BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...

కుటుంబంతో అమెరికా న్యూజెర్సీలో ఉంటున్న నేదునూరి రాజేశ్వరిగారు , హైదరాబాదులో ఉంటూ అమెరికా వెళ్లిన శ్రీలలితగారు తమ అనుభవాలను మనతో పంచుకుంటున్నారు..


ఎల్సీ కోర్ట్

జెర్సీ ఆవుల గురించి విన్నాం గానీ, ఎల్సీ కోర్ట్ గురించి ఎంత మందికి తెలుసు? ఏమో! అందరికి తెలుసేమో గానీ, నాకు మాత్రం ఇప్పుడే తెలిసింది. ఎందుకంటే, రోజూ ఉదయం సాయంత్రం వాకింగుకి ఆ కోర్టు ముందునుంచే వెడతాం గనుక, అక్కడున్న ఆ బోర్డు ఈ రోజే చదివాను గనుక.

ఇంతకీ జెర్సీ ఆవైనా, ఎల్సీ కోర్టైనా, శ్రీ శ్రీ చెప్పినట్టు అదే "అగ్గి పుల్ల కుక్క పిల్ల సబ్బు బిళ్ళ" లాగ అన్నమాట. వాకింగంటే, ఈ సమ్మరు పుణ్యమా అని జైలు వదలిన ఖైదీల్లా, ఆడా మగా, పిల్లా పెద్దా, ముసలీ ముతకా అందరూ హాయిగా గాలి ఫీల్చుకుంటారు. ఏసీలూ, హీటర్లు అన్నీ ఆపేసి, తలుపులు తీసుకుంటారు. పిల్లలు స్విమ్మింగుకి (పెద్దలు కూడా), టెన్నీస్, బాస్కెట్ బాల్, సైక్లింగ్, అలా వారి వారి ఇష్టాలకి పరుగులు తీస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ వాకర్ గార్డెన్లో, భారతీయత ఉట్టిపడుతూ ఉంటుంది.

రంగు రంగుల సీతాకోక చిలుకల్లా, అందమైన చీరలు, చక్క చక్కటి డ్రెస్సులు, ముచ్చట ముడులు, వాలు జడలు విరబోసిన జుట్లు, జుట్టుకి హైలైట్లు (రంగులు), ఇలా కొందరుంటే, టైటు పాంట్లు, టీ షర్ట్లు, చెడ్డీలు, మిడ్డీలు, స్లీవ్ లెస్సులు, తెల్ల వాళ్ళు, నల్లని వాళ్ళు, మధ్య రకం వాళ్ళు, పొట్టి పొడుగు లావు సన్నం, ఇలా రకరకాలుగా వాకింగు సోయగాలతో కన్నుల విందు చేస్తూ ఉంటారు.

ఇక స్విమ్మింగ్ పూల్ లో ఐతే, అర మీటరు బట్టతో, అవసరమైన చోట్ల తప్పా, మరే ఆచ్చాదన లేక అందాల భామలు అలా అలా మత్స్య కన్యల్లా, నీళ్ళల్లో మునుగుతూ తేలుతూ, ఒడ్డున కూర్చున్నవారికి ప్చ్! ఏ కవుల కలాల్లో ఎలా రంగరింపబడతారో ఉహాతీతమే.

ఇక, దేశం చూడాలనో, అమ్మాయి డెలివరీ కనో, పిలవగా వచ్చిన అమ్మలు, కొడుకులు మాత్రమే (కోడళ్ళు పిలవక పోయినా)పిలవగా వచ్చిన అత్తలు, "అమ్మ వెళ్ళిపోతే ఈ చాకిరీ అంతా ఎలా చేసుకోవాలా?" అని బాధ పడే కూతుళ్ళూ, అమెరికా వచ్చినా అత్త పోరు తప్పలేదని తిట్టుకునే కోడళ్ళూ, వదిలేసిన ఉద్యోగాలూ, నడుస్తున్న రాజకీయాలు మాట్లాడుకునే తండ్రులు, ఇలా ఎవరికి వారు జట్ట్లు జట్ట్లు గా వాగ్వివాదాలు చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు.

అందరినీ సవినయంగా ఆహ్వానిస్తున్నట్లు గుబురు గుబురుగా చక్కగా చిక్కగా కొత్త చివురులు తొడుగుతున్న చిట్టడవుల్లా పచ్చదనానికి ప్రతీకగా అంతెత్తు వృక్షరాజాలు. ఆ మధ్య నుంచి నిమిషానికో సారి రణగొణ ధ్వని చేసుకుంటు దూసుకు పోయే రైళ్ళ శబ్ధ తరంగాలు, ఏ హారను లేకుండా, రోడ్డు మీద చిరు సవ్వడితో సాగి పోయే కార్లు, రోడ్డుకిరు వైపులా సన్నని కాలిబాటలు "లాన్ డాక్టర్లు" అందంగా కట్ చేసిన పచ్చిక దారులు పైన హాయిగా గుంపులు గుంపులుగ ఎగిరే స్వేచ్చా విహంగాలు సునిసితంగా తాకిపోయే సన్నని గాలి తెమ్మెరలు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో అందంగా హాయిగా ఆహ్లాదంగా ఉండే ప్రకృతి సౌందర్యం అనుభవేద్యమే గానీ వర్ణనాతీతం. ముఖ్యంగా సమ్మరులో ప్రతి వాళ్ళూ ఇంటి ముందరా వెనుక (బాక్ యార్డ్ ) పూల మొక్కలు, కాయ గూరలూ, వారి వారి ఇస్టాలని బట్టి పెంచుకుంటారు. అంతే కాదు డెక్ (పాటియో) మీద సమ్మరుని వీలైనంత ఎంజాయి చేస్తూ ఉంటారు.


నేదునూరి రాజేశ్వరి....


********************************************************************************


సీనియర్ సిటిజన్




నాకిప్పుడు అరవైయ్యేళ్ళు. సీనియర్ సిటిజన్ ల లిస్ట్ లోకి వచ్చేసాను. అందుకని నాకేమీ విచారం లేదు. పైగా హుందాగా కూడా అనిపిస్తోంది. మన దగ్గరున్నన్నాళ్ళూ పిల్లలని బాధ్యతగా పెంచాం, ఇప్పుడు వారి జీవితాలు వాళ్లవి అని అందరూ అనుకున్నట్టే మేమూ అనుకున్నాం. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మా బాధ్యత తీరిపోయింది, ఇంక మాకేం కావాలి అనే నిరాసక్తత వ్యక్తపరిచేదానిని.
ఎక్కడికైనా వెడితే నేను పెద్దదాన్ని, మిగిలినవాళ్ళు నన్ను సలహాలడగాలి, మర్యాద చెయ్యాలి అనుకునేదానిని.
అటువంటిది ఒకసారి మా పిల్లల దగ్గరికి అమెరికా వెళ్ళాము. వాళ్ళు విజిటింగ్ కొచ్చిన మాలాంటి వాళ్ళని వారాంతం లో మాత్రమే బైటకి తీసికెళ్ళగలరు, వాళ్ళ ఉద్యోగాల లాంటివి మరి. మాకైతే మధ్యాహ్నం పూట అస్సలు తోచేది కాదు.

మా అబ్బాయి వుండే ఇంటికి దగ్గర్లో యూనివర్సిటీ వైపు వేళ్ళే బస్సు ఆగుతుంది. అదెక్కితే ఒకవైపు వెడితే యూనివర్సిటీ, మళ్ళీ చుట్టూ తిరిగి వస్తే మాల్ వైపుకి వెడుతుంది. నేనూ, మావారూ సమయం గడవడానికి మధ్యాహ్నం ఆ బస్సు ఎక్కి అటు యూనివర్సిటీ వైపో లేకపోతే మాల్ వైపో వెళ్ళి తిరిగొచ్చేవాళ్ళం.

అలాగే ఒకరోజు బస్ ఎక్కి మాల్ దగ్గర దిగాం. ముందున్న మా వారు ముందు దిగిపోయారు. ఈ మాల్స్ దగ్గర ఎక్కడ వెనకపడి మారిపోతానో అనే భయంతో నా ముందున్న ఒక అమెరికన్ లేడీని గబగబా తోసుకుని దాటేసి(మన ఇండియా లో లాగే) మావారి వెనకాలే దిగిపోయాను. మాల్ లోకి వెడుతుంటే ఎంట్రెన్స్ దగ్గర నన్ను ఆ అమెరికన్ లేడీ ఆపి "నీ వయసెంత?" అనడిగింది. చెప్పాను. వెంటనే ఆవిడ, "Iam 82. Learn to respect senior citizens" అంది. నేను అవాక్కయ్యాను.

నిజమే కదా. నాకన్న చిన్నవాళ్ళు నాకు మర్యాదివ్వాలని నేను కోరుకుంటున్నప్పుడు నాకన్న పెద్దవాళ్ళకి నేను మర్యాదివ్వాలి కదా. ఇదొక పాఠం లా అనిపించింది నాకు.

అరవైయేళ్ళొచ్చేసాయి, అన్నీ తెలిసిపోయాయి, ఇంకేం నేర్చుకోడానికి లేదు అనుకున్న నాకు ఇది ఎంత గొప్ప పాఠం! అందుకే అంటారేమో ఏదైనా నేర్చుకోవడానికి జీవితకాలం సరిపోదు అని. అప్పుడనిపించింది జీవించినంతకాలం కొత్తదేదైనా నేర్చుకోవాలి అని. అది మన మనసుని తట్టి లేపి ఆలోచించేదయితే మరీ మంచిదని.

******************************************************************************************************

Posted by జ్యోతి Jun 4, 2010

Subscribe here

భువన సుందరి సీరియల్ చదవండి

భువన సుందరి సీరియల్ చదవండి
Keira Knightley: Beautiful Lady reading a Book

You said it!