాఠాలు ఇలా ఉంటాయి.
పెళ్లయ్యాక మొదటిసారి భార్యాభర్తలు ఐ లవ్ యూ చెప్పుకోవడం ఎలా ఉంటుంది చూడండి..
ఏడుస్తున్న పిల్లవాడికి గుడ్డివాడు పాట పాడడం. దానిని కళ్లప్పగించి చూడడం తప్ప వినలేక ఎటువంటి స్పందన లేని తల్లితండ్రులు.
స్కూలులో తమ కొడుకు గొంతెత్తి పాడుతుంటే చూసి ఆనందిస్తున్న తల్లితండ్రులు.