BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...

డాక్టర్లు చాలా మంది లలిత కళలను ఆరాధించే సృజనకారులే. విశ్రాంతి లేని జీవితం. అయినా ఎందరో రచయితలు, చిత్రకారులు ఉన్నారు వారిలో. నిజానికి ఈ సృజనే వారికీ విశ్రాంతి నిచ్చే మానసిక వ్యాపారం కాబోలు. ఈ కోవలోకే చేరుతారు డా. పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి గారు. నాలుగు దశాబ్దాల నిరంతర సాహితీ వ్యాసంగంగా విస్తరించిన ఆమె ఇప్పటికి ఎనిమిది నవలలు, అయిదు నవలికలు, నాలుగు కవితా సంపుటాలు, తొమ్మిది కధా సంపుటాలు వెలువరించారు. అయితే కథయిత్రి( కథారచయిత్రి ) గానే ఆమెకు మంచి పేరుంది. కవయిత్రి కావడం వల్ల ఆమె కథల్లో భావుకత, కవిత్వ మనిపించే వాక్యాలు అక్కడక్కడ అలరిస్తాయి. వివిధ పత్రికల్లో వచ్చిన పద్నాలుగు కథలను ' నక్షత్రం' పేర ఇటీవల సంపుతీకరించారు డా. జయప్రద.

డాక్టరు గారి కథల్లో వస్తువు సామాజికం. కథనం వైద్యురాలి దృక్పథం - వెరసి సామాజిక చికిత్సే ఇతివృత్తం. అందుకే సామాజిక చికిత్స చేస్తున్న సాహితీ వైద్యురాలీమే. వైద్యురాలు కావడం వల్లే రాయగలిగినవి కొన్ని కథలు కథయిత్రి అయిదేంటిటీని పట్టిస్తాయి. ఇతివృత్త మేదైనా ఒక మానవీయ స్పర్శతో చర్చించే సామాజిక సమస్య పరిష్కార దిశలో పరిణమించే అక్షరాలు, రాశీభూతమైన భావాలు, భావనలు ఈమె కథలు.

సంపుటికి శీర్షికైన కథ 'నక్షత్రం'. కథ సామాన్యమైనదే అయినా, కథనం అసామాన్యం. మరొకరి జీవితం కోసం ఖర్చు పెట్టే కాసులు వాళ్ళకే కాదు, ఖర్చు పెట్టిన వారికీ ఆనందపు రుచిని చూపిస్తాయని చాటి చెప్పే కథ. వేలాది లక్షలాది మంది పేద పసివాళ్ళ లో ఎవరు నక్షత్రాలని తాకగలరో తెలుసుకోకుండానే వారి భవిష్యత్తు మొగ్గలోనే సమాధి అయిపోతుంది.అలాంటి ఒక నక్షత్రమే కన్నడు. చదువు కోసం వాడు పడుతున్న ఆరాటాన్ని చూసి వాడి గుడిసె ఎదుట మేడలో ఉండే యశోద స్పందిన్స్తుంది. వాడిని చదువులో పెడితే సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఆదాయం పోతుందనీ, నాయుడయ్య దొర అప్పు తీరడం ఆ మేరకు వెనుక బడుతుందని భావించిన కన్నడి తండ్రి తిరుపతికి ప్రతి సంవత్సరం ఆ డబ్బిచ్చి కన్నడ్ని చదివించేందుకు ఒప్పిస్తుంది, యశోద. '' పుణ్యం కోసం పుష్కరాలకి వెళ్ళనవసరం లే''దనే సందేశంతో కథ ముగుస్తుంది. మనిషికి డబ్బు అవసరమే కానీ, దాన్ని మించిన ప్రాపర్టీ ప్రేమని చెబుతుంది, ' నెత్తుటి పండు' కథ.

మొదటి కథ ' ప్రేమంటే ఇదే' - భిన్న లైన్గికతలోనే ప్రేమ ఉండదనీ, ఇద్ద రాడవాళ్ళ మధ్య ఉండే అఖండ స్నేహం కూడా ప్రేమేనని తెలిపే కథ. డా. జయప్రద గారి కథల్లో స్నేహితురాళ్ళ పాత్రలు పరస్పరం స్నేహాన్ని మించిన ప్రేమను కనబరచుకుంటాయి. ఒక పాత్ర జీవితంలో సంతోషానందాల్ని కోల్పోయి ' డిప్రెషన్' చెందితే మరో పాత్ర సరిదిద్ది రక్షిస్తుంది. రెండు పాత్రల మధ్య స్నేహాన్ని మించిన ప్రేమ ఉండబట్టే అది సాధ్యమవు తున్దనిపిస్తుంది. స్త్రీ పురషుల మధ్య ఆకర్షణకు మాత్రమే సాధారణంగా వాడబడే పదం ప్రేమ. కానీ ఆలోచిస్తే అంతకు మించిన స్నేహాలన్నీ ప్రేమగానే పరిగణించబడాలని చెబుతాయీ రెండు కథలూ. ' విజేత' కథలో కూడా ఈ కోణం బలీయంగా కనబడుతుంది. ఒకరి కొకరు కావాలనుకోవడం ప్రేమయితే, ఏ అవకాశ వాదమూ, స్వార్ధ చింతనా లేని స్నేహం కూడా ప్రేమేనని కథాపూర్వకంగా నిరూపిస్తారు, డా. జయప్రద. మొదటి రకం ప్రేమలో ' నాది' అనే భావం, ' నా' సొంతం అనే అందమైన స్వార్ధం ఉండవచ్చు కానీ, రెండో దానిలో అది కూడా లేనటువంటి స్వచ్చత ఉంటుందని ' వీలునామా' కథ చదివినప్పుడు అర్ధమౌతుంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన జీవిత భాగస్వామి హత్థాట్టుగా ఒంటరిని చేసేసి వెళ్ళిపోతే మిగిలిన భాగస్వామికి కావాల్సింది ఏమిటి? ఆస్తి పంపకాలా? మళ్ళీ సరికొత్త దాంపత్యమా? ఏ సుఖాలు?ఏ కన్నీళ్లు? ఏం కావాలి? ఇవన్నీ కావు; కావాల్సింది కాస్తంత ఏకాంతం. ఆ చనిపోయిన, విడిచిపోయిన జీవిత భాగస్వామి స్మృతుల్ని నెమరు వేసుకునేందుకు ఏకాంతమైన ఓ గుప్పెడు కాలం - అదీ కావాల్సింది.

అనుభవాల పాఠాల పరీక్షలో చాందసాలు ఓడిపోవలసిన్దేనని ' గ్రహణం' కథ చెబుతుంది. చాందసపు తల్లి దండ్రుల కారణంగా ఒంటరిగా మిగిలిపోయి సృష్టి ధర్మం ప్రకారం ఆకర్షణకు లొంగి పతనంలోకి దొర్లిపోయే ఆడపిల్లలు ఇకపై సమాజంలో ఉండకూడదన్నది ఇతివృత్తంగా ఈ కథ సాగుతుంది. ఎవర్నీ మార్చ లేనప్పుడు మనం మారడమే మన సంతోషానికి మనం ఇచ్చుకోగల పరిష్కారమని సందేశించే కథ ' డిప్రెషన్' - నక్షత్రం కథలానే మన ద్వారా గాని, మన డబ్బు ద్వారా గాని అవతలి వ్యక్తిలో మనం సంతోషాన్నీ, సంతృప్తినీ, కృతజ్ఞతనీ చూడగలిగినప్పుడు మనలో కలిగే ఆనందమే నిజమైన ఆనందమని ఈ కథ కూడా చెబుతుంది. ఈ మానవీయ కోణాన్ని డా. జయప్రద అవకాశం వచ్చినప్పుడల్లా పునః పునః చెబుతుంటారు.

స్త్రీ వాదం చర్చనీయంశ మైన కథ ' పరిమాణం'. స్త్రీ వాదమంటే సాధికారత కోసం పోరాటమే కాని ఆధిపత్యం కోసం కాదని చెబుతుంది. స్త్రీ వాదం కోరుకునే దేమిటి? హక్కుల పోరాటమా? సమానత్వమా? మగవాడిపై ఆధిపత్యమా? మరేమిటి? పురుషాహంకారపు కోరల్లో నలిగి, భర్తను వదలలేని నిస్సహాయతలో అతని ఆధిపత్యం ఓర్చుకోలేనటువంటి వ్యతిరేకతతో ఎందరి...ఎందరి స్త్రీల బతుకులు తెల్లారిపోతున్నాయి? ఈ అన్ని ప్రశ్నలకీ బాధ్యతతో కూడిన పరిష్కారం సూచిస్తుంది కథానాయకి. ఆ పరిష్కారమే - " సమస్యకి మూల కారణాన్ని వెతికి, వేరును తినేసే పురుగును ఏరి పారేయాలే కానీ వేరునే పెరికి వేయకూడ"దన్నది. ఎందుకంటే, " ఆ వేరు చాటున మానవ సంబంధాలు ఉన్నాయి...సంసారాలున్నాయి. భార్యా భర్తల్ని అల్లుకొని ఉన్న పిల్లల బ్రతుకులున్నాయి" కనుక. ఈ కథకు పేరు ' పరిణామం' అనుంటే ఔచిత్యంగా ఉండేదేమో!

శీర్షికను బట్టి ' లవ్ లెటర్' కథను ప్రేమోపాఖ్యానం అనుకునే వీలుంది.కానీ తల్లి కూతురికి రాసిన ఉత్తరమే ఇతివృత్తంగా రుపొందిందీ కథ.తల్లి ఉత్తరోపన్యాసం - కుమార్తె వివాహోత్తర ఉపన్యాసం. కూతురి పెళ్లి చేసాకా, అత్తవారింటికి సాగనంపి, ఉత్తరం ద్వారా వివాహపుటుత్తర జీవితాన్ని ఎలా సుఖమయం చేసుకోవాలో తెలిపే కథ. ఈ కథలో అమ్మ తన కుమార్తె దీప్తికి చెప్పేవన్నీ కుమారీ శతక నీతులకు తీసిపోవు. ఆ మాటే అంటే ఆమె అంటుంది - " కాలం ఏమైనా, అప్పుడైనా, ఎప్పుడైనా...మనిషికి కావాల్సింది మనశ్శాంతి... నీ మనస్సాక్షికి నువ్వు పదును పెట్టుకో! దాని మీదే నువ్వు ఆధారపడు" అని చెబుతుంది ఆ తల్లి.

ఓ డాక్టరు కోణం నుంచి వెలువడినవి 'సన్మానం', 'చీకటి', 'అజ్ఞానానికి మరో అంచు', 'గిఫ్ట్ బేబి' కథలు. డాక్టర్ల జీవితంలోని భిన్న కోణాన్ని వివరిస్తుంది 'సన్మానం' కథ. డబ్బుకు ఆశపడి డాక్టర్లు ఎటువంటి పనికైనా తెగిస్తున్నారని అనుకోవడం ఈ రోజు పరిపాటయింది. ఆఖరుకు పుట్టిన బిడ్డల్ని మార్చడం వంటి పనులైనా సరే. అయితే దాని వెనుక జరుగుతున్నదేమిటి? స్వార్ధపూరితమైన కొందరు న్యాయవాదుల ప్రమేయం అందుకెలా కారణ మవుతుందో చక్కగా చర్చిస్తుందీ కథ. వెంటనే ఆపరేషన్ చేస్తే కానీ బిడ్డని రక్షించలేమని డాక్టర్ చెబితే, డాక్టర్ల మీదున్న ఇటువంటి అభిప్రాయంతోనే పేషెంటు తల్లీ, అత్త, ఆఖరుకు భర్త కూడా ఆపరేషనుకు వెంటనే సమ్మతించక పోవడం, పరిస్థితి వికటించి లోపల చనిపోయిన బిడ్డని బయటికి తీసి తల్లిని రక్షించేందుకు అనివార్యంగా ఆపరేషన్ చేయాల్సి రావడం ఇతివృత్తంగా 'చీకటి' కథ నడుస్తుంది. చదువు లేకపోతే ఉన్న మెదడును వాడుకోలేకపోవడం ఎంత దౌర్భాగ్యమో తెలిపే కథ 'అజ్ఞానానికి మరో అంచు'. ఇతివృత్తంలో భిన్నమే అయినా, మౌలికంగా ఈ మూడు కథలూ ఒక బాధ్యతాయుతమైన డాక్టరు ఆలోచనాసరళిని వివరిస్తాయి. ఈ కథల్లోని సందర్భాలు బహుశా డా.జయప్రద గారి స్వీయానుభవాలు కూడా కావచ్చు. ప్రస్తుతం ' సైన్స్ పట్ల సంథియుగం' లో మనమున్నామంటూ, ఇదివరకు పేషంట్లు అజ్ఞానంతో ఉన్న కాలంలో వాళ్ళ విశ్వాసంలోనుంచి పుట్టిన ధైర్యంతో ఇవ్వాల్సిన ట్రీట్మెంటును సిన్సియర్గా, నిర్భయంగా ఇచ్చేవాళ్ళు డాక్టర్లు. కాని ఇప్పుడు పేషెంటు కాస్త అటూ ఇటూగా ఉంటే, ఆ పేషెంటుకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి వెనుకాడవలసిన పరిస్థితి అంటారు డాక్టరు గారు. " పేషెంటుకీ డాక్టరుకీ మధ్య ఆ అజ్ఞానపు కాలంలో ఉండిన నమ్మకం - మరలా పూర్తిగా జ్ఞానం సంతరించుకున్నాకా గాని సంభవం కాదనే ఆశాభావాన్ని వెలిబుచ్చుతారు. కథయిత్రి డాక్టరు కావడం వల్లనే రాయగలిగిన కథ ' గిఫ్ట్ బేబి'.

కథన రీతికి వస్తే, పాత్రలను ఆత్మీయం చేసే పద్ధతులు కొన్ని అనుసరిస్తారు డా. జయప్రద. 'కోకిరాల జ్యోత్స్న' అని ఇంటి పేరుతో సహా పరిచయం చేయడం పాత్ర పట్ల ఒక ఆత్మీయతా భావాన్ని కలిగిస్తుంది. అమూర్త భావనలకి పరిమాణా న్నివ్వడం ఒకటి. ఆనందాన్ని సి.సి.లలో కొలుస్తారు. బలాన్ని మెగా లీటర్లలో సూచిస్తారు. డైనులూ, న్యూటన్లూ కాదని బలానికి మెగాలీటర్లు చెప్పడం అమూర్తానికి పరిమాణాన్నివ్వడమే. అలాగే ఉద్వేగాల్నీ, ఉద్రేకాల్నీ పరిమాణామాత్మకంగా వర్ణిస్తారు జయప్రద. దానినే చెబుతూ, ప్రముఖ కథావిమర్శక'విహారి' అంటారిలా - " జయప్రద గారి కథల్లో ఇతివృత్తాలు స్వీయానుభవం నుంచీ, జీవితాద్యయనం నుంచీ, ఆమె మానవీయ భావనల నుంచీ జనించినవి.ఆ కథల్లో పాత్రలన్నీ మనమెరిగిన మనుషులు. మానవ సహజమైన బలం, బలహీనత కలిగిన రక్త మాంసాలున్న జనం. వారి ప్రవర్తన లోకవృత్త సహజమైన మనుషుల వర్తన లాగానే సాగుతుంది. వారందరూ అందుకనే మనకు బాగా సన్నిహితులైపోతా"రంటారు. ఆందుకే డా. జయప్రద గారి కథా జైత్రయాత్ర జయప్రదంగా సాగుతోందని చెప్పుకోగలం.

Posted by జ్యోతి Mar 8, 2010

Subscribe here

భువన సుందరి సీరియల్ చదవండి

భువన సుందరి సీరియల్ చదవండి
Keira Knightley: Beautiful Lady reading a Book

You said it!